
కిట్టూ విస్సాప్రగడ... నేటి కుర్రకారు మెచ్చిన గీతరచయిత. ‘ఉండిపోరాదే’(హుషారు), అరెరే మనసా(ఫలక్‌నుమా దాస్), తరగతిగది దాటి(కలర్‌ఫొటో)... ఈ పాటలన్నీ తనవే. సినిమాలపైన ఆసక్తి ఉన్నా అందరిలాగే ఇంజినీరింగ్ చదవడం, ఆ రంగం నచ్చక వెండితెరవైపు రావడం, చావోరేవో అన్నట్టు పోరాడటం... కొత్తతరం కళాకారుల ప్రయాణం ఇంచుమించు ఇలాగే ఉంటోంది. కాకపోతే, ఆ క్రమంలో ఎదుర్కొన్న కష్టాల తీవ్రతే వాళ్ల విజయాల విలువని పెంచుతోంది! అలా చూస్తే కిట్టూ విజయాలు అమూల్యమైనవి. ఎందుకో చూడండి...
నా పూర్తి పేరు రవికృష్ణ కానీ, ఆ పేరుతో మా అమ్మ బాగా కోపంవచ్చినప్పుడు తప్ప పిలవదు. మిగతా అప్పుడు ముద్దుగా కిట్టూ అనే పిలిచేది. దాంతో అందరికీ అదే అలవాటైంది.
మాది అమలాపురం. నాన్న వినాయకరావు అక్కడ బీఎస్ఎన్ఎల్లో ఆపరేటర్‌గా పనిచేసేవారు. ఆ తర్వాత రాజమహేంద్రికి బదిలీ అయ్యింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచీ నాన్నని ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తీవ్రంగా కామెర్లు వచ్చి నెలల తరబడి ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వచ్చింది. అందువల్ల ఆర్థికంగా చితికిపోయాం. నాన్న పనికెళ్లడం మొదలయ్యాక కూడా ఇంటి అద్దె, ఇతర ఖర్చుల్ని భరించలేక బాగా ఇబ్బంది పడ్డాం. నాన్నకి అప్పట్లో ఓవర్‌టైం చేస్తే గంటకి నాలుగు రూపాయలిచ్చేవారు. అందుకోసం రోజూ ఆరుగంటలపాటు ‘ఓటీ’లోనే ఉండేవారాయన. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులున్నా నన్ను రాజమండ్రిలో బాగా పేరున్న స్కూల్లో చేర్పించారు. ఎప్పుడూ క్లాస్‌లో నేనే టాపర్‌ని. బీటెక్‌లో వర్సిటీ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించిన రోజు మా ఇంట్లోవాళ్లకి ముఖ్యంగా నాన్న ఆనందానికి అవధుల్లేవు. కాకపోతే ఆ సంతోషాన్ని ఆయనకి ఎక్కువకాలం మిగల్చలేకపోయాన్నేను. ‘నా కడుపున చెడబుట్టావురా!’ అని తిట్టేస్థాయికి తీసుకెళ్లాను. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద సంస్థలు పంపిస్తున్న ‘కాల్ లెటర్స్’ని చించిపారేస్తుంటే... అప్పటిదాకా ఎంతో శ్రమించి చదివించిన ఏ తండ్రి మాత్రం ఊరుకుంటాడు చెప్పండి! కానీ అప్పట్లో ఆ తప్పు చేయకతప్పలేదు. అందుకు కారణం... సినిమాయే!
సాహిత్యంతోనే మొదలు...
చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. ఆ లోటుని మా అమ్మమ్మ తీర్చేది. కథలు అద్భుతంగా చెప్పేది. పేదరాశి పెద్దమ్మ కథల్నే పాటలుగా పాడేది! ఆమెని చూసి నేనూ నాకు తెలిసిన మామూలు విషయాలనే పాటలుగా పాడటం మొదలుపెట్టాను. అమలాపురం వెళ్లినప్పుడల్లా పండగలప్పుడు నిర్వహించే తోలుబొమ్మలాటలూ, నాటకాలూ నాకు భాషపట్లా, సాహిత్యంపట్లా అనురక్తిని పెంచాయి. పదో తరగతికి వచ్చేటప్పటికే గీత రచయితనైపోయాను. అప్పట్లో విన్న సిరివెన్నెలగారి ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..!’ పాట నా మనస్సుని కుదిపేసింది. పాటలంటే నిద్రపుచ్చేందుకూ, ఆనందాన్నిచ్చేందుకూ మాత్రమే అనుకుంటున్న నాకు... వాటితో స్ఫూర్తినీ నింపొచ్చని ఆ పాటతోనే తెలిసింది. ఇంజినీరింగ్ మూడో ఏడాదప్పుడు ఓసారి ఇంటర్-కాలేజీ షార్ట్‌ఫిల్మ్ పోటీలు జరిగాయి. నేను ఏదో రాస్తుంటానని తెలిసిన నా స్నేహితురాలు ఒకమ్మాయి... వాళ్లింట్లో ఉన్న కెమెరా తీసుకొచ్చి నాకిచ్చి పోటీల్లో పాల్గొనమని చెప్పింది. తన మాటని కాదనలేక అప్పటి కప్పుడు కథ రాసి దాన్ని చిత్రంగా తీశాను. మొదటి బహుమతి నాకే వచ్చింది. అక్కడే కాదు దాదాపు పాతిక కాలేజీల్లో నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విజేతగా నిలిచింది. అలా ఓసారి వైజాగ్ కాలేజీ ఫెస్ట్‌కి వెళ్లినప్పుడు అక్కడే నాగచైతన్య ‘జోష్’ సినిమా ప్రమోషన్ కోసం ఓ టీవీ కార్యక్రమం జరుగుతోంది. సినిమావాళ్లు వచ్చారన్న ఉత్సుకతతో ముందు వరసలోకి వెళ్లినిల్చున్నాను. వ్యాఖ్యాత సడన్‌గా ‘సినిమా గురించి ప్రేక్షకుల్లో ఎవరైనా మాట్లాడొచ్చు. బాగా మాట్లాడినవాళ్లని ఫైనల్స్‌లో హైదరాబాద్‌కి పిలుస్తాం!’ అని ప్రకటించాడు. ఎటో చూస్తున్న నన్ను గబుక్కున ‘నువ్వు తెలుగు చక్కగా మాట్లాడతావు కదా...!’ అని నా స్నేహితులు బలవంతంగా స్టేజీ మీదకు తోసేశారు.
అదో విషవలయం...
అప్పటికప్పుడు మాటల్ని కూడదీసుకుని వాటికి ప్రాసని చేర్చి ఆ సినిమా గురించి ఓ నాలుగు వాక్యాలు మాట్లాడి వచ్చేశాను. ఇంటికెళ్లిన రెండు మూడురోజులకి ఫోన్ వచ్చింది. ‘జోష్’ గురించి మాట్లాడిన ఐదొందల మంది కాలేజీ యువతలో పాతికమందిని ఎంపిక చేశారనీ అందులో నేనూ ఉన్నాననీ చెప్పారు. ఫైనల్ రౌండ్‌కి హైదరాబాద్‌కి రమ్మన్నారు. ‘మా సినిమా గురించే కాదు... మీ సొంత ప్రతిభ ఏదైనా ప్రదర్శించొచ్చు!’ అనీ చెప్పారు. దాంతో హైదరాబాద్ బస్సెక్కాను. ప్రయాణంలో ఆకాశంలోని ఓ నక్షత్రం నా వెంటే వస్తున్నట్టు అనిపించింది. ‘పాపం నక్షత్రం... చందమామ దగ్గరకి వెళ్లలేకపోతోంది’ అన్న ఊహ వచ్చింది. ఆ ఊహనే ‘నువ్వే నా లోకమంటూ...’ అన్న పాటగా రాశాను. ఆ కార్యక్రమంలో వేదికపైన దానికి నేనే బాణీకట్టి పాడాను. ప్రశంసలతోపాటూ... లక్షరూపాయల బహుమతీ ఇచ్చారు. ఆ రోజు వేదికపైనున్న జోష్ సినిమా దర్శకుడు వాసూ ‘గేయ రచయితకు కావాల్సిన లక్షణాలన్నీ నీకు ఉన్నాయమ్మా!’ అన్నారు. ఇంతలో దిల్‌రాజు మైక్ అందుకుని ‘ముందు చదువు పూర్తి చెయ్యి, ఆ తర్వాత సినిమా గురించి ఆలోచించు!’ అని చెప్పారు. కానీ నేనేమో ఆ క్షణం నుంచీ సినిమాలకి పాటలు రాయడమే లక్ష్యంగా చేసుకున్నాను. ఏడాది తర్వాత కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. నాకు వచ్చిన కాల్ లెటర్లన్నీ చింపేయడం మొదలుపెట్టాను. ఆ విషయం నాన్నకి తెలిసింది. నాకూ నాన్నకీ మధ్య మౌనయుద్ధమే సాగింది. చివరికి నాన్న మాటే విని... గూగుల్ ఉద్యోగినయ్యాను. కానీ ఏడాదిలోపే మనసు మళ్లీ పాటలవైపు పరుగులెత్తింది. దాంతో హైదరాబాద్ బస్సెక్కి దిల్‌రాజుగారి ఆఫీసుకెళ్లాను. ఆయన నన్ను గుర్తుపట్టి దర్శకుడు దశరథ్ దగ్గరకి పంపించారు. అప్పట్లో ఆయన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా తీస్తున్నారు. నేను వెళ్లినప్పుడు ‘ఆల్రెడీ... పాటలన్నీ పూర్తయిపోయాయి’ అని చెప్పారు. అక్కడి నుంచి బయల్దేరుతూ ఉంటే ఆయన దగ్గర అసిస్టెంట్‌గా ఉన్న ఒకతను పిలిచి ‘నాకో నిర్మాత తెలుసు...రా!’ అంటూ తీసుకెళ్లాడు. అలా ఒక్కరు కాదు ఇద్దరుముగ్గురు తగిలారు. వాళ్లెవరో నిర్మాతలమంటారు... పాటలు రాస్తే ట్యూన్ కట్టిస్తామని చెబుతారు... వచ్చేవారమే రికార్డింగ్ అనీ నమ్మబలుకుతారు! ఇదంతా నాలాంటి కొత్తవాళ్ల శ్రమని దోచుకునే జలగల గ్రూప్ అని తెలియడానికి నాకు కొన్ని నెలలు పట్టింది! కానీ సరైన ఛానెల్ ఎక్కడో ఉంటుందనిపించింది. దాని కోసం వెతకాలంటే ఉద్యోగం వదలడం ఒక్కటే దారనిపించింది. ఓ రోజు రాత్రి నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. కోప్పడతారనుకున్నాను కానీ ‘రెండేళ్లు పనిచేశాక కూడా నువ్విలా అడుగుతున్నావంటే... ఇక అక్కడ ఉండలేవు. సినిమాల్లోకే వెళ్లు..!’ అన్నారు. అంతే... గూగుల్‌లో నాకు రావాల్సిన సేవింగ్స్ మొత్తాన్నీ తీసి ఆయనకిచ్చేశాను. ‘నీకున్నాయా..?’ అనడిగారు నాన్న. ఉన్నాయన్నానుకానీ... నిజానికి నా దగ్గర ఒక్కపైసా లేదు అప్పుడు.
ఆ సంఘటన...
హైదరాబాద్‌లో నా క్లాస్మేట్స్ కొందరుంటే వాళ్ల రూములో తలదాచుకున్నాను. నాకు ఆర్కూట్‌లో పరిచయమైన అభిషేక్ మహర్షి వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా ఉంటే అతని దగ్గర సహాయకుడిగా చేరాను. నాదీ, మా చెల్లెలిదీ ఎడ్యుకేషన్ లోన్ తీరలేదుకాబట్టి ఇంటికి కచ్చితంగా ఐదువేల రూపాయలు పంపాల్సి వచ్చేది. పార్ట్‌టైమ్‌గా చేసి సంపాదించిందంతా అటు పోగా... నా దగ్గర పెద్దగా ఏమీ మిగిలేది కాదు. చిరుతిండితో పగలు గడిపేస్తే రాత్రుళ్లు అభిషేక్ టిఫిన్ పెట్టించేవాడు. అలాంటి సందర్భంలోనే... ఓ నిర్మాత నా చేత నాలుగు పాటలు రాయించుకున్నాడు. డబ్బుల కోసమని ఎన్నో సార్లు ఫోన్ చేస్తే ఓ రోజు ‘హైదరాబాద్ శివారు కందిలో షూటింగ్ జరుగుతోంది... అక్కడికి రా!’ అన్నాడు. అక్కడికెళ్లాక ‘మాకు జూనియర్ ఆర్టిస్టులు లేరు. ఓ చిన్న వేషం వేయి...!’ అన్నాడు. అలాగే వేషం వేశాను. షూటింగ్ పూర్తయింది. డబ్బులిస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్నాను. పొద్దుట్నుంచీ తిండి లేదు... అక్కడికి రావడానికి బస్సు ఛార్జీపోగా పదకొండు రూపాయలే జేబులో ఉన్నాయి. షూటింగ్ స్పాట్లో ఉన్న ఒకతన్ని అడిగితే ‘ఆయన ఎప్పుడో వెళ్లిపోయాడే!’ అన్నాడు. తట్టుకోలేకపోయాను... కాస్ట్యూమ్స్ విసిరికొట్టాను..! చెప్పులు వేసుకోబోతే తెగిపోయున్నాయి. కోపమో, దుఃఖమో తెలియని ఉద్వేగంలో కన్నీళ్లు కళ్లని కమ్మేస్తుంటే ఎటు నడుస్తున్నానో తెలియకుండా కాళ్లీడ్చుకుంటూ వెళ్లాను. ఓ బస్టాండ్‌లో నిల్చున్నాను.
అప్పుడు జరిగిందా సంఘటన... రోడ్డుకి అటువైపు వేగంగా వస్తున్న ఓ ఆటో బోల్తాపడింది. అక్కడున్న వాళ్లందరం ఆటోని పక్కకి తీసేటప్పటికే అందులో ఉన్న తండ్రీ ఒక బిడ్డా చనిపోయారు. తల్లినీ మరో పసిపాపనీ బయటకు తీశాం. ఆమె కాలు విరిగితే పక్కన కూర్చోబెట్టాం. ఆమె అంత బాధలోనూ ఏడుస్తున్న పాపని చటుక్కున ఒళ్లోకి తీసుకుని పాలు పట్టడం మొదలుపెట్టింది! తాను వెక్కివెక్కి ఏడిస్తే పాప పాలు తాగదేమో అన్న భయంతో... నవ్వు ముఖంతో పాపను లాలిస్తూ పాలిస్తున్న ఆమె నిబ్బరం నన్ను కదిలించింది. ‘ఉద్యోగంలో చేరితే ఇప్పుడైనా నెలకి లక్షలు సంపాదించగల నేను... ఓ చిన్న అవమానాన్నే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాను. సర్వస్వాన్నీ కోల్పోయి రేపు ఎలా ఉంటుందో తెలియని ఆ స్త్రీ అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతోంది. ఈమె కష్టం ముందు నా బాధ ఎంత! అనిపించింది!’ ఆ సంఘటన నా ఆలోచనని పూర్తిగా మార్చేసింది. అదే నా విజయానికి పునాది వేసింది.
ముందు మాటల రచయితగానే...
సంగీత దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ గారితో ఏర్పడ్డ పరిచయంతో 15 చిన్న సినిమాలకి పాటలురాశాను. విశ్వనాథ్‌గారి స్టూడియోకి వెళ్లినప్పుడు కలిసిన దర్శకుడు అరుణ్‌పవార్ నా మాటతీరు నచ్చి తన షార్ట్‌ఫిల్మ్‌కి సంభాషణలు రాయమన్నాడు. నందూ, గీతామాధురీలు నటించిన ‘అదితి’ అనే ఆ చిత్రం మాకందరికీ బాగా పేరుతెచ్చింది. అది చూసి చూసి ఎమ్మెస్ నారాయణగారి అమ్మాయి శశికిరణ్ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాకి మాటలూ, ఒక పాటా రాయమన్నారు. అప్పుడు పరిచయమైన దర్శకుడు సాగర్ ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత సుప్రియగారు పిలిచి... సుమంత్ హీరోగా ‘నరుడా డోనరుడా’ చిత్రానికి మాటలు రాసే అవకాశాన్నిచ్చారు. అందులో నేను రాసిన ‘తీరమే అలకై’ పాట కూడా బాగానే పాపులరైంది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘యుద్ధం శరణం’కీ, అఖిల్ హీరోగా చేసిన ‘హలో’కి సంభాషణల రచయితగా పనిచేశాను. ఆ తర్వాత... ‘అంతరిక్షం’ సినిమా చేశాను. సైన్స్ విషయాలని స్పృశిస్తూ డైలాగ్స్ రాయడం మరో ఛాలెంజ్ నాకు! ఆ సినిమా హిట్ అయ్యి మాటల రచయితగా నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ‘చి.ల.సౌ’, ‘హుషారు’, తాజాగా ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి సినిమాలు నన్ను యువతకి చేరువచేశాయి.
తిరిగి ఇస్తున్నాను...
నా ఫ్రెండ్ అభిషేక్ మహర్షి నాకు సాయం చేసేవాడని చెప్పాను కదా... ఓ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. అతని తల్లిదండ్రులు నా దైన్యం చూసి వాళ్లింట్లోనే ఉండిపొమ్మన్నారు. ఐదేళ్లున్నాను వాళ్లింట్లో! మహర్షి మరో స్నేహితుడు ‘నీకు నెలకి నాలుగువేలిస్తాను. ఏడాదిపాటు పోరాడు. ఆలోపు నీకు అవకాశాలు వస్తే డబ్బుతిరిగివ్వు... లేకపోతే ‘లైట్’ తీసుకో!’ అన్నాడు. ఆ ఇద్దర్నీ ఎప్పుడు తలచుకున్నా కన్నీళ్లు ఆగవు నాకు. వాళ్ల చేయూతతో ఈస్థాయికి వచ్చిన నేను... సమాజానికి తిరిగి ఇవ్వొద్దా! అందుకే నా స్నేహితురాలు స్థాపించిన ‘స్థిర’ అనే ఎన్జీఓతో కలిసి వలసకార్మికుల పిల్లలకి చదువుకి కావాల్సిన సమస్తం అందిస్తున్నాం. గత ఏడాదంతా వంద వలస కుటుంబాలకి కావాల్సిన నెలసరి సరకులని అందించాం. ఈ ఏడాది ఆ సేవల్ని మరిన్ని కుటుంబాలకి చేరువచేయాలనుకుంటున్నాను!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్