ఈ ప్రేమలింతే... - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ ప్రేమలింతే...

- జి.యస్‌.లక్ష్మి

‘‘ఏ   వండీ, ఇదిగో నా ఫోన్‌ నంబర్‌ రాసి ఇక్కడే బుక్‌ దగ్గర పెడుతున్నాను. మళ్లీ వెతుక్కోగలరు...’’ అన్న ప్రభావతి మాటలు పేపర్‌ చదవడంలో మునిగిపోయిన భర్త నరసింహం విన్నాడో లేదో కానీ తలూపడం మటుకు చేశాడు.
ఆ రోజు చుట్టాలింట్లో బారసాల. నరసింహం రానన్నాడు. ఇంట్లో అతనికి అన్నీ వండిపెట్టి, ఒక్కతీ వెళ్తోంది ఫంక్షనుకి. ఆవిడ చేతిలోకి ఇప్పుడు కొత్తగా మొబైల్‌ వచ్చింది. అందుకే తన ఫోన్‌ నంబర్‌ ఓ కాగితం మీద రాసి భర్తకి కనిపించేలా ఎదురుగా పెట్టడమే కాకుండా అక్కడ నంబర్‌ పెట్టానని భర్తకి చెప్పి మరీ బయల్దేరింది ప్రభ. ఫంక్షన్‌కి ఇదివరకు కూడా ఇలా నరసింహానికి కుదరనప్పుడు ఒక్కతీ వెళ్లేది. కానీ అప్పుడు ప్రభ దగ్గర సెల్‌ఫోన్‌ ఉండేదికాదు. ఉద్యోగం సద్యోగం లేదుకదా, ఇంట్లో లాండ్‌ లైన్‌ ఉందీ, భర్తకి మొబైల్‌ ఉందీ ఇంక మరో సెల్‌ఫోన్‌ ఎందుకని దానిమాటే బుర్రలోకి రానీలేదు ఇన్నాళ్లూ.

కానీ ఈ మధ్య తన కూతురు రమతో కలిసి యాదగిరిగుట్ట వెళ్లినప్పుడు అల్లుడు మధు అయిదు నిమిషాలకోసారి కూతురికి ఫోన్‌చేసి, ‘ఎక్కడున్నారూ... డ్రైవర్‌ జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడా... ఏమైనా తిన్నారా... దార్లో అక్కడ అది బాగుంది చూసిరండీ...’ అంటూ కూతురితో మాట్లాడడం చూసి, అల్లుడికి కూతురి మీద ఉన్న శ్రద్ధకి ముచ్చటపడి పోయింది. మనకి కావాల్సిన మనిషి ఎక్కడుంటే అక్కడికి కావాల్సినప్పుడల్లా ఫోన్‌ చేసుకునే అవకాశం ఈ మొబైల్‌ వల్లే కదా అనిపించి తను కూడా ఒక మొబైల్‌ కొనుక్కోవాలన్న కోరిక మొలకెత్తింది ప్రభలో.
ఆ తర్వాత కోడలు వసుధతో కలిసి చుట్టాలింట్లో పెళ్లికి వెళ్లినప్పుడు కొడుకు రవి కూడా కోడలి మొబైల్‌కి ఫోన్‌ చేసి తమ బాగోగులు కనుక్కున్నాడు. అప్పుడే వసుధ ఎంతో ప్రేమగా రవితో మాట్లాడుతూ, వెనక్కి వచ్చే దారిలో శారీమేళా ఉందనీ, వస్తూ వస్తూ అది చూసి వస్తామనీ రవికి చెప్పడం, రవి ‘ఓకే స్వీటీ...’ అంటూ ముద్దుగా ఫోన్‌లో అనడం విన్న ప్రభకి ఆ మొబైల్‌ మరీ అపురూపంగా కనిపించింది.

అంతేకాక ఈమధ్య చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతివాళ్ల చేతిలోనూ మొబైలూ, వాళ్లు దానిని పట్టుకుని అది రోడ్డా షాపా అని కూడా చూడకుండా ఒకటే మాట్లాడటం చూసిన ప్రభకి తను మటుకు ఎందుకు మొబైల్‌ కొనుక్కోకూడదూ అనిపించింది.
ఇవన్నీ పక్కన పెడితే ఆమధ్య శారదక్కయ్య ఇంట్లో పేరంటంలో చూసింది... ప్రతివాళ్ల చేతిలోనూ మొబైలే. ప్రతివాళ్లనీ వాళ్ల వాళ్ల మొగుళ్లు సరిగ్గా చేరారా లేదా అని అడగడమే. అది విని ఈ ఆడాళ్లందరూ మురిసి ముక్కలైపోవడమే.
అందాకా ఎందుకూ, మొన్న గౌతమీలో రాజమండ్రి వెళుతుంటే చూసిందికదా... ప్రతివాళ్లూ ట్రైన్‌ ఎక్కగానే- ఎక్కినట్టూ, తర్వాత రైలు బయలుదేరినట్టూ, ఫలానా స్టేషన్‌ వచ్చినట్టూ అందులో చెపుతూనే ఉన్నారాయె. ఎటొచ్చీ ఒక్క తను మాత్రమే రైలెక్కిందో లేదో, రైలు కదిలిందో లేదో తన మొగుడు నరసింహానికి తెలీదు... ఎందుకంటే తన దగ్గర మొబైల్‌ లేదు కనుక.

అన్నింటికన్నా ఎక్కువగా ప్రభ ప్రభావితమైన సంఘటన ఇంకోటుంది. ఆరోజు పద్మావతమ్మ గారింట్లో మనవడి బారసాల జరుగుతోంది. చుట్టాలూ, స్నేహితులూ చాలామంది వచ్చారు. మామూలుగానే ఒకవైపు బారసాల జరుగుతూనే ఉంది, మరోవైపు అందరూ చిన్న చిన్న గుంపులుగా విడిపోయి కబుర్లలో పడ్డారు. అప్పుడు మౌలాలీ నుంచి వచ్చిన మాలతి చాలా ఆసక్తికరంగా చెప్పడం మొదలుపెట్టింది.
‘‘పెద్దాళ్లు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్లకీ వెళ్లిపోయాక ఆ ఫ్లాట్‌లో ముసలాళ్లిద్దరే ఉన్నారు. వంటగ్యాస్‌ కనెక్షన్‌ సరిగ్గా ఉందో లేదో చూడాలీ అంటూ ఎవరో వస్తే తలుపు తీశారట. అంతే వాళ్లిద్దర్నీ కుర్చీలకి కట్టేసి ఇంట్లో ఉన్న డబ్బూ, నగలూ పట్టుకుపోయారట... పట్టపగలు, చుట్టూ అపార్ట్‌మెంట్లే. అయినా ఎవరికీ తెలీలేదు. ముసలాళ్లిద్దరూ పాపం ఏం చెయ్యగలరు. ఎదిరిస్తే పొడిచేస్తామని కత్తి చూపించి బెదిరించారట...’’ యాక్షన్‌తో సహా చెపుతున్న మాలతి మాటలు విస్తుపోతూ విన్నారందరూ.
అది విన్న దగ్గర్నుంచీ అందరూ ఎక్కడెక్కడ, ఎన్నెన్ని దొంగతనాలు జరిగాయో ఎవరికి తెలిసినవి వాళ్లు గందరగోళంగా చెప్పేసుకుంటున్నారు. కానీ వనజ మటుకు తన మొబైల్‌ను తీసి, ఆఫీసులో ఉన్న భర్త రంగనాధానికి పోన్‌చేసి, మాలతి చెప్పిన విషయం చెప్పి, ఇంటి దగ్గరున్న తన అత్తమామల్ని హెచ్చరించమని చెప్పింది.

ఆయన వెంటనే ఇంటికి ఫోన్‌ చేసి, వాళ్ల అమ్మానాన్నలకీ విషయం చెప్పి, జాగ్రత్తలు ఒకటికి రెండుసార్లు చెప్పాడు. అందరూ అత్తమామల మీద వనజకున్న అభిమానానికి ఆవిడ ముఖం మీదే పొగడ్తల వర్షం కురిపించేశారు. ఆ పొగడ్తలకి వనజ ఎంత మురిసిపోయిందో వెలిగిపోతున్న ఆ మొహం చూస్తేనే తెలిసిపోయింది ప్రభకి. కానీ అంతలోనే ఓ అనుమానం కూడా వచ్చింది. ‘ఆ జాగ్రత్తేదో డైరెక్ట్‌గా ఇంటికే ఫోన్‌ చేసి, అత్తామామలకే చెప్పొచ్చుకదా, మధ్యలో ఆఫీసులో పనిలో ఉన్న భర్తని డిస్టర్బ్‌ చెయ్యడమెందుకూ’ అని. ఆమాటే అడిగితే వనజ ఓ నవ్వు నవ్వి, ‘‘ప్రభా, మనం ఏం చేసినా అది త్రూ ప్రాపర్‌ ఛానల్‌ ద్వారా వెళ్లాలి. అప్పుడే దానికో గుర్తింపూ, గౌరవమూ ఉంటాయి. ఇప్పుడిలా మావారికి చెప్పడం వల్ల తన అమ్మానాన్నల గురించి నేను ఆలోచిస్తున్నానని ఆయన దృష్టిలో నా ఇమేజ్‌ పెరుగుతుంది. ఇంతమంది ముందు నేను అత్తమామలకిచ్చే ప్రాముఖ్యత చూసి వీళ్లలో నా గౌరవం పెరుగుతుంది. ఏం చేసినా సరే దానికో గుర్తింపు ఉండేలా చూసుకోవాలి...’’ అని హితబోధ చేసింది. ఈ గౌరవమంతా వనజ చేతిలో మొబైల్‌ ఉండడం వల్లేకదా సాధ్యమయిందీ అనుకున్న ప్రభ తనక్కూడా గుర్తింపు కావాలంటే మొబైల్‌ కొనుక్కోక తప్పదని నిర్ణయించేసుకుంది.

తన కోరికను ఇంట్లో వాళ్లకి చూచాయగా తెలియచేసింది ప్రభ. అర్థం చేసుకున్న కొడుకు తల్లికి ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాడు. కోడలు దానిని ఎలా వాడాలో ఒకటికి పదిసార్లు ప్రభకి అర్థమయ్యేలా చెప్పింది. ఇక అప్పట్నుంచీ ప్రభ ఇంట్లో తనకి వచ్చే మెసేజులు చూసుకుంటున్నా సరే ఎప్పుడు బయటకెళ్లే పని పడుతుందా, ఎప్పుడు మొబైల్‌ పట్టుకెళ్లి అందరిముందూ మొగుడితో ముద్దు ముద్దుగా మాట్లాడుదామా అనుకుంటుంటే ఇదిగో ఇప్పుడీ అవకాశం వచ్చింది. అందుకే ప్రభ ఆరోజు మర్చిపోకుండా బాగా గర్తు పెట్టుకుని మరీ తన హ్యాండ్‌బ్యాగ్‌లో మొబైల్‌ ఫోను పెట్టుకోవడమే కాకుండా దాని నంబర్‌ రాసి, నరసింహానికి కనపడేలా ఆ కాగితం పెట్టి, ఆ మాట ఒకటికి పదిసార్లు చెప్పి మరీ బయలుదేరింది ఫంక్షనుకి.

బారసాల మహోత్సవానికి ప్రభ వెళ్లేసరికి చాలామంది ఉన్నారక్కడ. అందరి మధ్యలో చోటు చూసుకుని కూర్చుంది. అందరినీ పలకరిస్తూ, మాట్లాడుతూనే ఉంది కానీ ప్రభ దృష్టంతా తన మొబైల్‌ నుంచి వచ్చే రింగ్‌ సౌండ్‌ మీదే ఉంది. పది నిమిషాలు చూసింది, పావుగంట దాటింది. నరసింహం పాపం ప్రభ అజాపజా కనుక్కోలేదు. ఇంక లాభం లేదు తనే చెయ్యాలనుకుంటూ అందరి దృష్టీ తన వైపు పడగానే స్టయిల్‌గా హ్యాండ్‌బ్యాగ్‌లోంచి మొబైల్‌ తీసి, ఇంటికి నంబర్‌ కలిపింది. భర్త నరసింహం ఎత్తాడు. తన కంఠాన్ని ఎంతో మార్దవంగా మార్చి, ‘‘హలో, నేనేనండీ ప్రభని. నేను జాగ్రత్తగానే వచ్చాను. చేరగానే ఫోన్‌ చెయ్యమన్నారు కదా, అందుకే చేస్తున్నాను’’ అంది. అటునుంచి, ‘‘ఏంటీ, నేనెప్పుడు ఫోన్‌ చెయ్యమన్నానూ! వాళ్లింటికి ఇదివరకు చాలా సార్లు వెళ్లావుకదా! ఇవాళేదో కొత్తగా చెప్తావేంటీ!’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు నరసింహం.
‘హూఁ ఈ మనిషికి ఫోన్‌లో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. నలుగురి మధ్యలో ఉంది కదా, ఆమాత్రం అందరికీ వినిపిస్తుందనే జ్ఞానం ఉండొద్దూ’ అనుకుంటూ ఎప్పట్లాగే మనసులోనే తిట్టేసుకుంటూ నల్లబడిపోతున్న మొహం మీదకి కష్టపడి చిరునవ్వు తెచ్చుకుంది ప్రభ. ఆమె అదృష్టం. అందరూ ఎవరికి వాళ్లు గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు కనక నరసింహం మాటలు ఎవరికీ వినపడలేదు. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. మరింక ఛస్తే మొగుడికి ఫోన్‌ చెయ్యకూడదనుకుంటూ చుట్టాలతో కబుర్లలో పడిపోయింది.

బారసాల మహోత్సవం బాగా జరిగింది. చంటి పిల్లాడికి బహుమతులు చదివించి విందు భోజనానికి బయల్దేరారు. విస్తరి ముందు కూర్చోగానే ప్రభ మొబైల్‌ మోగింది. అలవాటులేని ప్రభ ముందు పట్టించుకోలేదు. పక్కనున్నావిడ ‘‘మీ సెల్‌ఫోనే మోగుతోంది...’’ అన్నాక గబుక్కున హ్యాండ్‌బ్యాగ్‌లోంచి మొబైల్‌ తీసింది. చూస్తే ఇంటినుంచే ఫోన్‌. అప్పటిదాకా మామూలుగా ఉన్న ప్రభ మొహం మందారంలా విచ్చుకుంది. వెంటనే ఎత్తి, ‘‘హలో!’’ అంది మెత్తగా. వెంటనే అటునుంచి నరసింహం ‘‘పెరుగ్గిన్నె ఎక్కడ పెట్టేవ్‌? ఇందాకటినుంచీ వెతుక్కు ఛస్తున్నాను...’’ అన్నాడు. మ్లానమవబోతున్న మొహాన్ని బలవంతంగా ఆపుకుంటూ, చుట్టూవున్నవాళ్లకి వినపడకూడనంత నెమ్మదిగా ‘‘పొద్దున్నే తోడెట్టాను. స్టౌ పక్కనే ఉంది’’ అంది.
‘‘ఏవిటీ, కాస్త గట్టిగా చెప్పు...’’ అటునుంచి గట్టిగా వినిపించింది. పక్కవాళ్లకి వినపడ కూడదని విస్తరి ముందునుంచి లేచి, ఓ మూలకి వెళ్లి, ‘‘స్టౌ పక్కనే పెట్టాను’’ అంది.
‘‘ఇందాకణ్ణించీ ఫ్రిజ్జంతా వెతుక్కు ఛస్తున్నాను. అవునూ, ఆ ఫ్రిజ్‌లో అన్ని గిన్నెలున్నాయేవిటీ? ఎప్పటిదో పప్పు కూడా ఎండిపోయి అందులోనే ఉంది. అలా అన్నీ ఫ్రిజ్‌లో ఉంచేస్తే ఎలా! ఎక్కడలేని జబ్బులూ ఫ్రిజ్‌లో పెట్టిన వాటివల్లే వస్తాయని మొన్న పేపర్లో రాశారు, చూడలేదూ...’’
ఫోన్‌లో ఎప్పుడేం మాట్లాడాలో తెలియనివాళ్లతో మాట్లాడాలనుకోవడం ఎంత బాధో తెలిసొచ్చిందావిడకి.
‘‘మాట్లాడవేం. వినపడలేదా... ఆరోజు ఆ న్యూస్‌ చూపించి చదవమని నీకు చెప్పాను కదా, చదవలేదా?’’ మాట్లాడలేదావిడ. తన చుట్టూ పదిమంది ఉన్నారు. ఏం మాట్లాడినా అందరికీ వినిపిస్తుంది.
‘‘ఇందాక పాలవాడొచ్చాడు. వాడికి క్రితం నెల ఎక్కువిచ్చేం కదా! అదెక్కడ రాసిపెట్టేవూ! అదెంతో గుర్తులేక అలమార్లన్నీ తెగ వెతికేను ఆ కాగితం కోసం’’ ఒక్కసారి కళ్లు మూసుకుంది ప్రభ.

కళ్లముందు అలమార్లో ఉన్న బట్టలన్నీ మంచం మీద కుప్పగా కనిపించాయి. నీరసం వచ్చేసిందావిడకి.
‘‘మళ్లీ సాయంత్రం రమ్మన్నాను వాణ్ణి డబ్బులకి. విసుక్కుంటూ పోయాడు వెధవ...’’ చెవులు కూడా మూసేసుకోవాలనిపించింది.
‘‘నాలుగ్గంటలకి వస్తానన్నాడు. అక్కడ అక్కర్లేని కబుర్లలో పడిపోక భోజనం అవగానే వచ్చెయ్యి. అసలే మీ వాళ్లని చూస్తే నీకు ఒళ్లు తెలీదు.’’
మొబైల్‌ మీదున్న ఎర్రబటన్‌ నొక్కెయ్యాలన్నంత ఆవేశం వచ్చేసింది ప్రభకి.
‘‘వినపడుతోందా!’’ హెచ్చిన గొంతుకి జవాబుగా ‘‘ఊఁ’’ అంది నెమ్మదిగా.
అటు టప్పున ఫోన్‌ పెట్టేసిన శబ్దం వినిపించగానే, మొబైల్‌ ఆఫ్‌ చేసి వచ్చి, నీరసంగా భోజనం ముందు కూలబడింది. ఆ మొబైల్‌ని చూస్తుంటే ఇంట్లో పడుతున్నది చాలక బైటకొచ్చినప్పుడు కూడా ఈ బాండ్‌బాజా కోరి తెచ్చుకున్నట్టు అనిపించింది ప్రభకి.
ఇంటికెళ్లేటప్పటికి ఇంకా ఎవరూ ఆఫీసులనుంచీ, స్కూళ్లనుంచీ ఇంటికి రాలేదు. ప్రభ కాళ్లూ చేతులూ కడుక్కుని కాఫీ కలిపి తెచ్చి, భర్తకిచ్చి తనూ తీసుకుని కూర్చుంది.

నరసింహం పక్కనే ఉన్న బాక్స్‌లోంచి టాబ్లెట్‌ తీసి ఇస్తూ, ‘‘పొద్దున్న హడావిడిలో బీపీ టాబ్లెట్‌ వేసుకోకుండానే వెళ్లిపోయావు. ఇదిగో... ఇదేసుకుని, కాఫీ తాగి, కాసేపు పడుకో. ఆ వెధవ టీవీ పెట్టుకుని కూర్చోకు. మళ్లీ తలనొప్పి వస్తే నువ్వు తట్టుకోలేవు’’ అన్నాడు ఆర్డర్‌ వేస్తున్నట్టు.
‘హుఁ, ఏం మనిషో... ప్రేమగా మాట్లాడడం కూడా తెలీదు. అక్కడా అధికారమే. అన్నీ ఆర్డర్‌ వేసినట్టే. వెనకటి తరం వాళ్లు ఇంతేనేమో. మనసునిండా, ప్రేమ ఉంటుంది కానీ దాన్ని పైకి చూపించరు. ప్రేమని ఎలా చూపించాలో కూడా తెలీకుండానే జీవితాలు వెళ్లిపోతున్నాయి. మా ప్రేమలింతే, ఇలాగే ఉంటాయి, అర్థం చేసుకోవాలంతే’ అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది ప్రభ.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు