close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆడుకునే కారు రూ. 71 లక్షలు!

మామూలుగానే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని అరచేతుల్లో నడిపిస్తూ పెంచుతున్నారు. ఇక, అపర కుబేరులైతే అస్సలు ఆగుతారా... పిల్లలు ఆడుకునేందుక్కూడా రోల్స్‌రాయిస్‌, బాండ్‌ కార్లూ, బుగాటీ కార్లను కొనిపెట్టాలనుకుంటారు. డబ్బులున్నాయని వాళ్లు కొన్నా, చిన్న పిల్లలు పెద్ద కార్లను ఎలా నడపగలరు... అని సందేహం అక్కర్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్లు ఇప్పుడు పిల్లలకోసమే ప్రత్యేకంగా చిన్న చిన్న కార్లను తయారు చేస్తున్నాయి. సైకిల్‌ తొక్కుతూ ఆడుకున్నట్లే పిల్లలు వీటిని ఇంటి ముందు రోడ్డు మీద అటూ ఇటూ నడుపుకోవచ్చు. పేరుకి పిల్లల కార్లేగానీ వీటి ధర తక్కువేమీ కాదండోయ్‌.

స్టన్‌ మార్టిన్‌... రూ.51 లక్షలు!
జేమ్స్‌ బాండ్‌ ‘గోల్డ్‌ ఫింగర్‌’ సినిమాలోని 1960ల నాటి బాండ్‌ కారు గుర్తుండే ఉంటుంది. పిల్లలకోసం అచ్చం దానిలానే డీబీ5 జూనియర్‌, డీబీ5 వాంటేజ్‌ జూనియర్‌ ఎలక్ట్రిక్‌ కార్లని కొద్దిరోజుల కిందట మార్కెట్లోకి తెచ్చారు. ఆస్టన్‌ మార్టిన్‌తో కలిసి బ్రిటన్‌కి చెందిన లిటిల్‌ కార్‌ కంపెనీ రూపొందించిన డీబీ5జూనియర్‌ కారు ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మూడు మీటర్లు పొడవు, 1.1 మీటర్లు వెడల్పు ఉండే ఈ కారుని పిల్లలు నడిపేటపుడు పెద్దవాళ్లు కూడా ఒకరు సరదాగా పక్కన కూర్చునే వీలుంటుంది. మామూలుగా గంటకు పన్నెండు మైళ్ల వేగంతోనూ ఎక్స్‌పర్ట్‌ మోడ్‌లో ముప్ఫై మైళ్ల వేగంతోనూ ప్రయాణించగల దీని ధర దాదాపు రూ.35 లక్షలట. దీనికన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించగల వాంటేజ్‌ కారు ధర రూ.45 లక్షలు. ఈ మోడల్‌ కార్లను కేవలం 1059 మాత్రమే అమ్ముతారట.

రోల్స్‌ రాయిస్‌... రూ.38 లక్షలు!
సంపన్నుల స్టేటస్‌ సింబల్‌గా కనిపించే రోల్స్‌రాయిస్‌ కార్ల తయారీ సంస్థ మరీ చిన్నపిల్లల కోసం రిమోట్‌తో పనిచేసే కలినన్‌ మోడల్‌ని మార్కెట్లోకి తెచ్చింది. పేరుకి బుల్లి కారేగానీ కారు ముందు కనిపించే కంపెనీ లోగో నుంచి లోపలి స్టీరింగూ సీట్లూ... అన్నీ అచ్చుగుద్దినట్లూ పెద్ద కారుకి ఉన్నట్లే రూపొందించారు. వినియోగదారుల కోరికకు తగ్గట్లూ మార్పులు కూడా చేసిస్తారట. ఈ మినీ రోల్స్‌ రాయిస్‌ ధర రూ.38 లక్షల వరకూ ఉంది.

బుగాటీ... రూ.24 లక్షలు!
ఖరీదైన కార్ల బ్రాండ్‌ బుగాటీ కూడా ఆ కంపెనీకి చెందిన టైప్‌ 35 గ్రాండ్‌ ప్రిక్స్‌ మోడల్‌ను పోలి ఉండేలా పిల్లల కోసం ‘బేబీ’ ఎలక్ట్రిక్‌ కారుని తయారుచేసింది. దాదాపు రూ.24 లక్షల విలువైన ఈ కారు నోవిస్‌ మోడ్‌లో గంటకు 12 మైళ్ల వేగంతోనూ ఎక్స్‌పర్ట్‌ మోడ్‌లో 30 మైళ్ల వేగంతోనూ ప్రయాణించగలదు. పెద్దలు దగ్గర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే దీన్ని అడల్ట్‌ మోడ్‌లోకి మార్చి వాళ్లు కూడా నడపొచ్చట.

ఫెరారీ... రూ.71లక్షలు!
మూడేళ్ల కిందట బ్రిటన్‌కి చెందిన ‘రిడిల్స్‌డెల్‌’గ్యారేజీ ‘ఫెరారీ టెస్టరొసా స్పైడర్‌’ మినీ కారుని అమ్ముతామంటూ వార్తల్లోకొచ్చింది. ‘ఫెరారీ 512 టెస్టరొసా’ కారు ఆ కంపెనీ 90ల్లో తయారుచేసిన మోడల్‌. ఈ కారులో అప్పట్లోనే ఫోను కూడా ఉండేదట. అందుకే, ఇది సెలెబ్రిటీల ఫేవరెట్‌గా ఉండేది. ఇప్పటికీ ఈకార్లను వేలంలో కోట్లు పెట్టి కొంటున్నారు. అంత పేరున్న కారు కాబట్టే దీన్లో సగం ఉండే టెస్టరొసా స్పైడర్‌ కారు ధరని రూ.71లక్షలుగా నిర్ణయించింది

రిడిల్స్‌డెల్‌ గ్యారేజీ. అందుకే, ఇది ప్రపంచంలోనే ఖరీదైన టాయ్‌ కారట. గంటకు పాతికమైళ్ల వేగంతో ప్రయాణించే ఈ కార్లు పెట్రోల్‌తో నడుస్తాయి. దీన్లోని లెదర్‌ సీట్లూ హెడ్‌లైట్లూ స్టీరింగ్‌ అన్నీ పెద్దసైజు మోడల్‌కి ఉన్నట్లే ఉంటాయి. ఈ మినీ కార్లను 1990ల్లో ఫెరారీ కంపెనీ కేవలం మూడింటినే తయారుచేసింది. వాటికే కొత్త హంగులు అద్ది కుబేరుల పిల్లల కోసం మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది రిడిల్స్‌ గ్యారేజీ. పిల్లల కార్లు ఇంత ఖరీదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు