close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.లక్షన్నర మందులు... 8 వేలకే తెచ్చాం!

నాట్కో ఫార్మా... మనదేశంలో క్యాన్సర్‌ రోగులకి ఈ సంస్థ ఓ సంజీవనీ పర్వతం లాంటిది. ఒకప్పుడు బ్లడ్‌ క్యాన్సర్‌ చికిత్సకి నెలపాటు వాడాల్సిన మందులకి మనదేశంలో లక్షన్నర రూపాయలయ్యేవి. నాట్కో సంస్థ ఆవిష్కరించిన ‘జనరిక్‌ మందుల’తో ఆ ఖర్చు ఎనిమిది వేలకి తగ్గింది. ఈ అభినవ సంజీవనిని సృష్టించిన అపర రుషి వెంకయ్య చౌదరి నన్నపనేని. కొత్త ఔషధాల ఆవిష్కరణల కోసం 50 ఏళ్లుగా నిర్విరామకృషి చేస్తున్న ఆయన ఎంత ప్రయోగశీలో... సేవాతత్పరతలో అంత వితరణశీలి. ఆ ప్రస్థానం వీసీ నన్నపనేని మాటల్లోనే...

ఇది 1993 నాటి సంగతి. అప్పటికి మేం ఉత్పత్తి చేస్తున్న జలుబు మందు కోల్డ్‌యాక్ట్‌, ఛాతీనొప్పికి వాడే కార్డిక్యాప్‌ వంటివి బాగా ఆదరణ పొందాయి. వాటితో మా టర్నోవర్‌ రూ.60-65 కోట్లకి చేరింది. అప్పుడే నా దృష్టి బల్క్‌డ్రగ్స్‌పైన పడింది. వాటి తయారీ కోసం 1991లో ‘నాట్కో లేబరేటరీస్‌’ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక యూనిట్‌ని నెలకొల్పాం. అందుకు అప్పట్లోనే రూ.50 కోట్లయింది. కానీ... ఇంత చేసినా నష్టాలొచ్చాయి. అప్పులు పెరిగాయి.
ఇక భరించలేక ఆ యూనిట్‌ని అమ్మకానికి పెట్టాలనుకున్నాను. అప్పుడో ఇన్వెస్టర్‌ నా దగ్గరకొచ్చి దాన్ని తనకి అమ్మమన్నాడు. అతణ్ణి తీసుకుని నాకు రుణమిచ్చిన బ్యాంకుకి వెళ్లాను. అక్కడి ఉన్నతాధికారి ఒకరికి నా సంస్థని అమ్ముతున్నట్టు చెప్పాను. ఆయన నావైపూ, ఇన్వెస్టర్‌వైపూ తేరిపార చూసి... అతణ్ణి కాసేపు పక్కగదిలో కూర్చోమని చెప్పి నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
...ఆ మాటలే పారిశ్రామికవేత్తగా నాకు పెద్ద మలుపునిచ్చాయి. ‘నాట్కో’ ఇవాళ క్యాన్సర్‌ మందుల ఉత్పత్తిలో నంబర్‌ వన్‌గా నిలిచిందంటే... కొవిడ్‌ సమయంలోనూ మా సంస్థ 73 శాతం లాభాలతో 823 కోట్ల రూపాయల ఆదాయం చూస్తోందంటే... కారణం ఆయన మాటలే. ఆయన ఏమన్నాడో చెప్పేముందు... అప్పటిదాకా నేను నడిచొచ్చిన దారిలోని మైలురాళ్లని వివరిస్తాను...
గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని గోళ్ళమూడిపాడు అనే కుగ్రామం మాది. నాన్న నన్నపనేని లోకాదిత్యుడు... అమ్మ సీతారావమ్మ. ఇంట్లో ఇద్దరక్కయ్యలూ, అన్నయ్యా తర్వాత నేను. ఆరో తరగతిదాకా ఊర్లోనే చదువుకున్నాను. ఏడు నుంచి పదకొండు దాకా మా అమ్మమ్మ వాళ్లుండే కావూరులోనూ, పన్నెండో తరగతి గుంటూరు క్రైస్తవ కళాశాలలోనూ చదివాను. ఇంట్లో అందరికంటే చిన్నవాణ్ణి కావడంతో అల్లారుముద్దుగా పెరిగాను. నాకు పట్టుదల కూడా ఎక్కువే ఉండేది. ఓసారి మా దూరపు బంధువొకాయన మా ఊరికి కారు తెచ్చాడు. నేను దాన్ని ముట్టుకోబోతే ఆయన ‘ఏయ్‌... చెయ్యి తియ్‌!’ అన్నాడు. దాంతో ఉక్రోషమొచ్చి ‘ఒక్కటి కాదు... పెద్దయ్యాక నేను ఇలాంటి కార్లు నాలుగు కొంటాను!’ అనేశాను. మా అమ్మ, ఐదేళ్ల కిందట, చనిపోయేదాకా ఈ విషయం గుర్తు చేసుకుని నవ్వుతూ ఉండేది. ఎంత పట్టుదల ఉన్నా... అదేమిటోకానీ నాకు అస్సలు కోపం రాదు, కోపం వచ్చినా ఎదుటివాళ్లపైన చూపను... ఇప్పటికీ అంతే! ఈ గుణం నా స్నేహితుల సంఖ్యని పెంచింది. బీఫార్మసీ చదవడానికి వైజాగ్‌ ఆంధ్రా వర్సిటీకి వెళ్లాక అక్కడి విద్యార్థి సంఘంలో పోటీచేసి జాయింట్‌ సెక్రటరీ అయ్యాను. అప్పట్లో వర్సిటీ పక్కనే చాకలిపేట అని ఉండేది. సెలవు రోజుల్లో విద్యార్థుల్ని తీసుకునివెళ్లి అక్కడి పేదపిల్లలకి చదువు చెప్పేవాణ్ణి. ఓసారి హాస్టల్‌ ఎన్నికలు జరిగితే... శామ్యూల్‌ అనే దళిత విద్యార్థిని నిలబెట్టి గెలిపించాను! నేను ఇలా విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొనడం మా ప్రొఫెసర్‌లలో కొందరికి నచ్చలేదు. దాంతో చివరి ఏడాది నన్ను సస్పెండ్‌ చేశారు. దానికి వ్యతిరేకంగా నేను పోరాడలేదుకానీ... అది మంచికే అనుకున్నాను. మరింత కసిగా చదివి తర్వాత ఎంఫార్మ్‌లో కూడా చేరాను. ఇక్కడే మాకు నోరి విశ్వనాథంగారు ప్రొఫెసర్‌గా వచ్చారు. ఆస్ట్రేలియాలో పనిచేసిన ఆయనకి నేను ప్రియశిష్యుణ్ణయ్యాను. విదేశాల్లో ఉన్నట్టు నా ఇంటిపేరుని వెనక్కినెట్టి, అసలు పేరుని పొడి అక్షరాలుగా కుదించి ‘వీసీ నన్నపనేని’ అని మార్చింది ఆయనే!

ఊళ్లో తాగు నీటి పథకం
విద్యార్థి నాయకుడిగా వర్సిటీలో నా అనుభవం మా ఊరికీ మేలు చేసింది. మా ఊరికి అప్పట్లో తాగునీటి పథకం మంజూరయ్యింది కానీ స్థానిక రాజకీయాలు పెచ్చుపెరిగి పథకం అమలు కాలేదు. నాకు విషయం తెలిసి యువతని కూడగట్టి ఆ పథకం అమలయ్యేలా చూశాను. 1969లో ఎమ్మెస్‌ చేయడానికని అమెరికా బయల్దేరాను. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ కాలేజీలో చదువుకుంటూనే వైటరిన్‌ ఫైన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో ఉద్యోగం చేశాను. తర్వాత మూడేళ్లకి ఆలపాటి రవీంద్రనాథ్‌గారమ్మాయి దుర్గాదేవిని పెళ్ళి చేసుకుని అమెరికాలోనే కాపురం పెట్టాను. ఓ పరిశోధకుడిగా అమెరికాలో నేను ‘టైమ్‌ రిలీజ్‌’ సాంకేతికతపైన దృష్టిపెట్టాను. మామూలు మందుబిళ్లలు మనం వేసుకున్నాక వాటి రసాయనాన్ని ఒకేసారి ఏకమొత్తంగా విడుదలచేస్తాయి. అలాకాకుండా, వ్యాధి తీవ్రత తక్కువుంటే తక్కువగానూ, ఎక్కువుంటే అందుకు తగ్గట్టుగానూ మందుని విడుదలచేసేదే ‘టైమ్‌ రిలీజ్‌’ టెక్నిక్‌. అమెరికాలో పన్నెండేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత భారతదేశంలోనూ ఇలాంటి ఔషధాలు తయారుచేయాలనుకున్నాను. పైగా ‘జననీ జన్మభూమిశ్చ...’ అన్న భావన నాకెప్పుడూ ఉండేది! అప్పటికి మా పిల్లలు రాజీవ్‌, నీలిమ పుట్టారు. వాళ్లకి ఊహ తెలిసేలోపు... ఇండియా రావడం మంచిదనిపించి 1981లో ఇక్కడికి వచ్చేశాం. అప్పట్లో ఫార్మసీ రంగమంటే అందరూ ముంబయివైపే చూసేవారు. కానీ నేను పట్టుబట్టి మరీ హైదరాబాద్‌లోనే ఉండాలనుకున్నాను. హైదరాబాద్‌-బెంగళూరు రోడ్డులో ఉండే కొత్తూరులో మాక్కొంత స్థలం ఉంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టాను. అలా టైమ్‌ రిలీజ్‌ సాంకేతికతతో దేశంలోనే తొలిసారి కోల్డ్‌యాక్ట్‌, కార్డిక్యాప్‌ వంటి మందుల్ని అందించడం మొదలుపెట్టాం. వీటితో మా టర్నోవర్‌ రూ.65 కోట్లకి చేరింది. ఆ విశ్వాసంతోనే... బల్క్‌ డ్రగ్స్‌ యూనిట్‌ స్థాపించాను. బాగా నష్టం వచ్చింది... అన్నింటికన్నా అప్పు తడిసి మోపెడైంది. ఎంతైనా రైతు కుటుంబం నుంచి వచ్చినవాణ్ణి కదా... అప్పు అనగానే అతిగా జాగ్రత్తపడ్డాను. తలతాకట్టుపెట్టయినా సరే తీర్చేయాలనుకున్నాను. నా యూనిట్‌ని అమ్మకానికి పెట్టాను. అప్పుడు ఆ అధికారి మాటలు నా కళ్లు తెరిపించాయి!

‘మిమ్మల్ని మేం... నమ్ముతున్నాం!’
‘వీసీగారూ! మీరు కేవలం పారిశ్రామికవేత్త కాదు... శాస్త్రవేత్త. బల్క్‌డ్రగ్స్‌లో మీరు కచ్చితంగా అద్భుతాలు చేయగలరు...! మీమీద మాకున్న ఆపాటి నమ్మకం కూడా మీకు లేకపోతే ఎలా! ఈ యూనిట్‌ని అమ్మకండి... యూకెన్‌ డూ వండర్స్‌!’- కేవలం నాలుగు వాక్యాలేకానీ నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. బయటకొచ్చి ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించడం మొదలుపెట్టాను. నా ముందు ఒకటే దారి కనిపించింది... అది బాధాకరమే కానీ తప్పలేదు! ఏంటంటే, అప్పటిదాకా మాకంటూ బ్రాండ్‌ ఇమేజ్‌ని తెచ్చి పెట్టిన కోల్డ్‌యాక్ట్‌ వంటి యాభై మందుల ఫార్ములాల్ని అమ్మేయడం. అలా అమ్మగా వచ్చిన డబ్బుతోనే బల్క్‌ డ్రగ్‌ సంస్థని అట్టిపెట్టుకోగలిగాను. ఆ సంస్థని కాపాడుకోవడం ద్వారానే క్యాన్సర్‌ మందుల తయారీవైపు నడవగలిగాను. ఓసారి టైమ్స్‌ పత్రికలో వార్త ఒకటి వచ్చింది... స్విట్జర్లాండ్‌కి చెందిన నోవార్టిస్‌ సంస్థ కనిపెట్టిన ‘గ్లీవెక్‌’(ఇమాటినిబ్‌ మెసైలేట్‌) అనే మందు బ్లడ్‌ క్యాన్సర్‌కి దివ్యౌషధమనీ ఫార్మసీ రంగంలో ఇదో అద్భుతమనీ దాని సారాంశం. అలాంటి మందుల్ని ఇక్కడా తయారుచేసి పేదలకి అందించాలనుకున్నాను. వాళ్ల పేటెంట్‌ కాలం కూడా అప్పటికే ముగిసింది కాబట్టి ఏ సమస్యా ఉండదనుకున్నాం. అలా బ్లడ్‌ క్యాన్సర్‌ కోసం ‘వీనాట్‌’ మందుని ఆవిష్కరించాం. ఆ మందుని నెలకి రూ.8 వేలకే మార్కెట్‌లో పెట్టాం(ఇప్పుడు ధర మరింతగా తగ్గింది). ఎక్కడ లక్షన్నర... ఎక్కడ ఎనిమిదివేలు! అలా మన దేశంలో క్యాన్సర్‌ చికిత్సకి సంబంధించి కొత్త అధ్యాయం మొదలైంది.

చైనాలో సినిమా తీశారు!
వీనాట్‌ సక్సెస్‌ అవుతుండగానే నోవార్టిస్‌ సంస్థ మాపైన కేసుపెట్టింది. కొన్ని బహుళజాతి సంస్థలకి ఓ వ్యూహం ఉంటుంది. తమ మందు పేటెంట్‌ కాలం అయిపోయినా సరే... దానికి చిన్నాచితక మార్పులేవో చేసి ‘మళ్లీ కొత్తగా తెచ్చాం!’ అని కొత్త పేటెంట్‌ కోసం దరఖాస్తు చేస్తారు. పనిలోపనిగా మాలాంటి సంస్థల మీద పేటెంట్‌ కేసులు బనాయిస్తారు. అలా, ‘నోవార్టిస్‌’తో మేం సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడి విజయం సాధించాం. అన్నట్టు, మేం తయారుచేసిన వీనాట్‌ ఆధారంగా చైనాలో ‘డైయింగ్‌ టు సర్వైవ్‌’ అనే సినిమా కూడా తీశారు! ప్రస్తుతం బ్లడ్‌ క్యాన్సర్‌కి వీనాట్‌తోపాటూ బోర్టెజోమిబ్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి జెఫ్టినాట్‌ ఎర్లోనాట్‌ మందుల్నీ, మూత్రపిండాల క్యాన్సర్‌కి సొరాఫినాట్‌నీ తయారుచేస్తున్నాం.

నన్ను విడిచి వెళ్లరంతే..!
కంపెనీ సంక్షోభాలని ఎదుర్కొంటున్న సమయంలోనే మావాడు రాజీవ్‌ సంస్థలోకి వచ్చాడు. ప్రస్తుతం మా సంస్థకి సీఈఓగా ఉంటున్నాడు. కోడలు స్వాతి కంఠమనేని మా సీఎస్సార్‌ పనులన్నీ చూస్తోంది. నేను నా కుటుంబంతో ఒకటే చెబుతుంటాను ‘సంపద సృష్టించడమే కాదు... సమాజానికి పంచడం కూడా ముఖ్యం!’ అని. ఆ సమాజంలో అగ్రతాంబూలం నా ఉద్యోగులకే ఇస్తాను! ఆరోగ్య బీమాల్లాంటివాటికి అతీతంగా కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వైద్య ఖర్చులన్నీ నేనే భరిస్తాను. మా ఉద్యోగుల పిల్లలు ఎవరు ఐఐటీలకి వెళ్లినా చదువయ్యేదాకా వాళ్ల అవసరాలన్నీ కంపెనీయే చూసుకుంటుంది. అందుకే, కేవలం యాభైతో మొదలైన ఉద్యోగుల సంఖ్య... ఆరువేలకి చేరినా మొదట్లో చేరినవాళ్లలో 98 శాతం అలాగే ఉన్నారు!

ఆదివారాల్లేవు...
నాకిప్పుడు 75 సంవత్సరాలు. ఈ వయసులోనూ పనే నన్ను చురుగ్గా ఉంచుతోందన్నది నా నమ్మకం. నాట్కోని ప్రారంభించాకే కాదు, అంతకుముందు అమెరికాలో పనిచేసినప్పటి నుంచీ-అంటే గత యాభై ఏళ్లలో నేను సెలవు పెట్టింది లేదు... ఆదివారాలైనా సరే ఆఫీసుకిరావాల్సిందే. ల్యాబ్‌లో పని చేయాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలని నిర్దేశించుకుంటూ ఉంటాను. మనదేశంలో మరే కంపెనీ చేయనివిధంగా సొంత ఆవిష్కరణలతో కూడిన మందుల్ని తయారుచేయాలన్నదే... ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం!


35 కోట్లతో క్యాన్సర్‌ యూనిట్‌!

పేదల కోసం కొత్తగా ఆసుపత్రులు కట్టడంకన్నా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్ని మెరుగుపరచడం ముఖ్యమనుకుంటాన్నేను. అందుకే, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది రూ.35 కోట్ల ఖర్చుతో మా తల్లిదండ్రుల పేరుమీద అధునాతన క్యాన్సర్‌ యూనిట్‌ నిర్మించాం. క్యాన్సర్‌ చికిత్సకి కావాల్సిన లీనియర్‌ యాక్సలరేటర్‌ మెషిన్‌ని ప్రభుత్వం సమకూర్చుకోవడానికి తోడ్పాడ్డాం. ఈ యూనిట్‌ ఏర్పాటు కారణంగా కేంద్రప్రభుత్వం ఎమ్మెస్సీ రేడియో అంకాలజీలో జీజీహెచ్‌ బోధనాసుపత్రికి రెండు సీట్లిచ్చింది. ఇక్కడే రూ.10 కోట్లతో పిల్లల చికిత్సా కేంద్రాన్ని సరికొత్తగా ఆధునికీ కరించాం. హైదరాబాద్‌ నిలోఫర్‌లోనూ కొత్త ఓపీడీ బ్లాక్‌ కట్టిచ్చాం. ఇక, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో మా ప్లాంట్‌ ఉన్నచోటా, మా ఊరు గోళ్ళమూడి పాడులోనూ ఆధునిక వసతులతో నాట్కో బడుల్ని ఏర్పాటుచేశాం. హైదరాబాద్‌లోని బోరబండ మురికివాడలోని బడినీ దత్తత తీసుకుని. సర్కారు బడుల్లో నంబర్‌వన్‌గా నిలిపాం. అంతేకాదు, వైద్యులు సిఫార్సు చేస్తే... క్యాన్సర్‌ రోగులకి మందుల్ని ఉచితంగా అందిస్తుంటాం. ఇలా ఏటా వంద లాది కుటుంబాలకి అందిస్తున్నాం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు