close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరించని అదృష్టం

- ఉమాబాల చుండూరు

బ్యాంకు నుండి ఇంటికి వచ్చిందేగానీ ఆలోచిస్తూనే ఉంది వసుమతి. జరిగిన విషయం ఈజీగా తీసుకోవాలో, సీరియస్‌గా తీసుకోవాలో అర్థం కావడం లేదు. పాప ‘త్రయి’ ఆడుకోవడానికి వెళ్లింది. తల్లి వంట చేస్తోంది.
వసుమతి భర్త సాకేత్‌రామ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సాకేత్‌ తనకి తనలాంటి ప్రొఫెషన్‌ ఉన్న అమ్మాయి వద్దనుకుని బ్యాంకులో పని చేసే వసుమతిని పెళ్లి చేసుకున్నాడు. బ్యాంకుకి దగ్గరగా ఇల్లు తీసుకుని తను మాత్రం ఆఫీస్‌ దూరమైనా కార్లో వెళ్లి వచ్చేవాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పాప పుట్టగానే పేరు ప్రత్యేకంగా ఉండాలని ఎంతో శోధించి ‘త్రయి’ అని అమ్మవారి పేరుని తనే సెలెక్ట్‌ చేశాడు. వసుమతి ఇంకా మెటర్నిటీ లీవ్‌లో ఉంది.
ఒకరోజు సాకేత్‌కి ఆఫీస్‌లో బాగా లేట్‌ అయ్యి అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తుండగా ఎవరో తాగి రాష్‌గా డ్రైవ్‌ చేస్తూ అతని కార్‌ని గుద్దేయడంతో సాకేత్‌ కారు డివైడర్‌కి ఢీకొని అనుకోనిది జరిగిపోయింది. తప్పు ఎవరిదైనా, తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడినా పడకపోయినా, ఎవరూ పూడ్చలేని నష్టం జరిగిపోయింది. సాకేత్‌ చనిపోయాడు.
అది పెద్ద షాక్‌ అయినా వసుమతి తేరుకుని, అన్నయ్య దగ్గరుండే తన తల్లిని తెచ్చుకుని, తల్లి పాపని చూసుకుంటే, తను మాత్రం జాబ్‌కి వెళ్లి వస్తోంది. నెమ్మదిగా జ్ఞాపకాలు మరుగున పడుతున్నాయి. త్రయీకి ఏమీ తెలీదు కాబట్టి తనతో అంత సమస్యలేదు. బ్యాంకులో పని కూడా ఎక్కువయింది వసుమతికి. బ్యాంకులో అన్ని సీట్ల పనీ నేర్చుకోవాలని స్టాఫ్‌ని తరచూ సీట్లు మారుస్తూ ఉంటారు. అందరికీ అంత పనీ తెలిసే ఉంటుంది. కొంతమంది రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు ఉంటారు. అలా రోజూ వచ్చేవాళ్లూ పరిచయమయ్యి హలో అని, నమస్తే అని పలకరించుకోవడం మామూలే. అలా పరిచయమయ్యాడు వసుమతికి సుధీర్‌... అతను బిజినెస్‌మ్యాన్‌. అతని తరఫున రోజూ ఒక అసిస్టెంట్‌ వచ్చి క్యాష్‌ జమ చేస్తూ ఉంటాడు. రోజూ ఒక ఫారం ఫిల్‌ అప్‌ చేసి క్యాష్‌ పంపిస్తూ ఉంటారు.
బ్యాంకులో క్యాషియర్‌ ఆ డబ్బు తీసుకుని తీసుకున్నట్టు స్టాంప్‌ వేసి ఇస్తారు. అలా ఒకరోజు వసుమతి క్యాష్‌ చూస్తున్నప్పుడు, ఈ అసిస్టెంట్‌ తెచ్చిన క్యాష్‌ కౌంట్‌ చేస్తే మనీ ఎక్కువుండడంతో ఎక్కువున్న రెండువేల నోటు వెనక్కి తిరిగి ఇచ్చేసింది. అది అతను వెనక్కి తీసుకువెళ్లి, వాళ్ల ఆఫీసులో చెప్పడంతో ఫారం ఫిల్‌ అప్‌ చేసి, డబ్బు పంపిన అతను బ్యాంకుకి వచ్చి వసుమతికి థ్యాంక్స్‌ చెప్పాడు. అది తన పొరపాటే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాడు.
అలా ఇంకోసారి తన అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ కావాలని అప్లికేషన్‌ ఇవ్వడానికి వచ్చాడు. అలా రెండు మూడుసార్లు రావడంతో పరిచయం ఏర్పడింది.
ఒకసారి వసుమతి తన పాపకి డ్రెస్‌లు కొందామని శనివారం మధ్యాహ్నం బ్యాంకునుంచి డైరెక్ట్‌గా షాపింగ్‌ మాల్‌కి వెళ్తే, అక్కడ కనిపించి హలో చెప్పాడు. తరువాత సూపర్‌మార్కెట్‌లో ఒకసారి. ఒక ఆదివారం తల్లితో, కూతురితో హోటల్‌కి వెళ్తే అక్కడ కన్పించాడు. ఇన్నిసార్లు కలవడంతో మాటల్లో వసుమతి ఒంటరి అనీ, పాప ఉందనీ, తల్లితో ఉంటోందనీ తెలిసింది అతనికి. అతడి గురించి కూడా చెప్పాడు. అతను ఆడిటర్‌. కొంత మందితో చిన్న ఆఫీస్‌ నడుపుతున్నాడు సొంతంగా. కన్సల్టెంట్‌గా చేస్తున్నాడు. భార్యకీ తనకీ కొన్ని విషయాలలో అభిప్రాయబేధాలు వచ్చి విడిపోయారట. వసుమతి విని వదిలేసింది.
కానీ ఒకసారి లంచ్‌ టైంలో వసుమతి కొలీగ్‌ సుచరిత వసుమతితో చెప్పింది... ఆ సుధీర్‌ వాళ్లింటికి వచ్చి తను వసుమతిని ఇష్టపడుతున్నాననీ, ఆమెకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాననీ ఆ పాపకి తండ్రినవుతాననీ చెప్పి వసుమతికి చెప్పమన్నాడట.
సుచరిత, ‘మీరే చెప్పొచ్చుగా’ అంటే ‘ఆమెతో మాట్లాడే అవకాశం రావడం లేదు నాకు. ఏమనుకుంటుందో అని మొహమాటంగా ఉంది. ఒక స్నేహితురాలిగా, నా గురించి, నేను చెప్పమన్నది ఆమెతో చెప్పండి ప్లీజ్‌. ఈ సాయం చేయండి... దీని ఫలితం ఎలా ఉన్నా నేను ఏమీ అనుకోను’ అన్నాడట.
అది చెప్తూ సుచరిత, ‘వసూ, నువ్వే ఆలోచించుకో బాగా. నువ్వు తెలివైన దానివి. ఇది నీకు మంచి అవకాశమో కాదో నాకు తెలీదు. నిర్ణయం మాత్రం బాగా ఆలోచించి తీసుకో’ అంది.
‘‘ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇందులో మంచి చెడులు ఏంటో కూడా నాకు తెలీదు. ఈ నిర్ణయం నాదే కాదు పాప భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది... నా మీద పాప బాధ్యత ఉంది. నాకు చాలా టైం కావాలి ఆలోచిస్తాను. కానీ కన్సిడర్‌ చేసినట్టుకాదు. నేను ‘నో’ అని కూడా చెప్పొచ్చని నీకు మళ్లీ తారసపడితే చెప్పు’’ అంది వసుమతి.
‘ఏవిటీ ఈ కొత్త సమస్య అనుకుంది’ తనలో. జరిగిన విషయం తల్లితో చెప్పడం అనవసరం అనిపించింది. తల్లికి చెప్తే ముందే బోలెడు సంతోషించేసి, ఉబ్బితబ్బిబ్బై, తనని ప్రభావితం చేస్తుంది అనుకుని, తన క్లోజ్‌ ఫ్రెండ్‌ కిరణ్మయిని సలహా అడగాలనుకుంది.
కిరణ్మయి సెక్రటేరియట్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌గా పని చేస్తోంది. చిన్నప్పటి నుంచీ వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్‌. కిరణ్మయికి ఫోన్‌చేసి, ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి, ఎక్కడ కలుద్దాం’ అని అడిగింది.
‘రేపు ఒక గంట ముందు మా ఆఫీస్‌కి వచ్చేయ్‌. నేనూ పర్మిషన్‌ తీసుకుంటాను. ఇద్దరం ఎక్కడన్నా కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకుందాం’ అంది కిరణ్మయి.
అనుకున్నట్టుగానే మర్నాడు వసుమతి కిరణ్మయి ఆఫీసుకి వెళ్లింది. ఇద్దరూ కలిసి కిరణ్మయి కార్లో కాఫీషాప్‌కి వెళ్లారు. ఇద్దరూ కాఫీ, స్నాక్స్‌ ఆర్డర్‌ ఇచ్చాకా, ‘ఇప్పుడు చెప్పవే’ అంది కిరణ్మయి.
‘చెప్తాను. విని ఒక స్నేహితురాలిగా సిన్సియర్‌ అడ్వైజ్‌ ఇవ్వు’ అని జరిగినదంతా  పూస గుచ్చినట్టు చెప్పింది.
అంతా శ్రద్ధగా విన్న కిరణ్‌ ‘‘బాగానే ఉందిగానీ, అతను ఎంతవరకూ నిజాయతీగా చెప్పాడు అన్నది మనం కొంచెం ఆలోచించాలి. ఒకవేళ మంచివాడూ, సిన్సియర్‌ పర్సన్‌ అయితే, ఆలోచిస్తే తప్పులేదేమో వసూ. నీకూ బోలెడు జీవితముంది. త్రయీ మరీ పసిపిల్ల. దానికి తండ్రి అవసరముంది. పైగా అతను కూడా డివోర్సీ. మీ ఇద్దరి జీవితాలకీ తోడు అన్నది కావాలి. ఇద్దరూ జీవితంలో దెబ్బతిన్నవాళ్లే కాబట్టి, అన్నీ సెట్‌ అయితే తప్పులేదు అనిపిస్తోంది నాకు. ఇంతకీ అతను చూడటానికి ఎలా ఉంటాడు’’
అడిగింది కిరణ్‌.
‘‘చూడటానికి బానే ఉంటాడ్లే. అదికాదు  సమస్య. మళ్లీ ఈ కొత్త రిలేషన్‌తో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందా..? అఫ్‌కోర్స్‌ నాకు ఈ జీవితం అలవాటు అయిపోయిందనుకో. ‘త్రయీ’ని యాక్సెప్ట్‌ చేస్తానన్నాడట. కానీ నాకు భయంగా ఉందే. ‘నో’ చెప్పడం ఎంతసేపుగానీ, ఒకసారి నీ సలహా కూడా తీసుకుని ఆలోచిద్దాం అని నిన్ను కలవమన్నాను’’.
‘‘వసూ, నువ్వు కూడా చిన్నదానివే. నీకు బోలెడు భవిష్యత్తు ఉంది. నీకు మాత్రం ఏం తక్కువ. చక్కగా అందంగా ఉంటావు. నిన్ను చూస్తే పెళ్లయినట్టు కూడా అనిపించవు. ఈ కుర్తా పైజామాలో అయితే కాలేజ్‌ గర్ల్‌లా ఉంటావు. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒంటరిగా జీవితాన్ని లీడ్‌ చెయ్యలేవే. ఇతన్ని వద్దంటే సమస్య ఇంతటితో ఆగిపోదు. తరువాతైనా వేరెవరైనా ఇలాగే అడగవచ్చు. నువ్వు ఒంటరిదానివని తెలిసి అడ్వాంటేజ్‌ తీసుకునే వాళ్లు కూడా ఉంటారు. నేను అనేది, ఇతను కాకపోతే మరొకరు అని. కానీ నువ్వు మాత్రం మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది వసూ. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు. నీకు అండగా, రక్షణగా ఎవరో ఒకరు ఉండాలి.
ముందు మనం సుధీర్‌ గురించి తెలుసుకుని తరువాత ఆలోచిద్దాం. నాకు అతని వివరాలు ఇవ్వు. నేను ఎంక్వయిరీ చేస్తాను. భార్యతో ఎందుకు విడిపోయాడో అతను చెప్పినా, మనం కూడా మన తరఫున అతని పర్సనల్‌ లైఫ్‌ గురించి తెలుసుకుందాం. మీ బ్యాంక్‌ రికార్డ్స్‌లో అతని డీటైల్స్‌ ఉంటాయిగా అవి నాకు ఇవ్వు’’ అంది కిరణ్మయి.
‘‘ఇదిగో. ఎందుకైనా మంచిదని ఈ పేపర్‌ మీద రాసి తెచ్చాను’’ అని ఇచ్చింది వసుమతి.

‘గుడ్‌’ అని తీసుకుంది కిరణ్‌. ‘‘నేను కనుక్కుని చెప్పేవరకూ ఏదో విధంగా పెండింగ్‌ పెట్టు. ఏదీ చెప్పకు. నేను వారం రోజుల్లో మొత్తం కనుక్కుంటాను. అప్పుడు ఆలోచిద్దాం’’ అంది కిరణ్‌.
బిల్‌ పే చేసి పక్కనే ఉన్న షాపింగ్‌మాల్‌లో చెరో డ్రెస్‌ కొనుక్కుని వసుమతి ఆటో ఎక్కితే, కిరణ్మయి తన కార్లో వెళ్లిపోయింది.
తనకి ఆలోచించుకునే టైం కావాలనీ, తనంతట తాను చెప్పేవరకూ తనని డిస్టర్బ్‌ చేయొద్దనీ సుధీర్‌కి చెప్పమని, ఆఫీస్‌లో తన కొలీగ్‌ సుచరితకి చెప్పింది వసుమతి.
తరువాత అతను బ్యాంకుకి వచ్చినా తనని కలవకపోవడం వసుమతి గమనించింది.
మళ్లీ శనివారానికి కిరణ్మయి నుండి ఫోన్‌ వచ్చింది. అతని వివరాలు కనుక్కున్నాననీ సాయంత్రం వసుమతి ఇంటికి వస్తున్నాననీ చెప్పింది.
వసుమతి ఇంటికి వెళ్లేటప్పటికి కిరణ్మయి వసుమతి తల్లితో మాట్లాడుతూ ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతోంది. ‘త్రయి’ ఏదో కొత్త బొమ్మతో ఆడుతోంది... కిరణ్మయి తెచ్చినట్టుంది.
వసుమతి లోపలికి వెళ్లి ఫ్రెష్‌ అయి వచ్చి, ‘‘రావే నా రూమ్‌లోకి వెళదాం’’ అంది. ఇద్దరూ రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నారు.
కిరణ్మయి వసూతో ‘‘అంతా కనుక్కున్నానే, నా అసిస్టెంట్‌ అరుణ్‌ అని ఉన్నాడు. అతన్ని పిలిచి నువ్వు ఇచ్చిన డీటైల్స్‌ ఇచ్చి సుధీర్‌ వివరాలు తెలుసుకోమన్నాను.
నువ్విచ్చిన ఫోన్‌ నంబర్‌ తీసుకుని ఎయిర్‌టెల్‌ ఆఫీసులో ఒక ఫ్రెండ్‌ ఉంటే అతని ద్వారా ఇంటి అడ్రస్‌ తెలుసుకుని, సుధీర్‌ లేని సమయంలో వాచ్‌మన్‌ ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాడు. మీ రికార్డ్‌లో ఉన్న అడ్రస్‌ అతని ఆఫీస్‌దట. అతని తమ్ముడు ఈ సిటీలోనే ఉంటాడట. ఏదో ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడట. అతని అడ్రస్‌ తెలుసుకుని, మొత్తానికి ఎవరిద్వారానో అతని భార్య జీ.హెచ్‌.ఎం.సిలో జాబ్‌ చేస్తుందని తెలుసుకున్నాడు. సుధీర్‌ తమ్ముడి భార్య ద్వారా మరికొన్ని వివరాలు తెలుసుకున్నాడు.
నేను టూకీగా చెప్తున్నా విను.
సుధీర్‌ విడాకులు తీసుకుని రెండేళ్లవుతోందట. అతని భార్య ఇప్పుడు మేడ్చల్‌లో స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోందట. పేరు నీరజ.
నువ్వు సోమవారం సెలవు పెట్టు, నేనూ పెడతాను. ఇద్దరం మేడ్చల్‌ వెళ్లి ఆమెని కలిసి ఆవిడ వైపు కూడా తెలుసుకుందాం, ఏమంటావు’’ అంది.
వసుమతి ఆశ్చర్యంగా ‘‘ఇంత కష్టపడ్డావా నాకోసం’’ అంది. కిరణ్‌ నవ్వుతూ ‘‘నేనేం కష్టపడలేదులే. ఈ కష్టం అంతా అరుణ్‌దే. ఇవాళా రేపూ ఫోన్‌ నంబర్‌తో సమస్త వివరాలు తెలుస్తున్నాయి. పోలీసులు నేరస్తులని ఈ ఫోన్‌ నంబర్లతోనే పట్టుకుంటున్నారు. మనం ఏమీ నేరస్తుడి వివరాలు ఆరా తీయడం లేదుగా, సుధీర్‌ ఎంతవరకూ నిజం చెప్తున్నాడో తెలసుకుంటున్నాం అంతే. అయినా నువ్వు జీవితంలో స్థిరపడతావంటే నేను ఈ మాత్రం సాయం చేయలేనా చెప్పు’’ అంది వసుమతి భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా...
‘‘సరే కిరణ్‌... నేను నీకు థ్యాంక్స్‌ చెప్పి దూరం చేయను. ఇదేదో తేల్చుకుందాం. సోమవారం ఉదయం తొమ్మిదింటికల్లా నేను మా ఇంటి దగ్గర బస్‌స్టాప్‌లో ఉంటా. నువ్వు అక్కడ నన్ను పిక్‌ చేసుకో’’ అంది. ‘‘ఓకే మరి నేనిక వెళ్తా వసూ’’ అంటూ బాయ్‌ చెప్పి బయలుదేరింది కిరణ్‌.
అనుకున్నట్టే సోమవారం ఉదయం తొమ్మిదింటికల్లా వసుమతీ, కిరణ్‌లు బయలుదేరారు మేడ్చల్‌కి.
ఆ స్కూల్‌ పేరు ఎంక్వయిరీ చేస్తూ, రెండు గంటల్లో మేడ్చల్‌ చేరుకున్నారు ఇద్దరూ. స్కూల్‌కి వెళ్లాక ప్రిన్సిపాల్‌ని కలిసి వాళ్లని వాళ్లు పరిచయం చేసుకుని టీచర్‌ నీరజ కావాలని అడిగారు. ప్రిన్సిపాల్‌ కూర్చోమని నీరజని పిలిపించింది.
ప్రిన్సిపాల్‌ రూమ్‌లోకి సందేహంగా ఒకామె ప్రవేశించింది. ప్రిన్సిపాల్‌ ‘ఈవిడే నీరజగారు’ అని చెప్తూ, ‘నీరజా నీకోసం వచ్చారు వీళ్లు’ అని ఆమెతో చెప్పింది.
ఆమె ‘రండి’ అని టీచర్స్‌ వెయిటింగ్‌ రూమ్‌కి తీసుకువెళ్లింది. నీరజ సన్నగా పొడుగ్గా కళ్లజోడుతో సామాన్యంగా ఉన్నా ఆమెలో ఏదో తెలియని గ్రేస్‌ ఉంది అనుకున్నారు ఇద్దరూ.
అందరూ కూర్చున్నాకా నీరజ అడిగింది ‘నాతో ఏంటి పని’ అని. కిరణ్‌ నోరు విప్పింది. ‘‘నీరజగారూ, మేము హైదరాబాద్‌ నుండి మీకోసమే వచ్చాము. మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడొచ్చా’’ అని అడిగింది. ‘ఇక్కడా’ అని చూసి అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండడంతో, ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. నేను పర్మిషన్‌ తీసుకుని వస్తానని వెళ్లి, వెంటనే వచ్చింది.
ముగ్గురూ ఐదు నిమిషాల్లో వాళ్లింటికి చేరుకున్నారు. నీరజ లోపలికి తీసుకెళ్లి మంచినీళ్లిచ్చి ఇంట్లో ఉన్న తన తల్లిని పరిచయం చేసింది. ‘‘ఇప్పుడు చెప్పండి నాతో ఏం పని’’ అంది.
‘‘నేను డైరెక్టుగా విషయంలోకి వచ్చేస్తాను మీరేమీ అనుకోవద్దు. తను నా ఫ్రెండ్‌ వసుమతి. బ్యాంకులో పనిచేస్తుంది. మీ మాజీ భర్త సుధీర్‌ ఈమెని పెళ్లిచేసుకుంటాను అంటున్నారు. తన భర్త పోయి నాలుగేళ్లవుతోంది. ఒక పాప. ఈ పరిస్థితుల్లో ఆయన అడిగారు. ఆయన కూడా విడాకులు ఇచ్చారని తెలిసింది. అయితే ఆయన చెప్పిందీ, మేము విన్నదీ కాకుండా, మీ ద్వారా కూడా ఆయన గురించి తెలుసుకుందామని వచ్చాము. దయచేసి ఫ్రాంక్‌గా చెప్పండి. మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఆయన ఎలాంటివారు? అది తెలుసుకుందామనే ఇంతదూరం వచ్చాం’’ అంది కిరణ్‌.
నీరజ అంతా విని నవ్వింది. ‘వాళ్లిద్దరికీ నచ్చితే చాలు కదండీ’ అంది.
‘‘చాలదండీ... ఏదైనా వివాదం ఉంటే ఎవరైనా వాళ్లవైపు నుండే వాళ్ల వెర్షన్‌ చెప్తారు. అది సహజం. మాకు రెండువైపులా వినాలని ఉంది. నా ఫ్రెండ్‌ ఒకసారి విధి చేతిలో దెబ్బతింది. ఇంకోసారి తను ఆ పొరపాటు చేయకూడదు. అందుకని సాటి స్త్రీగా మాట్లాడండి, బి ఫ్రాంక్‌’’ అంది కిరణ్‌.
‘‘చూడండీ... నేను డిగ్రీ చేశాను. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నాకు తండ్రి లేరు. అన్నయ్యలున్నారు. మా నాన్నగారు మేము బాగా బతకడానికి సరిపడా ఇచ్చారు. మావాళ్లు అతను సి.ఏ చదివాడనీ, మంచి సంబంధమనీ చాలా ఖర్చు పెట్టి గ్రాండ్‌గా పెళ్లి చేశారు.
ముగ్గురు అన్నయ్యలకి నేనొక్కదాన్నే చెల్లెల్ని. అన్నయ్యలకి నేనంటే చాలా ప్రేమ.
కొత్తలో బాగానే ఉన్నాడు. తరువాత తను సొంతంగా కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకుంటాననీ  మా అన్నయ్యలని అడిగి డబ్బు తెమ్మనీ చెప్పాడు. నేను అడిగితే మా అన్నయ్యలు కాదనకుండా ఐదు లక్షలు ఇచ్చారు. తరువాత లోన్‌ కూడా తీసుకుని ఆ కంపెనీలో పెట్టారు.
తరువాత కూడా అస్తమానూ డబ్బు అడిగి తెమ్మనేవాడు. తనలాంటి పెద్ద చదువున్నవాడు, ఉద్యోగస్తురాలిని పెళ్లి చేసుకోకుండా నన్ను చేసుకున్నానని దెప్పేవాడు. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక్కతే చెల్లెల్ని ఇవ్వక ఏమి చేస్తారు అని అతని భావన. చాలావరకూ సహాయం చేశారు అన్నయ్యలు. వాళ్లకీ కుటుంబాలు ఉన్నాయి ఎంతని చేస్తారు. అయినా టార్చర్‌ చేసేవాడు. డబ్బులు ఇక తేలేనని అంటే, కొట్టేవాడు కూడా.
అన్నయ్యలు వచ్చి మాట్లాడారు. అప్పటికి పరిస్థితి సర్దుకున్నా. మళ్లీ మామూలే. ఏదో అసంతృప్తి. నేను పడలేకపోయాను. నాకూ ఆత్మాభిమానం ఉంటుంది కదా తిరగబడ్డాను. పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాను. మా అన్నయ్యలూ అమ్మా వచ్చి నన్ను తిట్టి, అతనికి క్షమాపణ చెప్పి, కంప్లైంట్‌ విత్‌డ్రా చేయించారు. ఇక అప్పటినుంచీ నేనంటే ఇంకా కక్ష.

బెదిరిస్తేనో, భయపెడితేనో కాపురాలు చేయలేము కదా. నాకు ఇక అతనితో ఉండలేను అనిపించింది. నేనే విడాకులకు అప్లై చేసి, మా అమ్మా అన్నయ్యలు వద్దన్నా వచ్చేశాను. అతను కోరుకునేది కూడా అదే కాబట్టి తొందరగానే వచ్చేశాయి విడాకులు.
ఇదిగో ఈ స్కూల్‌లో ఒక ఫ్రెండ్‌ ద్వారా టీచర్‌ ఉద్యోగం వచ్చింది. మొదట్లో ఒక్కదాన్నీ ఉండేదాన్ని, తరువాత అమ్మ వచ్చి ఉంటోంది నాకు తోడుగా. అన్నయ్యలు బి.ఇడి. చదవ మన్నారు. ‘ఎంతకాలం ఇలా చిన్న ఉద్యోగం చేస్తావు, బి.ఇడి. చేస్తే మంచి స్కూల్‌లో పర్మనెంట్‌గా మంచి స్కేల్స్‌తో జీతం బాగా వస్తుంది. ఒక స్థిరత్వం ఉంటుంది’ అని చెప్పారు.
ఆంధ్రా యూనివర్శిటీకి సంబంధించిన కాలేజ్‌, విజయనగరంలో సీట్‌ వచ్చింది. రేపు ఫస్ట్‌ నుండి ఇక్కడ జాబ్‌ మానేసి, అక్కడ హాస్టల్‌లో ఉండి, బి.ఇడి. చేస్తాను. ఇదీ నా కథ’’ అని వివరంగా చెప్పింది వనజ.
‘‘నేను ఇవన్నీ మీకు చెప్పి న్యాయం చేశానో, అన్యాయం చేశానో నాకు తెలీదు. నన్ను క్షమించండి. కానీ నేను చెప్పినవన్నీ నిజాలే. అతను కోరుకున్న లక్షణాలు ఉన్న, ఉద్యోగస్తురాలు అయిన స్త్రీ భార్యగా వస్తే, నాతో ఉన్నట్టు ఉండడేమో ఆలోచించండి. నిర్ణయం మీది’’ అంది నీరజ.
వెంటనే కిరణ్‌ ‘‘అదేంలేదు నీరజగారూ, మీరు అన్యాయం ఏమీ చెయ్యలేదు. నిజం చెప్పారు. చెప్పాలి కూడా. మేము ఆ నిజం కోసమే ఇంత దూరం వచ్చింది. మీరు ఒక్కరే కాబట్టి ఈజీగా బయటపడ్డారు. మా వసూకి పాప కూడా ఉంది. అలాంటి డబ్బు మనిషితో మా వసూకి ఎన్ని సమస్యలు వచ్చేవో. దీని బ్యాంక్‌ జాబ్‌ చూసి, ఒంటరితనం చూసి వల వేశాడేమో. ఇవన్నీ మీతో మాట్లాడేకా నాకు అతని మీద చాలా డౌట్లు వస్తున్నాయి. రేపు పెళ్లి అయ్యాకా పాప వద్దంటే... ఏమో ఏం చెప్పగలం..?
మేము మీ దగ్గరికి వచ్చి మంచి పనే చేశాం. ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షింపబడ్డాం. మీకు థాంక్స్‌ చెప్పాలి. వస్తాం... నమస్తే’’ అని అక్కడి నుండి ఇద్దరూ బయటపడ్డారు.
కార్లో కూర్చున్నాకా వసుమతి, కిరణ్‌ చేయి పట్టుకుంది. ‘‘ఏంటే... చెయ్యి ఇంత చల్లగా ఉంది భయపడ్డావా’’ అంది ఆప్యాయంగా కిరణ్‌. ‘‘అవునే, ఎంత ప్రమాదం నుండి బయటపడ్డాను. తలుచుకుంటేనే దడగా ఉంది’’ అంది వసుమతి బేలగా.
‘‘నిజమే, మనం సహాయం అవసరమైనప్పుడు గట్టిగా ఉన్న కొమ్మని పట్టుకోవాలి గానీ... పుచ్చిపోయిన బలహీనమైన కొమ్మని కాదు... నువ్వు బంగారు బాతువే వసూ... నెలనెలా బంగారు గుడ్లు పెడతావు. దానికోసం ఎలా బుట్టలో వెయ్యాలా అని చూస్తారు. అయితే ఇప్పుడు ఇలా అయిందని, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేనని అనుకోకు. నిన్ను అర్థం చేసుకునే వాళ్లూ, నిజాయతీ పరులూ... నిజంగా ప్రేమని పంచేవాళ్లూ కూడా ఉంటారు. ఎటొచ్చీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, విజ్ఞతతో వ్యవహరించాలి అంతే!
నేనూ మా ఆయన, ఆ సుధీర్‌తో మాట్లాడి, అతను నీ జోలికి రాకుండా చూస్తాం. మా ఆయన అడ్వకేట్‌ కదా. ఏదో చెప్పి, బెదిరించి నీ జోలికి రాకుండా చేస్తారు.
మీకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయిగా, కొంచెం నీ పలుకుబడి ఉపయోగించి, వీలైతే ఆ బ్రాంచ్‌ నుండి వేరే బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని వెళ్లిపో. నిశ్చింతగా ఉండు. నీ భవిష్యత్తు ఆ దేవుడు నిర్ణయిస్తాడులే’’ అంది కిరణ్‌.
‘‘కానీ వసూ... విచిత్రం చూశావా. కొన్ని పనులు జరిగితే ఆనందంగా ఉంటుంది. కొన్ని జరగకపోతే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. రెండింటికీ దేవుడికి నమస్కరిస్తాం కదా... నీకు పని జరగక అదృష్టం వరించింది. అంటే నువ్వు ఫెయిల్‌ అయ్యి పాస్‌ అయ్యావు’’ అంది కిరణ్‌ హాయిగా నవ్వుతూ.
వసుమతి కిరణ్‌ భుజంమీద తలపెట్టి కళ్లు మూసుకుంది. ఇంకా మనసులో ఆందోళన తగ్గలేదు. ఏదో ప్రమాదం తృటిలో తప్పిన ఫీలింగ్‌. కిరణ్‌ వసూ చేయి పట్టుకుని ఉంది, ధైర్యం ఇస్తున్నట్లుగా. కారు హైదరాబాదు వైపు సాగుతోంది వేగంగా... రోడ్డును మింగేస్తూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు