close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఇంటర్వ్యూ మా ఇంట్లో తుపాను రేపింది..!

మూవ్‌- ఆఁ నుంచీ ఆహా వరకూ! ఒకప్పుడు మన టీవీల్లో మారుమోగిన ప్రకటన ఇది. ఆ నడుంనొప్పి మందుని సృష్టించిన పారిశ్రామికవేత్త దర్శన్‌ పటేల్‌. అదొక్కటే కాదు కాళ్ల పగుళ్ల మందు ‘క్రాక్‌’, దురదకి వాడే ‘ఇచ్‌ గార్డ్‌’ వంటివాటి వెనకున్నదీ ఆయనే. వాటి ఉత్పత్తి తర్వాతే దర్శన్‌ జీవితం ఓ మలుపు తీసుకుంది. అన్నీ వదిలి సాగుకి దిగేలా చేసింది. దర్శన్‌ అలాగే ఉండిపోయుంటే... మన యువతకి ‘ఫాగ్‌’ డియోడరంట్‌ దొరికేది కాదు. బహుళజాతి బడాసంస్థల్ని ఓ దేశీయ కంపెనీ ఓడించిన చరిత్రా దక్కేది కాదు. ఆ కథ దర్శన్‌ మాటల్లోనే...

ది 2005 డిసెంబర్‌ నెల. నన్నో పత్రికా విలేకరి ఇంటర్వ్యూ చేయడానికని వచ్చారు. అప్పట్లో మా కుటుంబానికి చెందిన పారస్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ మూవ్‌, క్రాక్‌, ఇచ్‌ గార్డ్‌, డెర్మో కూల్‌ వంటి ఉత్పత్తులతో బాగా పేరుతెచ్చుకుంది. ఆ కంపెనీ ఎండీగా నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే ‘సరే’ అన్నాను. వారం తర్వాత అది నా జీవితంలో తీసుకురాబోయే తుపాను తాకిడిని ఊహించకుండా ఉత్సాహంగా ఇలా చెప్పుకుంటూ పోయాను...

‘మాది గుజరాతే కానీ మా నాన్న మేం పుట్టకముందే ఒడిశాలోని సంబల్‌పూర్‌కి వలస వెళ్లారు. ఆయనో ఫార్మసిస్టు కాబట్టి అక్కడ మందుల షాపు పెట్టారు. అక్కడ నష్టాల్లో ఉన్న ఓ చిన్న కంపెనీని కొన్నారు. ఫార్మా కంపెనీలకి అవసరమైన రసాయ నాలను అందించే సంస్థ అది. ఆ సంస్థతోపాటే మా కుటుంబం వృద్ధిలోకి వచ్చింది. ఇంట్లో మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్నయ్య గిరీశ్‌, రెండో అన్నయ్య దేవేంద్ర, తర్వాత నేను. నేను సంబల్‌పూర్‌లో పుట్టినా అహ్మదాబాద్‌లోనే చదువుకున్నాను. 1983లో మా నాన్న గుజరాత్‌లో ‘పారస్‌ ఫార్మాస్యూటికల్స్‌’ని ప్రారంభించాడు. జలుబూ, జ్వరం, ఒళ్లునొప్పులు వంటివాటికి వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ అవసరంలేని మందుల్ని తయారుచేసే సంస్థ అది. ‘పారస్‌’ అంటే బంగారమని అర్థం... ‘పరుసవేది’ నుంచి తీసుకున్న పదం అది. పేరుకు తగ్గట్టే నాన్న పట్టిందంతా బంగారమైంది. రెండేళ్లలోనే రూ.40 లక్షల టర్నోవర్‌కి చేరింది. సరిగ్గా అప్పుడే నేను బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకుని కంపెనీలో చేరాను. అన్నయ్యలు అప్పటికే కంపెనీలో పనిచేస్తున్నారు. మా నాన్న నన్ను మార్కెటింగ్‌ విభాగంలో అట్టడుగు పోస్టుకి తీసుకున్నారు. దేశమంతా తిరిగి మా ఉత్పత్తుల్ని మార్కెట్‌ చేయడం, కొనేవాళ్ల ఆసక్తుల్ని తెలుసుకోవడమే నా పని. ఒక్కసారి వెళితే 30-40 రోజుల తర్వాతే ఇంటికి రావడం. పెళ్లైన కొత్తల్లోనూ ఇంతే. ‘కొత్తగా పెళ్లైనవాణ్ని అలా రోజుల తరబడి ఊళ్లుపట్టుకుని తిరగమనడం బాగాలేదురా!’ అని మా తాతయ్య కోప్పడ్డా నాన్న వినేవాడు కాదు. ఆయన నన్నలా కఠోర శిక్షణకి గురిచెయ్యడం వెనక ఉద్దేశమేంటో పోనుపోను తెలిసింది. ఆ పర్యటనలే నాకు దేశంలోని సగటు వినియోగదారుడి నాడి పట్టుకోవడమెలాగో నేర్పాయి. షాపుకొచ్చిన వాళ్లు ‘నడుంనొప్పి మందు కావాలయ్యా...!’ అని అడుగుతున్నారా అమృతాంజనమో, అయోడెక్సో కావాలని అడుగుతున్నారా అని గమనించేవాణ్ణి. సామాన్యులు వాళ్ల నొప్పి గురించి చెప్పే అడుగుతారు కదా! అది గమనించాకే అప్పటికే మా సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘మూవ్‌’లో మార్పులు చేశాను. ఆ మందుని మొదట్లో అన్ని నొప్పులకోసమనే ఉత్పత్తి చేశాం. మార్కెట్‌ని పరిశీలించాక ఏదైనా ప్రత్యేక సమస్యకే అది పరిమితమైతే బావుణ్ణని కీళ్లనొప్పులకని మార్చాను. ఆ సమస్యకన్నా నడుంనొప్పికి గురయ్యేవారే ఎక్కువని తెలిసి మళ్లీ మార్చాను. అది క్లిక్‌ అయింది. ‘ఆఁ నుంచి ఆహా వరకూ’ అనే ఆ ప్రకటన పెద్ద హిట్టయింది. ఓ రోజు ముంబయి వెళుతుంటే రైలు చర్చ్‌గేట్‌ రైల్వేస్టేషన్‌లో ఆగింది.

నా కంపార్ట్‌మెంట్‌ వెనకే లేడిస్‌ బోగీ. అందులో నుంచి దిగుతున్నవాళ్లందరి పాదాల్లోనూ పగుళ్లు కనిపించాయి. ఈ సమస్య స్త్రీలందరిదీ కదా అనిపించి... ‘క్రాక్‌’ క్రీమ్‌ తయారుచేశాను. మా ఆవిడ తలస్నానం చేశాక జుట్టు చిక్కు తీయడానికి పడుతున్న అవస్థని గమనించాక ‘లీవాన్‌’ని తెచ్చాను. హాస్టల్లో చదువుతున్న మా స్నేహితుడి కొడుకు చెమట పొక్కులతో ఇబ్బంది పడుతుంటే అప్పటికే ఉన్న పౌడర్లు వాడి చూశారట. అవన్నీ వారం తర్వాతకానీ ఉపశమనం చూపట్లేదని వాపోయాడతను. ఆ సమస్య నుంచే ‘డెర్మీ కూల్‌’ పౌడర్‌ తెచ్చాను... ‘ఠండా ఠండా కూల్‌ కూల్‌’ అనే ప్రకటన పాటకూడా అప్పట్లో పెద్ద హిట్టు. మేం తయారు చేసిన ఇలాంటి 10 కొత్త ఉత్పత్తులూ ప్రజల రోజువారీ సమస్యల నుంచి పుట్టినవే. అలా నేను చేరడానికి ముందు రూ.40 లక్షలున్న సంస్థ టర్నోవర్‌ ఇప్పుడు 250 కోట్ల రూపాయల్ని అందుకుంది. నాన్న ఈ మధ్యే చనిపోయారు. ఆయన పేరు చిరకాలం నిలిచేలా బహుళజాతి సంస్థల్ని తలదన్నే స్థాయికి సంస్థని తీసుకెళ్లాలన్నదే లక్ష్యం!’ ...అని చెప్పి ఆ ఇంటర్వ్యూ ముగించాను. వారం తర్వాత పబ్లిష్‌ అయిన ఆ ఇంటర్వ్యూ మా కుటుంబంలో భూకంపాన్ని సృష్టించింది!

నిలువునా చీలిపోయింది...
‘ఇంటర్వ్యూ ఇవ్వడానికి నువ్వెవరివి? ‘పారస్‌’ కుటుంబంలో నువ్వొక్కడివే ఉన్నావా? అన్నీ నువ్వే సాధించినట్టు చెప్పుకొచ్చావ్‌...?’ - ఇలా నాపైన ప్రశ్నల వర్షం కురిపించారు. నేనేమో ‘నా విజయం మనందరిదీ కాదా!’ అని అంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. నన్ను అలా ముద్దాయిగా నిలబెట్టడాన్ని భరించలేకపోయాను. నిజానికి, అప్పటికి కొన్నేళ్ల కిందటి దాకా మా మధ్య చిన్నగా నలుగుతున్న ఓ సమస్య ముదిరి ఈ రూపంలో బయటపడిందని చెప్పాలి. మా పెద్దన్నయ్య కేవలం ‘పారస్‌’పైనే దృష్టి పెట్టకుండా ‘స్టెర్లింగ్‌ హాస్పిటల్స్‌’ సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. అది నాకు నచ్చలేదు. ఒక్క సంస్థపైనే దృష్టిపెడితే ఇంకా అద్భుతాలు చేయొచ్చనే భావన నాది. అది వాళ్లకి రుచించలేదు. నా ఇంటర్వ్యూ తర్వాత ఆ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. ఒక దశలో-ఇలా దగ్గరగా ఉండి తగాదాలు పెట్టుకోవడం కంటే... దూరమై కాసింత ఆత్మీయతని నిలుపుకోవడం మంచిది అనిపించింది. కంపెనీలో నాకున్న 24 శాతం వాటాని యాక్టిస్‌ అనే సంస్థకి అమ్మితే సుమారు వందకోట్ల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో వినీ కాస్మెటిక్స్‌ అనే సంస్థకి అంకురార్పణ చేశాను. ‘వినీ’ అంటే మా ఉమ్మడి కుటుంబం పెంచుకుంటూ వచ్చిన తాబేలు పేరు!

కంపెనీ స్థాపించాలనుకున్నా కానీ...
నేను మా సంస్థ నుంచి రాజీనామా చేసిన రోజు... కంపెనీలో కల్లోలం రేగింది. నాతోపాటూ రెండొందల మంది ఉద్యోగులు రాజీనామా చేసేశారు! సంస్థ కార్యకలాపాలన్నీ ఆగిపోయే పరిస్థితి. అది తెలిసి అన్నయ్యా, వదినలందరూ నన్ను కొత్త సంస్థ పెట్టొద్దని చెప్పారు. అమ్మ కూడా అదే మాట అంది. దాంతో నేను కోరుకున్నట్టు కొత్త సంస్థని స్థాపించలేదు. అంతేకాదు, ఉద్యోగుల్ని సంతృప్తిపరచడం కోసం నేను బోర్డు మెంబర్‌గా కొనసాగాల్సి వచ్చింది. ఈ పరిణామం నాకు మొత్తం బిజినెస్‌ వ్యవహారాలపైనే విరక్తి పుట్టించింది. నా వాటా అమ్మగా వచ్చిన డబ్బుతో గుజరాత్‌లోని మెహసన్‌ ప్రాంతంలో వందెకరాల స్థలం కొని రైతుగా మారాను. పొలం దగ్గరే ఉంటూ బఠాణీలూ, నారింజలూ, ద్రాక్షలూ సాగుచేయడం మొదలుపెట్టాను. ఊహ తెలిసినప్పటి నుంచీ వింటున్న మార్కెటింగ్‌, బ్రాండింగ్‌, షేర్‌ల వంటి పదాలన్నీ కనుమరుగై పాదు చేయడం, అంటుగట్టడం, చిగుర్ల కత్తిరింపుల వంటివే మనసుని నింపేశాయి. అలా మూడేళ్లు గడిచాయి. ఈలోపు మా పారస్‌ కంపెనీ కాలగర్భంలో కలిసిపోయింది! అన్నయ్యావాళ్లు ఈ కంపెనీని బ్రిటన్‌కి చెందిన సంస్థకి అమ్మేశారు. దాంతో నేను కంపెనీ స్థాపించడానికున్న అడ్డంకి తొలగిపోయినట్టే కానీ... అప్పటికే రైతుగా మారిపోయిన నాకు వ్యాపార ఆలోచనే రాలేదు.

అది 2010 సంవత్సరం. విదేశాలకి చెందిన వెంచర్‌ క్యాపిటలిస్టు సంస్థలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. అలా ఓ విదేశీ కంపెనీ ప్రతినిధి ఒకాయన నన్ను వెతుక్కుంటూ నా పొలం దగ్గరకి వచ్చాడు. ‘మేం మీ గురించి చాలా విన్నాం. మీరు ‘ఊ’ అనండీ ఎన్ని కోట్లయినా ఇస్తాం!’ అన్నాడు. నాకసలు బిజినెస్‌ పెట్టే ఆలోచనే లేదన్నాను. అతను వెళ్తూ వెళ్తూ ‘2006లో మీతోపాటూ రిజైన్‌ చేయడానికి పూనుకున్న ఆ 200 మంది ఉద్యోగులు ఇప్పుడేం చేస్తున్నారో ఆలోచించారా! అలాంటివాళ్ల కోసమైనా కొత్త కంపెనీ పెట్టండి!’ అన్నాడు. ఆ మాటలు నా మీద బాగా పనిచేశాయి. ఓ బిజినెస్‌ అంటే వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపడం కదా అనిపించింది. ఆ ఊహ వచ్చిన కొద్దిరోజులకే ‘వినీ కాస్మెటిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ని రిజిస్టర్‌ చేశాను!

ఢీ అంటే ఢీ...
నా కొత్త కంపెనీలో మా బాబాయి వాళ్లబ్బాయి దీపం పటేల్‌ కూడా చేరాడు. తొలి ఏడాది వైట్‌ టోన్‌ అనే టాల్కం పౌడర్‌నీ, ‘18 ప్లస్‌’ అనే డియోడరెంట్‌ని తీసుకొచ్చాం. వాటినెవరూ పట్టించుకోలేదు! దాదాపు 50 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాంతో... నేనే స్వయంగా మార్కెటింగ్‌ రీసెర్చికి దిగాను. వేలాది యువకుల్ని సర్వే చేశాను. ఆ సర్వే పేపర్లన్నింటినీ ఓ రోజు నా టేబుల్‌పైన పెట్టి చూస్తుంటే... అందరూ తాము అప్పటికే వాడుతున్న బ్రాండ్‌ బావుందన్నవారే! దాంతో ఉసూరుమనిపించింది. ఆ పేపర్లని మళ్లీ పరిశీలించినప్పుడు ఓ పదిశాతం మంది ‘మా పెర్ఫ్యూమ్‌ క్యాన్‌ 15 రోజుల్లోనే అయిపోతోంది. కనీసం నెలరోజులన్నా ఉంటే పాకెట్‌మనీ మిగులుతుంది!’ అని చెప్పారు. అది చూశాక నా మెదడులో ఓ మెరుపు మెరిసింది! పెర్ఫ్యూమ్‌ క్యాన్‌ ఎందుకు తొందరగా అయిపోతోంది... అందులో ఎక్కువగా గ్యాస్‌ ఉంటుంది కాబట్టి! ఆ గ్యాస్‌ తీసేసి డియోడరెంట్‌ లేదా పెర్ఫ్యూమ్‌ ద్రవాన్నే నింపితే... అనే ఆలోచన వచ్చింది. దానికి తగ్గట్టు సుగంధ ద్రవ్యాల ఫార్ములానీ, క్యాన్‌లనీ మార్చాను. ఈ కొత్త ప్రొడక్ట్‌కి ‘ఫాగ్‌’(ఫ్రెండ్‌ ఆఫ్‌ గుడ్‌ గయ్‌/గళ్‌... అని!) పేరుపెట్టాను. మొదటి నెల 15 వేల క్యాన్‌లు మాత్రమే అమ్ముడుపోయాయి. రెండోనెల 24 వేల క్యాన్‌లు. మూడో నెల ఒక్కసారిగా నాలుగున్నర లక్షలు... ఇక నాలుగో నెల పదిలక్షల క్యాన్‌ల అమ్మకాలు నమోదయ్యాయి.

అప్పట్లో ఓ బహుళజాతి సంస్థకి చెందిన ‘ఏక్స్‌’ నంబర్‌వన్‌ స్థానంలో ఉండేది. మా రాకని పసిగట్టిన సంస్థ... ప్రకటనలతో మమ్మల్ని నేరుగా ఢీకొంది. వాళ్లు వేలకోట్లయినా పెట్టగలరని తెలుసు... అయినా మేం తగ్గలేదు. ‘ఒక్క క్యాన్‌లో 800 స్ప్రేలు’ అంటూ కొత్త యాడ్స్‌ మొదలుపెట్టాను. కేవలం రెండేళ్లలోనే ఆ ఎమ్మెన్సీ కంపెనీ డియోడరెంట్‌ని తోసిరాజని... మేం నంబర్‌ వన్‌గా నిలిచాం! గత ఏడేళ్లుగా ఆ స్థానాన్ని కాపాడుకుంటూనే వస్తున్నాం. ఒకప్పుడు ఓ యాభై కోట్ల రూపాయల బ్రాండ్‌ తయారుచేస్తే చాలనుకునేవాణ్ణి... ఇప్పుడు మా ‘ఫాగ్‌’ ఒక్కదాని విలువే రూ.500 కోట్లు!

మహిళలే ప్రధానం...
అబ్బాయిల డియోడరెంట్‌ అనగానే... మార్కెట్‌లో ఉన్న సంస్థలన్నీ తమ ప్రకటనల్లో అశ్లీలతని చొప్పించేవి! ఆ యాడ్‌లు వచ్చినప్పుడు మా ఆవిడా, పాపా ఇబ్బంది పడటం గమనించాను. అందుకే ఫాగ్‌ ప్రకటనల్లో ఇసుమంతైనా అశ్లీలతకి తావులేకుండా జాగ్రత్తపడ్డాను. అందువల్ల ఈ డియోడరెంట్‌లని అమ్మాయిలూ ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇప్పుడే కాదు... ముందు నుంచీ స్త్రీలని లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు రూపొందించాను. ముఖ్యంగా మూవ్‌ ప్రకటనల్లో భాగంగా ఒకచిన్న పిల్లాడి చేత ‘ఇంటి పనులన్నీ అమ్మే ఎందుకు చేయాలి నాన్నా!’ అని అడిగించడం 2000ల్లోనే మాకు మంచి పేరుతెచ్చింది. మహిళల పట్ల ఉన్న ఈ గౌరవం కూడా మా విజయాల వెనకున్న ప్రధాన కారణమని చెప్పాలి.

ఇక మా కుటుంబం విషయంలో- ‘విడిపోయినా ఆత్మీయంగా ఉందాం’ అన్న నా మాటని నిలుపుకున్నాను. నేనెప్పుడూ అన్నయ్యవాళ్లని శత్రువులుగా చూసింది లేదు. వాళ్ల పిల్లలందరికీ నేనే పెళ్ళిళ్ళు జరిపించాను. వినీ సంస్థని ప్రారంభించినప్పుడు నాతోపాటూ వచ్చేసిన దీపం పటేల్‌ కొడుకు మనన్‌కి సీఈఓగా బాధ్యతలు అప్పగించాను! మా పాప జానకి మనన్‌కి  సహాయకురాలిగా ఉంటోంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు