
సేవ కోసం 50 ఎకరాలు అమ్మేశాడు!
మనసులో ఏదో అల్లకల్లోలం, ఎక్కడికెళ్లినా ‘ఇది కాదు నేను చేయాల్సింది ఇంకేదో ఉంది!’ అనే సందిగ్ధం... తమకి నచ్చిన కళలో కుదురుకునేదాకా కళాకారులందరూ ఇవన్నీ అనుభవిస్తారని చెబుతారు. ఆ మాట సమాజ సేవకులకీ వర్తిస్తుందనిపిస్తుంది రాపర్తి జగదీశ్బాబుని చూస్తే. విజయనగరంలోని శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడాయన. ఆ సంస్థ కోసం సొంత ఆస్తి 50 ఎకరాలని అమ్మేశాడు. దానితో ఇప్పటిదాకా 75 వేలమంది వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాడు... ఇంకా నింపుతూనే ఉన్నాడు!
అతని పేరు రాజశేఖర్... జగదీశ్బాబుకి ఆప్తమిత్రుడు. అమెరికాలో ఉద్యోగం వచ్చిందతనికి. వీసా కోసం తిరుగుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై కాళ్లు పోగొట్టుకున్నాడు. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచీ జగదీశే అతనికి అండదండగా ఉండేవాడు. అప్పుడే జైపూర్ కృత్రిమ కాళ్ల గురించి తెలిసి మిత్రులిద్దరూ అక్కడికి వెళ్లాలనుకున్నారు. అందుకోసం రైలు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకున్నారు. కానీ... జగదీశ్ చివరి నిమిషంలో వెళ్లలేక పోయాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు కూడా లేవు. జగదీశ్ కోసం ఎదురుచూస్తూ రైలు తలుపుదగ్గర నిల్చున్నాడేమో... రాజశేఖర్ పట్టుతప్పి పట్టాలపైన పడిపోయాడు. అక్కడి కక్కడే చనిపోయాడు. మిత్రుని మృతి జగదీశ్ని తీవ్రంగా కదిలించింది. ఆ కదలికే శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టుకి నాందిగా మారింది! ఈ ట్రస్టుని ప్రారంభించినప్పుడు జగదీశ్ వయసు ఇరవై నాలుగేళ్లే.
నక్సలైట్ కావాలనుకుని...
జగదీశ్బాబుది విజయనగరం లోని సంప్రదాయ హిందూ కుటుంబం. తండ్రి భాస్కర కన్నప్ప వేదపండితుడు. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. జగదీశ్ బెంగళూరు విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేశాడు. కాలేజీ సమయంలో పేదవాళ్లైన తన సహాధ్యాయులు ఎంత డబ్బు అడిగినా ఇచ్చేసేవాడు. అలా విచక్షణలేకుండా ఖర్చుపెట్టడం తల్లిదండ్రులకి కోపం తెప్పించినా జగదీశ్ తగ్గలేదు. అమెరికాకి వెళ్లాలనుకున్నాడుకానీ... కొడుకు పాశ్చాత్య మోహంలో పడిపోతాడనే భయంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాంతో ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఎంటెక్‌లో చేరాడు. అక్కడ నక్సల్స్ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళనతో అతణ్ణి చదువు మాన్పించి వెనక్కి రప్పించారు. అప్పుడే ఓసారి తీర్థయాత్రలకని కాశీకి వెళ్లిన తండ్రి... మళ్లీ తిరిగిరాలేదు. ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. ఆ బాధని మరచిపోవడానికి జగదీశ్ ఎన్నో ఉద్యోగాలు చేసినా ఎందులోనూ కుదురుకోలేకపోయాడు. ఓ హోటల్ కూడా ప్రారంభించాడుకానీ... నిర్వహించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ మరణం చోటుచేసుకుంది! అతని మరణం తనకు కొత్త దిశని చూపించిందని చెబుతాడు జగదీశ్‌బాబు. అప్పటి నుంచి వికలాంగుల్ని ఆదుకోవడానికి నడుంబిగించాడు. ముందుగా విజయనగరంలోని కొందరు వికలాంగుల కోసం జైపూర్ నుంచి కృత్రిమ కాళ్లని తెప్పించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని భారత్ వికాస్ పరిషత్తులో ఇలాంటివి తయారు చేస్తున్నారని తెలిసి అక్కడి కెళితే... ఆ సంస్థలో కృత్రిమకాళ్లని తయారుచేసే నళినేష్ బాబుతో పరిచయమైంది.
విజయనగరంలోనూ అలాంటి తయారీకేంద్రాన్ని ఏర్పాటుచేసి వికలాంగులకి ఉచితంగా అందివ్వాలనే ఆలోచనతో ఆయన్ని విజయనగరం రప్పించాడు. ఆ సేవలే లక్ష్యంగా 2000లో ‘గురుదేవ చారిటబుల్ ట్రస్టు’ని ఏర్పాటుచేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు నెలలకోసారి శిబిరాలు నిర్వహించి వికలాంగుల్ని గుర్తించి వాళ్లని ఆదుకుంటోందీ ట్రస్టు. కృత్రిమ కాళ్లూ చేతులే కాకుండా... ఆటోమేటిక్ హస్తాలూ, వినికిడి యంత్రాలూ, వీల్చెయిర్లూ, మూడు చక్రాల సైకిళ్లూ అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, కేరళ, ఛత్తీస్‌గఢ్‌కి చెందినవాళ్లు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి ఆరేడువేలమందికి ఈ సంస్థ సాయం చేస్తోంది. కేవలం పరికరాలు ఇచ్చి ఊరుకోకుండా వాళ్లు స్వయంఉపాధి సాధించేలా కుట్టుశిక్షణ అందిస్తున్నారు. పాలవ్యాపారం, కిరాణా కొట్లు పెట్టుకోవడానికీ సాయపడుతున్నారు. అంతేకాదు, ట్రస్టుని ఆశ్రయించిన మహిళల
వివాహాలకు మంగళసూత్రాలూ, మెట్టెలూ ఉచితంగా అందిస్తోంది.
జగదీష్‌బాబు ఈ ట్రస్టు ప్రారంభించేనాటికి 70 ఎకరాల ఆస్తికి సొంతదారు. ట్రస్టు ఖర్చుల కోసం ఇప్పటికే 50 ఎకరాలు అమ్మేయాల్సి వచ్చింది. అయినా సరే... సేవే తన జీవితానికి పరమావధి అంటున్నాడు.
పేదలకి ఉచితంగా సేవలు అందించడం కోసం సకల వసతులతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటుచేయాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్