close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేద విద్యార్థుల కోసం...  ఎంత చేస్తున్నారో!

స్వాతంత్య్రం తర్వాతి మనదేశ విద్యా చరిత్రని ఒక్క ముక్కలో చెప్పమంటే... ‘కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా సరే కేవలం పిల్లలు చదువుకోవడంతో ఉన్నతికి చేరిన కుటుంబాల చరిత్ర ఇది’ అని చెప్పేయొచ్చు! ఈ విషయం బాగా తెలిసినవాళ్లు కాబట్టే ఈ ముగ్గురూ పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం నడుంబిగించారు. ఇలాంటి సేవకి డబ్బుకన్నా సలకల్పబలమే ముఖ్యమని నిరూపిస్తున్నారు!


వేలమందికి సర్కారు ఉద్యోగాలు...

తేక్కుంబగమ్‌... కేరళ కొల్లం జిల్లాలోని ఓ చిన్న గ్రామం. గ్రామం చిన్నదేకానీ అక్కడ ప్రతి గడపకో ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు! కేరళలో సర్కారు ఉద్యోగులు ఎక్కువున్న గ్రామంగానూ అది గుర్తింపు సాధించింది. ఇదంతా గత పాతికేళ్లుగానే. అదివరకు అక్కడున్నవన్నీ పేద కుటుంబాలే. అలాంటి ఆ గ్రామం తలరాతని మార్చినవాడు... మురళీకృష్ణన్‌. ఇంటర్‌లో చదువు బుర్రకెక్కక మొద్దబ్బాయిగా పేరుతెచ్చుకున్నాడట మురళీ. ఓ రోజు వాళ్లనాన్న బాగా తిట్టడంతో ఇక తాను చనిపోవడమే మేలని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. చివరి నిమిషంలో భయపడిపోయి పట్టాలపై నుంచి పరుగెత్తుకుని వచ్చేశాడు. ఆ తర్వాత అతికష్టంపైన ఇంటర్‌ ముగించి, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాశాడు. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం తెచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది చూసి అప్పటికి ఎన్నోసార్లు పీఎస్‌సీ పరీక్షలు రాసీ పాస్‌కాని అతని స్నేహితులు సాయమడిగితే వాళ్లకి ట్యూషన్‌ చెప్పాడు. అది మొదలు గత పాతికేళ్లలో ఐదువేల మందికి తన కోచింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చూశాడు మురళీకృష్ణన్‌. ఇప్పటిదాకా రూపాయికూడా ఫీజు తీసు కోలేదు. ప్రస్తుతం తిరువనంతపురం సచివాలయంలో పనిచేస్తున్న మురళీ... తన తరగతులని శని, ఆదివారాలకే పరిమితం చేశాడు. ఆ రెండు రోజుల్లో దాదాపు వెయ్యిమందికి కోచింగ్‌ ఇస్తాడు. కొవిడ్‌ నేపథ్యంలో క్లాసులకి హాజరుకాలేని వాళ్ల కోసం ‘ఫ్యూచర్‌ కాలేజ్‌ ఆన్‌లైన్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తున్నాడు మురళీకృష్ణన్‌!


ఇదో విభిన్నమైన వర్సిటీ!

హైదరాబాద్‌లోని పాతబస్తీ ఎంత వెనకపడ్డ ప్రాంతమో చెప్పక్కర్లేదు. సగటు అక్షరాస్యత కూడా ఇక్కడ చాలా తక్కువ. అంత వెనకపడ్డ ప్రాంతంలోని పిల్లల కోసం ఓ ప్రయివేటు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ప్రొఫెసర్‌ సయ్యద్‌ జహంగీర్‌. హైదరాబాద్‌లోని ‘ఇఫ్లూ’లో అరబ్బీ భాష హెచ్‌ఓడీగా ఉంటారాయన. నిరుపేద ముస్లిం విద్యార్థులని వాళ్ల మాతృభాష ద్వారానే ఉన్నత విద్యావంతుల్ని చేయాలనుకున్నారు. కాకపోతే ‘మదరాసా’లకి భిన్నంగా ఆధునిక పద్ధతిలో దాన్ని నేర్పించాలని భావించారు. అందుకోసమే తన సొంత ఖర్చుతో ఇంగ్లిషు మోడల్‌ ఉర్దూ యూనివర్సిటీ(హర్మెయిన్‌ షరీఫియాన్‌)ని స్థాపించారు! ఉచితంగా భోజనం, బస వసతి కల్పించి మరీ చదువు చెబుతున్నారీ ప్రయివేటు విశ్వవిద్యాలయంలో. కేవలం ఉర్దూ మాత్రమే కాకుండా ఇంగ్లిషు, పార్సీ, సంస్కృతం, అరబ్బీ భాషలూ, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ కూడా నేర్పిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ముస్లీం విద్యార్థులు వస్తున్నారు. ఇన్ని భాషల్ని నేర్చుకోవడం వల్ల ఇక్కడ చదువుకున్న విద్యార్థులు పలు మల్టీనేషనల్‌ కంపెనీల్లో చక్కటి భాషానువాదకులుగా రాణిస్తున్నారు! అన్నట్టు... దేశంలో సంస్కృతం నేర్పిస్తున్న ఏకైక ఇస్లాం విద్యాసంస్థ కూడా ఇదే.


గిరిజన విద్యార్థులకి చదువు!

ఆయన పేరు కె.విజయశేఖరన్‌. ఒకప్పుడు పాఠశాల ప్రిన్స్‌పాల్‌గా చేస్తుండేవారు. అప్పట్లో వాళ్లింటి పక్కనే ఎస్సీ, ఎస్టీ బాలుర సంక్షేమ హాస్టల్‌ ఉండేది. అక్కడ చదువుకునేవాళ్లలో అత్యధికులు గిరిజన పిల్లలు. సరైన బోధకుల్లేక ఆ పిల్లలు చదువుకి దూరం కావడం చూసి ఆయన మనసు కరిగింది. తాను విధులకి వెళ్లొచ్చాక అక్కడి విద్యార్థులకి ఉచితంగా పాఠాలు బోధించడం మొదలుపెట్టారు. అలా గత 30 ఏళ్లలో ఎంతోమందిని ఉన్నత విద్యావంతులని చేశారు. 2005లో విజయశేఖరన్‌ రిటైర్‌ అయ్యారు. అప్పుడు ఆయన వద్ద పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ విజయశేఖరన్‌కి ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నారట. అప్పుడు విజయశేఖరన్‌ ఉన్నత విద్య చదవాలనుకునే గిరిజన విద్యార్థుల కోసమని ఓ పెద్ద భవంతిని కట్టివ్వాలని వాళ్లని కోరారట. ఆ విద్యార్థులు అప్పటికప్పుడు ఓ ట్రస్ట్‌ ఏర్పాటుచేసి రెండంతస్థుల భవంతిని కట్టిచ్చారు. అందులో 75 మంది విద్యార్థులు పాఠాలు వినగల పెద్ద హాలూ, ఓ అత్యాధునిక లైబ్రరీతోపాటూ బసకి కావాల్సిన సకల వసతులూ ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ చదువుకున్న కృష్ణదాస్‌ అనే గిరిజన విద్యార్థి ‘గేట్‌’ సాధించి ఐఐటీలో పీజీ సీటు తెచ్చుకున్నాడు. కేరళ ఉత్తరప్రాంతం గిరిజనుల్లో ఈ ఘనత సాధించిన తొలి విద్యార్థి తనే. అతనేమో ఆ ఘనత ముమ్మాటికీ విజయశేఖరన్‌దేనని అంటున్నాడు కృతజ్ఞతతో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు