దీపాలు కాదు మొసలి కళ్లు! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దీపాలు కాదు మొసలి కళ్లు!

ఈ ఫొటోను చూస్తుంటే చెరువులో కార్తీక దీపాలను వదిలినట్లుంది కదూ... ముమ్మాటికీ కాదు. ఇవన్నీ మొసళ్ల కళ్లు. చీకట్లో టార్చ్‌లైట్‌ వేసి చూసినప్పుడు పిల్లి కళ్లు మెరవడం చూసే ఉంటారు. అలాగే మొసలి కళ్లూ మెరుస్తాయట. ఈ జంతువుల కళ్లలోని రెటీనాలో ఉండే టపెటమ్‌ ల్యుసిడమ్‌ అనే పొర కారణంగానే ఇలా జరుగుతుందట. ఫ్లోరిడాలోని మ్యక్కా రివర్‌ స్టేట్‌ పార్కులోని నీటిలో పదుల సంఖ్యలో ఉన్న మొసళ్లను ఓ ఫొటోగ్రాఫర్‌ చీకట్లో ఫొటో తియ్యగా కెమేరా కాంతి వాటి కళ్లల్లో పడి ఇలా వచ్చింది. అయితే, పిల్లికి భిన్నంగా మొసలి కళ్లు మరీ ఎర్రటి ఎరుపు రంగులో వెలిగినట్లు కనిపించడమే వింత.


ఈ క్యాబ్‌లో అన్నీ ఫ్రీ!

దిల్లీకి చెందిన అబ్దుల్‌ ఖదీర్‌... ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌. అందరు డ్రైవర్లలానే ఉంటే అతడి గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండేది కాదు. కానీ వృత్తి పట్ల తనకున్న అంకితభావమే అతడిని వార్తల్లోకెక్కేలా చేసింది. ఇతడి కారు లోపల చూస్తే విమానంలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవేమో అనిపిస్తుంది మరి. ఈ కారులో వెనక సీట్లో కూర్చునేవారికోసం ప్రత్యేకంగా ఫ్యాన్లు ఉంటాయి. తాగడానికీ తినడానికీ వాటర్‌ బాటిళ్లూ కూల్‌డ్రింక్‌లూ చాక్లెట్లూ స్నాక్స్‌తో పాటు వార్తా పత్రికలు, మాస్కులు, శానిటైజర్‌, డియోడరెంట్‌, మాయిశ్చరైజర్‌, పౌడర్‌... ఇలా రకరకాల ఉత్పత్తుల్ని ప్రయాణికులు ఉచితంగా ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంచాడు ఖదీర్‌. అంతేనా, ‘మతం కాదు మానవత్వం ముఖ్యం’ అంటూ రకరకాల కొటేషన్లతో కారులో పోస్టర్లు కూడా పెట్టాడు. ఈమధ్యే ఖదీర్‌ కారు ఎక్కిన ఒకతను ఇదంతా ఫొటో తీసి, ట్విటర్‌లో పెట్టడంతో వైరల్‌ అయ్యి ఇప్పుడతడి గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.


అప్పుడు ఆర్మీ ఆఫీసర్‌... ఇప్పుడు మోడల్‌!

ఆర్మీ... మోడలింగ్‌... ఒకదానికి ఒకటి సంబంధం లేని రంగాలు. అలాంటిది ఎన్నో ఏళ్లు ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తున్నారంటే ఆశ్చర్యం అనిపించకమానదు. ఆయనే 48ఏళ్ల నితిన్‌ మెహతా. ఈయనకు మోడలింగ్‌ అంటే చాలా ఇష్టమట. 21సంవత్సరాలు ఆర్మీలో ఉన్నా ఆ మక్కువ మనసులో అలానే ఉండిపోయింది. దాంతో నాలుగేళ్ల కిందట పదవీవిరమణ తీసుకుని ఫ్యాషన్‌ రంగంలోకి అడుగు పెట్టి యువ మోడళ్లతో పోటీపడి మరీ అవకాశాలు దక్కించుకున్నారు. ఫ్యాషన్‌ వీక్‌లలో పాల్గొనడంతో పాటు, రీడ్‌ అండ్‌ టేలర్‌, తనిష్క్‌, పీవీఆర్‌... ఇలా ఎన్నో బ్రాండ్లకు మోడల్‌గా ఎంపికయ్యారు. ఇన్‌స్టాలోనూ ఈయనకు అభిమాన గణం ఎక్కువే.


అడవిలో వెలుగుల వంతెన!

అడవి అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి చోటులో బంగరు రంగులో మిరుమిట్లు గొలిపే వంతెన మీద నడుచుకుంటూ ప్రకృతి పంచే ఆహ్లాదాన్ని అనుభవిస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా... ఆ ఆనందాన్ని కలిగించేందుకే ఇండోనేషియాలోని ‘ఆర్కిడ్‌ ఫారెస్ట్‌ సికోల్‌’లో ఇలా చెట్ల సగంలోంచి వేలాడే వంతెనను నిర్మించారు. రాత్రిపూట అది స్వర్ణ కాంతులతో వెలిగేలా లైట్లను అమర్చడంతో ఇంత అందంగా ప్రతిబింబిస్తోంది.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు