close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముగ్గు ఎంత మారిందో..!

ఆకాశంలో హరివిల్లు ఎప్పుడోగానీ కనిపించదు. కానీ తెలుగువారి లోగిళ్లలో మాత్రం సంక్రాంతి వచ్చిందంటే ప్రతిరోజూ ఎన్నో ఇంద్రధనుస్సులు అందమైన ముగ్గుల్లా పరుచుకుంటాయి. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ ఇప్పుడు ఇంకా చూడచక్కగా మారుతోంది.
ధనుర్మాసం అంటేనే ముగ్గుల మాసం. ఈ నెల మొదలవగానే ‘సంక్రాంతి నెల పట్టింది’ అంటారు. అందుకే, అప్పట్నుంచే రకరకాల ముగ్గుల్ని వేస్తూ ముంగిట్లోకి పండుగ సంబరాన్ని తెచ్చేస్తారు పడతులు. నిజానికి ధనుర్మాసం కోసం ముగ్గులు ప్రత్యేకంగా ఉంటాయి. సంక్రాంతి మూడు రోజులు కూడా వైకుంఠ ద్వారాలు, తాబేలు, విస్తరాకు, చెరకుగడలు, చాప,రథం... అంటూ రకరకాల రంగవల్లుల్ని గీస్తుంటారు. పండుగ చివరి రోజున ఒక ఇంటి ముగ్గు నుంచి మరో ఇంటి వాకిట్లో ఉన్న ముగ్గుకి కలుపుతూ పిండిని గీతలా గీసి తీసుకెళ్తుంటారు. అలా ఊరి మొదట్లోని ఇంటి నుంచి చివర ఉన్న ఇంటి వరకూ ఒక్కో ముగ్గునీ జత చేసుకుంటూ ఆ గీతను పొలిమేరల్లోకి తీసుకెళ్లి పండుగకి వీడ్కోలు పలుకుతారు. ఇలా సంక్రాంతి వేడుకల్లో ముగ్గులది ముఖ్యమైన భాగం. అయితే, సంప్రదాయ ముగ్గులతో పాటు ఇంటికి మరింత అందాన్ని తెచ్చేందుకు ముంగిట్లో ఎన్నోరకాల ముగ్గుల్ని వేసి రంగుల్ని దిద్దుతుంటారు ముద్దుగుమ్మలు. వీటిలోనూ ఒకప్పుడు మెలికల ముగ్గులూ చుక్కల ముగ్గులూ గీతల రంగోలీలనే ఎక్కువగా వేసేవాళ్లు. కానీ ఇప్పటి ముగ్గుల్లో ఎన్నో వినూత్న పద్ధతులు వచ్చేశాయి. అన్నిటిలోనూ కొత్తదనాన్ని కోరుకునే నవతరం వనితలు ముగ్గుల్లోనూ కొత్త ట్రెండ్‌లను సృష్టించేశారు మరి. ఎంతో సృజనాత్మకతతో ఈతరం తీర్చిదిద్దే రంగోలీలను చూస్తే అవి ముగ్గులా కళాఖండాలా అన్నంతగా కళ్లను కట్టిపడేస్తున్నాయి.
ఎన్ని రకాలో...
కాలం మారింది. ఇళ్లు మారాయి. వాకిళ్లూ మారాయి. ఒకప్పుడు పెంకుటిళ్లూ పెద్ద పెరడూ మట్టి నేలా ఉండేవి. అందుకే, పేడతో కళ్లాపి చల్లి, తెల్లటి పిండితో ముగ్గువేసి రంగులు దిద్దేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. పట్టణాలూ నగరాల్లోనైతే మట్టి నేల కనిపించనే
కనిపించదు. ఎటుచూసినా గచ్చు, టైల్స్‌. అలా అని అమ్మాయిలు తమకెంతో ఇష్టమైన ముగ్గుని వదిలెయ్యలేదు. ముగ్గువేసే పద్ధతిని మార్చి నల్లటి గచ్చు అయినా తెల్లటి టైల్స్‌ అయినా చూడచక్కగా కనిపించేలా చేస్తున్నారు. మట్టి నేలమీదా మునివేళ్లతో హరివిల్లుల్ని పూయిస్తున్నారు.

పూల రంగోలీ...
సుకుమారమైన కుసుమాలను మించిన అందం ప్రకృతిలో వేటికి ఉంటుంది... అలాంటి పూరేకులతో చూడచక్కని రంగవల్లికను గీస్తే ఇల్లు పండుగ శోభతో కళకళలాడిపోదూ... పండుగ రోజున గుమ్మాలకు బంతి మాలల్ని కట్టడంతో పాటు దేవుడి ముందూ గుమ్మం ముందూ ఇలా పూల ముగ్గులు వేసి ఇంటిని అలంకరించడం ఈమధ్య బాగా పెరిగింది.
ఆక్రిలిక్‌ అందాలు... క్విల్లింగ్‌ సొగసులు...
ఉద్యోగాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉండేవారికి పండుగ ముందే రంగులు కొనుక్కోవడం, పండుగ రోజు ఉదయాన్నే లేచి ముగ్గులు వెయ్యడం కుదరకపోవచ్చు. అలాంటి వారికోసం రెడీమేడ్‌ ముగ్గులు దొరుకుతున్నాయి. ఆక్రిలిక్‌ ప్యానెళ్లను ముచ్చటైన రంగోలీ డిజైన్లలో కత్తిరించి, వాటిమీద రంగులు వేసి కుందన్లతో అందంగా అలంకరించి వచ్చేవి వీటిలో ఒక రకం. విడి విడి భాగాలుగా వచ్చే వీటిని పండుగ రోజు ఇంట్లో నచ్చిన చోట చిటికెలో అమర్చేసుకోవచ్చు. పనైపోయాక మళ్లీ తీసి దాచేయొచ్చు. వీటిలో మరోరకం క్విల్లింగ్‌ ముగ్గులు. సన్నగా పొడుగ్గా కత్తిరించిన కాగితాన్ని రకరకాల ఆకారాల్లో చుడుతూ ఈ ముగ్గుల డిజైన్లను తయారుచేస్తారు. ఇవి కూడా రెడీమేడ్‌గా దొరుకుతాయి. విభిన్నంగా ఉండే ఈ క్విల్లింగ్‌ ముగ్గుల్ని నేలమీదే కాదు, గోడలకూ ఆర్ట్‌పీస్‌లా అలంకరించుకోవచ్చు.

స్పూనులతో...
కళకు కాదేదీ అనర్హం అన్నట్లూ... నేటి నారీమణులు ప్లాస్టిక్‌ స్పూనులతో కూడా అందమైన రంగవల్లుల్ని సృష్టించేస్తున్నారు. స్పూనుల్ని వేర్వేరు ఆకారాల్లో పేర్చి వాటిలో రంగుల ముగ్గుల్ని పోసి తీర్చిదిద్దుతున్న ఈ రంగవల్లులు వెయ్యడమూ సులభమే చూడ్డానికీ భిన్నంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇక, పిండితో వేసే ముగ్గుల్లో ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందింది చిన్నచిన్న రాశులుగా ముగ్గుని పోసుకుంటూ వేసే డిజైన్లే. దీన్లో ఖాళీ ఫెవికాల్‌ బాటిల్లో ముగ్గుని పోసి, బాటిల్‌ని వత్తుతూ కావల్సిన ఆకారంలో పిండిని చిన్న పోగులుగా పోస్తారు. తర్వాత ఆ రాశుల్ని పుల్ల లేదా ఫోర్కుతో రకరకాల గీతలుగా గీస్తారు.వీడియోల్లో చూస్తే ఈ తరహా ముగ్గుల్ని చాలా సులభంగా వేగంగా వేసేసుకోవచ్చు. పైగా మామూలు చుక్కల ముగ్గులు వేసి రంగులు దిద్దిన వాటికన్నా ఇవి ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇలా అందంగా భిన్నంగా వేసుకునేలా ఎన్నో కొత్తరకం ముగ్గుల
గురించిన వీడియోలు యూట్యూబ్‌లో కోకొల్లలు. చూశారుగా ముగ్గు ఎంత మారిపోయిందో..!


వైరల్‌ అయిన వాలుజడ ముగ్గు


 

వాలుజడ వేసుకుని వయ్యారంగా కూర్చుని ముగ్గు వేస్తున్న కాంతామణుల అందాన్ని కవులు వర్ణిస్తూనే ఉంటారు. సినిమాల్లోనూ చూస్తూనే ఉంటాం. ఆ అందాన్ని ముగ్గులోకి దించేస్తే పోలా... అనుకుంటూ సృష్టించిందే ఈ అపురూప దృశ్యం. ఎవరు వేసిందో తెలియదు కానీ ఈ ముగ్గు గతేడాది సంక్రాంతి నుంచి ఇప్పటి వరకూ సోషల్‌మీడియాలో షేర్‌ అవుతూనే ఉంది. రంగులతో అమ్మాయిల్ని తీర్చిదిద్ది వారి జడ స్థానంలో నిజమైన సవరం జడలనూ, తల్లో పువ్వుల్నీ పెట్టారు. ఎంత సృజనో..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు