
ఇచ్చట వాహనాలు నిలుపరాదు... అని రాసున్న బోర్డులు పట్టణాలూ, నగరాల్లో దాదాపు ప్రతి ఇంటి గేటుకీ వేలాడుతుంటాయి. సాధారణంగా కొన్ని వాణిజ్య సంస్థలు తమ ప్రకటనల్ని జోడించి ఇలాంటి బోర్డుల్ని పెడుతుంటాయి. ఆ ప్రకటనల స్థానంలో ఉపయోగపడే నంబర్లు ఉంటే మంచిదనుకున్నారు చెన్నై శివారులోని తిరుముల్లై వాయల్ పట్టణ వాసులు. పట్టణంలోని ‘వెంకటాచలం నగర్’ కాలనీ సంక్షేమ సంఘం ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకుని... సొంత ఖర్చులతో వాటిని ఏర్పాటుచేసింది. స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్‌తోపాటు సీనియర్ సిటిజన్లు, పిల్లలూ, మహిళల హెల్ప్లైన్లతో ఉన్న బోర్డులని పెట్టారు. కాలనీలో దాదాపు ప్రతి రోడ్డులోనూ ఇవి కనిపిస్తాయి.
అరకప్పు టీ... అరగ్లాసు నీళ్లు!
చాయ్ దుకాణానికి వెళ్లినపుడు చాలామంది డబ్బు ఆదా చేయాలని ఫుల్ టీకి బదులు అర కప్పు ఆర్డర్ ఇస్తారు. కానీ నీటి విషయంలో మాత్రం ఈ పొదుపు సూత్రాన్ని పాటించరు. ‘డబ్బు పొదుపు చేయడానికి కొన్ని మిల్లీ లీటర్ల చాయ్ విలువని గుర్తించి అర కప్పు టీనే తాగుతాం. అదే సమయంలో నీటి విలువని ఎందుకని గుర్తించం. ఎందుకంటే, నీరు ఉచితంగా వస్తుంది. కానీ ప్రతి నీటి బొట్టూ అమూల్యమైనదే. దాన్ని కాపాడుకోవాల్సిందే’ అని చెబుతాడు మందర్ కొల్హాపురే. కర్ణాటకలోని బెలగావికి చెందిన మందర్ ఈ విషయంలో ప్రజల్లో అవగాహన తేవడానికి ‘కటింగ్ పానీ...’ నినాదాన్ని తెచ్చాడు. బెలగావిలో అరకప్పు టీని ‘కటింగ్ టీ’ అంటారు. నీటి పొదుపు మీద అవగాహన కలిగిస్తోన్న వ్యక్తులు తాము అనుసరిస్తున్న విధానాల గురించి తెలియజేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలా వచ్చిన వాటిలోంచి మందర్ది ఉత్తమ ఆలోచనగా ప్రకటించింది. ‘బెలగాం ఫుడీస్’ పేరుతో ఫేస్బుక్ పేజీ నడిపే మందర్... గతేడాది ప్రారంభంలో ఈ నినాదంతో ముందుకు వచ్చాడు. ఆ నగరంలోని 200లకు పైగా హోటళ్లలో పూర్తిగా నింపిన నీటి గ్లాసులతోపాటు సగం నింపినవీ ఉంచేలా ఒప్పించాడు. హోటళ్లలో ‘కటింగ్ పానీ’ పేరుతో పోస్టర్లనీ అతికిస్తుంటాడు.
వ్యాక్సిన్ లాంటి కేకు
గతేడాది అంతా కరోనా సంవత్సరం అయితే... 2021ని వ్యాక్సిన్ నామ సంవత్సరం అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో తలమునకలై ఉన్నాయి. ఈ ట్రెండ్‌ని గుర్తించిన జర్మనీకి చెందిన ఓ బేకరీ సంస్థ వ్యాక్సిన్(సిరంజ్)ని పోలి ఉన్న కేకుల్ని అందుబాటులోకి తెచ్చింది. ‘ఇలాంటి కేకు తేవాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించి చివరకు తయారుచేశాం. మా వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు’ అని చెబుతున్నారా బేకరీ యజమాని. ఈ సంస్థ గతేడాది కరోనా వైరస్ రూపంలో బిస్కెట్లూ తెచ్చింది.
కారుని క్రేన్గా మార్చేశాడు!
కారు పాతదైతే ఏం చేస్తాం... అమ్మేసి కొత్తది కొంటాం. కానీ ఆ ఇంజినీర్ సైంటిస్టు దానికో కొత్తరూపం ఇవ్వాలనుకున్నాడు. తిరువనంతపురానికి చెందిన బెన్ జాకబ్... ఇస్రోలో శాస్త్రవేత్త. లాక్డౌన్ కారణంగా గతేడాది కొన్నాళ్లు ఇంటినుంచే పనిచేశాడు. అప్పుడే తన పాతకారుని క్రేన్గా మార్చాలనుకున్నాడు జాకబ్. ‘ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్లో పనిచేస్తున్నా. నాకున్న నైపుణ్యంతో కారుని క్రేన్గా మార్చాలనుకున్నా. అందుకు అవసరమైన విడి భాగాలను గుజరాత్ నుంచి తెప్పించా. కొన్ని పరికరాలకు రంధ్రాలను మాత్రమే స్థానిక వర్క్‌షాపులో చేయించా. మిగతా పనులన్నీ మా ఇంట్లో నేనే చేసుకున్నా. దీనికి కేవలం రూ.70 వేలు ఖర్చయింది’ అని చెబుతాడు జాకబ్. ఈ క్రేన్ 500 కేజీల బరువుని ఎత్తగలదు. అంతేకాదు, పొలాల్లో గుంతలు తవ్వడానికీ ఉపయోగ పడుతుంది. ఈ ప్రాజెక్టుద్వారా పాత వాటిని కొత్త రూపంలోకి మార్చి వినియోగించవచ్చనే విషయాన్ని చెప్పాలనేది తన ప్రధాన ఉద్దేశమంటాడు జాకబ్.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్