close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఇంటికి... ఫ్యాన్లూ ఏసీలూ అవసరం లేదు!

ఎవరైనా సకల సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. చిత్రావిశ్వనాథ్‌ దంపతులు మాత్రం ఫ్యాన్లూ ఏసీలూ అక్కర్లేని ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. అదొక్కటే కాదు, వారి ఇంటికి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. అందుకే కొన్ని వందల మంది తమకూ అలాంటి ఇళ్లే కావాలని కట్టించుకుంటున్నారు.

ముప్ఫై ఏళ్ల క్రితం బెంగళూరులో ఈ దంపతులు సొంతిల్లు ఏర్పాటుచేసు కోవాలనుకున్నప్పుడు అక్కడి పరిస్థితి- వర్షం వస్తే వరద వచ్చినట్లుండేది. మరోపక్క తాగడానికేమో నీరు కొనుక్కోవాల్సి వచ్చేది. అలాంటిచోట తాము ఇబ్బంది పడకుండా, ప్రకృతిని ఇబ్బందిపెట్టకుండా ఇల్లు కట్టుకున్నారు సివిల్‌ ఇంజినీరు విశ్వనాథ్‌, ఆర్కిటెక్టు చిత్ర దంపతులు. మామూలు ఇంటికన్నా తక్కువ ఖర్చుతో ఏడాదికి పది నెలలు కరెంటూ, నీటి బిల్లులతో పనిలేని విధంగా వారు డిజైన్‌ చేసుకున్న ఇల్లు బెంగళూరులో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఓ యాత్రాస్థలమే అయింది.

అడుగడుగునా ఆశ్చర్యాలే!
బయటినుంచి చూస్తే మామూలు ఇళ్లలాగే కన్పించినా కింద బేస్‌మెంట్‌, పైన గ్రౌండ్‌ఫ్లోర్‌ ఉన్న ఆ ఇంట్లో అడుగుపెడితే అడుగడుక్కీ ఆశ్చర్యపోక తప్పదు. పునాదులకోసం తవ్విన మట్టితోనే ఇటుకలు చేసి ఇల్లు కట్టారు. పైన కిటికీలతో చక్కటి వెలుతురు వచ్చేలా విశాలమైన గదులతో కట్టిన ఆ కింది అంతస్తులో ఎప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుందట. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది కాబట్టి ఫ్యాను అక్కర్లేదు. పై అంతస్తు హాల్లో ఒక పక్క నిలబడితే చల్లగా ఉంటుంది. నాలుగడుగులు అవతలికి వేస్తే మామూలుగానే ఉంటుంది. అదెలా అంటే- ‘కాంక్రీట్‌ పైకప్పు మీద కొన్ని అంగుళాల ఎత్తుతో వ్యవసాయ వ్యర్థాలనుంచి తయారుచేసిన షీట్స్‌ కప్పాం. దాంతో అటు పక్క పైకప్పుకి ఎండ వేడి తగలక ఇలా చల్లగా ఉంటుంది...’ అని వివరిస్తారు చిత్ర. ఇల్లు ఒకటే కానీ కాలానికి తగినట్లు మారిపోతుందన్నమాట. ఇల్లన్నాక సహజమైన గాలీవెలుతురూ వస్తేనే హాయి. అందుకని బేస్‌మెంట్‌నీ పైభాగాన్నీ కలుపుతూ కట్టిన మెట్ల పక్కన గోడకి ఉన్న కిటీకీల నుంచి పై అంతస్తులోకి చల్లటి గాలి వస్తుంది. చలికాలం ఆ కిటికీలను మూసేస్తే ఇల్లంతా వెచ్చగా ఉంటుందట. వీళ్లింట్లో కిటికీలు నేలకు దగ్గరగా మొదలై నిలువుగా ఉంటాయి. దాంతో బయటనుంచి చల్లని గాలి అలవోకగా లోపలికి వస్తుంది.

ప్రకృతే ఆధారం
గదుల మధ్యలో వీలైనచోటల్లా తలుపుల్లేకుండా ఆర్చీలను కట్టడంతో గాలీవెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ ఉంటాయి. ఇల్లంతా సౌర విద్యుత్తునే వాడతారు కాబట్టి కరెంటు బిల్లు ఉండదు. వర్షపునీటిని ఒడిసిపట్టి దాచుకునే వెసులుబాటునీ ఇంటితో పాటే నిర్మించారు. ఏటా ఓ లక్ష లీటర్ల నీటిదాకా సేకరించి దాన్నే వాడతారు. మిగిలిన వాననీరు భూమిలోపలికి ఇంకి బోరుబావిని రీచార్జ్‌ చేస్తుంది. కాబట్టి అస్సలు వర్షాలు కురవకపోతే తప్ప నీటి బిల్లూ ఉండదు.
డాబాపైన కూరగాయలూ పండ్లూ పండిస్తున్నారు. ఇంట్లో వాడిన నీరు రీసైకిల్‌ అయ్యి మొక్కలకు వెళ్తుంది. వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారుచేసి మొక్కలకు వేస్తారు. దాంతో అటు కూరగాయల ఖర్చూ తగ్గింది, ఇటు ఇల్లూ చల్లగా ఉంటోంది. వంటకు కూడా సోలార్‌ కుక్కర్‌నే వినియోగిస్తారు. ‘మామూలు ఇంటికన్నా పదిశాతం తక్కువ ఖర్చుతోనే ఇలాంటి ఇల్లు కట్టుకోవచ్చు. నిర్వహణ ఖర్చయితే 75 శాతం తక్కువ’ అంటారు చిత్రా విశ్వనాథ్‌.
పర్యావరణ మిత్ర భవనాలను రూపొందించే ‘బయోమ్‌ సొల్యూషన్స్‌’ సంస్థను నిర్వహిస్తున్న చిత్ర తాము కట్టించే భవనాలన్నిటికీ 99శాతం స్థానికంగా దొరికే ముడిసరకునే వాడతారు. సాధారణ పాఠశాలలతో మొదలుపెట్టి ఖరీదైన రిసార్టుల వరకూ దేశంలోనూ బయటా 700 ప్రాజెక్టులు కట్టించిన చిత్ర తక్కువ బడ్జెట్‌లో చిన్న ఇళ్లను కూడా అంతే సమర్థంగా కట్టగలరు. పాత ఇల్లు పడగొట్టి కొత్తది కడితే పాతింటికి సంబంధించిన ఏ వస్తువునీ వృథాగా పోనీయకుండా తిరిగి వాడతారు. భూమి మన ఇల్లు... దాన్ని ముందుతరాలకు పదిలంగా అందించాలన్నదే ఈ దంపతులు నమ్మి ఆచరిస్తున్న సూత్రం.ఇతను రివర్స్‌ గేర్‌!

వరైనా 180 డిగ్రీల్లో తిరిగితే ఎలాగుంటుంది... వాళ్ల శరీరంతోబాటు కాళ్లూ అటువైపే తిరుగుతాయి. కానీ శరీరాన్ని అలాగే ఉంచి, పాదాల్ని మాత్రం వెనక్కి తిప్పగలిగే వాళ్లు ఉంటారా... అని అడిగితే ఎవరూ ఎక్కడా ఉండరు అనే చెబుతాం. కానీ ఒక్కడున్నాడు, అతనే మోజెస్‌ లాహామ్‌... ‘అన్‌లైక్‌ ఎనీ వన్‌’ అనే రికార్డుని సొంతం చేసుకున్న ఒకే ఒక్కడు...
అమెరికాకి చెందిన లాహామ్‌ తనదైన ఈ వింత శరీర నిర్మాణాన్ని తొలిసారిగా 14 ఏళ్ల వయసులో గుర్తించాడట. ఒకసారి స్కూలు జిమ్‌లో తాడుని పట్టుకుని ఎక్కుతున్న సమయంలో 18 అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డాడట. అలా పడి లేచినప్పుడు అతని కాలు వెనక్కి తిరిగి ఉందట. టీచర్‌ అది చూసి అతనికి మడమ దగ్గర ఎముక విరిగి ఉంటుందనీ అందుకే అలా తిరిగిపోయి ఉంటుందనీ కంగారుపడుతుంటే- అతను మాత్రం చాలా క్యాజువల్‌గా లేచి నిలుచున్నాడట. పైగా నొప్పేమీ లేదనడంతో అంతా నోరెళ్లబెట్టారట. ఆ మర్నాడే రివర్స్‌ ఫుట్‌ లాహామ్‌గా అతని పేరు అందరికీ తెలిసిపోయింది. ఎక్స్‌-రేలు తీసి పరీక్షించగా- అతనికి పుట్టినప్పుడు కీళ్లదగ్గర మృదులాస్థితోబాటు ఇతర కణజాలం రెట్టింపు ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే అతని తుంటి ఎముకలూ మోకాళ్లూ మడమలూ అన్నీ ఎలా కావాలంటే అలా వంగిపోతాయట. ఈ రకమైన స్థితిని డబుల్‌ జాయింటెడ్‌, హైపర్‌ మొబిలిటీ అని పిలుస్తారు. ఆ తరవాతి నుంచి సమయం దొరికినప్పుడల్లా కాళ్లను వెనక్కి తిప్పి నడవడం ప్రారంభించాడట. అది చూసి తెలియనివాళ్లు భయపడి పారిపోయేవారు. దానివల్ల అతనికి ఎలాంటి నొప్పీ లేకపోగా అలా నడవడం మహా సరదాగానూ ఉండటంతో ప్రదర్శనలిస్తూ మిస్టర్‌ ఎలాస్టిక్‌గా పేరొందాడు. అప్పుడప్పుడూ దుస్తుల్ని వెనక్కి తిప్పి వేసుకోవడం వల్ల తల తిరిగిపోయిందేమో అన్న భ్రమ కలిగిస్తూ ఆశ్చర్య పరుస్తుంటాడు. అందుకే ఇతనో వింత వ్యక్తి అని శాస్త్రవేత్తలూ తేల్చేశారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు