పచ్చదనం... పసితనం - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పచ్చదనం... పసితనం

ఇతివృత్తాల్లో సమకాలీనత, కథనంలో సాధికారత, భాషాశైలిలో సమ్మోహనత.. చంద్రలత రచనల్లో కనిపిస్తాయి. ఈ సంకలనంలోని 13 కథానికలూ ఆధునిక జీవిత వాస్తవికతలోని విభిన్న కోణాలను ప్రతి ఫలిస్తాయి. పుట్టింటి మమకారపు మాధుర్యం ఎంతటి ప్రగాఢమో, పెను కష్టాలనైనా అధిగమించి స్త్రీలలో అది చిరకాలం ఎంత స్థిరంగా నిలిచివుంటుందో ‘బొట్టెట్టి’ కథ సాక్ష్యమిస్తుంది. ఆడవారి ఆత్మవిశ్వాసానికీ, ఆశావహ దృక్పథానికీ అద్దం పట్టేవి- ‘అమిత్రం’, ‘మాయమ్మ’ కథలు. యాంత్రీకరణతో ప్రకృతి విధ్వంసం, మానవ సంబంధాల విచ్ఛిన్నం... ఆపై దారితీసిన పరిణామాలను ‘గుట్టెనుక’ కథ ఆవిష్కరిస్తుంది. రచయిత్రే చెప్పినట్టు- ‘పసితనాన్నీ, పచ్చదనాన్నీ వెతుకుతూ’ సాగే ఈ కథానికలు చిక్కుముళ్ళను చిత్రిస్తూనే రేపటిపై ఆశనిస్తాయి. పఠనీయంగానూ ఆలోచనలు రేకెత్తించేలానూ ఉంటాయి.

- సిహెచ్‌. వేణు

             బొట్టెట్టి (కథానికలు)
రచన: చంద్రలత
పేజీలు: 170; వెల: రూ.195/-
ప్రతులకు: ప్రభవ, ఫోన్‌:0861-2337573


తాత్త్విక మీమాంస

భారతీయ ఆంగ్ల రచయితల్లో రాజారావుది ప్రత్యేక స్థానం. ఆదిశంకరులు తన అద్వైతానికి ఉదాహరణగా చెప్పిన రజ్జుసర్పభ్రాంతిని వస్తువుగా తీసుకున్న ‘ద సర్పెంట్‌ అండ్‌ ద రోప్‌’ అన్న ఈ నవల ఆలోచింపజేసే తాత్త్విక మీమాంసకి కథారూపం. ఆత్మకథాత్మక ధోరణిలో రాశారు. ఫ్రెంచి యువతిని వివాహం చేసుకున్న రామస్వామికి ఆ బంధంలో సమస్యలు తలెత్తుతాయి. తండ్రి కోసం ఇండియా వచ్చినప్పుడు సావిత్రి పరిచయమవుతుంది. తమ మధ్య ఉన్నది ప్రేమేనని ఇద్దరికీ తెలిసినా ఎవరి దారిలో వాళ్లు జీవించాలనుకుంటారు. మరో పక్క భార్య బౌద్ధం స్వీకరిస్తుంది. సత్యాన్వేషణ దిశగా రామస్వామి ప్రస్థానం సాగిన వైనాన్ని వేదాంత చర్చలూ వాదోపవాదాల నేపథ్యంలో చిత్రీకరించిన కథని చక్కని అనువాదం ఆసాంతం చదివిస్తుంది.

-శ్రీ

రజ్జుసర్పభ్రాంతి(నవల)
రచన: రాజారావు, తెలుగు సేత: అశ్వినీ కుమార్‌
పేజీలు: 291; వెల: రూ. 295/-
ప్రతులకు: ఫోన్‌- 9949516567


సీమ ఆక్రోశం

నాలుగు కథల ఈ పుస్తకం ‘మేము’, ‘వాళ్లు’, ‘నీళ్లు’ అనే మూడు మాటల చుట్టూ తిరుగుతుంది. సిద్ధేశ్వరం ప్రాజెక్టు- ఆలోచనగానే మిగిలిపోయిన ఫలితాన్ని అనుభవిస్తున్న రాయలసీమ ప్రజల ఆవేదనకు అద్దం పట్టే కథలివి. కృష్ణా నది మీద సిద్ధేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాలనీ, దానిద్వారా అటు మద్రాసుకి తాగునీరూ ఇటు రాయలసీమతో సహా తెలుగువారికి సాగునీరూ అందించవచ్చనీ బ్రిటిష్‌ కాలంలోనే ప్రణాళిక వేశారు. మన నీళ్లు వాళ్లకెందుకివ్వాలన్న స్వార్థంతో అప్పటివారు నాగార్జున సాగర్‌ దగ్గర ప్రాజెక్టు కట్టారు. ఆ తర్వాత ఎన్నేళ్లయినా, ఎన్ని ప్రాజెక్టులు కట్టినా రాయలసీమ దాహాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. సిద్ధేశ్వరం కావాలన్న కాంక్షనూ, ప్రజల ప్రయత్నం అవసరాన్నీ బలంగా ప్రకటిస్తాయి ఈ కథలు.

- పద్మ

సిద్ధేశ్వరం అడుగు(కథలు)
పేజీలు: 56; వెల: రూ. 50/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


పదాల పన్నీటి చెమ్మ!

కవితలు మనకేమిస్తాయ్‌... లోలోపలి తాపాలకి భావాల ఆకారాన్నీ, చుట్టూ ఉన్న పరిస్థితులపై ఉబికొచ్చే కోపాలకి అక్షరాల ఆయుధాన్నీ అందిస్తాయి. ఈ కవితా సంపుటి అదే చేస్తుంది. అనుబంధాల్లో తలెత్తే అధికారాన్ని ‘వికృతంగా ఒక విశ్వరూపం/ఉన్నట్టుండి ఉద్భవిస్తుందనీ... తగ్గి ఉన్నంత మాత్రాన ఎవరూ తక్కువ కారని/తెలుసుకోలేని అశుద్ధ క్షణం అది అని...’ ధిక్కరిస్తారు రచయిత్రి. ఆ ధిక్కారాలే కాదు... ‘తడబడుతున్న అడుగుల మధ్య/ఒలికిపోయిన పదాలను ఏరుకుంటూ..’ ఎదపైన పదాల పన్నీటి జల్లూ కురిపిస్తారు.

- అంకిత

         పోతబొమ్మ(కవిత్వం)
రచన: స్వాతీ శ్రీపాద
పేజీలు: 124; వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు