
ఐస్‌క్రీమ్‌లంటే పిల్లలకే కాదు, పెద్దలక్కూడా నోరూరిపోతుంది. తినడానికే కాదు, రంగు రంగుల్లో ఉండే కోన్ ఐస్‌క్రీమ్‌లు చూడ్డానికీ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక, మెత్తగా ఉండి కూర్చోవడానికి సౌకర్యంగా ఉండే బీన్ బ్యాగులన్నా అందరికీ ఇష్టమే. ఈ రెండిటినీ కలిపి ‘చిక్ సిన్ డిజైన్’ కంపెనీ రూపొందించిందే ‘ఫాలెన్ ఐస్‌క్రీమ్ బీన్ బ్యాగ్’. అచ్చం కారుతున్న ఐస్‌క్రీమ్‌లా ఉన్న ఈ బీన్ బ్యాగులు పెద్దలకే కాదు, చిన్నారులకీ బాగా నచ్చుతాయి. ఇవి హాల్లో ఉంటే చూడ్డానికీ ప్రత్యేకంగా ఉంటాయి కదూ!
ఇది బుక్‌మార్క్ పెన్!
పుస్తకాలు చదివేటపుడూ నోట్స్, డైరీలూ రాసేటపుడూ మళ్లీ అదే పేజీని సులభంగా తెరిచేందుకు వీలుగా బుక్‌మార్క్‌ని పెడుతుంటాం. అయితే, మనం రాసుకునే పెన్నునే సులభంగా అలా పెట్టేసుకోవచ్చు. కానీ అది లావుగా ఉండడంతో పడిపోతుంది. అదే ఈ ‘బుక్‌మార్క్ బనానా, ఓక్ పెన్’లు ఉంటే వీటితో అటు రాసుకోవచ్చు, ఇటు పలుచగా ఉంటాయి కాబట్టి బుక్మార్క్లుగానూ వాడొచ్చు. ఇవి చూడచక్కగానూ ఉంటాయి.
ఎక్కడైనా ప్రింట్ చెయ్యొచ్చు!
కప్పుల మీదా రుమాళ్ల పైనా ఇష్టమైన వారి పేర్లూ స్మైలీ బొమ్మలూ ఇంకా మన పెంపుడు జంతువుల ఫొటోలూ ప్రింట్ చేయించుకోవాలనిపిస్తుంది. కానీ ప్రతిసారీ షాపుకి వెళ్లి అలా వేయించుకోవడం కష్టం. అలాంటపుడు మన దగ్గరే బుల్లి ప్రింటర్ ఉంటే దాంతోనే నచ్చిన ప్రింట్‌ని ఎక్కడైనా చిటికెలో వేసుకోగలిగితే బాగుంటుంది కదా... అందుకోసం వచ్చిందే ఈ ‘ప్రిన్ క్యూబ్’. అరచేతిలో పట్టేంత చిన్నగా ఉండే దీన్ని వైఫై ద్వారా మన ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ఫోన్లోని ఏ సందేశం, ఫొటోలనైనా టోపీలూ కప్పులూ టీ షర్టుల్లాంటి వాటిపైన ప్రింట్ చేసుకోవచ్చు. వ్యాపారాలకు సంబంధించిన లోగోలనూ వేసుకోవచ్చు. మీకూ నచ్చిందా మరి!
పచ్చని ఫెన్సింగ్!
అపార్ట్మెంట్లైనా మామూలు ఇళ్లైనా బాల్కనీలను ఎక్కువగా ఇనుప గ్రిల్స్ లాంటి వాటితోనే కట్టిస్తుంటారు. సిమెంటుతో కట్టించిన గోడల్లోనూ కొన్నిటిలో డిజైన్‌లో భాగంగా పెద్ద పెద్ద ఖాళీలుంటాయి. బాగా చిన్న పిల్లలు ఉంటే ఆ సందుల్లోకి దూరే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే కొందరు ఏకాంతం కోసం బాల్కనీకి ఏదైనా అడ్డు ఉంటే బాగుంటుందనుకుంటారు. అందుకోసం వచ్చిందే ఈ ‘ఆర్టిఫిషియల్ ఫెన్సింగ్’. దీన్ని బాల్కనీ గ్రిల్స్‌కి అమర్చితే పిల్లలకు రక్షణగా ఉంటుంది. ఆకులూ పూల తీగల్లా చేసిన ఈ ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఇంటికి అలంకరణగానూ పనికొస్తుంది. ఇవి ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్