
ఇది రేగు పండ్ల కాలం. కానీ వాటిని ఏదో సరదాగా తినడమే తప్ప, ఓ ఆరోగ్యకరమైన పండుగా గుర్తించి తినేవాళ్ల సంఖ్య తక్కువ. కానీ రేగు పండ్లలో ఔషధ గుణాలనేకం అంటున్నారు ఆయుర్వేద, అల్లోపతీ వైద్యనిపుణులు. అన్నింటికన్నా ముఖ్యంగా అత్యధిక శాతం ఎదుర్కొనే నిద్రలేమి సమస్యకి చక్కని మందు రేగు అంటున్నాయి తాజా పరిశోధనలు. ఈ పండ్లలోని ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు నిద్ర పట్టేలా చేయడమే కాదు, మెదడు పనితీరునీ ప్రభావితం చేయడం ద్వారా ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల్ని తగ్గిస్తాయట. వీటి గింజల నుంచి తీసిన తైలం మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి వాటినీ నివారిస్తుందని తేలింది.
* రేగుపండ్లలోని పాలీశాకరైడ్లు పొట్టలోని మంటని తగ్గిస్తాయి. ఇంకా రోగనిరోధకశక్తిని పెంచి క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి.
* వీటిల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరుకి తోడ్పడుతుంది. తద్వారా బీపీ, హృద్రోగ సమస్యలు రాకుండా చేస్తుంది.
* రోజూ రెండుమూడు రేగుపండ్లు తినే వాళ్లలో అల్సర్లూ గ్యాస్ట్రిక్ సమస్యలూ రావట. మలబద్ధకం కూడా ఉండదు.
* ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్-ఎ, సిలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని కాల్షియం, పాస్ఫరస్ ఖనిజాలు ఎముక సమస్యలు, నాడీసంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకి ఎంతో మేలు చేస్తాయి.
* ఈ పండ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, దద్దుర్లు... వంటి చర్మసంబంధ సమస్యల్నీ నివారిస్తాయట.
పొట్టలోని బ్యాక్టీరియాతో కరోనా!
పొట్టలోని బ్యాక్టీరియాకీ మెదడు పనితీరుకీ సంబంధం ఉందని ఇప్పటికే కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది. ముఖ్యంగా ఊబకాయం, ఆల్జీమర్స్, డిప్రెషన్ వంటి సమస్యలకి ప్రధాన కారణం బ్యాక్టీరియా లోపమే అంటున్నారు. అయితే కొత్తగా కొవిడ్ తీవ్రతకీ బ్యాక్టీరియానే కారణం అంటున్నారు ఇలినాయిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వందమంది రోగుల్నీ ఆరోగ్యంగా ఉన్న మరో వందమందినీ గమనించారట. ఆరోగ్యంగా ఉండేవాళ్లలో ఉండే బైఫిడొబ్యాక్టీరియా, పీకలిబ్యాక్టీరియా, యుబ్యాక్టీరియా... వంటి బ్యాక్టీరియా రకాలు కొవిడ్ రోగుల్లో కనిపించలేదట. వీటికి బదులుగా వాళ్లలో రుమినోకాకస్, బ్యాక్టీరియోడ్స్ వంటివి ఉన్నాయట. దీన్నిబట్టి రోగనిరోధకశక్తిని పెంచే బ్యాక్టీరియాలోని అసమతౌల్యం వల్లే కొందరిలో కరోనా సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట. వాళ్లలో కొవిడ్ వచ్చి తగ్గిన కొన్ని నెలల తరవాతా బ్యాక్టీరియాలో అసమతౌల్యం అలాగే ఉందట. అదేసమయంలో రోగనిరోధకశక్తిని పెంచే బ్యాక్టీరియా ఉన్నవాళ్లలో కొవిడ్ ప్రభావం తక్కువగా ఉంది. దాంతో కొవిడ్ రావడానికే కాదు, వచ్చాక త్వరగా తగ్గకపోవడానికి కారణం కూడా పొట్టలోని బ్యాక్టీరియా అసమతౌల్యమే అంటున్నారు పరిశోధకులు.
పిల్లల్లో బుద్ధిమాంద్యం ఎందుకంటే..!
అమ్మానాన్నలిద్దరూ ఆరోగ్యంగా తెలివితేటలతో ఉన్నా వాళ్లకు పుట్టే పిల్లల్లో బుద్ధిమాంద్యం వచ్చిన కేసులు కనిపిస్తుంటాయి. దీనికి ఇంతవరకూ సరైన కారణాన్ని గుర్తించలేకపోయింది శాస్త్ర ప్రపంచం. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు తండ్రుల జన్యువులే కారణం అంటున్నారు. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లల తండ్రుల్ని ఎంపికచేసి నిశితంగా గమనించగా- అందులో 28 శాతం పిల్లల తండ్రుల వయసు 40- 49 ఉండగా మిగిలిన 72 శాతం మంది పిల్లల తండ్రుల వయసు యాభై దాటిందట. దాంతో ఆటిజంతో బాధపడే పిల్లల తండ్రుల జన్యు క్రమాన్ని ఆటిజంలేని పిల్లల తండ్రుల జన్యువులతో పోల్చి చూశారు. అందులో మామూలుగా ఉన్న పిల్లల తండ్రుల శుక్రకణాల్లోని జన్యువుల పనితీరు సరిగానే ఉందనీ అదే ఆటిజంతో బాధపడే తండ్రుల జన్యువుల్లో తేడాలు స్పష్టంగా ఉన్నాయనీ తేలింది. దీన్నిబట్టి వయసు పెరిగేకొద్దీ వాతావరణ పరిస్థితులు, జీవనశైలి కారణంగా పురుషుల్లో కొన్ని రకాల జన్యువుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందనీ ఆ కారణంతోనే పిల్లల్లో ఆటిజం వస్తుందనీ భావిస్తున్నారు.
మధుమేహం తగ్గుతుందా?
డయాబెటిస్ వచ్చినవాళ్లకి అది తగ్గడం అనేది ఓ పట్టాన సాధ్యం కాదు. కానీ తక్కువ పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే కొంతకాలానికి మధుమేహం తగ్గే అవకాశం ఉందంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. సాధారణంగా ఎవరైనాగానీ రోజూ తీసుకునే ఆహారంలో పిండిపదార్థాల శాతమే ఎక్కువ. కాబట్టి వాటి నుంచే శరీరానికి అవసరమయ్యే క్యాలరీలు లభిస్తాయి. ఇందుకు భిన్నంగా కొందరు మధుమేహ రోగుల్ని ఎంపికచేసి వాళ్లకు ఏడాదిపాటు తక్కువ పిండిపదార్థాలు- అంటే, క్యాలరీలు తక్కువ ఉండే పండ్లూ కూరగాయల్ని ఇచ్చారట. మరో వర్గానికి మామూలు ఆహారాన్నే ఇచ్చారట. ఏడాది తిరిగేసరికల్లా తక్కువ పిండిపదార్థాలున్న ఆహారం తీసుకున్నవాళ్లకి డయాబెటిస్ 32 శాతం తగ్గిందట. సాధారణ ఆహారం తీసుకున్నవాళ్లలో వ్యాధి అలాగే ఉంది. దీన్నిబట్టి ఇదిలానే కొన్నేళ్లపాటు కొనసాగిస్తే డయాబెటిస్ పూర్తిగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. పైగా ఈ రకమైన ఆహారం తీసుకున్నవాళ్లకి కొలెస్ట్రాల్ కూడా తగ్గింది.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్