హిచ్‌కాక్‌ ‘సైకో’ ఇతనే...! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
హిచ్‌కాక్‌ ‘సైకో’ ఇతనే...!

ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ఆల్‌టైమ్‌ హిట్‌ ‘సైకో’లో హీరో పాత్ర ఎంత భీతిగొల్పేలా ఉంటుందో చూశాం. కానీ అది కల్పితం కాదు, నిజంగానే అటువంటి వ్యక్తి ఉన్నాడు! అతడే అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ జీన్‌. తన కథ వింటే ఎవరికైనా భయం, బాధా ఒకేసారి కలుగుతాయి. చిన్నారి ఎడ్వర్డ్‌ అందరిలాగానే చలాకీ పిల్లాడు. కానీ అతడి తండ్రి జార్జ్‌ పెద్ద తాగుబోతు. దీంతో పిల్లలు హెన్రీ, ఎడ్వర్డ్‌ల బాధ్యత తల్లి అగస్టా తీసుకుంది. అయితే ఆమెదో విపరీత ధోరణి. తొమ్మిదేళ్ల వయసున్న పిల్లలతో నరబలి, శవాల గురించి మాట్లాడుతుండేది. అప్పటినుంచే ఎడ్వర్డ్‌లో విపరీతభావనలు మొదలయ్యాయి. 30 ఏళ్లొచ్చినా అందరితో కలిసేవాడు కాదు. తండ్రి, అన్న చనిపోయి తల్లితో ఒంటరిగా మిగిలిపోయాడు. కొన్నాళ్లకు ఆమె కూడా మరణించింది. ఇక అప్పటినుంచీ అతడి పైశాచికత్వం బయటకొచ్చింది. ఇల్లంతా చెత్తకుప్పలా తయారుచేసి అక్కడే తిని పడుకునేవాడు. కొన్నాళ్లకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనుషులు కనిపించకుండా పోవడం మొదలైంది. పోలీసులకు ఎడ్వర్డ్‌ మీద అనుమానమొచ్చింది. ఒకరోజు హఠాత్తుగా అతడి ఇంటి మీద దాడి చేశారు. అక్కడి దృశ్యాలు చూసి వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్లైంది! కిచెన్‌లో ఎవరెవరివో కాళ్లూ చేతులూ ముక్కలుగా పడున్నాయి. జాడీల్లో నిల్వ ఉన్నవన్నీ అవయవాలే! మనుషుల పుర్రెలతో సూప్‌ బౌల్స్‌, చర్మంతో కుర్చీలకు కుషన్లూ, గ్లౌజులూ, టేబుల్‌ లాంప్స్‌, బెల్టులూ చేసున్నాయి!! వెంటనే ఎడ్వర్డ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. కొందరిని స్వయంగా చంపాననీ, కొన్ని శరీరాలను శ్మశానం నుంచి ఎత్తుకొచ్చాననీ అతడు చెప్పాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న జడ్జి ఎడ్వర్డ్‌కి ఎలాంటి శిక్షా విధించకుండా మానసిక ఆరోగ్యశాలకు తరలించారు. దాదాపు 20 ఏళ్లకు మెంటల్‌ హాస్పిటల్‌లోనే కేన్సర్‌తో చనిపోయాడు. దర్శకుడు
హిచ్‌కాక్‌ స్వయంగా ఈ కేసును స్టడీ చేసి తన సినిమాలో హీరో పాత్రనూ, అతడి తల్లి పాత్రనూ రాసుకున్నాడట.

కాస్త వినాలి

భార్యాభర్తలు కలిసి హోటల్‌కు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్‌ చేశారు. వెయిటర్‌ సర్వ్‌ చేసి వెళ్లాక, భర్త తినబోతుండగా...
భార్య: ఏమండీ, మీ...
భర్త: (చిరాగ్గా) తినేటప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను.
భార్య: అదికాదండీ...
భర్త: (కోపంగా) చెబుతుంటే అర్థంకాదా... నీ సోది తీరిగ్గా వింటానుగానీ, ముందు కాస్త ప్రశాంతంగా తిననియ్‌.
తిన్న తర్వాత...
భర్త: ఊఁ, ఇప్పుడు చెప్పు
భార్య: మీరు తిన్న బిర్యానీలో బొద్దింక ఉంది.
భర్త: ఆఁ... (అందుకే- భార్య చెప్పే మాట కాస్త వినాలి)

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు