close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విష్ణుమూర్తే వీరనారాయణుడై...

విశాలమైన ప్రాంగణం.... చుట్టూ పచ్చని పరిసరాలు... ఆకట్టుకునే నిర్మాణశైలితో కనిపిస్తుంది వీరనారాయణస్వామి ఆలయం.  ప్రతిఏటా మార్చి 23న స్వామిపైన సూర్యకిరణాలు పడే ఈ దివ్యక్షేత్రంలో నారాయణుడితోపాటూ నరసింహుడు, వేణుగోపాలస్వామి కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. అతి పురాతనమైన ఈ క్షేత్రం కర్ణాటకలోని బెలవాడిలో ఉంది.
అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతోపాటూ మరికొన్ని విశేషాలు కలగలసిన విష్ణు దేవాలయం ఈ నారాయణస్వామి సన్నిధి. ఈ ఆలయం కర్ణాటకలోని చిక్‌మగళూరుకు ఇరవైఎనిమిది కిలోమీటర్ల దూరంలోని బెలవాడిలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి సాలగ్రామ రూపంలో నారాయణుడిగా ప్రధాన పూజలు అందుకుంటుంటే... స్వామికి ఇరుపక్కలా వేణుగోపాలుడు, యోగ నరసింహుడు కొలువై ఉంటారు. ఈ ప్రాంగణంలో ఉన్న 108 స్థూపాలు ఒక్కోదానితో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో రెండో వీరబళ్ళాల దేవరాయలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. త్రికుటాచల క్షేత్రంగా పిలిచే ఈ ఆలయంలో ప్రతిఏటా మార్చి 23న సూర్యకిరణాలు ఇక్కడున్న ఏడు ద్వారాలను దాటి స్వామిపైన పడతాయనీ అది చూసేందుకు రెండు కళ్లూ చాలవనీ అంటారు. ఈ ఆలయాన్ని అమరశిల్పి జక్కన నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
స్థలపురాణం
మహాభారత కాలంలోనూ బెలవాడి ఉందనీ... దాన్ని ఏకచక్రనగరిగా పిలిచే వారనీ చరిత్ర చెబుతోంది. మారువేషంలో ఉన్న పాండవులు ఇక్కడ ఓ బ్రాహ్మణుడి ఇంట్లో తలదాచుకునేవారనీ... అలా ఉన్నప్పుడే భీముడు బకాసురుడిని సంహరించాడనీ అంటారు. అదేవిధంగా విష్ణుమూర్తి నారాయణ స్వరూపుడిగా శకాసుర అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడట. ఆ తరువాత స్వామి  శిలలా ఉండిపోయాడనీ... అది జరిగిన కొన్నాళ్లకు వీర బళ్ళాల దేవరాయలు ఈ ఆలయాన్ని కట్టించాడనీ చెబుతారు. ఈ ఆలయాన్నే కాదు బెలవాడిని కూడా 1760ల నుంచీ కంచి కామకోటి పీఠం దత్తత తీసుకుందనీ... అప్పటినుంచీ ఆ పీఠం సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారనీ అంటారు. ఒకప్పుడు జరిగిన యుద్ధాల్లో ఎన్నో ఆలయాలు ధ్వంసం అయినా ఇది మాత్రం చెక్కుచెదరలేదని కూడా ఆలయ నిర్వాహకులు చెబుతారు.

విశేషపూజలు...
పంచనారాయణ క్షేత్రాల్లో ఒకటని ఈ ఆలయానికి పేరు. బేలూరులో ఉన్న విజయ నారాయణుడు, మెల్కొటెలోని చెలువ నారాయణుడు, తలకాడులోని కీర్తినారాయణుడు, తొండనూరులో ఉన్న నంబినారాయణుడుతోపాటూ ఇది కూడా ఒకటని అంటారు. ఇక్కడ స్వామి గద, పద్మాలతో దర్శనమివ్వడం విశేషం. అదేవిధంగా స్వామికి కుడిపక్కన కృష్ణుడు వేణుగోపాలుడి రూపంలో కల్పవృక్షం కింద నిల్చుని దర్శనమిస్తాడు. ఈ విగ్రహం దేశంలోనే అరుదైనదిగా పురావస్తుశాఖ పేర్కొంటోంది. అలాగే మరోవైపు ఉన్న యోగా నరసింహుడిని యోగముద్రలో... శంఖ, చక్రాలతో చూడొచ్చు. ఈ స్వామి పక్కన శ్రీదేవి, భూదేవి కొలువై ఉండటం విశేషం. నారాయణుడి విగ్రహం చుట్టూ దశావతారాలు ఉంటే.. ఎనిమిదో అవతారంలో కృష్ణుడికి బదులుగా బలరాముడు కనిపిస్తాడు. సంతానం లేనివారు ఇక్కడున్న వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఆరోగ్యం, ఆర్థిక సమస్యలూ, కోర్టు వ్యవహారాల్లాంటి సమస్యలు తీరేందుకు యోగ నరసింహుడిని దర్శించుకుంటారు భక్తులు. ప్రతిఏటా మార్చి 23తోపాటూ, కృష్ణాష్టమి, ఇతర పర్వదినాల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి పరంగానూ ఆకట్టుకునే ఈ క్షేత్రాన్ని ప్రతిఏటా ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకోవడం విశేషం.
ఎలా చేరుకోవచ్చంటే...
ఈ ఆలయం కర్ణాటక చిక్‌మగళూరు జిల్లాలోని బెలవాడి అనే గ్రామంలో ఉంది. హలేబీడుకు పదికిలోమీటర్లూ, చిక్‌మగళూరుకు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. విమానంలో అయితే బెంగళూరు వరకూ వచ్చి.. అక్కడి నుంచి చిక్‌మగళూరు చేరుకుని ఆలయానికి వెళ్లొచ్చు. రైల్లో రావాలనుకుంటే కడూరు, బిరూరులలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అక్కడ దిగితే ఆలయాన్ని చేరుకోవడం సులువు.


తిరుమలేశుడికి ఏరువాడ జోడు పంచెలు

దసరా నవరాత్రుల్లో వెంకటేశ్వరస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఆ సమయంలో మొదటిరోజు స్వామికి కట్టే పంచెల్ని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చేనేత కార్మికులు తయారుచేస్తారు తెలుసా! అవును... ఆ కార్మికులు నెల రోజుల పాటు ఎంతో నియమనిష్ఠలతో నేసిన పంచెల్ని స్వామికి కట్టించే సంప్రదాయం దాదాపు 350 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని గద్వాల సంస్థానాధీశులు ప్రారంభిస్తే వారి వారసులు నేటికీ ఏటా శ్రావణమాసంలో గద్వాల చేనేత కార్మికులతో ఏరువాడ జోడు (రెండు) పంచెలు నేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పిస్తున్నారు. అంతేకాదు, తిరుమలేశుడికి పంచెల్ని సమర్పించాక అర్చకులు ‘గద్వాల ఏరువాడ జోడు పంచెలు వచ్చాయి’ అంటూ మూడుసార్లు స్వామి చెవిలో చెబుతారట. ఆ తరువాత సంస్థానాధీశుల చేత స్వామికి హారతి ఇప్పించడం కూడా ఓ సంప్రదాయంగానే వస్తోంది.

ఏరువాడ జోడు అంటే...
నడిగడ్డగా పిలిచే గద్వాల ప్రాంతం కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉంటుంది. ఈ ప్రాంతంలో నదిని ఏరు అని పిలుస్తారు. రెండు ఏరుల మధ్యన ఉండటంతో ఏరువాడగా, రెండు పంచెలు కాబట్టి జోడు అనే పేరు వచ్చిందని ఇక్కడి చేనేత పెద్దలు చెబుతున్నారు. ఈ పంచెలను తయారు చేసేందుకు అంచులకు నాణ్యమైన పట్టునూ, మిగతా భాగం నూలునూ ఉపయోగిస్తారు. అంచుకు ఎక్కువభాగం ఎరుపు, ఆ పైన ఆకుపచ్చ, బంగారు వర్ణాల పట్టు వాడతారు. మూలవిరాట్టుకు సరిపోయేలా ఒక్కో పంచెను పదిమీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పుతో నేస్తారు.

- పూర్ణచంద్ర, ఈనాడు మహబూబ్‌నగర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు