close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చీకట్లో వెలిగే దుప్పట్లు..!

చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో... ఆ చీకట్లో చిరు వెలుగు అంత అందంగా ఉంటుంది.  నిశిరాత్రిలో మిలమిలా మెరిసే కాంతుల్ని చూస్తే పిల్లల కళ్లు కూడా దీపాల్లా వెలిగిపోతాయి. అందుకే, వారికోసం రకరకాల బొమ్మలతో చీకట్లో వెలిగే దుప్పట్లు వస్తున్నాయిప్పుడు.
పిల్లల్ని సమయానికి నిద్ర బుచ్చడం పెద్ద ప్రహసనం. చీకటంటే భయమంటారు. వెలుగుంటే పడుకోరు. ‘నువ్వూ నాతో పాటు పడుకో అమ్మా’ అని మారాం చేస్తారు. పెద్దలకేమో బోలెడన్ని పనులు. ప్రతిరోజూ పిల్లలతో పాటే త్వరగా పడుకోవడానికి కుదరదు. అలా అని అమ్మలు పడుకునేవరకూ పిల్లలూ నిద్రపోకపోతే వారికి నిద్ర సరిపోదు. ఇదంతా లేకుండా పిల్లలు చీకట్లో తమ దుప్పట్లోనే వెలిగే బుల్లి బుల్లి బొమ్మల్ని చూసుకుంటూ ఊహల్లో తేలుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా... అందుకోసం వస్తున్నవే ఈ ‘గ్లో ఇన్‌ ది డార్క్‌ బెడ్‌షీట్లు’. ఈ దుప్పట్లమీద చీకట్లో మెరిసే యూవీ/నియాన్‌ వర్ణాలతో రకరకాల ఆకారాల్లో ప్రింట్లు వేస్తారు. ఈ రంగులు పగటి వెలుగునీ ట్యూబ్‌లైట్ల కాంతినీ గ్రహించి లైటు తియ్యగానే చీకట్లో మెరుస్తూ కనిపిస్తాయి.

పిల్లలకు భలే నచ్చుతాయి
డైనోసార్‌, చేప, గుర్రం లాంటి జంతువుల కార్టూన్‌ బొమ్మలూ, పాలపుంత, పువ్వులూ, చందమామ, నక్షత్రాలూ, గ్రహాలూ... ఇలా రకరకాల ప్రింట్లతో వచ్చే ఈ మెరిసే దుప్పట్లను పక్కమీద వేసుకోవచ్చు, పైన కప్పుకోవచ్చు. వీటిని చీకట్లో చూస్తే ఆకాశం దిగివచ్చి పడక
గదిలో దుప్పటైందా... తారలు వెలిగే బొమ్మల్లా మారి మంచం మీద చేరాయా... అనిపించకమానదు. అంత అందంగా ఉంటే పెద్దలకు మాత్రం నచ్చకుండా ఉంటాయా... పగలంతా అలసిపోయి మంచం మీద వాలుతున్నప్పుడు వీటిని చూస్తే మనసు సేదతీరుతుందనడం అతిశయోక్తి కాదు. ఇవి రాత్రిపూట పడకగదికి ప్రత్యేక అలంకరణగానూ పనికొస్తాయి. అతిథులు వచ్చినపుడు వారిని ఆశ్చర్యంలోనూ ముంచెత్తుతాయి. ఏమంటారు..?

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు