అనుభవ పాఠాలు చెబుతారు! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అనుభవ పాఠాలు చెబుతారు!

స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లైనా మనదేశంలో చదువు ఇంకా చాలామందికి అందని  మానిపండే. అందుకు కారణాలు ఏవైనా- కొందరు పూనుకుని తోటివారిని చదివించడాన్ని తమ బాధ్యతగా భావించడంతో వందలాది పిల్లల బతుకులు బాగుపడుతున్నాయి.

పల్లెటూళ్లలో ‘గ్రామీక్ష’

డిగ్రీ చదవడానికి గ్వాలియర్‌ నుంచి బెంగళూరు వెళ్లిన స్తుతికి- తనకీ బెంగళూరులో చదువుకున్నవాళ్లకీ మధ్య చాలా తేడా ఉందనిపించింది. మంచి స్కూల్లో చదివిన తనకే ఇలా ఉంటే పల్లెల్లో సరైన సిబ్బందిలేని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అనుకునేది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు ఇంజినీరింగ్‌ చదువుతూనే స్నేహితులతో కలిసి పల్లెల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్న శుభం సింగ్‌తో పరిచయమైంది. స్తుతి ఉత్సాహంగా వారితో కలిసింది. బడికి వెళ్లలేని నిరుపేద పిల్లలను సమీకరించి వారికి అక్షరజ్ఞానం అందించడమే కాక పరిశుభ్రతా, నడవడికా లాంటి విషయాలూ నేర్పించేవారు. కొన్నాళ్లకే వారిలో కన్పించిన మార్పు ఈ యువ టీచర్లను ఆశ్చర్యపరిచింది. కొందరు పిల్లలు పట్టుదలగా పాఠశాలల్లోనూ చేరారు. దాంతో తమ పనిని మిగతా ప్రాంతాలకూ విస్తరించాలనుకున్న స్నేహబృందం ‘గ్రామీక్ష’ పేరుతో ఎన్జీవోని ప్రారంభించి ప్రత్యేకమైన బోధనా విధానాన్ని తయారుచేసుకున్నారు. పిల్లల్లో సమగ్ర వికాసానికి తోడ్పడేలా పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. ఈ పనిలో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా గ్రామీక్ష వెబ్‌సైట్‌ ద్వారా సంస్థ సహాయం తీసుకుని వలంటీర్లుగా తమ ఊళ్లోనే సేవలందించవచ్చు. ఇప్పటికే ఆరు నగరాల్లో కొన్ని వందల మంది యువతీయువకులు ‘గ్రామీక్ష’ స్వచ్ఛంద కార్యకర్తలుగా విద్యాదానం చేస్తూ వేలాది చిన్నారుల జీవితాల్లో మార్పు తెచ్చారు.


నాడు బాలకార్మికుడు నేడు టీచర్‌!

పేదరికం నీరజ్‌ ముర్ముని ఐదోఏటే మైకా గనిలో కూలీని చేసింది. అక్కడ మట్టి తవ్వి పోస్తూ కొన్ని రోజులు కష్టపడితే కానీ కిలో మైకా దొరికేది కాదు, దానికి అతడికి రూ.5 ఇచ్చేవారు. కైలాశ్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ సాయంతో ఆ వెట్టి చాకిరీ నుంచి బయటపడి బడిలో చేరాడు నీరజ్‌. పద్నాలుగేళ్ల వయసులో అక్షరాలతో మొదలెట్టినా కష్టపడి చదివి ఇంటర్‌ పూర్తిచేశాడు. ఇప్పుడు డిగ్రీ ప్రైవేటుగా చదువుతూనే మరో పక్కన ఊరి పిల్లల భవిష్యత్తునీ బాగుచేసే బాధ్యత తన నెత్తిన వేసుకున్నాడు. ఝార్ఖండ్‌లోని దులియాకరం గ్రామానికి చెందిన నీరజ్‌ దినచర్య ఉదయం తండ్రికి పొలంపనిలో సాయం చేయడంతో మొదలవుతుంది. పదిగంటలకల్లా అది ముగించుకుని ఊళ్లోని స్కూలుకు చేరుకుంటాడు. అక్కడ అప్పటికే పాతిక నుంచి యాభై మంది పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతూ నీరజ్‌ కోసం ఎదురుచూస్తుంటారు. అతడు రాగానే తమ సందేహాలన్నీ తీర్చుకుని, కొత్త పాఠాలు చెప్పించుకుంటారు. పిల్లలకు ఎనిమిదో తరగతి వరకూ చెప్పి తొమ్మిదిలో వారిని పక్క ఊళ్లో ఉన్న హైస్కూల్లో చేర్పిస్తాడు నీరజ్‌. అతడి కృషి వల్ల ఇప్పుడు 150 మంది పిల్లలు పై చదువులు చదువుతున్నారు. అంతకు ముందు వారంతా నీరజ్‌లాగే కూలీల్లా పనిచేసేవారు. మొత్తంగా ఊరిని బాలకార్మికులు లేని ఊరిగా మార్చిన నీరజ్‌ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ప్రిన్సెస్‌ డయానా స్మారకార్థం నెలకొల్పిన ‘డయానా అవార్డు’ లభించింది.


కస్తూరిబా కల నిజమైంది!

బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ఒక మారుమూల పల్లె భితిహర్వ. వందేళ్ల క్రితం మహాత్ముడు తొలి సత్యాగ్రహం చేసింది అక్కడే. ఆడవాళ్లు చదువుకోవాలంటూ కస్తూరిబా పాఠశాల పెట్టిందీ ఆ ఊళ్లోనే. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్నవాళ్లు లేక పాడుబడింది. ఊళ్లో అమ్మాయిలెవరూ బడికి వెళ్లకపోవడమూ వరకట్నంలాంటి దురాచారాలూ సాంఘిక కార్యకర్త దీపేంద్ర వాజ్‌పేయీని కలచివేశాయి. స్నేహితుడు వివేక్‌ కుమార్‌తో తరచూ ఆ విషయాలే చర్చించేవాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే కావడంతో ‘ప్రవాహ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో కస్తూరిబా పేరిట అమ్మాయిల సంక్షేమానికి ఒక ట్రస్టు నెలకొల్పారు.
గ్రామస్థులను అందులో సభ్యులను చేసి ఆ ట్రస్టు ఆధ్వర్యంలోనే ఆనాడు కస్తూరిబా పెట్టిన చోటే ప్రత్యేకంగా బడి పెట్టారు. 350 మంది అమ్మాయిలు ఇప్పుడక్కడ చదువుకోవటమే కాదు, మరెన్నో నైపుణ్యాలనూ నేర్చుకుంటూ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుకుంటున్నారు. పట్నం నుంచి వచ్చి స్వచ్ఛందంగా పాఠాలు చెప్పే టీచర్లకు గ్రామస్థులు తమ ఇళ్లలోనే భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక స్కూల్లో ఒక స్థాయి వరకూ చదివాక హైస్కూల్లో చేరడమో లేక ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష రాయడమో చేస్తున్నారు విద్యార్థినులు. ప్రతి విద్యార్థినీ స్కూల్లో ఉన్న పొదుపునిధిలో నెల నెలా కొంత మొత్తం జమచేయాలి. పై చదువులకు కానీ స్వయం ఉపాధి ఏర్పరచుకోడానికి కానీ ఆ డబ్బుని ఉపయోగించుకోవాలి.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు