close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడి భిక్షగాళ్లు ఉద్యోగులయ్యారు!

‘మనం చూస్తున్న యాచకుల్లో 90 శాతం మంది ఏ ఉపాధీ దొరక్క భిక్షాపాత్ర పట్టినవాళ్లే! కాబట్టి, వాళ్లకి డబ్బు ఇవ్వడం కన్నా ఆహారమో, బట్టలో ఇవ్వండి... వీలైతే ప్రేమగా మాట్లాడండి, అవకాశం ఉంటే ఉపాధి చూపండి!’ అంటాడు 26 ఏళ్ల నవీన్‌ కుమార్‌. ఇలా ఉపదేశించడంతోనే ఆగిపోలేదు అతను... తన ‘అక్షయం ట్రస్ట్‌’ ద్వారా ఐదువేల మంది భిక్షగాళ్లకి పునరావాసం కల్పించాడు. వారిలో సుమారు ఆరొందల మందిని ఉద్యోగులుగానూ, చిరువ్యాపారులుగానూ మార్చాడు. ఇందుగ్గాను కేంద్ర ప్రభుత్వం నుంచి యువ పురస్కారాన్నీ అందుకున్నాడీ లెక్చరర్‌!
ఆమె పేరు వసంత... వయసు ముప్పై ఏళ్లకి మించదు. తమిళనాడులోని ఈరోడు రైల్వే జంక్షన్‌ పక్కన భిక్షమెత్తుకుంటూ ఉండేది. ఎలా మొదలైందో తెలియదుకానీ... మద్యం, గంజాయిలకి బానిసైంది. వసంత చిరిగిన బట్టలూ, అట్టకట్టుకుపోయిన జుట్టూ, ఒళ్లంతా గాయాలని చూసి ఒకప్పుడు జాలిపడి ఎంతో కొంత భోజనం పెట్టినవాళ్లు ఈ అలవాట్లని చూసి చీదరించుకోవడం మొదలుపెట్టారు. అలా ఆకలితో శోషవచ్చి పడిపోయిన వసంతని చేరదీసింది ‘అక్షయం ట్రస్ట్‌’. రెండునెలల్లోనే ఆమెని మత్తు వ్యసనం నుంచి బయటపడేసి... మామూలు మనిషిని చేసింది. మరో నెలపాటు శిక్షణ ఇచ్చి ఆమెని ఓ అనాథాశ్రమంలో వంటమనిషిగా ఉద్యోగంలో చేర్చింది. ఒకప్పుడు హోటళ్లలో మిగిలిన తరుగుబొరుగుతో పొట్టనింపుకున్న వసంత ఇప్పుడు... రోజుకి రెండొందల మందికి శుచిగా, రుచిగా వండి పెడుతోంది! ఆమెకంటూ ఇల్లూ, వాకిలీ ఉన్నాయి. ఇలా ఒకరిద్దరు కాదు... ఐదువేలమంది భిక్షగాళ్లకి కొత్త జీవితాన్నిచ్చాడు అక్షయం ట్రస్టు వ్యవస్థాపకుడు నవీన్‌ కుమార్‌. వీరిలో 570 మందిని ఉద్యోగులుగానూ, చిరు వ్యాపారులుగానూ మార్చాడు. మిగతావారిలో 90 శాతం మందిని వాళ్ల కుటుంబాలకి అప్పగించాడు. చేరదీయడానికి ఎవరూలేని వాళ్లని అనాథ, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నాడు. తీవ్రరోగంతో అవసానదశలో ఉన్నవాళ్లని తన షెల్టర్‌లోనే పెట్టి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. చనిపోతే సొంత కొడుకులా అంత్యక్రియలు చేస్తున్నాడు. ఓ వైపు కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తూనే భిక్షగాళ్ల బాధ్యతని తలకెత్తుకున్నాడు! అసలు ఈ ఆలోచన నవీన్‌కి ఎలా వచ్చిందంటే... ఎనిమిదేళ్ల కిందటి మాట. అప్పట్లో నవీన్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతూ గేట్‌కీ ప్రిపేర్‌ అవుతుండేవాడు. పేదరికం, నాన్న వైకల్యం, అమ్మ దీర్ఘకాల అనారోగ్యం... ఇలా ఎన్నో కష్టాల మధ్య కాలేజీకి వెళ్తుండేవాడు. ఉదయం, మధ్యాహ్నాలలో కాలేజీ క్యాంటీన్‌లో తిన్నా రాత్రిపూట బయటే తినాల్సి వచ్చేది. అందుకోసం అతను వేసుకున్న బడ్జెట్‌ పదిహేను రూపాయలు. ఓ రాత్రి భోజనాని కనివెళుతుంటే ఓ భిక్షగాడు అతని వద్దకొచ్చాడట. వినోద్‌ కాస్త ఆదరణగా మాట్లాడేటప్పటికి తన కథ చెప్పాడట. కుటుంబంతో విహారయాత్రకి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యా, కొడుకూ కూతుళ్లందరూ చనిపోయారనీ చెప్పాడట.  ‘ప్రతి భిక్షగాడి వెనకా ఇలాంటి కథేదో ఉంటుందనిపించింది. అప్పట్నుంచీ నాకు చేతనైనంతలో వాళ్లకి సాయపడదామను కున్నాను’ అంటాడు నవీన్‌. అలా సాయపడుతూనే విద్యార్థిగా కాలేజీలోనే బెస్ట్‌ స్టూడెంట్‌గా రాణించాడు. పీజీ చేసి లెక్చరర్‌ అయ్యాడు. 2014లో ఈరోడులో ‘అక్షయం ట్రస్టు’ను స్థాపించి 400 మంది విద్యార్థుల్ని వలంటీర్లుగా చేర్చుకున్నాడు.

ఇలా చేస్తున్నారు...
వారానికోసారి రైల్వే స్టేషన్‌లూ, బస్‌ స్టాప్‌లూ, గుడులకి వెళ్లి అక్కడ ఉన్న భిక్షగాళ్లని అక్షయ ట్రస్ట్‌ కేంద్రాలకి తీసుకొస్తారు. జడలు కట్టుకుపోయిన వాళ్ల జుత్తుని కత్తిరించి, స్నానాలు చేయించి, కొత్త బట్టలు వేయించి ఫొటోలు తీస్తారు. ఈ కొత్త ఫొటోనీ, వాళ్ల ఒకప్పటి ఫొటోనీ చూపించి... ఇకపైన మీరెలా ఉండాలనుకుంటారో చెప్పమంటారు. ‘మేం ఊహించినట్టే చాలామంది కొత్త జీవితమే బావుందంటారు... అక్కడి నుంచి మా కౌన్సెలింగ్‌ మొదలుపెడతాం!’ అంటాడు నవీన్‌. వాళ్లకి కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి సైకాలజీ, మెడికల్‌ విద్యార్థులు సిద్ధంగా ఉంటారు. అదయ్యాక వాళ్ల ఆసక్తిని బట్టి ఉపాధి శిక్షణ ఇస్తారు. టీ దుకాణాలూ, టైలరింగ్‌ కేంద్రాలూ వంటివి ఏర్పాటు చేయిస్తారు. వారి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో వెతికి, కలిపే ప్రయత్నం చేస్తారు. నవీన్‌ సేవా తత్పరతకు అటు కేంద్రం, ఇటు తమిళనాడు ప్రభుత్వాలు ‘యువ పురస్కారా’లని అందించాయి. ప్రస్తుతం తమిళనాడులోని 18 జిల్లాల్లో ఉన్న ‘అక్షయం’ సేవల్ని... త్వరలోనే దక్షిణాది మొత్తానికీ విస్తరిస్తామంటున్నాడు నవీన్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు