close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పార్వతీదేవికి పదివేల కేజీల సారె

ఆ ఊరివాళ్లకు పార్వతీదేవి తమ ఇంటి ఆడపడుచుతో సమానం. అందుకే ప్రతిఏటా అమ్మవారికి సారె పెడతారు. అదీ ఏ నాలుగైదు రకాలో అనుకుంటే పొరపాటే. ఏకంగా వందకు పైగా రకాల పిండివంటలను దాదాపు పదివేల కేజీలు చేసి ఆ సారెను అమ్మవారికి సమర్పించి... పార్వతీదేవి పట్ల తమకు ఉన్న భక్తిని చాటుకుంటారు. ఏటా సంక్రాంతి తరువాత జరిగే ఈ గౌరీశంకరుల జాతరను చూడాలంటే అనకాపల్లికి వెళ్లాలి.

సంక్రాంతి వస్తోందంటే చాలామంది మహిళలు ఇరుగుపొరుగు వారితో కలిసి... అరిసెలతోపాటూ రకరకాల పిండివంటలు చేసుకోవడం చాలా ఊళ్లల్లో జరిగేదే. కానీ విశాఖజిల్లా అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం, వేల్పులవేది, విజయరామరాజు పేట, మునగపాక, కసింపేట, నాగులాపల్లి, చూచుకొండ, హరిపాలెం గ్రామాల మహిళలు మాత్రం తమ ఇళ్లల్లో చేసుకునే పిండివంటలకన్నా సంక్రాంతి తరువాత పార్వతీదేవికి సమర్పించే సారె తయారీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అయితే ఈ ఊళ్లలో మిగిలిన గ్రామాల వాళ్లు... రెండుమూడు వేల కేజీల చొప్పున వంటకాలను తయారుచేస్తే ఒక్క గవరపాలెం మహిళలే పదివేల కేజీలకు పైగా పిండివంటల్ని సిద్ధంచేస్తారు. దాదాపు అయిదు వేలమంది మహిళలు కలిసి వీటన్నింటినీ తయారుచేస్తారు. ఆ  తరువాత వెయ్యిమందికిపైగా మహిళలు ఊరేగింపుగా వెళ్లి... అమ్మవారికి సారెను సమర్పిస్తారు. ఇలా సారెను ఇచ్చే కార్యక్రమాన్ని గౌరీ పరమేశ్వరుల జాతరగా పిలుస్తారు. కన్నుల పండుగ్గా జరిగే ఈ జాతర పన్నెండేళ్లక్రితం మొదలయ్యింది.

విగ్రహాలను తయారుచేసి...
అనకాపల్లిలోని మూడు ప్రాంతాల్లో గౌరీపరమేశ్వరుల ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఏడాదంతా జరిగే పూజలు ఒకెత్తయితే ఈ జాతర మరొకెత్తు అంటారు. ఎందుకంటే... ఆ ఆలయాల్లో శివపార్వతులకు శాశ్వత విగ్రహాలు ఉన్నా... ప్రతి ఏటా దీపావళి ముందురోజు మట్టి విగ్రహాలను తయారు చేయిస్తారు. తరువాత ఈ ఆలయాల్లో ఆ విగ్రహాలను ఏర్పాటుచేసి అప్పటినుంచీ జాతర వరకూ పూజలు నిర్వహిస్తారు. జనవరిలో వచ్చే ఆఖరి శనివారానికి మూడు రోజుల ముందు పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని నిర్వహించి ఆ మర్నాడు - తయారుచేసుకున్న సారెను గుడికి తీసుకెళ్లి పార్వతీదేవికి నైవేద్యంగా అర్పించి, దాన్నో జాతరగా నిర్వహిస్తారు. ఆ మర్నాడు విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఒక్కో ఊరివాళ్లు ఒక్కో రోజున ఇలా సారెను సమర్పిస్తే గవరపాలెం ఊరివాళ్లు మాత్రం జనవరిలో వచ్చే ఆఖరి శనివారం నాడు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నివేదిస్తారు. అనకాపల్లి ప్రాంతంలో ఆడపిల్లకు పెళ్లి జరిగితే సారెను ఊరేగింపుగా తీసుకెళ్లడం ఓ సంప్రదాయంగా పాటిస్తారు. పార్వతీదేవిని కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించే ఇలా సారెను సమర్పిస్తామని చెబుతారు ఆ ఊరివాళ్లు.

అన్నిరకాల పదార్థాలూ...
అమ్మవారికి సమర్పించే సారెలో పండ్లూ, కొబ్బరికాయలూ, బెల్లం దిమ్మలు లాంటివే కాదు... పూతరేకులూ, బూరెలూ, తీపి గులాబీలూ, గవ్వలూ, రవ్వలడ్లూ, కొబ్బరిఉండలూ, సున్నుండలూ, బూందీలడ్లూ, జిలేబీలూ, కజ్జికాయలూ, బాదుషా... ఇలా సంప్రదాయ మిఠాయిల్లో దాదాపు అన్ని రకాలూ ఉంటాయి. అదేవిధంగా పంచదార చిలకలూ, జంతికలూ, మిక్చర్‌, కారప్పూసతో కలిసి మొత్తంగా వందకు పైగా వంటకాలను సిద్ధంచేస్తారు. ఈ సారెను తీసుకెళ్లే ముందు అమ్మవారికి మొదట పసుపు, కుంకుమ, గాజులతో భారీ తాంబూలాన్ని ఇస్తారు. ఉదయం పదిగంటలకు మొదలయ్యే ఈ వేడుక తెల్లవారు జాము వరకూ కొనసాగుతుంది. ఈ జాతరలో రకరకాల వినోద కార్యక్రమాలూ ఉంటాయి. ఇలా భక్తులు తీసుకు వచ్చిన సారెలో 10 శాతం గౌరీశంకరులకు నైవేద్యంగా వదిలేసి, మిగిలిన పదార్థాలను గుడికి వచ్చినవారు పంచుకోవడమే కాకుండా... తమ ఇళ్లకూ తీసుకెళ్లి బంధువులకు ప్రసాదంగా ఇస్తారు. ముఖ్యంగా వివాహం అయిన తమ ఇంటి ఆడపిల్లలకు ఈ ప్రసాదాన్ని పంపడం ఓ ఆనవాయితీగా వస్తోంది. కరోనా ఇబ్బందిపెట్టినా.. ఈసారి కూడా అమ్మకు సారెను తీసుకెళ్లడం మాత్రం ఆగదని చెబుతున్నారు ఈ మహిళలు.

- పెంటకోట వెంటక సీతారాం, న్యూస్‌టుడే అనకాపల్లి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు