close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మడిస్తే పెండెంట్‌... తెరిస్తే నెక్లెస్‌..!

ప్రతిసారీ ఒకే నగ వేసుకోవాలంటే బోర్‌ కొట్టేస్తుంది. చూడ్డానికీ కొత్తగా ఉండదు. అలా కాకుండా మన దగ్గరున్న నెక్లెసే చిటికెలో పెండెంట్‌గా మారిపోతే..? దాన్నే కావల్సినప్పుడు క్షణాల్లో మళ్లీ  నెక్లెస్‌గా చేసి వేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా... అందుకోసం వస్తున్నవే ఈ టూ ఇన్‌ వన్‌ నెక్లెస్‌ కమ్‌ పెండెంట్‌ నగలు.

నిశ్చితార్థం, పెళ్లి లాంటి వేడుకలకు వెళ్లేటప్పుడైతే కాస్త ఎక్కువ రెడీ అవుతాం. అలాంటప్పుడు పట్టు చీరలూ లంగా ఓణీల మీదికి నెక్లెస్‌లూ హారాలూ వేస్తే బాగుంటుంది. పుట్టినరోజు లాంటి వాటికైతే కొంచెం సింపుల్‌గా ఉన్న చీరనో చుడీదార్‌నో వేస్తాం కాబట్టి వాటిపైన పెద్దగా ఉండే పెండెంట్‌ వేస్తే ఎంచక్కా నప్పుతుంది. కానీ బంగారం రేటు ఆకాశాన్నంటుతున్న వేళ... ఒకటీ రెండు ఆభరణాలు కొనుక్కోవాలంటేనే బోలెడంత ఖర్చు అవుతోంది. ఇక, వేడుకకు తగ్గట్లు వేరు వేరు రకాల నగల్ని కొనాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదివరకటి రోజుల్లో అయితే, ఎప్పుడో ఒక్కసారి నగల్ని చేయించుకుంటే వాటినే జీవితాంతం వేసుకునే వారు. ఇప్పుడలా కాదు. ఇప్పుడున్న మోడల్‌ రెండేళ్లకే పాత ఫ్యాషన్‌ అయిపోతోంది. అప్పుడు మార్చి కొత్త నగ చేయించుకోవాలన్నా తరుగు బోలెడంత పోతుంది. అదే ఈ టూ ఇన్‌ వన్‌ నెక్లెస్‌ కమ్‌ పెండెంట్‌ నగలు ఉంటే ఈ బాధంతా ఉండదు.

అయస్కాంతం మహిమ
ఎలా కావాలంటే అలా మార్చుకోగలిగే ఈ నెక్లెస్‌లలో బయటికి కనిపించకుండా చిన్న చిన్న అయాస్కాంతాలను అమర్చుతారు. నగ డిజైన్‌ని కూడా ప్రత్యేకంగా చేస్తారు. దాంతో నెక్లెస్‌ని పెండెంట్‌గా మార్చాలనుకున్నప్పుడు దాని మధ్యలో వేలాడే లాకెట్‌కి అటూ ఇటూ ఉండే చెయిన్‌లను రెండువైపుల నుంచీ లాకెట్‌ చుట్టూ అమరేలా దగ్గరకు చుడితే చాలు. ఆ రెండు చివరలూ లాకెట్‌ చుట్టూ చక్కగా అమరి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి అచ్చం పెండెంట్‌లా మారిపోతుంది. వీటి చివరల్ని కలిపేందుకు చిన్న హుక్కుల్లాంటివీ ఉంటాయి. నెక్లెస్‌కి రెండు వైపులా ఉండే చెయిన్లు కూడా పెండెంట్‌కి ఉన్నట్లు ఒక దగ్గరకు వచ్చేస్తాయి. మళ్లీ నెక్లెస్‌లా కావాలంటే దగ్గరకు కలిపినదాన్ని విడదీస్తే సరి. ఈ తరహా నగలకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే... ఆ నగనే ఇలా మార్చాం అని చెప్పినా నమ్మేలా ఉండవు. పైగా అతికించినట్లూ తెలియదు. బాగున్నాయి కదూ..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు