
మనకు రాత్రిపూట చలి 20 డిగ్రీలు ఉంటేనే స్వెటర్లు వేసుకుని పెద్ద పెద్ద రగ్గులు కప్పుకుని పడుకుంటాం. కానీ చలికాలం వస్తే సైబీరియాలోని నొవొసిబిర్స్క్లో ఉష్ణోగ్రత చాలా రోజులపాటు మైనస్ 40డిగ్రీల సెల్సియస్‌కి అటూ ఇటూగా నమోదవుతుంది. పైగా సైబీరియాలో గాలి ఆర్కిటిక్‌లో కన్నా చల్లగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా చిటికెలో గడ్డకట్టేయకుండా ఉంటుందా... ఆ విషయాన్నే ‘ఒలెగ్’ అనే స్థానికుడు ఇలా కళ్లకు కట్టాడు. ఇక్కడ కనిపించే చిత్రంలో ఒకటి గుడ్డును పగలగొడితే అది ప్లేటులోకి కారేలోపే గడ్డకట్టేస్తే... మరొకటి వేడి వేడి నూడుల్స్‌ని తిందామని ఫోర్క్‌తో పైకి లేపేసరికి గడ్డకట్టేశాయి. ‘ఈరోజు మా పట్టణంలో ఉష్ణోగ్రత -45డిగ్రీల సెల్సియస్ ఉంది’ అంటూ అతడు షేర్ చేసిన ఈ ఫొటో ట్విటర్లో తెగ వైరల్ అయింది.
వాళ్లకు వేలి ముద్రలుండవు!
ఈరోజుల్లో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్... లాంటివి కావాలన్నా రేషన్ తీసుకోవాలన్నా... వేలి ముద్రలు లేకుండా జరగదు. కానీ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ కుటుంబానికి తరతరాలుగా అసలు వేలి ముద్రలే లేవట. ‘పాతకాలంలో అయితే, గుర్తింపు కార్డులుండేవి కాదు కాబట్టి, మా తాతకు వేలి ముద్రలు లేవనే సంగతే మాకు తెలియదు. మా నాన్న గుర్తింపు కార్డు కోసం వెళ్లినప్పుడే తనతో పాటు మా కుటుంబంలోని మగవారెవ్వరికీ వేలి ముద్రలు లేవనే విషయం తెలిసింది’ అంటాడు అపు సార్కర్. ఒక రకమైన జన్యు సమస్య కారణంగా ఇలా జరుగుతుందట. కాకపోతే ప్రస్తుతం అపు కుటుంబం వేలిముద్రలు లేక చాలా తిప్పలు పడుతోంది. డ్రైవింగ్ లైసెన్సు కూడా తీసుకోలేకపోతున్నారు. ఫోన్‌కి సిమ్ తీసుకోవాలన్నా వాళ్ల అమ్మ పేరు మీద తీసుకుంటున్నారట. ఇదో వింత కష్టం అన్నమాట!
డ్రెయినేజీలో చేపలు!
డ్రెయినేజీ కాలువలు అంటే ఎక్కడైనా మురికిగా, ముక్కు మూసుకునేలానే ఉంటాయి. కానీ జపాన్, క్యుషు ద్వీపంలోని షిమబర నగరం మాత్రం ఇందుకు భిన్నం. అక్కడి డ్రెయినేజీ కాలువలు ఎంత శుభ్రంగా ఉంటాయంటే... కొయి రకం చేపలు పెరిగేంత! క్యుషు ద్వీపంలో మంచి నీటి బుగ్గలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఆ నీరు డ్రెయినేజీ కాలువల్లోకీ ప్రవహిస్తుంది. జనం కూడా డ్రెయినేజీలో చెత్తా చెదారం వెయ్యకుండా శుభ్రంగా ఉంచుతారు. దాంతో కొన్నేళ్ల కిందట అధికారులు ఈ కాలువల్లో కొయి చేపల్ని వదిలారు. ఈ రకం చేపలు నీళ్లు మురికిగా ఉంటే బతకలేవు. అంటే... ఈ కాలువల్లోని నీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ప్రస్తుతం షిమబర డ్రెయినేజీలు రంగు రంగుల చేపలతో నిండి స్థానికులతో పాటు, పర్యటకులకూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఈ బ్యాగు ధర రూ.90 వేలట!
బన్‌లా ఉన్న ఈ బ్యాగుని చూస్తే ‘బ్యాగులు ఇలా కూడా ఉంటాయా... ఎవరు కొంటారు వీటిని’ అనిపిస్తోంది కదూ... ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ మొచినో దీన్ని తయారు చేసింది. విచిత్రం ఏంటంటే... ఫొ లెదర్‌తో తయారు చేసిన ఈ బ్యాగు ధర రూ.90 వేలట. ఇంకేముందీ... ఇలాంటి బ్యాగుకి ఇంత ధరేంటీ అంటూ సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్