
మొక్కలు పెరట్లో ఉంటాయి. లేదంటే బాల్కనీలో కుండీల్లో పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్ అయితే హాల్లో ఏదో ఓ మూల పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు కాఫీ టేబుల్లోనూ మొక్కల్ని పెంచేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ ఇంటికి అందాన్నీ మనసుకి ఆహ్లాదాన్నీ ఇస్తోంది.
ఉద్యోగం, వ్యాపారం ఇలా రోజంతా ఏదో ఒక పనితో బయట తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరి సోఫాలో వాలిపోతాం. ఇంట్లో ఉన్నా అంతే... పని ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలన్నా సోఫాలో ఒరిగిపోతాం. టీవీ చూడ్డానికీ కుటుంబమంతా అక్కడే చేరిపోతుంది. మరి, అలాంటి చోటులో కంటికెదురుగా పచ్చని మొక్కలు ఉంటే ఇంకెంత హాయిగా ఉంటుందో కదా..! సోఫాకెదురుగా మొక్కల్ని ఎలా పెంచగలం అన్న సందేహం అక్కర్లేదు... మనసుంటే మార్గముంటుందన్నట్లూ ప్రకృతి ప్రేమికులు తలచుకుంటే పచ్చదనం ఎక్కడైనా పరుచుకుంటుంది. సక్యులెంట్ గార్డెన్లుగా మారిన ఈ కాఫీ టేబుళ్లను చూస్తుంటే ఆ విషయం అర్థం కావట్లేదూ? దీనికోసం టేబుల్ పైభాగాన్ని కాస్త లోతుగా ఉండేలా తయారుచేయించుకుంటే చాలు. ఎండా ఎక్కువ నీరూ అవసరం లేని ఎడారి మొక్కల్ని ఎంచక్కా అందులో నాటుకోవచ్చు. ఆ పైన మామూలు గ్లాస్ టేబుళ్లకున్నట్లే గాజు ఫలకాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అయితే, టేబుల్లోని మొక్కలకు గాలి వెళ్లేందుకు వీలుగా టేబుల్కీ గాజు అద్దానికీ మధ్యలో కాస్త ఖాళీ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మొక్కలకు నీళ్లు పోసేందుక్కూడా వీలుంటుంది. ఇంకో విషయం ఏంటంటే... ఇలా పెంచే మొక్కలకు నీరు నిల్వ ఉండకుండా కొద్ది కొద్దిగానే పొయ్యాలి. ఎడారి మొక్కల్లో పచ్చగా ఉండే వాటితో పాటు, ఎన్నో రంగుల్లోనూ అందమైన రూపాల్లో ఉండేవీ వస్తున్నాయి. అలాంటివి టేబుల్లో ఉంటే అక్కడ పచ్చదనమే కాదు, చిన్నసైజు తోట ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అలాకాదూ ఎక్కువ పచ్చదనమూ గుబురుగా పెరిగే మొక్కలూ కావాలీ అనుకుంటే నాచు మొక్కల్నీ తక్కువ ఎత్తు పెరిగే ఇండోర్ మొక్కల్నీ పెంచుకోవచ్చు.
కంటికీ మంచిది
ఎక్కువసేపు ఫోన్లూ టీవీలూ కంప్యూటర్లూ చూడటం వల్ల రకరకాల కంటి సమస్యలు వస్తున్నాయి. సృజనాత్మకత కూడా తగ్గుతుందనీ మానసికంగానూ సమస్యలు తలెత్తు తున్నాయనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే, తప్పనిసరై స్మార్ట్తెరలు చూసినా కనీసం ఇరవై నిమిషాలకోసారి కొద్ది సెకన్లపాటు పచ్చని మొక్కల వైపు చూస్తే మంచిదన్నది వైద్యుల మాట. అలాంటపుడు రోజులో ఎక్కువ సమయం గడిపే సోఫా ముందు పచ్చదనం పరుచుకుని ఉంటే మంచిది కదా... అందుకే, ‘కాఫీ టేబుల్ సక్యులెంట్, టెర్రేరియం గార్డెన్’ల ట్రెండ్ ఈమధ్య పెరుగుతోంది.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్