
ఈ కాలంలో విరివిగా దొరికే ఉసిరికాయలతో తొక్కుపచ్చడి, ఆవకాయ పెట్టుకోవడం తెలిసిందే. కానీ ఎన్నో పోషకాలనిచ్చే ఉసిరితో అవొక్కటేనా... మరికొన్ని రకాలూ చేసుకోవచ్చు తెలుసా...
స్వీట్ చట్నీ
కావలసినవి: ఉసిరికాయలు: అయిదు, జీలకర్ర: చెంచా, ఆవాలు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, కారం: రెండు చెంచాలు, ఇంగువ: చిటికెడు, బెల్లం తరగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: మూడు చెంచాలు.
తయారీ విధానం: ఉసిరి ముక్కల్ని, ఓ గిన్నెలో వేసి కాసిని నీళ్లు పోసి మెత్తగా అయ్యేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఆ తరువాత ముక్కలన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేయించాలి. అవి వేగాక కారం, ఉసిరిముద్ద, బెల్లం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. బెల్లం కరిగి.. ముద్దలా అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశల్లోకి బాగుంటుంది.
ఉసిరి కొబ్బరి పచ్చడి
కావలసినవి: ఉసిరికాయలు: నాలుగు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: అయిదు, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: మూడు చెంచాలు, ఆవాలు: పావుచెంచా, జీలకర్ర: పావుచెంచా, మినప్పప్పు: అరచెంచా, సెనగపప్పు: అరచెంచా, దనియాలు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, మెంతులు: నాలుగైదు గింజలు.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి.. నాలుగు ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, దనియాలు వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మరో చెంచా నూనె వేసి, ఉసిరికాయల్ని వేసి.. మెత్తగా అయ్యేవరకూ మగ్గించుకోవాలి. వాటి వేడి తగ్గాక ముక్కల్లా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉసిరి ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు, ముందుగా వేయించుకున్న తాలింపు వేసి అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి.. పచ్చడిపైన వేసి ఓసారి కలిపితే చాలు.
ఉసిరి బెల్లం మురబ్బా
కావలసినవి: ఉసిరికాయలు: ఏడు, బెల్లం తరుగు: అరకప్పు, నిమ్మకాయ: ఒకటి, మిరియాలపొడి: అరచెంచా.
తయారీ విధానం: ఉసిరికాయల్ని కడిగి కాసేపు ఎండలో పెట్టాలి. ఆ తరువాత ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించి తీసుకుని వేడి తగ్గాక వాటికి అక్కడక్కడా గాట్లు పెట్టి ఏదయినా సీసాలో వేసి.. పైన బెల్లం తరుగు వేసి మూత పెట్టేయాలి. రెండు రోజులకు బెల్లం కరుగుతుంది. అప్పుడు ఈ రెండింటినీ ఓ గిన్నెలో వేసి స్టౌమీద పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగి... ముదురుపాకంలా అవుతున్నప్పుడు స్టౌ కట్టేసి నిమ్మరసం, మిరియాలపొడి వేసి జాగ్రత్తగా కలిపి సీసాలోకి తీసుకోవాలి.
కారప్పొడి
కావలసినవి: సన్నగా తరిగిన ఉసిరికాయ ముక్కలు: అరకప్పు, ఎండుమిర్చి: ఏడు, దనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, వెల్లుల్లిరెబ్బలు: నాలుగు, ఉప్పు: తగినంత, నూనె: మూడు చెంచాలు, మెంతులు: పావుచెంచా.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి.. ఉసిరికాయ ముక్కల్ని బాగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో ఉప్పు తప్ప నూనెతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఉసిరి ముక్కలు, ఎండుమిర్చి తాలింపుకు సరిపడా ఉప్పును మిక్సీలో తీసుకుని కాస్త బరకగా పొడి అయ్యేలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి.
ఉసిరి కూర
కావలసినవి: ఉసిరికాయ ముక్కలు: కప్పు, ఆవనూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: అరటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, బెల్లం: టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను
తయారీ విధానం: బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేసి మూతపెట్టి, మధ్య మధ్యలో కలుపుతూ సిమ్‌లో ఉడికించాలి. తరవాత కారం, దనియాలపొడి, ఉప్పు వేసి కలిపి, రెండు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి, బెల్లం తురుము వేసి మూతపెట్టి మరో పది నిమిషాలు సిమ్‌లో దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి, కొత్తిమీర తురుము చల్లి దించాలి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్