close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘హార్లీ’ బైకుల్నీ అద్దెకిస్తున్నారు!

హార్లీ డేవిడ్‌సన్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, యమహా ఎఫ్‌జెడ్‌... యువత కలలు కనే ‘మ్యాచో’ బైకులివి! బండి నడపడం వచ్చాక కనీసం ఒక్కసారైనా వీటితో చక్కర్లు కొట్టాలని కోరుకోని కుర్రాళ్లుండరు. సమస్యంతా వాటి ధరలతోనే! లక్షన్నర నుంచి పదిలక్షల దాకా ధర పలుకుతాయీ బైకులు. అంతంత పెట్టి ఆ బైకుల్ని సొంతం చేసుకోలేనివాళ్ల కోసమే కొన్ని స్టార్టప్‌లు వాటిని అద్దెకిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్లతో ఊరిస్తున్నాయి!
‘ఏదో ఒక కొత్త ఐడియా కావాలి. అలాంటి ఐడియా లేకపోతే పాతదాన్నే కొత్తగా చేసి చూపాలి!’ - నేటి స్టార్టప్‌ల నినాదం ఇది. బైకుల్ని అద్దెకిచ్చే సంస్థలు ఈ రెండో అంశాన్ని చక్కగా ఒంటపట్టించుకున్నాయి. మనదేశంలో బైకుల్ని రోజుల తరబడి అద్దెకివ్వడం మరీ కొత్తపద్ధతేమీ కాదు. ప్రసిద్ధ పర్యటక ప్రాంతాల్లో ఈ పద్ధతి ఉండేది. కాకపోతే, ఈ వ్యాపారం పూర్తి అసంఘటితంగా, అనధికారికంగా జరిగేది. ఒక్క గోవాలో తప్ప మిగతా అన్నిచోట్లా మెకానిక్‌ షెడ్డులవాళ్లు వీటిని అద్దెకిస్తుండేవారు. ఆ బండిని మనం నడుపుతుంటే... వాటి డాక్యుమెంట్లవీ సరిగ్గా లేక పోలీసులు ఇబ్బంది పెడుతుండేవారు! బెంగళూరుకి చెందిన అభిషేక్‌ చంద్రశేఖర్‌, ఆకాశ్‌లు ఓసారి పుదుచ్చేరి వెళ్లినప్పుడు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అప్పుడే బైకుల్ని అద్దెకివ్వడాన్ని అధికారికంగా, పారదర్శకంగా చేయాలనుకున్నారు. ఆ ఆలోచన అంకురించే నాటికి ఇద్దరూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. మరో రెండేళ్ల తర్వాత చదువు పూర్తికాగానే ఈ ఆలోచన ఆధారంగా 2016లో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. మామూలు బైకుల్ని అద్దెకిస్తే పెద్ద ఆకర్షణగా ఉండదని తొలిసారి ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ బైకుల్ని పరిచయం చేశారు. అందుకు తగ్గట్టే తమ సంస్థకి ‘రాయల్‌ బ్రదర్స్‌’ అని పేరుపెట్టారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 40 నగరాల్లో విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, గుంటూరు నగరాల్లో బైకుల్ని అద్దెకిస్తోంది. మొత్తం రెండున్నరవేల పైచిలుకు వాహనాలని ఈ సంస్థ ఇలా అరువిస్తోంది.

రాయల్‌ బ్రదర్స్‌కి పోటీగా మరో వెయ్యి వాహనాలు అదనంగా నడుపుతోంది ‘ఓఎన్‌ఎన్‌ బైక్స్‌’ సంస్థ. దీని వ్యవస్థాపకులదీ దాదాపు రాయల్‌ బ్రదర్స్‌లాంటి కథే. ఓసారి గోవా వెళ్లిన వీళ్లు అక్కడ బైకుల్ని ఎంతో పారదర్శక పద్ధతిలో పకడ్బందీగా అద్దెకివ్వడం చూశారు. అలాంటి సేవల్ని అన్ని నగరాలకీ విస్తరించాలన్న ఆలోచనకి టెక్నాలజీని జోడించి ‘ఓఎన్‌ఎన్‌ బైక్స్‌’ని ప్రారంభించారు. ఈ సంస్థ మామూలు వినియోగదారులతోపాటూ బైకుల అవసరం ఎక్కువగా ఉన్న స్విగ్గీ, జొమాటాలాంటి సంస్థలకీ గంపగుత్తగా అద్దెకిచ్చి లాభాల బాట పట్టింది. రాయల్‌పాండా, డ్రైవ్‌ కెఫే వంటి సంస్థలూ విలాసవంతమైన బైకుల్ని అద్దెకిస్తూ తమదైన ముద్రవేస్తున్నాయి. వీటిమధ్య పోటీ పెరిగేకొద్దీ వినియోగదారులకి మరింత మంచి సేవలు అందివస్తున్నాయి.

ఎన్నెన్ని ఆఫర్లో..!
ముందుగా ఈ సంస్థలన్నీ విలాసవంతమైన బైకుల్నే తమ ప్రధాన ఆకర్షణగా చూపిస్తున్నాయి. హార్లీ డేవిడ్‌సన్‌తో ఓ సంస్థ ఊరిస్తే... ఇంకొకటి ‘కవాసాకి నింజా’తో కవ్విస్తోంది. ఒకరు ట్యాంకు నిండుగా పెట్రోల్‌ నింపి ఇస్తామంటే ఇంకొకరు... ఒకటికి రెండు హెల్మెట్‌లని ఇచ్చేస్తామంటున్నారు. ఈ సంస్థలు మొదట్లో బైకుల ధరల్ని బట్టి పాతికవేల దాకా డిపాజిట్టు తీసుకునేవి! కానీ పోటీపెరిగాక అలాంటి నిబంధనల్ని మానుకుని జీరో డిపాజిట్‌ నినాదాన్ని తెచ్చాయి. జీపీఎస్‌ టెక్నాలజీ సాయంతో అద్దెకు తీసుకున్నవాళ్లపైన ఓ కన్నేసి ఉంచుతున్నాయంతే. ప్రారంభంలో రోజుకీ, వారానికీ మాత్రమే బైకుల్ని అద్దెకిచ్చేవి. పోటీ కారణంగా వాటిని నెలకీ, మూడునెలలకీ పెంచేశాయి. హార్లీ డేవిడ్‌సన్‌, కవాసాకి నింజా, యమహా ఎంటీ 15, టీవీఎస్‌ అపాచీ 160 4వి వంటి ‘మ్యాచో’ బళ్లతోపాటూ హోండా సీబీఆర్‌, పల్సర్‌, హోండా 160, యాక్టివా వంటివాటినీ అద్దెకిస్తున్నారు. ఇక రోజువారీ అద్దె విషయానికొస్తే బైకుల్ని బట్టి ఎక్కువలో ఎక్కువగా రూ.600 వరకూ తీసుకుంటున్నారు. రోజంతా వద్దనుకుంటే కనీసం నాలుగు గంటల వరకు మాత్రమే కొన్ని సంస్థలు అద్దెకిస్తున్నాయి. ఇందుకు గంటకి రూ.50 వంతున వసూలు చేస్తున్నాయి. ఈ సంస్థల వాళ్లు ఒక్క ఫోన్‌ చేస్తే ఇంటి వద్దకే తెచ్చిస్తారు. మనకు లైసెన్స్‌ ఉంటే డాక్యుమెంట్లతోపాటూ వాహనాన్నీ మన చేతిలో పెట్టి వెళతారు. మధ్యలో సర్వీసింగ్‌ అవసరమైనా వాళ్లే వచ్చి చేస్తారు.


నాటి కూలీల చేతులు... వీణలు చేస్తున్నాయి!

శాస్త్రీయ సంగీత వాయిద్యాలని తయారుచేసే కుటుంబాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. బొబ్బిలి వీణ, తంజావూరు వీణల వంటివాటిని తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందినవారే చేస్తుంటారు. కానీ పశ్చిమ బంగలోని దాద్‌పుర్‌కి చెందిన సితార్‌ తయారీదారులు మాత్రం తరాలనాటి వారసత్వానికి సొంతదారులు కాదు... ఒకప్పుడు రెండ్రూపాయల కూలీ కోసం రోజంతా సీమ పెంకులు చేసినవాళ్లు. నేడు అంతర్జాతీయంగా సంగీతపరికరాలని ఎగుమతిచేస్తున్నారు!

భారతదేశ చరిత్రతో ఎంతోకొంత పరిచయం ఉన్నవాళ్లందరికీ 1941 నాటి బెంగాల్‌ ఘోర కరవు గురించి తెలిసే ఉంటుంది. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం బెంగాల్‌ని నిలువునా చీల్చడం, విచక్షణలేని పన్ను విధానాలతో గ్రామాల్లోని ఆహారధాన్యాలన్నింటినీ తీసుకోవడం... అందుకు ప్రధాన కారణాలు. ఆ కరవు కారణంగా నాటి అధికార లెక్కల ప్రకారమే 30 లక్షలమంది చనిపోయారని అంచనా. అలా నాలుగోవంతు జనాభాని కోల్పోయిన బెంగాల్‌ గ్రామాల్లో ఒకటి దాద్‌పుర్‌.
కోల్‌కతాకి 40 కిలోమీటర్ల దూరాన... హౌరా జిల్లాలో ఉండే చిన్నగ్రామం అది.

వ్యవసాయంపైన పూర్తిగా ఆశలు కోల్పోయిన అక్కడి గ్రామస్థులు అప్పట్లో పొట్టకూటి కోసం ఎన్నోదారులు వెతికారు. వాళ్లకప్పుడు కనిపించిన మార్గాల్లో ఒకటి... ‘సీమ పెంకులు’ చేయడం. అప్పట్లో ప్రభుత్వ భవనాల నిర్మాణంలో ఈ పెంకుల్నే ఉపయోగించాలనే రూల్‌ ఉండేది. అలా కోల్‌కతాలోని ఓ ఫ్యాక్టరీ దానికి కాంట్రాక్టు తీసుకుంటే వాళ్లకి సీమపెంకుల్ని తయారుచేసే పనిని ఈ గ్రామస్థులు చేసిపెట్టారు. ఊళ్ళోని పిల్లాజెల్లా ముసలీముతకా అందరూ పెంకులు తయారుచేయడం మొదలుపెట్టారు. హుగ్లీ నదీ తీరం నుంచి బంకమట్టి తెచ్చి, వాటిని మెత్తగా చేసి, అచ్చుల్లో వేసి కొలిమిలో కాల్చి పెంకులుగా సిద్ధం చేసేవాళ్లు. ఎర్రటి ఎండని సహిస్తూ అంతకన్నా ఎక్కువగా శరీరాన్ని దహించే కొలిమి దగ్గర రోజంతా పనిచేస్తే రెండురూపాయలు కూలీగా ఇచ్చేవారు. 1980ల వరకూ ఆ గ్రామస్థులకి అదే ప్రధాన ఉపాధి. ఆ రాతని మార్చి... మట్టిపిసికిన ఆ చేతులతోనే మధురస్వరాలని పలికించే వీణలకి ప్రాణం పోయించాడు తారాపద హల్దార్‌! ప్రస్తుతం ఈ గ్రామంలో తయారుచేసే తీగవాయిద్యాలు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ వంటి దేశాలకి ఎగుమతి అవుతున్నాయంటే కారణం ఆయనే!

టీ షాపులో పనిచేసేవాడు...
తారాపద హల్దార్‌ది కూడా దాద్‌పుర్‌ గ్రామమే. ఆరేళ్లప్పుడే అక్కడి సీమపెంకుల తయారీలో కూలీగా చేరాడు. అక్కడ పనిచేయలేక పారిపోయి కోల్‌కతాకి చేరుకున్నాడు. ఆ నగరంలోని గిరీష్‌పార్కు దగ్గరున్న ఓ టీ షాపులో కప్పులు కడుగుతుండేవాడు. కోల్‌కతాలో అప్పట్లో సితార్‌లని విక్రయించే ‘రాధాకృష్ణ శర్మ అండ్‌ కంపెనీ’ యజమాని దృష్టిలో పడ్డాడు. ఆయన తారాని తన సంస్థలో కూలీకి చేర్చుకున్నాడు. ఏడేళ్ల వయసులో అందులో చేరిన తారా మెల్లగా సితార్‌ వాయిద్యాలని తయారుచేయడం నేర్చుకున్నాడు. 15 ఏళ్లకే అందులో నిపుణుడయ్యాడు. మరో రెండేళ్లకి కంపెనీ లక్నో బ్రాంచిలో సితార్‌ తయారీని పర్యవేక్షించే స్థాయికెళ్లాడు. మంచి జీతం వచ్చేది. కానీ ఈ విద్యతో తాను మాత్రమే బాగుపడితే సరిపోదనుకున్నాడు తారా. దాని ఆసరాతో తన గ్రామాన్ని దారిద్య్ర కోరల నుంచి బయటపడేయాలనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి... సొంత గ్రామంలోనే తన ఇంట్లోనే వాటి తయారీని ప్రారంభించాడు. గ్రామంలోని ప్రతి గడప నుంచి ఒకర్ని పిలిచి సితార్‌ల తయారీని నేర్పించడం మొదలుపెట్టాడు. తయారైనవాటిని కోల్‌కతా, బెనారస్‌, లఖన్‌వూలలో వ్యాపారులకి అమ్మడం మొదలుపెట్టాడు. మెల్లగా ఆయన కొడుకులూ, శిష్యులూ వేర్వేరుగా ఫ్యాక్టరీలని పెట్టి వీటి తయారీని చేపట్టారు. అలా గత 35 ఏళ్లలోనే ఇక్కడ పది సంగీత పరికరాల ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. సితార్‌, వీణలాంటి వాయిద్య పరికరాలకి కావాల్సిన పెద్ద బూడిదగుమ్మడి(కలాబాష్‌), దేవదారు, టేకు చెట్ల సాగుని పొరుగు గ్రామాలు చేపడుతున్నాయి. పరికరాలకి కావాల్సిన తీగల వంటివాటినీ ఈ చుట్టుపక్కలే తయారుచేస్తున్నారు.

ఒక్క సితారే కాదు...
మొదట్లో సితార్‌లని మాత్రమే తయారుచేసినా తర్వాత్తర్వాత తంబురా, రుద్రవీణ, దిల్‌రుబా, సరోద్‌, రుబాబ్‌లనూ తయారుచేసివ్వడం మొదలుపెట్టారు. వీటిల్లో వాడే కలపని బట్టి ఒక్కోదాని ధర రూ.9 వేల నుంచి రూ.50 వేలదాకా ఉంటుంది. ప్రతి ఫ్యాక్టరీలోనూ నెలకి కనీసం పాతికదాకా వాయిద్యాలు తయారుచేస్తారు. పనిచేసే ప్రతిఒక్కరికీ కనీసం రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా ఆదాయం ఉంటోంది. డబ్బు విషయం పక్కనపెడితే 1980ల దాకా సీమపెంకుల కూలీకి వెళ్లినతాము... ఇప్పుడు సంగీత ప్రపంచానికి తమవంతు సేవలు అందించడం గర్వంగా ఉందంటున్నారు దాద్‌పుర్‌ వాసులు. అందుకే పదిహేడేళ్లకిందట చనిపోయిన తారాపదని ఇప్పటికీ ఓ దేవుడిలా చూస్తున్నారు!


మీకు తెలుసా!

కూల్‌డ్రింక్‌ బాటిల్‌ క్యాప్‌ ఓపెన్‌ చేస్తే ఆ మూతలో ప్లాస్టిక్‌ లేయర్‌ ఒకటి ఉంటుంది, చిన్నప్పుడు దాన్ని బయటకు లాగి తీసి ఆడుకునేవాళ్లం. నిజానికి అది లేకపోతే కూల్‌డ్రింక్‌లోని కార్బన్‌డయాక్సైడ్‌ మొత్తం బయటకు పోతుందట! గ్యాస్‌ను సీల్‌ చేసి ఉంచేది ఇనుప మూత కాదు, ఈ ప్లాస్టిక్‌ లేయరే.


అలాగా!

పిల్లలకు చిన్నప్పుడు త్వరగా మాటలు నేర్పడానికీ నడక నేర్పడానికీ తెగ ఆరాటపడతాం. అవి వచ్చాకేమో ‘నోర్మూసుకో, కదలకుండా కూర్చో’ అంటాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు