close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఆసుపత్రి... బూట్లూ బ్యాగుల కోసం!

మీరు ఊహించింది నిజమే! బూట్లనీ బ్యాగుల్నీ చక్కగా కడిగి, పరిమళాలద్ది, కొత్త రంగునీ హంగునీ జోడించే కేంద్రాలు కాబట్టే వీటిని ‘స్పా’లని అంటున్నారు. ఒక్క శుభ్రం చేయడమే కాదు అక్కడే వాటికి సకల మరమ్మతులూ చేసి కొత్తవే అన్నట్టు మారుస్తున్నారు. కనుక వీటిని ‘క్లినిక్కు’లనీ పిలుస్తున్నారు! దేశంలోని దాదాపు అన్ని మహానగరాల్లోనూ బూట్లూ, బ్యాగులకీ  సంబంధించిన ఈ ‘స్పా’లూ, క్లినిక్కులూ వస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ సేవలందిస్తున్నాయి.

బూట్లే కదా ఏవైతేనేం అనే రోజులు ఎప్పుడో పోయాయి! ఫార్మల్స్‌ అనీ, స్పోర్ట్స్‌ అనీ, ట్రాక్స్‌ అనీ రకరకాలవి వస్తున్నాయిప్పుడు. వేలాది రూపాయలు ధర పలుకుతున్నాయివి. ఇక, బ్యాగుల్ని అవసరానికన్నా ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా వాడుతున్నవాళ్లే ఎక్కువ. వీటిల్లో లక్షలరూపాయలు ఖరీదు చేసేవీ ఉన్నాయి. ఇష్టంగా అంత ధరపెట్టి కొనడంవల్లో, ఇష్టమైనవాళ్లు కానుకగా ఇచ్చినవి కావడంవల్లో... వాటితో ఏదో అనుబంధం ఉంటుంది మనకు! అలాంటివాటిల్లో ఏదైనా సమస్య వస్తే మిగతా వస్తువుల్లా అంత త్వరగా వదులుకోవడానికి మనసొప్పదు. రిపేరు చేయించాలంటే, వారెంటీ ఉన్నంత కాలం సమస్యలేదుకానీ ఆ తర్వాత పెద్ద షాపుల్లో వాటిని మరమ్మతు చేయరు. చిన్నాచితకా రిపేరు షాపులకిస్తే పాడు చేసేస్తారేమో అనే భయం పీడిస్తుంటుంది. అందుకే, వినియోగదారులు తమకు బాగా ఇష్టమైన షూలూ బ్యాగులను-చిన్న గీత పడిందనో కాస్త మరక ఏర్పడిందనో కుట్టు ఊడిందనో బటన్‌ పోయిందనో పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా మంచి ప్రమాణాలతో పాత బ్యాగులూ షూలని కొత్తవాటిల్లా మార్చి ఇస్తామంటున్నాయి ఈ ‘స్పా’లు!

చెన్నైకి చెందిన అభిషేక్‌ ధింగ్రా ఫిలిప్పైన్స్‌లో ఎంబీఏ చేశాడు. అక్కడ చదువుతున్నప్పుడు తన సహాధ్యాయి కుటుంబానికి పాత బూట్లని మరమ్మతులు చేసి అందించే షాపులు 160 దాకా ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయాడట. ఓసారి అలాంటి షాపు ఒకదానికెళితే షూలని రిపేరు చేయించు కోడానికి వచ్చినవాళ్లందరూ పేద్ద క్యూలో నిల్చుని ఉండటం చూశాడట! దాంతో, ఇలాంటి షాపులు మనదేశంలోనూ పెట్టాలనే ఆలోచనతో ఎంబీఏ పూర్తికాగానే చెన్నైలో ‘మిస్టర్‌ ప్రాంటో’ సంస్థని ప్రారంభించాడు అభిషేక్‌. గత పదిహేడేళ్లలో హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 13 శాఖల్ని ఏర్పాటుచేసి ఈ తరహా సంస్థల్లో దేశంలోనే తాము నంబర్‌ వన్‌ అని చెబుతున్నాడు. బూట్లకి సంబంధించిన హీల్‌ గ్రిప్‌ సరిచేయడం నుంచీ లెదర్‌ సోల్‌ మార్చడం దాకా 20 రకాల మరమ్మతుల్ని చేస్తారిక్కడ. మనం కోరితే వాటి రంగుల్నీ మార్చి అందిస్తారు. రిపేర్‌ని బట్టి రూ.250 నుంచి రూ.1300 వరకూ తీసుకుంటారు. ‘స్నీకర్‌ స్పా’ పేరుతో ప్రత్యేకంగా శానిటైజేషన్‌, వాటర్‌ప్రూఫింగ్‌, డియోడరైజేషన్‌ కూడా చేసిస్తారు. బ్యాగులవిషయానికొస్తే జిప్‌ సమస్యలూ, చిరుగులూ వంటివన్నీ సరిచేసి ఇస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇలాంటి సేవలే అందిస్తున్న మరో సంస్థ ‘ది లెదర్‌ లాండ్రీ’. దిల్లీకి చెందిన అక్కాచెల్లెళ్లు నేహాశర్మ, మల్లికా శర్మలు ఈ స్టార్టప్‌ వ్యవస్థాపకులు. అత్యంత ఖరీదైన లెదర్‌ షూలూ, బ్యాగులతోపాటూ జెర్కిన్‌లకి సంబంధించిన రిపేర్లని ఈ సంస్థ చేపడుతుంది. ఖరీదైన బ్యాగుని ఏళ్లపాటు ఒకే రంగులో వాడటం విసుగనిపిస్తే.. వాటి రంగుల్ని పూర్తిగా మార్చి(రీ-డైయింగ్‌) ఇస్తుందీ సంస్థ. విదేశాలకే పరిమితమైన ఈ రకం సేవల్ని తాము మాత్రమే అందిస్తున్నామంటున్నారు దీని వ్యవస్థాపకులు. ఇలాంటి ఆన్‌లైన్‌ స్పాలు మనదేశంలో డజనుకుపైగా ఉన్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు