close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాదాలకు మర్దన

వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడూ, ఎక్కువసేపు నడిచినప్పుడూ అరిపాదాలు నొప్పి పుడితే వెంటనే గోరువెచ్చని నీటిలో కాసేపు కాళ్లుపెట్టుకుంటాం. లేదంటే ఏదయినా బామ్‌ రాసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. కానీ వేడినీళ్లూ, బామ్‌ లాంటివి అన్నివేళలా మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. వాటికి ప్రత్యామ్నాయంగా ఈ ‘హీటింగ్‌ ఇన్‌సోల్స్‌’ కొని పెట్టుకుంటే సరి. వీటిని వాడే ముందు యూఎస్‌బీ కేబుల్‌ సాయంతో ఛార్జింగ్‌ చేసుకుని ఆ తరువాత బూట్ల లోపల పెట్టుకుంటే చాలు. ఈ సోల్స్‌ వేడిగా ఉండటం వల్ల పాదాలు వెచ్చగా ఉండటమే కాదు, నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి. మన కాళ్లు రకరకాల సైజుల్లో ఉంటాయి కదా... అన్నింట్లోనూ ఈ సోల్స్‌ ఎలా పడతాయనే సందేహం అక్కర్లేదు. కాలి సైజుకు తగినట్లుగా వీటిని కత్తిరించుకుని వాడుకోవచ్చు కాబట్టి ఎవరికైనా ఇవి చక్కగా సరిపోతాయి.


ఈ చేపలు కదలవు

ఇంట్లో చిన్న అక్వేరియం ఉందంటే రోజూ కాసేపైనా దాని ఎదురుగా కూర్చుని ఒత్తిళ్లన్నీ మర్చిపోతుంటాం. కాకపోతే వాటికి రోజూ ఆహారం వేయడం, వారం పదిరోజులకోసారి ఆ నీటిని మార్చడమే పెద్ద పని అనుకునే వారికి ఇప్పుడు కృత్రిమ త్రీడీ చేపల తొట్టెలు వచ్చేస్తున్నాయి. ఎపాక్సీ రెజిన్‌, పెయింట్లు వాడుతూ తయారుచేసిన ఈ తొట్టెలు నిజమైనవి కావు. చిన్నచిన్న కప్పులూ, ప్లేట్ల రూపంలో ఉండే వీటిని ఇంట్లో నచ్చిన చోట పెట్టుకోవచ్చు. కావడానికి కృత్రిమమైనవే అయినా... చేత్తో తాకితేనే కానీ పెయింట్‌ వేశారని తెలియనంత సహజంగా ఉంటాయివి. గృహాలంకరణలో భాగంగా వాడుకోవడమే కాదు, ఎవరికైనా కానుకగా ఇవ్వడానికీ బాగుంటాయివి. 


మ్యాగ్నెట్‌ పూసలివి

పిల్లల ఆట వస్తువుల్లో బిల్డింగ్‌బ్లాక్స్‌ కూడా ఒకటి. వాటితో రకరకాల బొమ్మలు చేసి అవి కూడా బోర్‌ కొడుతున్నాయని పేచీ పెట్టే చిన్నారులకు ఈ పూసల్ని ఇచ్చి చూడండి. రకరకాల రంగుల్లో పూసల్లా కనిపిస్తున్న ఇవన్నీ మ్యాగ్నెట్సే. ఓ కిట్‌రూపంలో దొరికే ఈ పూసల్ని ‘మ్యాగ్నెట్‌ బీడ్స్‌’ అంటారు. ఈ మ్యాగ్నెట్‌ పూసల్ని పిల్లలకు ఇస్తే నచ్చిన రంగుల్లో దండలా పేర్చుకుంటూ ఆ తరువాత బిల్డింగ్‌బ్లాక్స్‌ తరహాలోనే రకరకాల బొమ్మల్ని తయారు చేస్తారు. ఎవరైనా చూస్తే పూసలతోనే ఇంత అందంగా ఎలా తయారు చేశారబ్బా అని అనకుండా ఉండలేరు.


లైటర్‌ పాడవదు

గ్యాస్‌స్టౌ వెలిగించేందుకు లైటర్‌ని వాడితే... కొవ్వొత్తి, అగరుబత్తి లాంటివాటికి అగ్గిపెట్టె తప్పనిసరి. ఒక్కోసారి లైటర్‌ పనిచేయకపోవడం, అవసరానికి అగ్గిపెట్టె దొరక్కపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివాటికి చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు ఛార్జింగ్‌ లైటర్‌ వచ్చేసింది. చిన్న బటన్‌తో పనిచేసే ఈ లైటర్‌ని గ్యాస్‌స్టౌ నుంచి కొవ్వొత్తులూ, అగరుబత్తీలూ, దీపాలూ... ఇలా ఒకటేమిటి అగ్గిపెట్టెతో పని లేకుండా అన్నింటికీ ఉపయోగించుకోవచ్చు. పనైపోయాక యూఎస్‌బీ సాయంతో దీన్ని కాసేపు ఛార్జింగ్‌ పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా వాడుకునేందుకు సిద్ధంగా ఉంటుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు