close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కదిలించే కథలు

‘తాతా కథ రాశాను చూస్తావా’ అంటూ పిచ్చి గీతలు గీసిన కాగితం పట్టుకొచ్చిన ఓ చిన్న పిల్లాడు ఆ పెద్ద మనిషి కళ్లు తెరిపించాడు. ‘మా అబ్బాయి స్పెషల్‌ చైల్డ్‌, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని...’ అంటున్న ఆ అబ్బాయి తండ్రి మాటలు కొరడాతో చెళ్లున కొట్టినట్లు అతడికి ఎందుకు అనిపించాయో ‘శిశిర కుసుమం’ కథ చెబుతుంది. సందీప్‌, సురభి ఉద్యోగస్తులు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకునే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి పెటాకులదారి పట్టినప్పుడు బామ్మ కోరిన ఒక్క కోరిక వారి బంధాన్ని ఎలాంటి మలుపు తిప్పిందో చెప్పే కథ ‘సప్తపది’. బయటకు కన్పించే పనులను చూసి మనిషిపై ఒక అభిప్రాయానికి రాకూడదంటుంది ‘నివురు.’ 2019 సంవత్సరంలో వివిధ పత్రికల్లో వచ్చిన మంచి కథలను ఏరి ప్రచురించిన ఈ సంకలనంలో 15 కథలున్నాయి. అన్ని కథలూ పాఠకుడిని కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి.

- పద్మ
తెలుగు కథానిక 2019
సంపాదకులు: ఎమ్‌.ఆర్‌.వి.సత్యనారాయణమూర్తి
పేజీలు: 114; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9848663735


ఊరి కబుర్లు

ట్టిగ తిరిగితే ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూసుడు అయిపోతది- అనే రచయిత ఆ ఊరి గురించి కథలుగా చెప్పిన జ్ఞాపకాలివి. పెద్దయ్యే క్రమంలో తన అనుభవాల్నీ, ఊరితో అల్లుకున్న బంధాల్నీ గుర్తు చేసుకుంటూ నల్లగొండ మాండలికంలో చెప్పిన కబుర్లు. అమ్మానాన్నల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం కానీ, వాళ్ల గురించి నాలుగు మాటలు రాయడం అరుదు. కష్టజీవీ అమాయకుడూ అయిన తండ్రి గురించి రాశాక ‘ఇన్నేండ్లల్ల ఎప్పుడూ కానిది మా నాన్నకి దగ్గరైనట్లనిపించింది’ అనుకుంటాడు. చదువు లేకపోయినా సంసారాన్ని తెలివిగా నెట్టుకొచ్చిన తల్లిది పెద్ద కథ అంటూనే ఇవాళ తాను ఏ కథ చెప్పినా అది అమ్మ దగ్గర నేర్చుకున్నట్లే ఉంటదని చెబుతాడు. నిండా మూడు పదులన్నా నిండని వయసులో బాల్య జ్ఞాపకాలని రాస్తుంటే తనకి తాను మళ్లీ దొరికినట్లుఅనిపించడం సహజమేగా!

- శ్రీ
నల్లగొండ కథలు
రచన: వి.మల్లికార్జున్‌
పేజీలు: 150; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9912460268


పీవీ జీవిత చరిత్ర

పీవీ ప్రధాని అయిన కొద్ది రోజులకే దిల్లీలో పాత్రికేయుడిగా అడుగుపెట్టిన రచయిత ఆయనను దగ్గరగా పరిశీలించి రాసిన పుస్తకం ఇది. సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పీవీ ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చిన పరిస్థితులతో మొదలుపెట్టి ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ ఆర్థిక, సామాజిక పరిణామాలను మలుపు తిప్పిన విధానాన్నీ పార్టీలో ఉన్న వ్యతిరేక శక్తుల్నీ బయట ప్రతిపక్షాలనూ ఎదుర్కొనడానికి ఆయన అవలంబించిన వైఖరినీ విశ్లేషించారు. ‘సోషలిస్టు కార్య క్రమాన్ని అమలుచేసే క్రమంలో నేను ఒక ఉద్యోగాన్ని(సీఎం పదవి) పోగొట్టు కున్నాను, ఉదారీకరణను అమలుచేసే క్రమంలో మరో పదవి(ప్రధాని)ని పోగొట్టుకున్నా’నని పీవీ అన్న మాటల వెనక ఉన్న అన్ని కోణాలనూ ఇందులో వివరించారు.

- సుశీల
విప్లవ తపస్వి పి.వి.
రచన: ఎ.కృష్ణారావు
పేజీలు: 224; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు