close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పారిజాత గిరిపై వెలసిన... శ్రీనివాసుడు

చుట్టూ పారిజాత వృక్షాలూ... ఆహ్లాదకర వాతావరణం నడుమ ఏడుకొండల్లో విరాజిల్లుతోంది గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. జంగారెడ్డి గూడెంలో ఉన్న ఈ క్షేత్రంలో వేంకటేశ్వరుడు.... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

పచ్చని పంటపొలాలూ.... ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య వెలసిన క్షేత్రమే వేంకటేశ్వరస్వామి ఆలయం. గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలిచే ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని తల్లా - దేవరపల్లి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తుంది. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న ఏడు కొండల్లో ఆరో కొండపైన స్వామి స్వయంభువుగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీ దేవి, ఎడమ భాగాన గోదాదేవి -ఆళ్వారాచార్యులు కొలువై కనిపిస్తారు. కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే... శ్రీనివాసుడు వెలసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడిని చూడొచ్చు. కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి, దుర్గ, సరస్వతి, గాయత్రీ దేవి ఆలయాలూ, గోశాలా ఉంటాయి. అదేవిధంగా మెట్ల మార్గంలో గణపతి, గోవింద రాజ స్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి రాయి పేర్చి గూడులా కడితే... చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందనీ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ భక్తుల నమ్మకం. ఆలయం చుట్టు పక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ గుడికి తిరుమల పారిజాత గిరి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

స్థలపురాణం
దాదాపు అరవైఏళ్ల కిందట చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఏడు కొండలలో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయనీ, అక్కడ ఆలయం నిర్మించమనీ చెప్పాడట. దాంతో ఆ భక్తుడు ఏడు కొండల్ని వెతికితే ఆరో కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయట. ఆ పాదాలు వెలసిన శిలనే విగ్రహంగా మార్చి... చిన్న మందిరంగా నిర్మించాడట. క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ... కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్లదారినీ నిర్మించారనీ అంటారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని గోకులమనీ, వేంకటేశ్వరస్వామి వెలసిన ప్రదేశం కావడం వల్ల తిరుమల అనీ, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాతగిరిగానూ పిలుస్తున్నారు భక్తులు.

తిరుమల తరహాలోనే అర్చనలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించిన తరహాలోనే ఇక్కడా పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. రోజూ త్రికాల పూజలతోపాటూ ప్రతి మంగళవారం స్వామికి బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన ఉంటుంది. శుక్రవారం నాడు అభిషేకం, ప్రతి నెలా పూర్వ ఫాల్గుణ నక్షత్రం రోజున గోదాదేవికీ ఉత్తర ఫాల్గుణ నక్షత్రం రోజున పద్మావతీ దేవికీ విశేష పూజలు చేస్తారు. వైశాఖ మాసంలో ఏడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలనూ స్వామికి నిర్వహించే కల్యాణాన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. అదే విధంగా ఆశ్వీయుజ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఏటా డిసెంబరు 16 నుంచి జనవరి 13 వరకు ధనుర్మాసంలో అధ్యయన ఉత్సవాల పేరుతో స్వామికి విశేష పూజల్ని చేస్తారు. ప్రధానంగా ధనుర్మాసంలో 27వ రోజున కూడారై అనే ఉత్సవం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఆ రోజున 108 గంగాళాలతో అక్కార్‌అడిశల్‌ అనే ప్రసాదం సమర్పిస్తారు.

ఎలా చేరుకోవాలంటే...
ఏలూరు లేదా రాజమహేంద్రవరానికి రైలులో వస్తే అక్కడి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి బస్సులూ, ప్రైవేటు వాహనాలూ ఉంటాయి.  జంగారెడ్డిగూడెం బస్టాండు నుంచి ఆటోల ద్వారా గుడికి చేరవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేటకు ఈ క్షేత్రం 25 కి.మీ. దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చు.

కందుల శ్రీనివాసరావు,
సహకారం: వందవాసు శ్రీనివాస్‌,
న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు