close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాళ్లుకావు... రంగు పెన్సిళ్లు...!

రాళ్లతో రంగులేయొచ్చు. బొమ్మలతో పెయింటింగులు వేయొచ్చు. అవును, ఇప్పుడు... క్రేయాన్లు  రాళ్లలానూ బొమ్మల్లానూ వస్తున్నాయి మరి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇక్కడ కనిపించేవన్నీ క్రేయాన్లే.

చిన్న పిల్లలకి క్రేయాన్లంటే ఎంతిష్టమో... అవి చేతిలో ఉంటే గోడలూ తలుపులూ టేబుళ్లూ... అన్నీ డ్రాయింగ్‌ పుస్తకాలుగా మారిపోతాయి. రంగు రంగుల్లో ఉండే ఆ పెన్సిళ్లతో డూడుల్స్‌ని గీసి ఏదో బొమ్మలు వేసేశాం అని ఆనందపడిపోతారు. ఏమో ఎవరికి తెలుసు... ఈరోజు వాళ్లు గీసే ఆ గీతలే వారిలోని రేపటి చిత్రకారులకి పునాదులేమో. పైగా బొమ్మలు గియ్యడం వల్ల పిల్లల్లో మెదడు చురుకుగా మారి సృజన కూడా పెరుగుతుందట. అందుకే, పాఠశాలల్లోనూ నర్సరీ నుంచే డ్రాయింగ్‌ పుస్తకాలు ఇచ్చి పిల్లలతో రంగులు వేయిస్తుంటారు. ఇక, ఈతరం తల్లిదండ్రుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా... పిల్లలు ఏం గీసినా తెగ సంబరపడిపోతూ కావల్సినన్ని క్రేయాన్లను కొనిస్తుంటారు. అయితే, పిల్లలకు ప్రతిదీ ఎప్పటికప్పుడు కొత్తగా మారిపోతుండాలి. ప్రత్యేకంగా ఉండాలి. అందుకే, వాళ్ల పౌచ్‌లూ బ్యాగులూ పెన్సిళ్లూ రబ్బర్లను రకరకాల బొమ్మలుగా తయారుచేసి అమ్ముతున్నాయి వ్యాపార సంస్థలు. ఆ కోవలోకే ఇప్పుడు క్రేయాన్లు కూడా వచ్చి చేరాయి.

రాళ్లలా బొమ్మల్లా...
ఎందుకో తెలీదు, బోలెడు బొమ్మలున్నా సరే... రోడ్డుపక్కన గులకరాళ్లు కనబడితే పిల్లలు వాటిలో చిన్నా పెద్దా సైజుల్ని ఏరుకుని ఆడుకుంటూ ఉంటారు. ఈ కారణంతోనే తైపేకి చెందిన ఓ సంస్థ ఈమధ్య ‘కలర్‌ జెమ్‌’ పేరుతో అచ్చం మట్టిలో దొరికే రకరకాల రాళ్ల ఆకారంలో ఉండే క్రేయాన్లను తయారుచేసింది. సహజంగా దొరికే రాళ్లలో కొన్నిటిలో రెండు మూడు రంగులు కూడా ఉంటాయి. అచ్చం అలాగే ఉండే ఈ క్రేయాన్లతో రాసినప్పుడు ఒక్కోసారి ఒక్కోరంగు వస్తుంటుంది. దాంతో మరీ చిన్నపిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి కూడా. వీటితో పాటు, వేరు వేరు రంగుల గుండ్రటి రాళ్ల(పెబుల్స్‌)లానూ రత్నాల ఆకారంలో కూడా క్రేయాన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. సీతాకోక చిలుక, చేప, గుర్రం, డోనట్‌, ఐస్‌క్రీమ్‌, ఆకు, కారు, లెగో బ్రిక్స్‌... ఇలా వేరు వేరు బొమ్మల రూపంలో వచ్చేవి వీటిలో మరోరకం. ఈ క్రేయాన్లలోనూ ఒకే రంగుతో ఉన్నవీ రకరకాల రంగులు కలిసినవీ వస్తున్నాయి. మామూలు క్రేయాన్లు విరిగిపోయినా సగంవరకూ అరిగిపోయినా వాటిని పిల్లలు పక్కన పడేస్తుంటారు. అలాంటి వాటిని కరిగించి బొమ్మల రూపంలో ఉండే మౌల్డుల్లో పోసి కూడా ఆయా ఆకారాల్లో క్రేయాన్లను తయారుచేసుకోవచ్చు. బాగా చిన్న పిల్లలకు సన్నగా ఉండే పెన్సిళ్లను పట్టుకోవడం కుదరదు. వాళ్లకు ఇలా లావుగా బొమ్మల్లా ఉండే క్రేయాన్లను ఇస్తే ఎంచక్కా గీసుకుంటారు. ఈ క్రేయాన్లు చిన్నారులకు కానుకలుగా ఇవ్వడానికీ బాగుంటాయి. పుట్టినరోజులకు రిటర్న్‌ గిఫ్ట్‌లుగా ఇస్తే ఎంత ఆశ్చర్యంగా చూస్తారో..!


‘చిత్రాల’ కేకులు... చూస్తారా... కోస్తారా..?

పచ్చని చెట్లూ... పారే సెలయేర్లూ... కొండా కోనల్ని ఎప్పుడు చూసినా మనసు ఆనందంతో ఆహ్లాదంతో నిండిపోతుంది. మరి, మనం ఎంతో సంతోషంగా ఉండే పుట్టినరోజూ పెళ్లి వేడుకల సమయంలో అలాంటి దృశ్యాలున్న ‘ల్యాండ్‌స్కేప్‌’ కేకుల్ని కట్‌ చేస్తే ఆనందం రెట్టింపు అవుతుందనడంలో అతిశయోక్తి ఏముందీ...!

ఒకప్పుడు పుట్టినరోజు అంటే పాయసం చేయడం మన సంప్రదాయం. కానీ ఇప్పుడు పాయసం ఎంతమంది చేస్తున్నారో తెలియదు కానీ పల్లెటూళ్లలో కూడా కేకు కట్‌ చెయ్యకుండా ఆ వేడుక జరుపుకోవడం లేదు. అదో సంప్రదాయంగా మారిపోయింది. పుట్టినరోజుకేనా పెళ్లి రోజూ, నిశ్చితార్థం, కొత్త సంవత్సర వేడుకలు, ప్రేమికుల రోజు... ఇలా కేకు కట్‌ చెయ్యడానికి ఎన్నో సందర్భాలు. అందులోభాగంగానే పూల బొకేల్లానూ రకరకాల బొమ్మల్లానూ జంతువుల్లానూ నీటి కొలనుల్లానూ... ఎన్నో రకాల కేకులు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఫ్యాషన్‌ ట్రెండ్స్‌తో పోటీ పడుతూ కేకుల్లో కొత్త ట్రెండ్‌లను తెస్తున్నారు బేకరీ నిర్వాహకులు. అలా పుట్టు కొచ్చినవే ఈ ‘ల్యాండ్‌స్కేప్‌ కేకు’లు కూడా.

కేకు మీద పెయింటింగులు
సెలయేరు ఒడ్డున ఇల్లూ ఆ చుట్టూ రంగు రంగుల ఆకులున్న చెట్లూ... దూరంగా కనువిందు చేసే కొండలూ... ఆ దృశ్యాల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అందుకే, అలాంటి సీనరీలున్న పెయింటింగుల్ని కొని గోడకు తగిలించుకుంటాం. ఆ అందాలను ఆస్వాదించేందుకే విహార యాత్రలకూ వెళ్తుంటాం. ఇంకేముందీ, చూడచక్కగా ఉండే దేన్నైనా కేకులమీదికి చొప్పించేయడం అలవాటైన షెఫ్‌ల కళ్లు ఇప్పుడు ల్యాండ్‌స్కేప్‌ల మీదా పడ్డాయి. ఫలితం... వేడుకల సమయంలో అందమైన ప్రకృతి చిత్రాలు కేకుల రూపంలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నోటిని తీపి చేస్తున్నాయి. సీనరీలే కాదు, వికసించిన పువ్వులూ రంగు రంగుల పక్షులూ బుజ్జిగా ముద్దొచ్చే పప్పీలూ పిల్లి పిల్లల పెయింటింగుల్ని కూడా కేకుల మీద వేయించుకుంటున్నారు. మనం ఎంపిక చేసిన సీనరీని తినే రంగులతో అచ్చుగుద్దినట్లుగా ఈ కేకుల మీద పెయింట్‌ చేస్తారు. ఈ తరహా కేకులు హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ పెద్ద బేకరీల్లో దొరుకుతున్నాయి. పేరున్న హోమ్‌ బేకర్లు కూడా వీటిని చేస్తున్నారు. అలా చేయించుకోవడం కష్టం అనుకుంటే రకరకాల పెయింటింగులు ఉన్న ఎడిబుల్‌ పేపర్లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. వరి పిండితో తయారయ్యే ఈ పేపర్లను ఎంచక్కా కేకుల మీద అంటించుకోవచ్చు.


రంగులు మారే మాస్కులు...!

కరోనా పుణ్యమా అని మాస్కులు మన జీవితంలో భాగమైపోయాయి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే ముఖానికి మాస్కు ఉండాల్సిందే. మరోపక్కేమో అవి ముఖాన్ని సగం కప్పేస్తాయి. దాంతో మాస్కులు తమ అందానికి అడ్డంగా ఉన్నాయంటూ మొదట్లో అందరూ తెగ బాధపడిపోయారు. అలాంటి వాళ్ల కోసమే ఇప్పుడు మాస్కులు అదేపనిగా చూసేంత భిన్నంగా ఎన్నో రకాలుగా వస్తున్నాయి మరి.

చీకట్లో వెలిగే మాస్కులు

పగలైతే మంచి ప్రింట్లూ ఎంబ్రాయిడరీ ఉన్న మాస్కుల్ని పెట్టుకుంటే కనిపిస్తాయి. కానీ రాత్రిపూట పెళ్లిళ్లూ పుట్టినరోజు పార్టీలకు వెళ్లినప్పుడు అవి అంతగా కనిపించవు. అలాంటప్పుడు చీకట్లో వెలిగే ఈ ‘ఎల్‌ఈడీ మాస్కు’ల్ని పెట్టుకుంటే ఎవరైనా మనవైపు తిరిగి చూడాల్సిందే. ఫైబర్‌ ఆప్టిక్‌ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన వీటిని చూస్తే రంగు రంగుల నక్షత్రాలన్నీ ఓ చోట చేరి వెలుగుతున్నట్లుంటాయి. రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే ఈ మాస్కుల తాడుకి చిన్న స్విచ్‌ ఉంటుంది. దాంతో వీటి లైట్‌ వెయ్యడం, తియ్యడమే కాదు, ఒక్కో మాస్కుని ఏడెనిమిది రంగుల్లోకీ మార్చుకోవచ్చు. ఇంకేముందీ... అసలే ముఖాన్ని ధగధగా మెరిపించే మాస్కులు... పైగా అవి అప్పటికప్పుడు రంగులు మారుస్తుంటే చూసేవారు అదుర్స్‌ అనకుండా ఉండగలరా..! ‘హీట్‌ సెన్సిటివ్‌ కలర్‌ చేంజింగ్‌ మాస్కు’ల పేరుతో మామూలు మాస్కుల్లోనూ రంగులు మారేవి వస్తున్నాయి. వేడి తగలగానే రంగు మార్చే పెయింట్‌తో వీటిపైన డిజైన్లు గీస్తారు. అలా మనం గాలి వదిలినపుడు దానిలోని వేడి తగిలి ఈ మాస్కుల మీదున్న డిజైన్‌ బయటపడుతుంది.


మాస్క్‌ చెప్పేస్తుంది...

వేడుకకు తగ్గట్లూ రకరకాల మెసేజ్‌లూ ఫన్నీ కొటేషన్లతో ఉన్న మాస్కులూ వస్తున్నాయి. పుట్టినరోజు నాడు పెట్టుకునేందుకు ఇట్స్‌ మై బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే అని రాసున్నవీ, పిల్లల పెళ్లిలో తల్లిదండ్రుల కోసం ‘పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు తండ్రి’ అని రాసున్న మాస్కులూ వస్తున్నాయి. ఇలాంటి మాస్కులు పెట్టుకుంటే మగ పెళ్లివారికి పెళ్లి కూతురు అమ్మానాన్నలు ఫలానా వాళ్లని ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదన్నమాట. అలాగే వరుడి తల్లి, తండ్రి అని రాసున్న మాస్కులూ విడివిడిగా దొరుకుతున్నాయి. లేదంటే మనమే ప్రత్యేకంగా తయారు చేయించుకోవచ్చు. ఇక, మాస్కు పెట్టుకుంటే ఎవరైనా ఎదురుగా వచ్చి పలకరింపుగా నవ్వినా కనిపించదు. అందుకే, సరదాగా మాస్కు మీద ‘నేను నవ్వుతున్నా’ అని ఉన్నవీ వస్తున్నాయి.


త్రీడీ థ్రిల్‌!

ఈ త్రీడీ మాస్కుల్ని ఒక్కసారిగా చూస్తే వాటిలో నుంచి బుల్లి కుక్క పిల్లా, పిల్లి పిల్లా బయటకు వస్తున్నట్లుంటాయి. దగ్గరకొచ్చి చూస్తేగానీ తెలియదు అదంతా ఒట్టి ప్రింటే అని. మాస్కున్నా ముఖం కనిపిస్తుంది ‘ఎంత అందంగా తయారై ఏం లాభం, మాస్కు పెట్టుకుంటే అసలు ముఖమే కనిపించడంలేదుగా’ అని బాధపడే వారికోసం పూర్తిగా పారదర్శకంగా ఉండే మాస్కులు దొరుకుతున్నాయి. మెత్తటి ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ మాస్కులు చెవిటి, మూగ వారితో సంభాషణ సాగించేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి. వారికి ఎదుటివాళ్లు చెప్పేది వినిపించదు. మన పెదవుల కదలికల్ని బట్టి మాటల్ని అర్థం చేసుకుంటారు కాబట్టి, అలా పనికొచ్చేలా కూడా వీటిని తయారు చేస్తున్నారు.


మాస్కున్నా ముఖం కనిపిస్తుంది

‘ఎంత అందంగా తయారై ఏం లాభం, మాస్కు పెట్టుకుంటే అసలు ముఖమే కనిపించడంలేదుగా’ అని బాధపడే వారికోసం పూర్తిగా పారదర్శకంగా ఉండే మాస్కులు దొరుకుతున్నాయి. మెత్తటి ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ మాస్కులు చెవిటి, మూగ వారితో సంభాషణ సాగించేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి. వారికి ఎదుటివాళ్లు చెప్పేది వినిపించదు. మన పెదవుల కదలికల్ని బట్టి మాటల్ని అర్థం చేసుకుంటారు కాబట్టి, అలా పనికొచ్చేలా కూడా వీటిని తయారు చేస్తున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు