close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అత్త - కోడలు

- మొలకలపల్లి కోటేశ్వరరావు

‘‘సంక్రాంతి పండుగ దగ్గరకి వచ్చింది. ఇంతవరకూ నువ్వూ, పిల్లలూ బట్టలు తీసుకోలేదు అంజనా. రేపు టౌన్‌కి వెళ్లి నీకూ, పిల్లలకీ బట్టలు తెచ్చుకుందాం!’’ కమలమ్మ అంది కోడలు అంజనతో.
‘‘ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా, అందరికీ ఉన్నాయిగా? ఇయ్యేడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఖర్చులు ఎందుకు పెంచుకోవడం?’’
‘‘వ్యవసాయం అన్న తరవాత అంతే. ఒకేడు పండుతుందీ, ఒకేడు ఎండుతుంది. అదంతా మామూలే. పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా, పండుగ చేసుకోవడం మానుకుంటామా?’’
‘‘పిల్లలు పెద్ద అవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయికానీ తగ్గవు! రేపు వాళ్ల చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది! ఇప్పట్నుంచీ ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా!’’
‘‘పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్లూ వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకి ఉన్నా, లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్లు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ, చిన్నతనంగా ఉండకూడదు.’’
‘‘సరే అత్తయ్యా అయితే! పండుగ సరుకులు కూడా కావాలి కదా? రేపు వెళ్లి సరుకులూ, పిల్లలకి బట్టలూ, విజయకి చీరా, వాళ్ల పిల్లలకి బట్టలూ తీసుకుందాం అయితే!’’
‘‘విజయకి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం? పెళ్లయి పదేళ్లు అవుతోంది. ఏటా పెడుతూనే ఉన్నాం. మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా, పెడుతుందా? ఇదేనా సంబడం అని తీసి పారేస్తుంది? ఎందుకు లేనిపోని తలనొప్పి!’’
‘‘కాదులే అత్తయ్యా! ఇంటాడపడుచు. మనం ఏం పెడుతున్నాం? పండక్కి ఓ చీరేకదా, ప్రతి ఏడూ పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది?’’
మరుసటి రోజు డబ్బు తీసుకుని అత్తా, కోడలూ ఇద్దరూ టౌన్‌కి వెళ్లారు.
పండుగ సరుకులు తీసుకున్న తరువాత బట్టలషాపుకి వెళ్లారు. పిల్లలవరకూ బట్టలు తీసుకున్నారు. అంజన తీసుకోలేదు.
‘‘అంజనా, నామాట విను. నువ్వూ ఒక చీర తీసుకోమ్మా!’’
‘‘వద్దు అత్తయ్యా! నాకు చాలా చీరలు ఉన్నాయి. నూలు గుడ్డ నూరు కాలాలు ఉంటుందా. ఇంట్లోనూ, బీరువాలోనూ అడ్డమే. వాటిని సర్దుకోలేకచావాలి’’ అని అంజన ససేమిరా చీర తీసుకోలేదు.
అంజన, విజయకి చీర తీసుకుంటుంటే, కమలమ్మ క్యాష్‌ కౌంటర్‌ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి మోకాళ్ల నొప్పులు.
విజయ చీర అయిన తరువాత, అంజన కాటన్‌ చీరలు ఉన్న చోటుకి వెళ్లి, చిన్న చిన్న పువ్వులు ఉన్న రెండు నేత చీరలు తీసుకుంది.
‘‘ఇలా రా అత్తయ్యా... ఇవి చూడు, బాగున్నాయి. నీకోసం ఈ రెండు చీరలు తీసుకున్నా!’’
‘‘నాకు వద్దు అంజనా... ఇప్పుడు నాకు ఎందుకు, వద్దొద్దు’’ అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది, అవి లోపల పెట్టమని చెప్పడానికి.
‘‘ముందు ఇవి చూడు అత్తయ్యా! నీకు బొత్తిగా లేవు చీరలు. రోజువారీ కట్టుకోవడానికి ఉన్నాయికానీ దాపుడికి ఏం ఉన్నాయి? రేపు ఏ పెళ్లికో, పేరంటానికో వెళ్లాలన్నా, పండక్కో పబ్బానికో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు? ఇంటికి పెద్దదానివి. నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది? నిన్నుకాదు, మమ్మల్ని అంటారు. ముందు నువ్వు బాగుండాలి!’’
కమలమ్మ ‘‘వద్దు... వద్దు’’ అంటున్నా ఆ రెండు చీరలూ ప్యాక్‌ చేయించింది. తరువాత భర్తకి లుంగీలూ, టవళ్లూ తీసుకుందామని మరో కౌంటర్‌ దగ్గరకి వెళ్లింది అంజన.
‘‘చెప్పిన మాట వినవుకదా?’’ కమలమ్మ విసుగ్గా అంటూ, వచ్చి కౌంటర్‌ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది.
‘‘అమ్మా... మీరు వరసకి అత్తాకోడళ్లా, నిజం అత్తాకోడళ్లా?’’ కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు, వీళ్ల సంభాషణ గమనించి. ఆయనకి ఇంట్లో తన భార్య, తల్లీ నిత్యం పడే గొడవలు తలపుకి వచ్చాయి.
‘‘ఏం? అత్తా కోడళ్లు బాగుండకూడదా? ఆమె నా కొడుకు భార్య, నేను ఆమె భర్త తల్లినీ!’’
‘‘మీ సొంత మేనకోడలా?’’
‘‘కాదు. పరాయిపిల్లే! అయితేనేం, మంచి ముత్యం!’’
అతను విస్మయంగా చూశాడు.
కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ, భర్త, భర్తతో కాపురం సొగసు గుర్తు వచ్చింది. తనకి పెళ్లయి 42 ఏళ్లు. తన పదహారో ఏట పెళ్లయింది. భర్త కాంతయ్య తాగుబోతు. 15 ఎకరాల పొలం ఉంది. మంచి రైతే. ఎద్దులూ, వ్యవసాయం, ఒక పాలేరూ, పనివాళ్లూ అన్నీ బాగున్నాయి. కానీ, అత్తా, భర్తా ఇద్దరి బుద్ధీ మంచిదికాదు. మామ లేడు. తనకి పెళ్లయ్యేనాటికే చనిపోయాడు.
తన భర్త రోజూ తాగివచ్చి నానా గొడవ చేసేవాడు. అత్తా, భర్తా ఇద్దరూ కలిసి తనని చాలాసార్లు కొట్టారు. తనకో ఆడబిడ్డ. ఆమెని ఊళ్లోనే ఇచ్చారు. పేదకాపురం.
ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం, కష్టపడి బతుకుదాం అనే తత్వం కాదు ఆమెది. సోమరి. పుట్టింటి మీద ఆధారపడేది. ఉప్పు దగ్గర నుంచి పప్పువరకూ సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే!
ఎవరైనా అదేమంటే, గతిమాలిన వాడికి కట్టబెట్టి గొంతు కోశారని శోకాలు పెట్టేది.
మంచి కుటుంబం, మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు.
తన పుట్టింటి వాళ్లకి బొత్తిగా ఆస్తిలేదు. నిరుపేదలు. పొలం ఉంది, తను అయినా సుఖపడుతుందనే ఉద్దేశ్యంతో అమ్మానాన్నా సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు.
ఆ రోజుల్లోనే తనకి పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. వీళ్లకి అసలు చదువులు లేవు. తను చదువుకోవడం వీళ్లకి హేళన.
ప్రతిరోజూ ఏదో ఒక గొడవే. ఏదో వంకతో తగాదానే. రోజూ హింసే.
ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం, సరదాలు లాంటివి తనకి ఏరోజూ ఉండేవికాదు.
ఇద్దరు పిల్లలు పుట్టారు. ముందు కొడుకూ, మూడేళ్లకి కూతురూ.

తాగీ తాగీ భర్త కాలేయం దెబ్బతినిపోయింది. ఆయన తాగుడికీ, ఆస్పత్రి ఖర్చులకీ, ఇంట్లో దుబారాకీ ఐదు ఎకరాల పొలం కరిగిపోయింది. చివరకి తాగుడే బలి తీసుకుంది. పిల్లల పసి ప్రాయంలోనే పోయాడు.
భర్త పోయిన తరువాత అత్తా, ఆడబిడ్డా తన మీద ఎప్పటిలానే పెత్తనం చేయాలని చూశారు. వాళ్ల ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు. ఎల్లకాలమూనా? ప్రతిఘటించింది. అంతే వాళ్లే తగ్గిపోయారు.
కొంత కాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది. మంచాన పడింది. సేవ చేయాల్సివుంటుందని కన్నకూతురు కన్నెత్తి చూడలేదు.
తన పాలిట పడింది. ఆమె చేసిన ఆగడాలకి తను ఎలా చూస్తుంది? కానీ తప్పదాయె. చీదరగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు.
మంచంలో చాలా యాతన పడింది. బాధ పడింది. చేసుకున్న ఫలితం.
అత్త వలన కలిగిన అనుభవాలతోనూ, గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది... తనకి వచ్చే కోడలితో ఎలాంటి పరిస్థితిలో కూడా ఇలా వ్యవహరించకూడదని.
కనీ పెంచీ పెద్ద చేసిన కన్నవాళ్లనీ పుట్టింటినీ వదిలి ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో కోరికలతో, ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ, ఎంతో ఆదరణతోనూ, ఎంతో ప్రేమతోనూ, ఎంతో మంచిగానూ చూడాలని నిర్ణయించుకుంది.
అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది.
కొడుకుని బాగా చదివించాలని తన కోరిక. కానీ, కొడుక్కి చదువు ఒంట పట్టలేదు. ఇంటర్‌ రెండుసార్లు ఫెయిలయ్యాడు.
ఇక చదువుకాదని పొలం పనుల్లోకి దిగాడు. ట్రాక్టర్‌ నేర్చుకున్నాడు. బ్యాంకులోన్‌తో కొత్త ట్రాక్టర్‌ తెచ్చుకున్నాడు. తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నాడు.
కూతురు విజయ ఎమ్మెస్సీ చదువుకుంది. కొడుకు తన మాట మీరడు. తను ఎంత చెబితే అంతే. ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది. సంబంధాలు వస్తున్నాయి.
పొరుగూరు పమిడిపాడు. ఆ ఊరునుంచి అంజనవాళ్ల సంబంధం వచ్చింది. బాగా బతికి చెడిన కుటుంబం. తండ్రి లేడు. అమ్మాయి చదువుకుంది. మంచి పుటక. మంచి కుటుంబం, ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్లు చాలామంది చెప్పారు.
కొడుక్కి పెళ్లి చేసింది. అంజన కోడలైంది. అందరూ చెప్పినట్లు నిజంగానే చాలా మంచి అమ్మాయి.
కొడుకు పెళ్లి అయిన ఏడాదికి కూతురు విజయకి కూడా పెళ్లయింది.
విజయకి ఆ మనువు మాట్లాడింది అంజనే. వాళ్ల ఊరూ, వాళ్ల బంధువుల కుర్రాడు. చాలా కట్నం అడిగారు. అంత ఇవ్వడానికి తనూ, కొడుకూ ఇద్దరూ ఆసక్తి చూపలేదు. అంజన పట్టు పట్టింది.
తమకి పది ఎకరాలు పొలం ఉంది. నాలుగు ఎకరాలు పొలం, నాలుగు లక్షల డబ్బూ, పాతిక సవర్లు బంగారం కట్నంగా ఇచ్చారు. ఆస్తిలో సగానికి పైగానే! అంత ఇవ్వడానికి తనకి ఇష్టం లేదు.
‘‘పర్లేదు అత్తయ్యా! మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది. మాటిమాటికీ ఇవ్వంకదా. అబ్బాయికి మంచి ఉద్యోగం. ఆస్తి ఉంది. మంచి కుర్రాడు. విజయ సుఖపడుతుంది’’ అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది.
నిజానికి అంజన పట్టుదల వలనే విజయకి ఆ సంబంధం కుదిరింది.
అల్లుడు మంచివాడే. కూతురు విజయమీదనే తనకి అసంతృప్తి.
వాళ్లు ఆస్తి పరులు. అల్లుడికి పెద్ద ఉద్యోగం. దేనికీ లోటు లేదు. పోల్చుకుంటే, తమకంటే వాళ్లకి పదిరెట్లు ఆస్తి ఉంది. అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన.
అన్నా, వదిన అంటే ఏమాత్రం విలువలేదు. వాళ్లకి ఏమీ గౌరవం ఇవ్వదు.
‘‘నాకేం ఇచ్చారమ్మా? సుశీల వాళ్లు చూడు, కూతురికి ఎలా జరుపుతున్నారో. సుజాతకి చూడు, వాళ్ల అమ్మావాళ్లు ఎలా పెడుతున్నారో. మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు. ఎవరైనా, మనవరాలికి మీ అమ్మావాళ్లు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నా. సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా’’ అంది చాలాసార్లు.
ఇక్కడ వీళ్ల పరిస్థితి అంతంత మాత్రమే కదా. విజయ పెళ్లికీ, ఇచ్చిన కట్నానికీ మూడు లక్షల అప్పు అయింది. ఆ అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు.
పండినా, పండకపోయినా తనకి ఇచ్చిన పొలానికి కౌలుడబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ. ఒక్కరూపాయి తగ్గించుకోదు.
అంజనది మంచి స్వభావం. సర్దుకుపోయే మనిషి. మనసులో కుళ్లు, కుతంత్రం, కపటం, ద్వేషం, పంతం, పట్టింపులాంటివి ఉండవు. అలా ఉండబట్టే పదేళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం, ఆనందంగా గడిచిపోవడం. రోజురోజుకీ తమ ఇద్దరిమధ్యా ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. తగవులు లేవు.
‘‘కొనడం అయింది అత్తయ్యా, ఇక వెళ్దామా?’’ అంజన క్యాష్‌ కౌంటర్‌లో డబ్బు చెల్లిస్తూ అంది.
అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ.
ఇద్దరూ బట్టల సంచులు తీసుకుని బయటకి వచ్చి ఆటో ఎక్కారు.

*   *   *

అల్లుడు వాళ్ల ఊరు పమిడిపాడులో సంక్రాంతి పండుగని బాగా జరుపుతారు.
సంక్రాంతి సరదాల సంబరాలు పేరుతో మహిళలకూ, యువకులకూ, పిల్లలకూ ఎన్నో రకాల పోటీలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయి. పండుగకి దూరప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా వీలైనంత వరకూ తప్పనిసరిగా వస్తారు.
కమలమ్మ అల్లుడూ, కూతురూ, పిల్లలూ పండుగకి వచ్చారు. వాళ్ల ఊళ్లో ఒకరోజు ఉండి, మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది.
అంజన ఆడబిడ్డనీ, పిల్లల్నీ ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆదరంగా మాట్లాడింది.
విజయ కొద్దిసేపు కూర్చుని ఇరుగుపొరుగునీ, స్నేహితుల్నీ పలకరించడానికి బయటకి వెళ్లింది. మధ్యాహ్నానికి వచ్చి, తిని పడుకుంది.
అంజన గారెలూ, పిల్లలు కోరిన టిఫిన్లూ ఏవో చేసి పెట్టింది. విజయ నిద్రలేచిన తరువాత అంజన టిఫిన్‌ పెట్టి, టీ ఇచ్చింది.
‘‘గుడి దగ్గర ఆడవాళ్లు కోలాటం వేస్తున్నారు విజయా. వెళ్దాం వస్తావా?’’ అంజన అడిగింది.
‘‘ఛ... కోలాటం చూసేదేమిటి? నేను రాను!’’
అంజన పొరుగింటామెతో కలిసి కోలాటానికి వెళ్లింది.
కమలమ్మా, కూతురూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు.
‘‘ఇవిగో విజయా, నీకు చీరా పిల్లలకి బట్టలూ... అంజన తెచ్చింది.’’
కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది.
‘‘ఈ చీర ఖరీదు ఎంతమ్మా?’’
‘‘ఏమో, నాకు తెలియదు విజయా!’’
‘‘ఛ... ఏం చీరమ్మా ఇదీ? మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు. ఇది నాకు వద్దు. వదిన తెచ్చుకున్న చీర ఏదీ?’’
‘‘తను ఏ చీర తెచ్చుకుంటే నీకు ఎందుకు విజయా? తన డబ్బులూ, తన ఇష్టం. పెళ్లైన పదేళ్ల తరవాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు. ఏదో గౌరవంగా పెట్టేదానికి ఛా, ఛీ అంటే ఎలా?’’ కమలమ్మ కోపంగా అని, అంట్లు తోముకోవడానికి దొడ్లోకి వెళ్లింది.
విజయ టీవీ చూస్తూ కూర్చుంది. అంట్లపని ముగించుకుని వచ్చిన కమలమ్మతో అంది విజయ.
‘‘పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా? మీ అల్లుడికి నేతి అరిసెలు ఇష్టం. మీ మనవరాలికేమో లడ్లు కావాలంట. మనవడేమో సున్నుండలూ, కజ్జికాయలూ ఇష్టపడతాడు. ఈ స్వీట్లతోపాటూ సన్నకారప్పూస కూడా చేయమ్మా! కొద్దిగా ఎక్కువ చేయి. మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు పదిరోజులపాటు తింటారు!’’
‘‘నాకు అన్ని చేసే ఓపిక లేదమ్మా! ఏదైనా ఒకటి చెప్పు, చేస్తా!’’
‘‘అసలు ఏం చేయొద్దులే. ఎందుకు లేనిపోని చాకిరీ? కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా. అందరు తల్లులూ అడక్కముందే ఎంత ఇష్టంగా చేసిపెడతారు పిల్లలకి. నేను నోరు తెరిచి అడిగినా చేయను అంటున్నావు. డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏమిటి?’’
‘‘దొరికితే కొనుక్కోండి విజయా. ఎవరు వద్దన్నారు? అడగడం ఎందుకూ, చేయలేదని నిష్ఠూరపోవడం ఎందుకూ?’’
‘‘ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు?’’
‘‘నిష్ఠూరం గాక ఏమిటి? ఎవరి కాపురాలు వాళ్లవి అయ్యాయి. ఎవరి తంటాలు వాళ్లు పడుతున్నారు. మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టం. మీ ఆయనలాగా వాడికేమైనా ఉద్యోగమా...’’
‘‘కావాలంటే డబ్బు ఇవ్వనా ఏమిటి? మాకు ఎందుకు వూరక!’’
‘‘నువ్వు డబ్బు ఇవ్వడం, మేం చేసి పెట్టడం ఎందుకు ఇదంతా? సిటీలోనే కొనుక్కోండి’’ నిర్మొహమాటంగా అంది కమలమ్మ.
‘‘నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా? లేకపోతే ఆవిడగారి మీద ప్రేమకారిపోతోందా? నీకు కన్నకూతురుకంటే పరాయి వాళ్ల కూతురే ఎక్కువైపోయింది మరి!’’
‘‘పరాయి వాళ్ల కూతురు అయితే ఏంటట? నేను ఈ ఇంటి కోడల్ని! అంజనా ఈ ఇంటి కోడలే! ఆడపిల్లకి పెళ్లి అయిన తరవాత ఇక ఆడ పిల్లేకానీ ఈడపిల్లకాదు. మెట్టిల్లే వాళ్ల ఇల్లూ, పుట్టిల్లే పరాయి! రేపు నా ముసలితనంలోనో, ఒకవేళ మంచంలో పడితేనో నా కంచంలో కూడువేసేది అంజనేకానీ నువ్వుకాదు. నువ్వు
ఎప్పుడైనా చుట్టపుచూపుగా వచ్చి పలకరించిపోతావేమో. ఊళ్లోనే ఉన్న
మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది?
రేపు నువ్వూ అంతే!’’
‘‘అందుకే అన్నమాట, కోడలు అంటే అంత తీపి కావడం!’’
‘‘తీపిగాక కోడలు అంటే ద్వేషంతో ఉండాలా, తగాదా పడుతూ ఉండాలా? మా అత్తమాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా? అది ఇద్దరికీ మంచిదికాదు. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. తల్లీ, భార్యా తగాదాలతో ఉంటే బయటకి వెళ్లే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు? నిశ్చింతగా పనులు ఎలా చక్కపెట్టుకోగలడు? అత్తా, కోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుపడుతుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ ఇచ్చి పుచ్చుకునేవి. నీకు కూతురిగా ఏమీ లోటు చేయలేదుకదా? మీ ఆయనకి నెలకి లక్షకి పైగానే జీతం. మీ అన్నయ్యకు ఏడాదికి కూడా అంత సంపాదన లేదు. నువ్వు పుట్టింటినుంచి ఇంకా ఆశించడం మంచిదికాదు విజయా!’’
మాటల్లోనే విజయకి భర్తనుంచి ఫోన్‌ వచ్చింది, వెంటనే పిల్లల్ని తీసుకురమ్మనీ, అక్కడ పిల్లల పోటీలేవో ఉన్నాయనీ.
‘‘నేను వెళ్తున్నా. మళ్లీ వస్తేవస్తా, లేకపోతే లేదు’’ విజయ పిల్లల్ని తీసుకుని విసురుగా వెళ్లిపోయింది.
విజయ మరుసటిరోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు.
కోలాటం దగ్గరనుంచి అంజన వచ్చింది.
‘‘విజయ ఏది అత్తయ్యా?’’
‘‘వాళ్ల ఊరు వెళ్లింది.’’
‘‘అదేమిటి? ఉండమని అడక్కపోయావా?’’
‘‘వాళ్లాయన ఫోన్‌ చేశాడు వెళ్లింది. పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంట. బియ్యం నానపోయి అంజనా. పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాం. విజయకూడా తీసుకుపోతుంది!’’
‘‘అలాగే అత్తయ్యా’’
‘‘నేను కూడా కాసేపు కోలాటంకాడికి పోయి చూసివస్తా’’ అంటూ కమలమ్మ బయల్దేరింది.
‘‘అంజన ఉందా పిన్నీ?’’ అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురు వచ్చింది.
‘‘ఉంది రేఖా! తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారా?’’
సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది. అంజనా, సురేఖా స్నేహితులు. ఒకే ఊరు. సురేఖా ఈ ఊరి కోడలే. భర్తకి తిరుపతిలో ఉద్యోగం.
కమలమ్మ కోలాటం దగ్గరకి వెళ్లి, అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది.
మోకాళ్ల నొప్పుల మనిషి కావడంతో వచ్చీరావడంతోనే పంచలో ఉన్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. కొన్ని మాటల తరువాత అంజన మాటలు కమలమ్మ చెవినపడ్డాయి.
‘‘మా అత్త మంచి మనిషి రేఖా. చాలా మంచి మనసు. పైసా కట్నం తేకపోయినా, పుట్టింటి పెట్టుపోతలు లేకపోయినా
నన్ను ఎంతో బాగా- నిజం చెప్పాలంటే కూతురికంటే మిన్నగా చూస్తుంది.
ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను.’’
‘‘నాది కాదు అంజనా నీదే మంచి మనసు. నువ్వు బంగారానివి! మామూలు బంగారంకాదు, మేలిమి బంగారానివి. మా ఇంటి దీపానివి’’ మనసులోనే కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు