చారు... చవులూరించేలా! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చారు... చవులూరించేలా!

జలుబూ, దగ్గూ లాంటివి ఇబ్బంది పెట్టినప్పుడు చాలామంది చేసే పని వేడివేడి చారన్నం తినడమే. అసలే చలికాలం కూడా కాబట్టి  చారును రోజూ తీసుకున్నా మంచిదేనంటారు. అలాగని ఎప్పుడూ ఒకే రుచిలో చేసుకోలేం గనుక కొన్ని కొత్త రుచులు...

వెల్లుల్లితో...

కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు: పది, చింతపండు: నిమ్మకాయంత, ఎండుమిర్చి: రెండు, మిరియాలు: అరచెంచా, దనియాలు: చెంచా, సెనగపప్పు: అరచెంచా, జీలకర్ర: రెండు చెంచాలు, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, ఆవాలు: అరచెంచా.
తయారీవిధానం: చింతపండును కప్పు నీటిలో నానబెట్టి తరువాత రసం తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి ఎండుమిర్చి, మిరియాలు, దనియాలు, సెనగపప్పును వేయించుకుని వేడి చల్లారాక మిక్సీలో వేసి చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లితో కలిపి ముద్దలా చేసుకోవాలి. బాణలిని మళ్లీ స్టౌమీద పెట్టి  మిగిలిన నూనె వేసి ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకు వేయించి.. ఒకటిన్నర కప్పు చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా వేసి.. మరికాసిని నీళ్లు పోయాలి. బాగా మరిగాక దింపేయాలి.


కొబ్బరి పాల రసం

కావలసినవి: మిరియాలు: చెంచా, దనియాలు: చెంచా, జీలకర్ర: ఒకటిన్నర చెంచా, వెల్లుల్లి రెబ్బలు: మూడు, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు రెబ్బలు: రెండు, చింతపండు: నిమ్మకాయంత, నీళ్లు: కప్పు, పసుపు: పావు చెంచా, ఇంగువ: పావు చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, కొబ్బరిపాలు: పావుకప్పు, నూనె: చెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: ఒకటి.
తయారీవిధానం: చింతపండును కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. అదే విధంగా మిరియాలు, చెంచా జీలకర్ర, దనియాలు, వెల్లుల్లిని కలిపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. తరువాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి కరివేపాకు, చింతపండు నీళ్లు, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొత్తిమీర, కొబ్బరిపాలు వేసి బాగా కలిపి.. చారు మరిగాక దింపేయాలి. బాణలిని స్టౌమీద పెట్టి మిగిలిన నూనె వేసి... అది వేడయ్యాక ఆవాలు, మిగిలిన
జీలకర్ర, ఎండుమిర్చి వేయించి.. చారుపైన తాలింపు వేయాలి.


జీలకర్రతో...

కావలసినవి: చింతపండు నీళ్లు: పావుకప్పు, టొమాటో: ఒకటి, సాంబారుపొడి: అరచెంచా, జీలకర్ర: ఒకటిన్నర చెంచా, కందిపప్పు: అరటేబుల్‌స్పూను, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: రెండు రెబ్బలు, నెయ్యి: చెంచా, ఆవాలు: అరచెంచా, కొత్తిమీర: కట్ట.
తయారీవిధానం: ముందుగా చెంచా జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చిని పావుగంటసేపు నానబెట్టుకుని తరువాత సగం కరివేపాకు కూడా కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఓ గిన్నెలో చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు, టొమాటో ముక్కలు, సాంబారుపొడి, మిగిలిన కరివేపాకు, కొత్తిమీర వేసి స్టౌమీద పెట్టాలి. ఇది మరిగాక ముందుగా చేసుకున్న మిశ్రమం వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. చారు మరగడం మొదలు పెట్టినప్పుడు దింపేయాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి చారుపైన వేసి ఓసారి కలపాలి.


పుదీనాతో...

కావలసినవి: టొమాటోలు: రెండు, పుదీనా ఆకులు: గుప్పెడు, చింతపండు గుజ్జు: రెండు చెంచాలు, నూనె: చెంచా, జీలకర్ర: ఒకటిన్నర చెంచా, మిరియాలు: చెంచా, పసుపు: పావు చెంచా, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: రెండు, నెయ్యి: చెంచా, ఆవాలు: అరచెంచా, ఎండుమిర్చి: ఒకటి, కొత్తిమీర: కట్ట.
తయారీవిధానం: ముందుగా చెంచా జీలకర్ర, మిరియాలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. అది తీసేసి పుదీనా, ఒక టొమాటో, చింతపండు గుజ్జును కూడా మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి పుదీనా మిశ్రమాన్ని వేయాలి. అయిదు నిమిషాలయ్యాక ఇందులో కప్పు నీళ్లు, పసుపు, మిగిలిన టొమాటో ముక్కలు, మిరియాలపొడి, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. నీళ్లు వేడెక్కాక మరో కప్పు నీళ్లు పోయాలి. ఇది మరగడం మొదలవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు, మిగిలిన జీలకర్ర వేయించి చారులో వేసి ఓసారి కలిపితే చాలు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు