close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాస్త... ఎండలోకి పదం‘డి’!

ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ... సుఖంగా బతకడమంటే ఎండ కన్నెరుగకుండా జీవించడమే అనుకుంటున్న మనిషికి కనువిప్పు కలిగించింది కరోనా వైరస్‌. ఇన్నాళ్లూ స్థూలకాయమూ గుండెజబ్బులూ మధుమేహమూ లాంటివే జీవనశైలి వ్యాధులన్న భ్రమలో ఉన్నవారికి మరో కొత్త సంగతిని చెప్పింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని తెలియగానే- అసలు వ్యాధినిరోధక శక్తి ఎందుకు తగ్గుతోందీ అన్న ప్రశ్న తలెత్తింది. ఉచితంగా దొరికేదే కదా అని ఏళ్ల తరబడి ‘సన్‌షైన్‌’ విటమిన్‌ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇదని అర్థమయ్యాక ఇప్పుడు సప్లిమెంట్లతో గండం గట్టెక్కాల్సి వస్తోంది. ఒక్క కరోనాని ఎదుర్కొనడానికే కాదు... ‘డి’ విటమిన్‌తో మన శరీరానికి చాలా పనులున్నాయి. అవేంటో తెలుసుకుని తగినంత ఆ విటమిన్‌ని సొంతం చేసుకుంటే ఆరోగ్యం మీ వెంటేనంటున్నారు పరిశోధకులు!

తెల్లగా తెల్లవారినా ఇంకా నిద్ర లేవకపోతే ఎలా...
బారెడు పొద్దెక్కింది త్వరగా పొలం వెళ్లాలి...
పొద్దుగూకేదాకా వంచిన నడుము ఎత్తకుండా పనే పని...
ఒకప్పటి మన ప్రతి మాటలోనూ, ప్రతి పనిలోనూ పరోక్షంగా సూర్యుడి ప్రస్తావన ఉండేది. ఇంట్లో వడియాలు పెట్టాలన్నా పొలంలో కందికాయ ఎండబెట్టాలన్నా... ఆ సూర్యుడి కనుసన్నల్లోనే. ఆకాశంలో సూర్యుడి ప్రయాణానికి అనుగుణంగానే నేల మీద మనిషి దినచర్య సాగేది.
అలాంటిది కృత్రిమ వెలుగులు కనిపెట్టి, చేతికి వాచీ పెట్టిన మనిషి ఇక సూర్యుడిని మర్చిపోయి ఇరవైనాలుగ్గంటల్నీ ఉపయోగించుకునేందుకు మూడు షిఫ్టుల పనిలో పడిపోయాడు. పని చేసుకోవడంలో తప్పులేదు కానీ, సూర్యుడితో అనుబంధాన్ని కేవలం పగలూ రాత్రీ అన్న తేడా తెలుసుకోడానికే పరిమితం చేయడం వల్లే వచ్చింది ఇబ్బంది అంతా. అసలు సూర్యుడు లేనిదే భూమి మీద ప్రాణమే ఉండదు. విత్తనం మొలకెత్తగానే చిగురించే రెండు ఆకులూ సూర్య కిరణాలవైపు చేతులు చాస్తాయి. ఆ కిరణ స్పర్శతోనే మొక్కలు ఆహారాన్ని తయారుచేసుకుని ఏపుగా ఎదుగుతాయి. మన శరీరానికి ఒక ఆకృతినిచ్చే ఎముకలూ కండరాలూ పుష్టిగా ఉండటానికి సూర్యరశ్మినుంచి లభించే ‘డి’ విటమిన్‌ కావాలి. ఆ సంగతి తెలిసి కూడా మనం ‘అమ్మో ఎండ’ అంటూ దానికి కన్పించకుండా దాక్కుంటున్నాం. అలా ఎండ తగలకుండా జీవించడం వల్లే ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు నిపుణులు.

ఎండలో తిరుగుతూనే ఉంటాం కదా..?
తిరగకేం, తిరుగుతూనే ఉన్నాం...
ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఆఫీసులకీ, పనులకు వెళ్లేవాళ్లు పనులకీ, వ్యవసాయం చేసేవాళ్లు పొలానికీ... వెళ్తూనే ఉన్నారు. అయినా మనదేశంలో నూటికి డెబ్భైమందికి పైనే ‘డి’ విటమిన్‌ లోపం ఉంటుందని
నిపుణులు చెబుతున్నారు.

ఎందుకలా..?
ఎందుకంటే- ఎంత మనం బయట తిరుగుతున్నా ఎండ ఒంటి మీద పడడంలేదట. అందుకు కారణం మారిపోయిన మన అలవాట్లే. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవనశైలిలో మార్పులు వచ్చాయి. శారీరక కష్టం తగ్గిపోయి ప్రతి పనికీ యంత్రాలను వాడడం ఎక్కువైంది. ఒకప్పుడు పెద్ద పెద్ద ఇళ్లూ ముందూ వెనకా ఖాళీ స్థలాలూ ఉండేవి. స్త్రీలూ పురుషులూ కూడా పెరటి వాకిట్లోనో, బావి దగ్గరో కూర్చుని పనులెన్నో చేసుకునేవారు. చాలామంది పొలాలకు వెళ్లేవాళ్లు. ఎక్కడికైనా నడిచి వెళ్లేవాళ్లు. దాంతో ఏదో ఒక సమయంలో కావలసినంత ఎండ శరీరం మీద పడేది. ఆఖరికి రాణివాసాల్లాంటి వాటిల్లో కూడా ఎండ కాగడానికి ఒక చోటు ఉండేది. కానీ రాను రాను ఆ అలవాట్లు పోయాయి. పెరుగుతున్న జనాభాకి చోటు చాలక ఇళ్లు ఇరుకైపోయాయి. వాహనాల వాడకం పెరిగి నడక తగ్గిపోయింది. పట్టణాల్లో ఉండే పెద్దలూ పిల్లలూ ఆఫీసులకీ బడులకీ పొద్దున్నే వెళ్లిపోతే మళ్లీ సాయంత్రం చీకటి పడే వేళకి ఇంటికి చేరతారు. ఇంటి పట్టున ఉండే స్త్రీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం కట్టుకుంటున్న ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో ఎండ పడడం అరుదు. వీరే కాదు, ఆఖరికి రోజంతా పొలంలో పనిచేసే వారిలో కూడా ‘డి’ విటమిన్‌ చాలినంత లేదని తిరుపతిలో ఓ డాక్టర్ల బృందం జరిపిన అధ్యయనం వల్ల తెలిసింది.

అదెలా..?
పొలంలో పనిచేస్తున్నవాళ్లు ఎండ తట్టుకోలేక మొత్తం శరీరాన్ని దుస్తులతో కప్పేసుకోవడం వల్ల వారి శరీరంలోనూ తగినంత ‘డి’ విటమిన్‌ తయారవడం లేదట. ఈ విటమిన్‌ని మన శరీరం తయారుచేసుకోవాలంటే కేవలం ఎండలో కాసేపు తిరిగితే సరిపోదు. మరికొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ఏమిటవి?
పసిపిల్లల్ని ఉదయపు లేత ఎండలో కాసేపు ఉంచమని వైద్యులు చెప్పడం మనకు తెలుసు. లేత చర్మం కాబట్టి వారికి అది చాలు. కానీ పెద్దయ్యే కొద్దీ అది సరిపోదు. మిట్టమధ్యాహ్నపు ఎండ రోజూ అరగంటన్నా తగలాలి. ముఖ్యంగా ఉదయం పదిగంటల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటలోపు అయితే మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో అయితేనే మన శరీరం కూడా అందుకు సిద్ధంగా ఉంటుందట. ఒక్కసారి గుర్తు చేసుకోండి... ఆ సమయంలో వారంలో ఎన్నిసార్లు బయటకు వెళ్లారో! మరో ముఖ్యమైన విషయం- నిండా దుస్తులు కప్పుకుని ఏ బండి మీదో, బస్సులోనో వెళ్లొచ్చి ఎండలో తిరిగానంటే సరిపోదు. సూర్యకిరణాలు నేరుగా, స్థిరంగా చర్మానికి తగలాలి. ముఖమూ, ముంజేతులూ, కాళ్లూ... ఎంత ఎక్కువ చర్మంపై ఎండ పడితే అంత మంచిది. సూర్యకాంతిలో ఉన్న అతినీలలోహిత కిరణాలు చర్మంలోని కొలెస్టరాల్‌తో కలిసి ‘డి’ విటమిన్‌ తయారీకి తోడ్పడతాయి. చలిప్రాంతాల్లో ఉండేవారికీ, శరీరఛాయ తక్కువ ఉండేవారికీ ఇతరుల కన్నా మరింత ఎక్కువ సమయం ఎండలో ఉండడం అవసరం. దుస్తులే కాదు, ఆఖరికి ఎండ తగిలి చర్మం నల్లబడుతుందని భావించి మనం వాడే సన్‌స్క్రీన్‌ లోషన్లూ, వాతావరణంలో ఉండే కాలుష్యమూ కూడా సూర్యకాంతిని నేరుగా మనకి తగలకుండా అడ్డుకుని విటమిన్‌ ‘డి’ తయారీకి అవరోధం అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన వాటా విటమిన్‌ ‘డి’ని పొందేందుకు ప్రయత్నించాలి.

ఈ విటమిన్‌ తగ్గితే తెలిసేదెలా?
రక్త పరీక్షతో తెలుసుకోవచ్చు. త్వరగా అలసిపోవడం, మెట్లెక్కితే కాళ్లూ కండరాలూ నొప్పెట్టడం, జుట్టు ఊడిపోవటం, చర్మం నిగారింపు తగ్గడం, తరచూ జలుబూ, జ్వరమూ, తలనొప్పులూ, ఇతర అనారోగ్యాలూ ఇబ్బంది పెడుతుంటే- డి విటమిన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఒకప్పుడు విటమిన్‌ ‘డి’ లోపం అంటే రికెట్స్‌ వ్యాధి గురించి మాత్రమే చెప్పేవారు. కొన్నిప్రాంతాల్లో సంస్కృతీ సంప్రదాయాల వల్ల గర్భిణులు అసలు బయటకు రాకపోవడంతో పిల్లలు ఈ సమస్యతో పుట్టేవారు. ఎముకలు వంకర తిరిగిపోయి, పెళుసుగా ఉండేవి. ఇప్పుడు ఆ వ్యాధి అరుదుగా కన్పిస్తోంది కానీ, సాధారణ ప్రజల్లోనే విటమిన్‌ ‘డి’ స్థాయులు బాగా తగ్గిపోతున్నాయని తెలుస్తోంది.

ఎంత ఉండాలి?
ఉష్ణదేశం కాబట్టి మనకి ప్రత్యేకంగా విటమిన్‌ ‘డి’ అవసరం ఉంటుందని పరిశోధకులు అనుకోలేదు. అందుకే ఎంత కావాలీ అన్న ప్రశ్న గతంలో ఎప్పుడూ రాలేదు. ఇటీవల బయటపడుతున్న ఆరోగ్య సమస్యలూ, పరిశీలనలూ చూశాక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏయే వయసుల వారికి ఏయే విటమిన్లు రోజుకి ఎంత అవసరం అన్న వివరాల్ని విడుదల చేస్తూ అందులో ‘డి’ విటమిన్‌ విషయంలో భారతీయులను కూడా చేర్చింది. ఏడాది లోపు పిల్లలకు 400, ఏడాది నుంచి 70 ఏళ్లవరకూ 600(15ఎంసీజీ), డెబ్భై పైబడినవారికి 800(20ఎంసీజీ) అంతర్జాతీయ యూనిట్ల చొప్పున రోజూ మన శరీరానికి విటమిన్‌ ‘డి’ అవసరమని తేల్చి చెప్పింది. సూర్యరశ్మి వల్ల ఎక్కువగానూ, కొన్నిరకాల ఆహారపదార్థాల నుంచి కొద్ది మొత్తంలోనూ ఇది లభిస్తుంది.

దీనివల్ల లాభాలేంటి?
విటమిన్‌ ‘డి’ చేసే మేలు అంతాఇంతా కాదు. చర్మంపై సూర్యరశ్మి పడడం ద్వారా తయారయ్యే విటమిన్‌ డి తొలుత కాలేయానికీ ఆ తర్వాత మూత్రపిండాలకీ వెళ్లి చురుకైన హార్మోన్‌గా మారుతుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్‌ వల్లే జీర్ణాశయంలో ఆహారపదార్థాల నుంచి కాల్షియం, ఫాస్పరస్‌ లాంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. ఈ రెండూ ఎముక నిర్మాణానికి చాలా ముఖ్యమైన మూలకాలు. అందుకే ఎముకలూ, దంతాలూ ఆరోగ్యంగా ఉండాలంటే చాలినంత విటమిన్‌ ‘డి’ అందాలి. ఇంకా...
* మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
* చాలినంత ‘డి’ విటమిన్‌ ఉంటే స్త్రీలలో నెలసరి ముందు ఇబ్బందులూ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లూ తగ్గుతాయి.
* రోగకారక క్రిములతో పోరాడే టి సెల్స్‌, రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఫ్లూ, క్షయ, ఆస్థమా వంటి శ్వాసకోశ సమస్యల ముప్పు తగ్గుతుంది.
* రక్తనాళాలను కాపాడుతుంది.
* ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగా జరిగేలా చూస్తుంది.
* నెలలు నిండకముందే కాన్పు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
* వివిధ క్యాన్సర్ల రిస్క్‌ తగ్గడమే కాక, వాటి కారణంగా సంభవించే మరణాలను తగ్గించడంలోనూ దీనిదే కీలక పాత్ర అని అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. క్యాన్సర్‌ బాధితులు కనీసం మూడేళ్లపాటు విటమిన్‌ ‘డి’ మాత్రల్ని తీసుకుంటే వారి జీవితకాలం పెరిగినట్లు మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తెలిసింది. ఈ విటమిన్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలని అడ్డుకుని, వాపులను తగ్గిస్తుందని ప్రయోగాలు నిరూపించాయి.
* గుండెపోటు ముప్పునూ తగ్గించగలదు.
* బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రకారం- కాల్షియం స్థాయులు తక్కువగా ఉండి స్థూలకాయంతో ఉన్నవారికి విటమిన్‌ ‘డి’, కాల్షియం సప్లిమెంట్లను ఇస్తే వాళ్లు బరువు తగ్గడమే కాక ఆరోగ్యంగా ఉన్నారట. టైప్‌ 2 డయబెటిస్‌ రిస్క్‌ కూడా తగ్గినట్లు ఒక అధ్యయనంలో తెలిసింది.
* మానసిక కుంగుబాటుతో బాధపడు తున్నవారికీ మంచి మందు- సూర్యకాంతి.
* లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే కరోనాని అడ్డుకోవడంలోనూ ఇది ప్రధాన పాత్ర పోషించింది.

వైరస్‌ని ఎలా అడ్డుకుంది?
విటమిన్‌ ‘డి’ పుష్కలంగా ఉన్నవాళ్లలో కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి, మరణాలు తక్కువగా ఉన్నట్లు ఐర్లండ్‌లోని ట్రినిటీ కళాశాల పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనడంలో ఈ విటమిన్‌ కీలకమని గతంలోనే కొన్ని పరిశోధనలు నిర్ధారించినా తాజా అధ్యయనాల్లో శ్వాస వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా చూడడంలోనూ విటమిన్‌ ‘డి’ తోడ్పడుతోందని తెలిసింది. కొవిడ్‌ను ఎదుర్కొనడంలో దీని పాత్ర ఏమిటన్నది తెలుసుకునేందుకు యూనివర్శిటీ ఆఫ్‌ షికాగో వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా ఓ అధ్యయనం చేశారు. వైరస్‌ సోకనివారూ, వచ్చి తగ్గినవారూ కొన్ని వందలమందికి సంబంధించిన ఆరోగ్య వివరాలు సేకరించి విశ్లేషించగా విటమిన్‌ ‘డి’ స్థాయి తగినంత ఉన్నవారితో పోల్చితే లేనివారే కొవిడ్‌కు గురైనట్లు గుర్తించారు. కొవిడ్‌ 19తో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఈ విటమిన్‌ లోపం ఉన్నవారేననీ తేలింది.

లోపిస్తే ఏమవుతుంది?
ఈ విటమిన్‌ లోపంతో ఆకలి మందగిస్తుంది. బరువు తగ్గుతారు.
నిద్రలేమి, నిస్సత్తువ, నీరసం వంటి సమస్యలు వేధిస్తాయి. మతిమరుపు వ్యాధులూ, స్కిజోఫ్రెనియాలాంటి మానసిక సమస్యలూ పెరుగుతాయి. ఇటీవలి అధ్యయనాల్లో మరో కొత్త విషయం కూడా తెలిసింది. విటమిన్‌ ‘డి’ లోపంతో తరచూ తలనొప్పి కూడా వస్తుందట. ముఖ్యంగా పురుషుల్లో ఇది ఎక్కువ. విటమిన్‌ ‘డి’ స్థాయులు సాధారణం కన్నా తగ్గితే తలనొప్పి తరచూ వస్తున్నట్లు ఫిన్‌లాండ్‌లో జరిగిన పరిశీలనలో తెలిసింది. విటమిన్‌ స్థాయులు తగ్గుతున్నకొద్దీ తలనొప్పి రావటం పెరుగుతోందని తెలిశాక వారి అలవాట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలకు వారు బయట ఎక్కువగా గడపడం లేదనీ, శరీరానికి ఎండ అసలు తగలడం లేదనీ అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ విటమిన్‌ లోపంతో బాధపడుతున్న నేపథ్యంలో మరింత తేలిగ్గా లోపాన్ని గుర్తించేందుకు ట్రినిటీ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేశారు. వెంట్రు కలను పరీక్షించడం ద్వారా విటమిన్‌ ‘డి’ స్థాయుల్ని నిర్ధారించవచ్చని వారి అధ్యయనంలో తేలింది. ఈ విటమిన్‌ లోపం ఉన్నవారికి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు త్వరగా రావడం లేదనీ గుర్తించారు. ఇది లోపించడం వల్ల కలిగే దుష్ప్రభావాల జాబితాలో మరొకటి- దంతచికిత్సలు విఫలమవడం.
మనదేశంలో 40-75 మధ్య వయసువారిలో నూటికి 15 మంది వెన్నెముక సమస్యలతోనూ, ఐదుగురు తుంటి సమస్యలతోనూ బాధపడుతున్నారనీ మహిళల్లో అయితే ఇది ఇంకా ఎక్కువగా 18, 13 శాతం చొప్పున ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాక విటమిన్‌ ‘డి’ లోపం వల్ల రక్తపోటు పెరుగుతోందనీ తెలిసింది. హై బీపీకి చికిత్సగా దీన్ని సప్లిమెంటుగా ఇవ్వడంపై కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి.

ఆహారంలో దొరకదా?
ఆహారపదార్థాల్లో కొంతవరకు మాత్రమే లభిస్తుంది. ఎండతో పోలిస్తే అది చాలా చాలా తక్కువ. కొవ్వు తీయని పాలల్లో కొంతవరకు ఉంటుంది. కొవ్వు వల్ల స్థూలకాయమూ, గుండెజబ్బులూ వస్తాయని భయపడి అసలు తీసుకోవడమే మానేయడంతో దాంతోపాటు అందాల్సిన విటమిన్లూ తగ్గిపోతున్నాయి. విదేశాల్లో చాలా ఆహారపదార్థాలకు ‘డి’ విటమిన్‌ చేర్చి (ఫోర్టిఫైడ్‌) అమ్ముతున్నారు. మనదేశంలోనూ ఈ మధ్య పాలూ, నూనెలూ ఫోర్టిఫైడ్‌వి దొరుకుతున్నా అవి అందరికీ అందుబాటులో ఉండడం లేదు.

సప్లిమెంట్లు తీసుకోవచ్చా?
తప్పనిసరి అయినప్పుడు వైద్యులు సప్లిమెంట్లను సూచిస్తారు. లోపం స్థాయిని బట్టి వైద్యులు సూచించిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అయితే జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే ఆ అవసరమే రాదంటారు నిపుణులు. పైగా సమస్యలేవీ లేవు కాబట్టి ‘డి’ విటమిన్‌ చాలినంత ఉందని సంబరపడడానికీ లేదట. ఈ జీవనశైలి వల్ల తలెత్తుతున్న మరో ప్రధాన సమస్య... ఎముకలూ కండరాలకు తగినంత వ్యాయామం లేకపోవడం కూడాననీ, పెద్ద వయసులో అది బయటపడుతుందనీ వారు అంటున్నారు.

సమస్య రాకుండా ఏం చేయాలి?
ముఖ్యంగా పెరుగుదల ఎక్కువగా ఉండే టీనేజీ వయసు పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆరుబయట ఎండలో రోజూ కాసేపు తప్పనిసరిగా ఆడుకోనివ్వాలి. అప్పుడే తగినంత కాల్షియం లభించి ఎముకలు బలంగా పెరుగుతాయి. ఇరవయ్యేళ్లకు పెరుగుదల ఆగిపోతుంది కాబట్టి ఇక ఆ తర్వాత ఎముకల ఆరోగ్యాన్నీ పటుత్వాన్నీ కాపాడుకోవటం మీద శ్రద్ధ పెట్టాలి. అందుకు ‘డి’ విటమిన్‌, కాల్షియంతోపాటు శారీరక వ్యాయామమూ కావాలి. గంటల తరబడి కూర్చునో నిలబడో కదలకుండా చేసే ఉద్యోగాలూ, ఇళ్లల్లో పనులకు వాడే రకరకాల యంత్రాల వల్ల శరీరంలో కదలికలు పరిమితమై పోయి కండరాలకు పని ఉండటం లేదు. దాంతో ఎప్పుడైనా కాస్త కష్టపడి పనిచేయాల్సి వస్తే నొప్పిపెడతాయి. పెద్ద వయసు వచ్చాక ఎముకలు పెళుసుబారి త్వరగా విరిగిపోతాయి. ఈ సమస్యలేవీ రాకుండా జీవితమంతా ఆరోగ్యంగా చురుగ్గా గడిపే మంత్రం మన చేతిలోనే ఉంది. అదే కాసేపు ఎండలో గడపడం. జిమ్‌లో వ్యాయామం చేసేవారూ, పొద్దు పొడవకముందే వాకింగ్‌ ముగించుకొచ్చేవారూ కూడా తర్వాతైనా ఎండలోకి వెళ్లడం మరవకూడదు.
సూర్యకిరణాలను కాసేపు ముఖాన్ని ముద్దాడనిస్తే అనారోగ్యపు నీలినీడలు మన దరికే చేరవని హామీ ఇస్తున్నాయి పరిశోధనలన్నీ. మరెందుకింక ఆలస్యం... పదండి కాసేపు ఎండలోకి..!


ఏయే పదార్థాల్లో...

విటమిన్‌ ‘డి’ కొన్ని ఆహారపదార్థాల్లోనూ తగు మోతాదుల్లో ఉంటుంది. అవేంటంటే...
మాంసాహారం: కాలేయం, కొన్ని రకాల చేపలు, చేపనూనెలు(కాడ్‌లివర్‌ ఆయిల్‌), గుడ్డు పచ్చసొన, చికెన్‌
ఆకుకూరలు: తోటకూర, దాని గింజలు, మునగాకు
చిరుధాన్యాలూ పప్పులూ: నువ్వులు, సోయా, రాజ్మా, బొబ్బర్లు, రాగులు, మొక్కజొన్న
కూరగాయలు: బీన్స్‌, టొమాటో, పుట్టగొడుగులు, బెండకాయలు, పచ్చి బఠాణీ
పండ్లు: దానిమ్మ, బొప్పాయి, పచ్చిమామిడి
సుగంధ ద్రవ్యాలు: లవంగాలు, మిరియాలు, యాలకులు, గసగసాలు
ఇంకా... కొవ్వు తీయని పాలు, పాల ఉత్పత్తులు, ఫోర్టిఫైడ్‌ నూనెలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు