close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెరువు లేకుండానే చేపలు పెంచేస్తున్నారు!

‘చేపల పెంపకం అంటే ఎకరాలకొద్దీ భూమిని చెరువుగా మార్చాలి, బోలెడంత పెట్టుబడి కావాలి, నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ... ’ ఇలాంటి అభిప్రాయాలు చాలానే ఉంటాయి. కానీ ఇవేమీ లేకుండా కొద్దిపాటి స్థలంలో, అధిక సాంద్రతతో, అత్యధిక లాభాలు వచ్చేలా చేపలను పెంచడమే ఇప్పటి ట్రెండ్‌. దీనికి అవకాశం కల్పిస్తున్న ఆర్‌ఏఎస్‌(రీసర్క్యులేటింగ్‌ ఆక్వాకల్చర్‌ సిస్టం)ను తెలుగు రాష్ట్రాల్లో రైతులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. అసలు ఈ పద్ధతేంటో మనమూ చూసేద్దామా!

సంప్రదాయరీతిలో చేపలు పండించే టప్పుడు ఉండే సమస్యలు అందరికీ తెలిసినవే. రైతులు ఎదుర్కొనే మార్కెట్‌ ఇబ్బందులకుతోడు ఏళ్లతరబడి చెరువుల్లో  సాగు వల్ల భూమి సారం కోల్పోతుంది. అధికంగా నీళ్లు అవసరం పడటంతోపాటూ కొన్నాళ్లకు భూగర్భ జలాలూ కలుషితం అవుతాయి. చిన్న వ్యాధి ప్రబలినా మొత్తం పంట మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే... ఈ సమస్యలన్నిటికీ సమాధానం చెబుతూ ఆర్‌ఏఎస్‌ పద్ధతి వచ్చింది. నిజానికి  ఇది నీటి లభ్యత అంతగా లేని విదేశాల్లో ఎప్పటినుంచో పాటిస్తున్నదే! మన రాష్ట్రాల్లోని కొందరు అభ్యుదయ రైతులు ఆ విధానాలను పరిశీలించి, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్చి అవలంబిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ జిల్లాల్లో ఈ ఆర్‌ఏఎస్‌ యూనిట్లు నెలకొల్పి అధిక లాభాలు పొందుతున్నారు.

తాజా నీటిలో...
ఏ జీవిలో అయినా శరీరం తనకు అవసరం లేని పదార్థాలనే విసర్జిస్తుంది. కానీ చెరువుల్లో ఉండే చేపలు... తాము విసర్జించిన పదార్థాల మధ్యే పెరగాలి. అవన్నీ నీటి అడుగున పేరుకుని కుళ్లిపోవడం వల్ల చేపలకే కాదు... వాటిని తిన్నవారికీ, చుట్టుపక్కల వాతావరణానికీ మంచిది కాదు. ఆర్‌ఏఎస్‌ పద్ధతి ముఖ్య ఉద్దేశం దీన్ని అరికట్టడమే. ట్యాంకుల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చేపలు వదిలిన వ్యర్థాలను వెలికితీసేయడం, నీటిని తాజాగా ఉంచడంతో అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. నీటిని ఫిల్టర్‌ చేసి మళ్లీ మళ్లీ వాడతారు కాబట్టి దీన్ని రీసర్క్యులేటింగ్‌ సిస్టం అంటున్నారు. పైగా ఈ పద్ధతిలో ఎటువంటి రసాయనాలూ వాడరు. కెమికల్‌ ఫ్రీ ఫార్మింగ్‌ కావడం వల్ల చేప మార్కెట్‌లో మంచి ధర పలుకుతూ రైతుకూ ఆర్థికంగా బాగుంటుంది.

ఈ పద్ధతిలో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి కనీసం 800 గజాల స్థలం ఉన్నా చాలు. రేకులతో షెడ్డు వేసి... అందులో సిమెంటు లేదా స్టీలుతో కొలతల ప్రకారం నాలుగు నుంచి పన్నెండు వరకూ ట్యాంకులు కట్టిస్తున్నారు. వీటిలో నీటిని నింపడానికీ, మార్చడానికీ తగిన పైపులూ ఫిల్టర్ల వ్యవస్థ అవసరమవుతుంది. నీటి నుంచి చేపల వ్యర్థాలను వేరు చేయడానికి మరో ప్రత్యేకమైన ట్యాంకు ఉండాలి. మొత్తం ట్యాంకుల్లో సగం నర్సరీ, సగం గ్రోత్‌ ట్యాంకులు ఉంటాయి. హేచరీల నుంచి తెచ్చిన చేప పిల్లలను ముందు నర్సరీ ట్యాంకుల్లో మూడు, నాలుగు నెలలు ఉంచుతున్నారు. ఆ తర్వాత వాటిని గ్రోత్‌ ట్యాంకుల్లోకి మారుస్తున్నారు. మొదటి ట్యాంకులో పావుకేజీ వరకూ పెరిగిన చేప... రెండో ట్యాంకులో రకాన్ని బట్టి కేజీ నుంచి కేజిన్నర వరకూ పెరుగుతుంది. ఈ క్రమం ఇలా కొనసాగడం, ఒక్కో ట్యాంకులో ఒక్కో వయసున్న చేపలు ఉండటం వల్ల పంటనంతా ఒకేసారి తీయాల్సిన అవసరం రాదు. మొదటిసారి పంట చేతికి రావడానికి ఆరేడు నెలల సమయం పట్టినా... ఆ తర్వాత ఏడాదికి మూడు నాలుగుసార్లు చేపలు తీయొచ్చు, ఫాం దగ్గరే రోజూ వంద కేజీల వరకూ అమ్ముతున్నవారూ ఉన్నారు! పెద్దట్యాంకుల్లో నలభై వేల లీటర్ల వరకూ నీళ్లు పడతాయి, మూడు నుంచి నాలుగు వేల పిల్లలను పెంచొచ్చు. ఇది ఒక పెద్ద చెరువు సామర్థ్యానికి సమానం తెలుసా! అంటే తక్కువ స్థలంలో, తక్కువ నీరూ పెట్టుబడితో అదేస్థాయిలో దిగుబడి సాధిస్తున్నారన్నమాట. అమ్మోనియా, పీహెచ్‌ స్థాయులను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. చేప కంటికి కనిపిస్తూ ఉండటం వల్ల ఎలాంటి వ్యాధి ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. కొరమీను, బొచ్చ, బొమ్మిడాయి... ఇలా రకాన్ని అనుసరించి నీటికి సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తున్నారు. అలాగే ఇవి ఆరుబయట కాకుండా షెడ్డులో పెరగడం వల్ల గాలి, ఇతర జంతువుల ద్వారా వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌ల ఉద్ధృతి తగ్గుతుంది. 4 నుంచీ 12 ట్యాంకులు పెట్టి ఏడాదికి సగటున 40 టన్నుల నుంచీ 70 టన్నుల వరకూ ఉత్పత్తి చేస్తున్నారు. 70 లక్షల నుంచీ కోటిన్నర వరకూ టర్నోవర్‌ ఉంటోంది. చేపపిల్లల కొనుగోలూ వాటి ఆహారం, కూలీల ఖర్చూ పెట్టుబడిగా పోయినా సగానికి సగం లాభంగా మిగులుతోంది. కొందరైతే ఈ చేపల వ్యర్థాల ద్వారా ఎరువులు తయారుచేసి అదే ఫాంలో మొక్కలను కూడా పెంచుతున్నారు. అన్నివిధాలా లాభదాయకంగా ఉండటంతో ఈ పద్ధతి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సంప్రదాయరీతికి పూర్తి భిన్నంగా సాగుతున్న ఈ సాగు... అటు రైతులకూ ఇటు వినియోగదారులకూ మేలు చేస్తుందనడంలో సందేహమే లేదు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు