close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నందన వనం

- ఎనుగంటి వేణుగోపాల్‌

‘‘వా   ళ్లెవరో కన్న పిల్లల్ని మనింట్లో తెచ్చి పెడతాను అంటారేంటండీ?’’ తోక తొక్కిన పాములా అంత ఎత్తున లేచింది మాలతి.
ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నంలో విఫలమవుతున్నాడు శశిధర్‌.
‘‘ఏంటా మాటలు? నోటికి ఎంతొస్తే అంతేనా మాట్లాడ్డం? వాళ్లు పరాయి వాళ్లేం కాదు కదా! నాకు స్వయానా తోడబుట్టిన అన్నయ్య పిల్లలు...’’ భార్యను ఒప్పించేందుకు శతవిధాల తంటాలు పడుతున్నాడు.
‘‘అయితే మట్టుకు వాళ్లను పెంచి పోషించే బాధ్యత మీ నెత్తిన వేసుకోవాలా? హాస్టల్స్‌ ఉన్నాయిగా. వేసుకోమనండి. వాటిని వదిలేసి పిల్లల్ని మన దగ్గర ఉంచడమేంటీ!’’
‘‘నేనీ ఊళ్లో ఉండగా వాళ్లని హాస్టల్లో వేయడమా? అది జరగని పని. నేను ఒప్పుకోను కూడా!’’
‘‘అంటే, ఇదంతా స్వయంగా తమరి ఆలోచనేనన్న మాట. ఇంకా నయం ఆవిడగారు మిమ్మల్ని అడిగిందేమోనని అపోహ పడుతున్నాను ఇందాకట్నుంచీ’’
‘‘అన్నయ్య బ్రతికి లేనంత మాత్రాన వదిన అందర్నీ బ్రతిమిలాడాలనా నీ ఉద్దేశం?’’
‘‘అంత అభిమానం ఉన్నప్పుడు... ఎవర్నీ అడగలేనప్పుడు... ఆవిడే ఈ ఊర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతోపాటు ఉండొచ్చుగా!’’
‘‘నేను ఉండగా అలా జరగనివ్వను! నీకు తెలుసు. నా చిన్నతనంలోనే నాన్న పోయారు. నాన్న బాధ్యతలు అన్నయ్య తీసుకున్నాడు. నాన్న కళ్లముందు లేడనే ఒక్క బాధ తప్ప అమ్మకీ, నాకూ పెద్ద దిక్కు అయ్యాడు ప్రభాకరం అన్నయ్య.
ఊళ్లో తోటివాళ్లతో చేరి నేను అల్లరిచిల్లరిగా తిరుగుతుంటే ‘పెద్దోడా వాణ్ణి చూశావుగా!
ఎట్లా ఆకతాయిగా  మారిపోయాడో? వాడిని కాస్త అదుపులో పెట్టి నీతోపాటు పనులకు తీసుకుపోరా. వాడిని దారిలో పెట్టాల్సిన సమయం ఇదే. ఇలాగే గాలికి విడిచిపెట్టామంటే ఇక మన చేతికి దొరకడు బిడ్డా!’ అనేది అమ్మ.
అమ్మ మాటలకు నవ్వి ఊరుకునేవాడు అన్నయ్య.
నా గురించి ఆయన పట్టించుకోక పోవడంతో... చూసి చూసి విసిగిపోయిన అమ్మ కొన్నాళ్లకి అన్నయ్యను మళ్లీ నిలదీసింది.
‘‘తండ్రిలేని పిల్లవాడిని చూస్తూ చూస్తూ అలాగే గాలికి వదిలేస్తావా? చెబితే చెవిన వేసుకోవేంరా?’’ కాస్త తీవ్ర స్వరంతోనే అంది అమ్మ.
‘‘పట్నంలో మంచి స్కూలు వాకబు చేశానమ్మా. వచ్చే ఏడాది చేర్చుకుంటా మన్నారు. వెళ్లి చూసొచ్చాను కూడా. హాస్టల్‌ వసతీ అన్నీ బాగున్నాయి’’ అప్పుడు చెప్పాడు ప్రభాకరం అన్నయ్య ఎప్పటిలాగే నవ్వుతూ.
‘‘పట్నం బడా? పైగా హాస్టల్‌ అంటున్నావు. డబ్బులు బాగా అవుతాయేమో, ఎట్లా కొడుకా? మీ నాన్న చేసిన అప్పులే ఇంకా తీరలేదు. ఉన్న కొద్దిపాటి ఈ వ్యవసాయంతో ఎలాగో నెట్టుకొస్తున్నావు. మళ్లీ తమ్ముడి చదువుకోసం అప్పులు చేస్తావా?
వాడిని పెద్ద చదువులు చదివించే స్తోమత మనకు ఎక్కడుంది బిడ్డా. వ్యవసాయం పనికి వాడుకూడా తోడైతేనే ఉన్న ఆ అప్పులు తీరుతాయేమో!’’ నిట్టూర్చింది అమ్మ.
‘‘అమ్మా, నాన్న అప్పుచేసింది తాగుడుకో తందనాలు ఆడడానికో కాదు కదా. నీళ్లు పడకపోతాయా అనే వెర్రి ఆశతో వ్యవసాయపు బావిని పదే పదే తవ్వించడం, నీళ్లు లేక సరిగా పండని పంటలతో కోలుకోలేని దెబ్బ... ఇంకా చెప్పాలంటే కుటుంబం కోసమే అప్పులు చేశారాయన. తమ్ముడు బాగా చదువుకుంటానంటే అంతకన్నా కావల్సిందేముంది? ఈ అప్పులు ఒక లెక్కా! మెల్లమెల్లగా తీర్చుకోవచ్చులే’’ అమ్మకి సర్దిచెబుతూ ధైర్యాన్ని అందించాడు అన్నయ్య.
దసరా సెలవులకి ఇంటికి వచ్చాక, నేను బడిలో బాగా చదువుకుంటున్నాను అన్న విషయం స్వయంగా నన్ను అడిగి తెలుసుకుని మా కంట పడకూడదని మౌనంగా ఆనందభాష్పాలు రాల్చింది అమ్మ.
అన్నయ్య శ్రమ ఊరకే పోలేదని సంతోషపడింది. నాన్న పోయాక ఆమె ముఖంలో చాలా రోజులకి వెలుగుని చూసిన నేను ఆ సంతోషాన్ని ఆమె హృదయంలో అలాగే కలకాలం నిలపాలనే పట్టుదలతో చదువుపై మరింత శ్రద్ధ చూపాను.
‘‘ఒరే నాన్నా! మీ నాన్నగారు బతికుంటే కూడా తమ్ముడి భవిష్యత్తు గురించి ఇంత గొప్పగా ఆలోచించి ఉండేవారు కాదేమో?’’ అమ్మ అందో రోజు అన్నయ్యతో.
‘‘అమ్మా! ఇంటికి పెద్దవాడిగా అది నా బాధ్యత. రేపు నా పిల్లల గురించి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే కదా. తమ్ముడైనా వాడు నాకు కొడుకులాంటి వాడే’’ అన్నాడు అన్నయ్య ప్రేమగా.
అలాంటి ప్రేమమూర్తి అన్నయ్య... పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక... ఆకస్మిక మరణంతో  వదినతో పాటూ పిల్లలిద్దరినీ ఒంటరిని చేసి మా కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యాడు.
తాము ఒంటరి వాళ్లమయ్యాం అనే భావన వదినకూ పిల్లలకూ రాకూడదని నా తాపత్రయం. నాన్న లేని లోటు తెలియకుండా నన్ను పెంచాడు అన్నయ్య. ఆయన పిల్లలకు అలాంటి పెంపకానికి నేను చేయూతనవ్వాలన్నదే నా తపన.
ఆ సమయం కోసమే ఇన్నాళ్లూ వేచి ఉన్నాను. నా చదువు పూర్తయ్యింది. జాబ్‌ ప్రిపరేషన్‌ ఫలించి ఉద్యోగం వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగం చూసే ప్రభుత్వ ఉద్యోగిని వైన నువ్వు నాకు ఇల్లాలి వయ్యావు.
అలా పెళ్లైన ఆర్నెల్లకే తీపి కబురు అందించావు. డాక్టర్‌ నీకు కంప్లీట్‌ బెడ్‌రెస్ట్‌ అన్నారు. పుట్టింటికి వెళ్లిపోయావు. తర్వాత ‘పిల్లాడు చిన్నోడు’ అంటూ వదిన ఇన్నాళ్ల నుండి దాటవేస్తూ వస్తున్నారు’’ చాలా కుటుంబ విషయాలు పెళ్లయ్యాక శశిధర్‌ ఇదే మొదటిసారి ఆమె ముందు మనసు విప్పి వెల్లడించడం.
‘‘అమ్మ ఇప్పుడు మన మధ్య లేకపోయినా నా నిర్ణయాన్ని తప్పక హర్షిస్తుంది. ఏ లోకాన ఉన్నా ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు మనల్ని ఆశీర్వదిస్తుంది. ఏది ఏమైనా అది నా కర్తవ్యం. అన్నయ్య పిల్లలు నాకూ బిడ్డలే. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత నాపైన ఉంది’’ తన నిర్ణయాన్ని స్థిరంగా మరోసారి భార్యకు అవగతమయ్యేలా చెప్పాడు శశిధర్‌.
కుటుంబ విషయాలు విడమరిచి చెప్పి... శశి తన ఫైనల్‌ నిర్ణయమేంటో కచ్చితంగా తెలియజేశాక... ఇక భర్తముందు ఆమె నోరెత్తే సాహసం చేయలేకపోయినా అసహనాన్ని మాత్రం వ్యక్తపరిచింది.
బెడ్‌రూమ్‌ నుండి కొడుకు రెండేళ్ల అభినవ్‌ ఏడుపు వినిపించడంతో హడావుడిగా అటువైపు కదిలింది.

* *

ప్రహరీ గోడ దగ్గర నిలబడి పక్కింటి పరిమళతో ముచ్చటిస్తోంది మాలతి.
తల్లి చెంతకు హడావిడిగా పరిగెత్తుకు వచ్చింది పరిమళ కూతురు దరహాస. ఇంటర్‌ చదువుతోందా అమ్మాయి.
అక్కడ మాలతి కనిపించడంతో ‘‘మాలతక్కా! రెండు కోతులు మన ఇళ్లవైపుగా వచ్చాయి. తినే వస్తువులేం కనబడినా పట్టుకుపోతున్నాయి. ఆరుబయటగాని ఏమైనా ఉంచావా?’’ అనడిగింది.
‘‘ఇవేం కోతులు... అస్తమానం మన వీధిలోకి వచ్చి కంగారు పెడుతున్నాయ్‌’’  మాలతి అంది పరిమళతో.
‘‘కాలేజీలో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ కూడా ఇదే మాట చెప్పారక్కా. వాళ్ల వీధుల్లోకి కూడా కోతులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ విసిగిస్తుంటాయట’’ కలుగజేసుకుంది దరహాస.
‘‘మన ఊరికి దగ్గరలో కొండగట్టు ఆంజనేయుడి దేవాలయం ఉండడం వలన మనకీ కోతుల బెడద. ఆ కొండగట్టు పరిసర అటవీ ప్రాంతంలో ఏమీ దొరకక పాపం కోతులిలా చుట్టుపక్కల ఉన్న ఊళ్లపై పడుతున్నట్టున్నాయి.
అడవులను నరుకుతూ పరోక్షంగా వాటికి ఆహారం దొరక్కుండా చేస్తోంది మనమే కదా! కనీసం ఇళ్లమీద పడితే తినడానికేమైనా దొరక్కపోతాయా అని వాటి ఆశేమో’’ అంటూ నవ్వింది పరిమళ.
‘‘అయ్యో మాలతక్కా, దీనిపై చర్చ తీరిగ్గా పెట్టుకుందువుగానీ ముందా పని చూడు’’ అంటూ గుర్తు చేసింది దరహాస.
‘‘అవును మర్చేపోయా. డాబాపైన నువ్వులు ఆరబోశాను. ఈ కోతులు అటు గానీ పోయాయంటే ఇక అంతే సంగతులు’’ అంటూ హడావుడిగా వెనుతిరిగింది.
చిన్నోడు అభినవ్‌ని ఎత్తుకుని ఎదురుపడిన ప్రభాకరం పెద్ద కొడుకు పదమూడేళ్ల అభిరామ్‌ ‘‘నువ్వుల్ని గిన్నెలో పోసి డైనింగ్‌ హాల్లో పెట్టాను పిన్నీ’’ చెప్పేసి తమ్ముడు అభినవ్‌తో సహా ఇంట్లోకి వెళ్లిపోయాడు.
మాలతి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ఏదో ఒక మాట అనాలని ప్రయత్నిస్తున్నా అందుకు తావివ్వకుండా పిన్నికి అనుకూలంగా మసలుకుంటున్నాడు అభిరామ్‌.
తోటికోడలి ఇద్దరు పిల్లలూ బుద్ధిమంతులే అయినా వాళ్లపట్ల సానుకూలతకి మాలతి మనసింకా పూర్తిగా అంగీకరించడం లేదు.
గడచిన సంఘటనలు అసంకల్పితంగా ఆమెని చుట్టుముట్టాయి.
వదిన సువర్చల మనసు ఎరిగిన శశిధర్‌ స్వయంగా మాలతి చేత ఆమెకు ఫోన్‌ చేయించాడు.
‘‘అక్కా! పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో ఉంచి చదివించడం దేనికి? మేమిక్కడ ఉన్నాం కదా! పిల్లల్ని మావద్ద వదిలేసి వెళ్లండి. మీ మరిదిగారు ఇక్కడే మంచి స్కూల్‌ చూసి జాయిన్‌ చేస్తారు’’ అంటూ మాట్లాడింది ఫోన్లో.
‘‘అటు ఉద్యోగం ఇటు చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతూ ఉంటావు. దానికి తోడు వీళ్లిద్దరూనా? వద్దులేమ్మా. వాళ్ల చదువు తిప్పలేవో వాళ్లు పడతార్లే. ముందు ముందు  తప్పకపోతే ఎలాగూ అక్కడేగా వాళ్లుండాల్సింది’’ అంటూ దాటవేసిందామె.
‘‘అది కాదక్కా...’’ నచ్చ చెప్పబోయింది మాలతి.
సువర్చల వినిపించుకోలేదు.
‘‘ముందు చిన్నోడినైతే జాగ్రత్తగా చూసుకో అమ్మా’’ అంది.
వదినను ఎలాగైనా ఒప్పించాలని శశిధర్‌ ముందే గట్టిగా చెప్పి ఉండడంతో ఎలాగైనా ఆమెని ఒప్పించాలన్న ఉద్దేశంతో ‘‘అదే నేను మీ సొంత చెల్లెల్నైతే నా మాటని తిరస్కరించే వారా అక్కా!’’ అంది మాలతి చప్పున.
‘‘అయ్యో అంత మాటనేశావేమమ్మా!’’ నొచ్చుకుంది సువర్చల.
‘‘మరేంటక్కా, మీరు నన్ను పరాయిదానిలా వేరుచేసి మాట్లాడుతున్నారు.’’
సమాధానం ఏమివ్వాలో తోచలేదు సువర్చలకు.
తోటికోడలు మాలతినే కాదు, మరిది శశిధర్‌నీ నొప్పించడం ఆమెకు ఇష్టం లేదు.
‘‘సరేనమ్మా! పిల్లల్ని తీసుకుని వస్తాను’’ ఎట్టకేలకు ఒప్పుకోక తప్పింది కాదామెకు.
ఎందుకంటే గత నెల రోజుల నుండి ఇదే విషయమై మాలతీ, శశిధర్‌ దంపతులిద్దరూ రోజూ ఆమెకు ఫోన్‌చేస్తూ బ్రతిమిలాడుతూనే ఉన్నారు.
మాలతి స్పీకర్‌ ఆన్‌చేసి ఉంచడంతో వాళ్లిద్దరి సంభాషణా వింటున్న శశిధర్‌ చప్పున భార్య చేతిలోంచి ఫోన్‌ అందుకుని ‘‘వదినా మీరేం ఇబ్బంది పడకండి. రేపు నేనూ మాలతీ కార్లో బయలుదేరి వస్తాం. పిల్లల బట్టలూ, వస్తువులైతే సర్ది ఉంచండి’’ అన్నాడు.
అలా మరుసటి రోజు వెళ్లి పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చారు. పేరున్న స్కూల్‌ ఎంపిక చేసుకుని వాళ్లిద్దరినీ జాయిన్‌ చేశాడు శశిధర్‌.

* *

భర్త మాటకు తలొగ్గి పిల్లలిద్దరూ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది కానీ అప్పుడప్పుడూ మాలతి వాళ్లపట్ల అసహనాన్నీ విసుగునూ ప్రదర్శించడం శశిధర్‌ గమనించకపోలేదు.
‘‘ఏమండీ, పనిమనిషిని మాన్పించేద్దాం. ఎలాగూ పిల్లలిద్దరూ చెరో సాయం చేస్తున్నారు. పనిమనిషి చేసేందుకు పనేమీ ఉండడం లేదు. అనవసరంగా నెలకు ఆమెకో రెండు వేలు దండగ’’ అని మాలతి భర్తతో అంటుండగా విన్నట్టున్నాడు పెద్దవాడు అభిరామ్‌.
మాలతి దగ్గర లేని సమయం చూసి ‘‘చిన్నాన్నా, పనిమనిషిని మాన్పించేయండి. నేనూ తమ్ముడూ ఉన్నాంగా పిన్నికి సహాయం చేయడానికి’’ అన్నాడు.
‘‘సరేలేరా అలాగే చేద్దాం! మరి నువ్వు మరొక పనీ చేయాలి సుమా. రేపటి నుండి స్కూల్‌ మానేయాలి. ఎంచక్కా ఇంట్లో ఉండి ఆ పనీ ఈ పనీ చేద్దువుగానీ... సరేనా?’’ అన్నాడు శశిధర్‌ మందలింపుగా.
‘‘అలా అనేశారేంటి చిన్నాన్నా?’’ అంటూ నొచ్చుకున్నాడు అభిరామ్‌.
‘‘లేకపోతే ఏంట్రా? ఈ చిన్న వయసులోనే అనవసరంగా లేనిపోనివన్నీ పట్టించుకుంటున్నావ్‌! ఇంట్లో వినిపించినవన్నీ తలకెక్కించుకోకూడదు. నువ్విక్కడికి వచ్చింది చదువుకోడానికి. అది మర్చిపోకు. సరేనా!’’
‘‘మొన్నటి ఎస్‌.వన్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపించాగా చిన్నాన్నా. స్కూల్లో నేనే ఫస్టొస్తున్నా.’’
‘‘ఈసారి లాస్ట్‌ వద్దువులే’’ చిరుకోపం ప్రదర్శించాడు శశి.
‘‘సారీ చిన్నాన్నా!’’ అభిరామ్‌ తలొంచుకున్నాడు.
‘‘ఒకరికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన స్థితి ఎప్పటికీ తెచ్చుకోకు... అది నాకైనా, అమ్మకైనా, మరెవరికైనా. ఎందుకంటే నిన్ను చూసి ఎదిగే వాళ్లు మరో ఇద్దరున్నారన్న విషయం మర్చిపోకు. వాళ్లిద్దరి కంటే పెద్దవాడిగా నీ నడకా, నీ నడవడికా, నీ ఆలోచనా ఎవరి ముందైనా గర్వంగా తలెత్తుకునేలా ఉండాలి’’ జీవిత పాఠపు ఎరువుని ఆ చిన్నారి గుండె కుదుళ్లకు అందిస్తున్నాడు శశిధర్‌.
చిన్నాన్న ముందు తిరిగి నోరెత్తడానికి సాహసించలేదు అభిరామ్‌.
‘‘ఒరేయ్‌! నీకూ, నీ తమ్ముడికీ మంచిపేర్లు పెట్టే అవకాశం మా అన్నయ్య నాకు కలిగించాడు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న అన్నయ్య తండ్రి లేని నాకు పెద్ద అండగా నిలిచి తానే తండ్రయ్యాడు. మీ ఇద్దరి పేర్లకు తోడయ్యేలా నీ రెండో తమ్ముడికి కూడా అభినవ్‌ అని పేరు పెట్టింది... ఒక్క ఆ అభిమానంతోనే కాదు. మనమంతా ఒక్కటే, మాదంతా ఒకే కుటుంబం అనే ఆత్మీయత మీలో నాటుకు పోవాలని!’’
వంటింట్లో ఉన్న భార్యకి వినపడాలనే శశిధర్‌ కాస్త గట్టిగా అభిరామ్‌ చెవిన వేస్తున్నాడు.
‘‘నాన్నకీ, మీకూ మంచి పేరు తెచ్చేలా ఎదుగుతాను చిన్నాన్నా! ప్రామిస్‌... రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తలవంచను. మన కుటుంబానికి తలవంపులు తేను. నా తమ్ముళ్లకి ఆదర్శంగా నిలిచేలా నా వ్యక్తిత్వాన్ని మలచుకొనే ప్రయత్నం చేస్తాను.’’ ఒక సరికొత్త మానవీయ పరంపరకి ఊపిరి పోస్తూ చాలా స్థిరంగా చెప్పాడు కౌమారదశలో ఉన్న అభిరామ్‌.
‘‘ఇదిగో, ఇలాంటి ఆత్మవిశ్వాసమే అలవర్చు కోవాలి. నాది నీది అనే భేదభావం లేకుండా మీ ముగ్గురూ ఒకటిగా కలిసిపోయి పొదరిల్లులా అల్లుకుపోవాలి. మా అన్నదమ్ముల్లాగే సడలిపోని ఆత్మీయానుబంధం మీతరం మధ్య కూడా నెలకొనాలని నేను కోరుకుంటున్నాను’’ అభిరామ్‌ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ప్రేమగా వెన్ను తడుతూ చెప్పాడు శశిధర్‌.

* *

వేగంగా దూసుకువచ్చిన కారు చిల్డ్రన్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ చక్రవర్తి హాస్పిటల్‌ ముందు ఆగింది. శశిధర్‌ దంపతులిద్దరూ కారులో నుండి దిగారు. వెంట రక్తసిక్తమైన అభిరామ్‌ ఉన్నాడు.
సంఘటన నుండి శశి కాస్త తేరుకున్నాడు కానీ మాలతి కింకా గుండె దడ తగ్గలేదు. ముందే ఫోన్‌ చేసి రావడంతో అభిరామ్‌ని తీసుకుని నేరుగా డాక్టర్‌ గదిలోకి వెళ్లాడు శశి.
బయట బెంచీ మీద కూలబడిపోయింది మాలతి. ఇంట్లో జరిగిన సంఘటన అప్రయత్నంగా గుర్తుకు రాసాగింది. ఆరోజు ఆదివారం కావడంతో భార్యను వెంటబెట్టుకుని కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు శశిధర్‌. దంపతులిద్దరూ ఇంటికి చేరేసరికి గేటు లోపల చుట్టుపక్కల వాళ్లు గుమిగూడి ఉన్నారు. గుండెలు అదురుతుంటే ఎవరికి ఏమైందో అనుకుంటూ గాభరాగా గేటు లోపలికి అడుగు పెట్టింది మాలతి. శశి కూడా కంగారు పడుతూ బైక్‌ని హడావుడిగా ఓ పక్కనపెట్టి పోగైన జనం దగ్గరకు పరుగుతో చేరాడు.
అక్కడ రక్తసిక్తమై ఉన్నాడు అభిరామ్‌. అభినవ్‌ పెద్దపెట్టున ఏడుస్తున్నాడు. అభిషేక్‌ ఓ పక్కకు నిలబడి ఏడుపు ముఖంతో అన్నవైపు దిగులుగా చూస్తున్నాడు.
దూది, డెట్టాల్‌ చేతపట్టుకుని అభిరామ్‌కి సపర్యలు అందిస్తున్నాడు ఎదురింటి నారాయణరావు. శశిని చూడగానే ‘‘మీ అబ్బాయి అభినవ్‌కి మీ అన్నయ్యగారి అబ్బాయి అభిరామ్‌ ప్రాణం పోశాడండీ.
అభిరామ్‌ వద్దని వారిస్తున్నా వినకుండా అభినవ్‌ బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు. బలవంతంగా లోపలికి తీసుకెళ్లబోతే హఠం చేశాడు. హఠాత్తుగా ఆ సమయంలో రెండు కోతులు ఇటువైపు వచ్చాయండీ!
మీ అబ్బాయి మీదకు ఎగబడి దాడి చేయబోతుంటే అడ్డుపడి మీ వాడిని లాక్కుని ఇంట్లోకి వెళ్లిపోబోయాడు అభిరామ్‌. వదలకుండా వెంబడించిన కోతుల్ని అడ్డుకునే ప్రయత్నంలో చిన్నోడిని ఇంట్లోకి నెట్టి తలుపులు వేసి వీటితో తలపడ్డాడు అభిరామ్‌. ఒంటిచేత్తో నిజంగా సాహసమే చేశాడా అబ్బాయి.
ఇదంతా నేను డాబా పై నుంచి గమనిస్తూ వీలైనంత తొందరగా కిందికి దిగి వచ్చేశాను. అభిరామ్‌ మీద కలబడుతున్న కోతుల్ని ఈ సుగుణారావూ నేనూ కర్రలతో అదిలించేసరికి భయపడి పారిపోయాయి. తృటిలో ప్రమాదం తప్పిందనుకోండీ.’’
మాలతి ఏడుస్తూనే బెదిరిన అభినవ్‌ని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది.
‘‘ఏంకాలే... ఏంకాలేదు నాన్నా!’’ లాలిస్తూ వాడిని ఓదార్చింది.
తల్లిదండ్రులు కంటపడగానే సగం ఏడుపు ఆపేసిన అభినవ్‌ని శశికి అప్పచెబుతూ అభిరామ్‌ దగ్గరకు వెళ్లింది.
శశికైతే కాళ్లూ చేతులూ ఆడ్డంలేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంటే నోట మాట రాక స్థాణువులా నిలబడి పోయాడలా.
అభిరామ్‌ని ఆ స్థితిలో చూస్తుంటే ఉద్వేగంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. వాడిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకుంది. అభిరామ్‌ మౌనంగా ఉండిపోయాడు.
భర్త వైపు చూస్తూ ‘‘ముందు హాస్పిటల్‌కి పదండి!’’ అంది.
అభిరామ్‌ని పొదవి పట్టుకుని లేవదీస్తూ ‘‘భయం లేదు నాన్నా! మేమున్నాంగా’’ అనునయిస్తూ ధైర్యం చెప్పింది. చిన్నాన్నా, పిన్నీ కంట పడినప్పుడే గుబులు పోయి
కాస్త ధైర్యం వచ్చింది వాడికి.
‘అభినవ్‌ వెంట వస్తానని ఏడుస్తుంటే వారిస్తూ వాడిని ఇంట్లోనే వదిలిపెట్టడం ఇంత పెద్ద దారుణానికి దారి తీస్తుందనుకోలేదు. లేకపోతే అభిరామ్‌ పరిస్థితి ఇలా అయ్యేది కాదేమో! అంతా తన వల్లే... జరిగిందిదంతా’’ అనుకుంటూ వాపోయింది మాలతి.
ఇంతలో అభిరామ్‌ని తీసుకుని శశి రావడంతో ఆమె ఆలోచనలకు బ్రేక్‌ పడింది.
లేచి నిలబడుతూ ‘‘ఏమన్నారు డాక్టర్‌? అంటూ ఆతృతగా అడిగింది.
‘‘కోతులు గోర్లతో రక్కినట్టున్నాయి. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదన్నారు. ఇంజక్షన్‌ చేసి, మందులు రాసిచ్చారు.’’
అప్పటిగ్గానీ ఆ దంపతులిద్దరి మనసులు స్థిమితపడలేదు. అభిరామ్‌ చేయి పట్టుకుని కారువైపు నడుస్తున్న మాలతి ‘ఒకరకంగా తనకొడుక్కి అభిరామిప్పుడు ప్రాణదాత అయ్యాడు’ అనుకుంటూ ఉద్వేగంతో వాడిని మరింత దగ్గరకు తీసుకుంది.

* *

ఓ రోజు సాయంత్రం ఆరుబయట పూల మొక్కల మధ్యన కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు శశి.
కాఫీ పట్టుకుని వచ్చిన మాలతి భర్తకి కప్పు అందిస్తూ ‘‘పెద్దోడు అభిరామ్‌కి చాలావరకూ మీ లక్షణాలే వచ్చాయండీ. ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటాడు. ఇక చిన్నోడు అభిషేక్‌ మీలాగా వెరీ షార్ప్‌’’ అంది నవ్వుతూ.
‘‘మా చిన్నతనంలో మా అన్నయ్యనూ, నన్నూ ఆప్యాయంగా చూస్తూ ఇలాగే నాన్నతో పోలుస్తూ ఆనంద పడేది అమ్మ నాన్న ముందర’’ అంటూ కాఫీ తాగేసి కప్పు చేతికందిస్తూ ‘‘ఇంతకీ అభినవ్‌గారి గురించి చెప్పలేదేం?’’ అంటూ నవ్వాడు.
‘‘చూడాలి... ఇంకాస్త పెద్దయ్యాక ఎలా ఉంటాడో? ఇప్పటికైతే అన్నింటిలోనూ ముమ్మూర్తులా తమరికి జిరాక్సే సుమా!’’
‘‘వంశవృక్షమైన తండ్రి పోలికలూ లక్షణాలే కొమ్మలైన వారసులందరిలోనూ విస్తరించుకుపోతాయి. ఏ ఇంట్లోనైనా ఇలాగే జరుగుతుంది కూడా.
అది విస్మరించి ఉమ్మడి కుటుంబాల్లో కొందరు స్వార్థం హద్దులు దాటి తమలో తామే గొడవపడుతూ ఉంటారు.
కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయతలతో అల్లుకుపోతుంటే... ఆ లతలు పొదరిల్లవుతూ... ఆ ఇల్లు తప్పక నందనవనమవుతుంది.
‘‘పిల్లలు మన ఇంటికి వచ్చిన కొత్తలో వాళ్లపైన కోపంగా ఉన్నానని నాకు పాఠం చెప్తున్నారా?’’
‘‘అలా ఏంకాదు. నీలోని తల్లి హృదయం నాకు తెలియదా? నీకు గొప్ప మనసు ఉండబట్టే పిల్లలని ఇంటిదాకా ఆహ్వానించావు. ఇప్పుడు నీ మాతృ ప్రేమని ముగ్గురికీ సమంగా పంచుతూ గుండెల్లో పెట్టుకుంటున్నావు కాకపోతే అందుకు కాస్త సమయం పట్టిందంతే!
రేపటి రోజున ఎవరి జీవితం ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. కానీ మనకంటూ నిర్దేశించబడిన కర్తవ్యాన్ని నిర్వర్తించమని వర్తమానం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తుంటుంది. అపుడెవరూ స్వార్థంతో తమ బాధ్యతల్ని విస్మరించకూడదు!
ఎందుకంటే మాలతీ- ఈ భూమ్మీద అన్నింటికంటే- రక్త సంబంధాల కంటే కూడా- ఉన్నతమైనవి మానవత్వ బంధాలే! అవి మన హృదయాల్ని వీడిపోనివ్వకూడని అనుబంధాలు. ఆ బంధాల్ని నిలుపుకోవడంలో భార్యగా నాకు పూర్తిగా సహకరించావు. నాకదే చాలు’’ అన్నాడు శశి సంతృప్తిగా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు