close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ లాలీపాప్‌లు తాగడానికి!

లాలీపాప్‌... పిల్లల ఫేవరెట్‌ క్యాండీ. పెద్దలకూ దాన్ని చూస్తే చప్పరించాలనిపించకమానదు. కొత్త విషయం ఏంటంటే... ఇప్పుడు టీ, కాఫీల కోసమూ లాలీపాప్‌లు వస్తున్నాయి. టీ బ్యాగుల్లానే వీటిని వేడినీళ్లూ లేదా పాలల్లో ముంచి నచ్చిన పానీయాన్ని తయారు చేసుకోవచ్చు.

టీపొడితో టీ పెట్టుకునే కన్నా వేడి నీళ్లలో లేదా పాలల్లో టీ బ్యాగ్‌ వేసుకోవడం సులభం. అయితే, కేవలం టీ బ్యాగ్‌ వేసినంత మాత్రాన టీ రెడీ అయిపోదు. అందులో పంచదార గానీ తేనెగానీ వెయ్యాలి, స్పూన్‌తో కలపాలి. ఇక, గ్రీన్‌ టీలో నిమ్మరసం, అల్లం కలుపుకోవాలంటే విడిగా తెచ్చుకోవాలి. తులసి, పుదీనా... లాంటివి కావాలన్నా విడిగా వేసుకోవాలి. దానికెంత సమయం పడుతుందిలే అనుకుంటాం కానీ అంతకన్నా సులభంగా చెయ్యగలిగిన అవకాశం ఉంటే ఈమాత్రం కష్టపడటమైనా ఎందుకనిపించకమానదు. ఆ సౌకర్యాన్ని అందంగా కల్పించేందుకు వస్తున్నవే ఫ్లేవర్డ్‌ టీ, కాఫీ, హనీ లాలీపాప్‌లు. మామూలుగా గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, కాఫీ బ్యాగులు వేరు వేరు ఫ్లేవర్లలో వచ్చినా వాటిలో పంచదార లేదా తేనె కలిసుండవు. కానీ ఈ లాలీపాప్‌లు వాటితో కలిపే వస్తాయి. ఉదాహరణకు గ్రీన్‌ టీ లాలీపాప్‌నే తీసుకుంటే గ్రీన్‌ టీ పౌడర్‌తో పాటు, అందులో తేనెను కూడా కలిపి లాలీపాప్‌గా చేస్తారు. దీన్ని వేడినీళ్ల కప్పులో ముంచి ఆ లాలీపాప్‌ పుల్లతోనే ఓ నిమిషం తిప్పుకుంటే చాలు. గ్రీన్‌ టీ తయారైపోతుంది. విడిగా స్పూను కూడా అవసరం లేదు. అందుకే, వీటిని లాలీపాప్‌, టీ కాఫీ స్టిర్రర్స్‌, టీ స్పూన్స్‌ అని కూడా అంటున్నారు. ఇలాగే బ్లాక్‌ టీ, లెమన్‌ టీ, అల్లం టీ, హెర్బ్‌ల్‌ టీ, ఫ్లవర్‌ టీ, ఫ్రూట్‌ టీ, వెనీలా చాయ్‌, హాట్‌ చిల్లీ టీ, స్పైస్‌ టీ... అంటూ రకరకాల టీ లాలీపాప్‌లు వస్తున్నాయి. కాఫీ లాలీపాప్‌లను కూడా పంచదార, కాఫీ పొడి కలిపిన సిరప్‌తో చేస్తారు. దీన్లోనూ వేరు వేరు రుచులు ఇష్టపడేవారి కోసం కాఫీ క్యారమెల్‌, సిన్నమన్‌ లాటె, పెప్పర్‌ మింట్‌ లాటె... లాంటి ఎన్నో ఫ్లేవర్లు దొరుకుతున్నాయి.

తేనె, పంచదారకూ లాలీపాప్‌లు
మామూలుగా పెట్టుకునే టీలలోనూ కాఫీల్లోనూ తేనె లేదా పంచదార కలుపుకోవాల్సిందే. అదే అవి లాలీపాప్‌లా వస్తే ఒకటి తీసుకుని చిటికెలో ఆ పుల్లతోనే కలిపేసుకుని తాగేయొచ్చు. కొందరు టీలో అల్లం, నిమ్మరసం, దాల్చిన చెక్క, తులసి... ఇలా ఏదో ఒక రుచి అదనంగా ఉంటే ఇష్టపడతారు. అలాంటివారికోసం జింజర్‌ హనీ, లెమన్‌ హనీ, లావెండర్‌ హనీ... అంటూ ఎన్నో రుచుల్లో తేనె పుల్లలు వస్తున్నాయి. పంచదార లాలీపాప్‌ల విషయానికొస్తే... అందరికీ టీలో పంచదార వేసుకునే అలవాటుండదు. అందుకే, ఇంటికొచ్చిన అతిథులకు ముందే పంచదార వెయ్యకుండా కావల్సినంత వేసుకునేలా విడిగా పంచదారనూ స్పూనునీ పెడుతుంటారు. దీనికి కాస్త అందమైన పరిష్కారమే షుగర్‌ లాలీపాప్స్‌. బ్రౌన్‌ షుగర్‌తో కూడా వస్తున్న ఈ లాలీపాప్‌ను సాసర్‌లో పెడితే చూడ్డానికి భిన్నంగానూ ఉంటుంది. రుచికి తగ్గట్లూ కలుపుకుంటారు. వీటిలో కుంకుమపువ్వు కలిపినవి కూడా వస్తున్నాయి. అన్నట్లూ వీటిలో కొన్ని లాలీపాప్‌లు చాక్లెట్‌లా చప్పరించడానికీ బాగుంటాయి. అదండీ సంగతి... చూడ్డానికి అందంగానూ సులభంగా వాడుకునేలానూ ఉన్న ఈ లాలీపాప్‌ స్పూన్లు ఆఫీసుల్లాంటి చోటికి తీసుకెళ్లేందుకూ సౌకర్యంగా ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు