close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేను- నా రాజ్యం

-పెనుమాక నాగేశ్వరరావు

నోరుగలవాడిదే రాజ్యం అంటారుగానీ రాజ్యం నోరుతోనే నేను బతకగలుగుతున్నాననేది వాస్తవం. అవును! రాజ్యం నాకు భార్య అయిన తర్వాతే నామీద నాకు ఓ నమ్మకం, నాలో ధైర్యం, తద్వారా గర్వం ఏర్పడ్డాయి. వాళ్ల నాన్న ముగ్గురు ఆడపిల్లల తండ్రి. సామాన్యమైన సంపాదన. పస్తులతో పడుకోకపోయినా కష్టం సుఖం తెలిసిన కుటుంబం. ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ పొదుపుగా సంసారం చేసుకునే మనుషుల మధ్యనుంచి వచ్చింది. బహుశా అందుకే- నాకు నిలకడైన ఉద్యోగం ఉంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవనే కారణంగానూ, తన తర్వాత మరో ఇద్దరికీ పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రికి ఉన్నందువల్లనూ నన్ను చేసుకునేందుకు ముందుకు వచ్చి ఉంటుంది రాజ్యం.

అప్పటికి రాజ్యానికి ఇరవై ఒక్క సంవత్సరాలు. నాకూ, ఆమెకీ కూడా అవే మొదటి, చివరి పెళ్లిచూపులు. రాజ్యం నాకూ, నేను రాజ్యానికీ నచ్చాం. ఒకర్నొకరం మనసులోనే మెచ్చుకున్నాం. పెద్దల అంగీకారం కూడా అందడంతో మా పెళ్లి సజావుగా జరిగింది. ఓ నెలలోపే రాజ్యం కాపురానికి వచ్చింది. మా ఇల్లు ఆమెకి నచ్చింది. ఆమె రాక నా జీవితంలోకి వసంతం తెచ్చింది.
అందమైన భార్య... వయసులో ఉన్న భార్య... అయినదానికీ, కానిదానికీ పలుకరిస్తూ, పరవశిస్తూ, మధ్య మధ్యన కోపగిస్తూ, మందలిస్తూ, ఇల్లంతా కలియ తిరుగుతూ ఉంటే పురుషుడికి అంతకన్నా నేత్రానందం, హృదయానందం ఏముంటాయి.
రాజ్యం నన్ను చూసికాదు, నా ఉద్యోగం చూసి నన్ను పెళ్లి చేసుకుంటే, నేను రాజ్యం అందం కంటే తన తెలివితేటల్ని కనిపెట్టీ పెళ్లి చేసుకున్నాను. ఫేస్‌ ఈజ్‌ ద ఇండెక్స్‌ ఆఫ్‌ మైండ్‌ అని కదా అంటారు. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క మంచి పని ఏదయినా ఉంటే... అది రాజ్యాన్ని పెళ్లి చేసుకోవటమే అంటే బాగుంటుంది.
ఓ పక్కన అందచందాలూ, మరో పక్కన ప్రతిభా పాటవాలూ కలిగిన అరుదైన మనిషి రాజ్యం. పేరు పాతదే అయినా మనిషీ, మనసూ మాత్రం సరికొత్తవనే చెప్పుకోవాలి. పేరు సాఫ్ట్‌గా ఉన్నా మనిషి మాత్రం సో ఫాస్ట్‌. ఆలోచనలు అంతకన్నా ఫాస్ట్‌.
బమ్మిని తిమ్మినీ, తిమ్మిని బమ్మినీ చేయటం అంటారే... అలా చేయగలదు రాజ్యం. అయితే ఎవ్వరినీ మోసం చేయటం, మాయ మాటలు చెప్పటం రాజ్యం నైజం కాదు. మాటకారి. సమయస్ఫూర్తితో సందర్భోచితంగా మాట్లాడగలదు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోగలదు. కాగలకార్యం కానించుకోగలదు.

కిరాణా కొట్టులో సకాలానికి మేము డబ్బు చెల్లించలేకపోయినా, పనిమనిషి చెప్పాపెట్టకుండా నాలుగు రోజులు నాగా పెట్టినా, ఏ నెలలో అయినా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, చెత్త తీసుకువెళ్లే అతను ఏ పూట అయినా మా ఇంటి ముందు ఆగకుండా వెళ్లినా సతాయించగలిగిందీ, తన సాధింపుని సమర్దించుకునేదీ, సవరించుకునేదీ రాజ్యమే. మనదంతా మౌనమె నీ భాష ఓ మూగమనసా... అంతే.
గ్యాసు బండ తెచ్చే డెలివరీ బాయ్‌ దగ్గర్నుంచీ కాలువలు శుభ్రం చేసే అతని వరకూ దసరా మామూలు ఇచ్చేటప్పుడు చూడాలి రాజ్యం విశ్వరూపం.
నెల నెలా నాకు వచ్చే జీతం మొత్తం ఆమె చేతిలో పెట్టడంతో నా బాధ్యత తీరిపోతుంది. మిగిలిన కష్టాలన్నీ ఆమెవే. నాకు ఎటువంటి సంబంధం ఉండదు. చాలినా, చాలకపోయినా సర్దుకుపోవలసిన మనిషీ సరిపుచ్చుకోవలసిన మనిషీ రాజ్యమే. పాపం ఒక్కసారి కూడా నా ఆదాయం ఇంటి ఖర్చులకి చాలటం లేదు అని చెప్పలేదు. తినటానికి ఏ లోటూ లేకుండా చూస్తుంది. ఎప్పుడూ కళకళలాడుతూ ఇంటిని కూడా అలాగే ఉంచుతుంది. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు కదా!
బంధువులెవరైనా వస్తున్నారంటే కావలసిన ఏర్పాట్లన్నీ తనే చూసుకుంటుంది, చేసుకుంటుంది. నాకు ఆఫీసు పని తప్ప మరో బాధ్యత లేదు. నా విషయం అంతా ఆరు నెలలు కాదు ఆరు రోజుల్లో కాచివడపోసింది రాజ్యం. ఏ పనైనా నాకు చెప్పటం కంటే తానే చేసుకోవటం నయమని తేలిగ్గానే తెలుసుకుంది.
రాజ్యం మళ్లీ జన్మలో కూడా నన్నే భర్తగా కోరుకుంటుందో లేదోగానీ, నేను మాత్రం జన్మజన్మలకూ ఆమెనే భార్యగా కోరుకుంటాను. ఇది నిజం.
నాకు చదువుకునేటప్పుడు కూడా స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఇల్లూ, బడి పుస్తకాలూ, చదువూ తప్ప మరో ధ్యాస ఉండేది కాదు, అలాగని నేను ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంటునూ కాదు. మామూలు మార్కులతో పాస్‌ అయ్యేవాడిని. నలుగురిలో తిరగటం, హడావిడి చేయటం లాంటివేవీ నాకు తెలియవు. ఇప్పుడూ అంతే... ఇల్లూ, ఆఫీసూ, ఆఫీసులో నా పని... అంతే. జోకులెయ్యటం, విరగబడి నవ్వటం, విశేషాలు సేకరించడం లాంటివాటి జోలికి వెళ్లను. మాటలు మరీ తక్కువ.
నన్ను ఎవ్వరి ముందూ చులకన చేసి మాట్లాడదు రాజ్యం. నన్నెంత వెనకేసుకు వస్తుందో! నన్ను ఎవరైనా ఆట పట్టించడానికి ప్రయత్నిస్తే వాళ్ల నోళ్లు మూయిస్తుంది నవ్వుతూనే. ఆమె ముందు నన్ను ఎవ్వరూ ఏడిపించాలనుకోరు.
కొడుకు గుణం... పెళ్లి తర్వాత, కూతురు గుణం... వయసులో, భర్త గుణం... భార్య అనారోగ్యంలో, భార్య గుణం... భర్త పేదరికంలో, స్నేహితుని గుణం... కష్టంలో, అన్నదమ్ముల గుణం... జగడంలో, పిల్లల గుణం... వృద్ధాప్యంలోనూ తెలుస్తాయి అన్నది పెద్దలు చెప్పిన మాట.

నేను పుట్టిందీ పెరిగిందీ పెరుగుతున్నదీ పేదరికంలోనే. చాలీచాలని బతుకులే. కానీ ఎప్పుడూ రాజ్యం సంయమనం కోల్పోలేదు. నిజానికి ఆమె కూడా నాలాంటి కుటుంబంలో నుంచే వచ్చిన కారణంగానే ఆమెకు పేదరికం అంటే కోపం లేకపోయి ఉండచ్చు. తాను నిరాశ పడదు, నన్ను పడనీయదు.
మా పెళ్లయిన రెండో సంవత్సరం రాజ్యం నెల తప్పింది. మా ఆనందానికి అవధి లేకపోయింది. అవసరం అనుకున్నప్పుడల్లా డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చెక్‌ అప్‌ చేయించుకునివస్తుంది. పోషకాహారం తినాలని పండ్లు ఎక్కువగా తినటం మొదలుపెట్టింది. ఇంటి పనుల్లో (వంట పనుల్లో కాదు) బరువులు ఎత్తటం, పొయ్యికి సిలెండర్‌ మార్చటం లాంటి బరువైన పనులు నేనే చూసుకోవటం అలవాటు చేసుకున్నాను. మొదట్లో వద్దని వారించినా, పుట్టబోయే బిడ్డపై ప్రేమతో నేను పనులు చేస్తుంటే రాజీ పడక తప్పింది కాదు రాజ్యానికి.
కూతురు తల్లి కాబోతున్నదని విన్న మా అత్తగారూ, మామగారూ వచ్చారు రాజ్యాన్ని చూసివెళ్లడానికి.
‘‘ఏమ్మా... ఎలా ఉన్నావ్‌... మీ ఆయన నిన్ను ఎలా చూసుకుంటున్నాడు’’ లోగొంతుకతో అడిగింది రాజ్యాన్ని వాళ్ల అమ్మ వంటగదిలో కూతురికి సాయం చేస్తూ.
‘‘నాకేమిటమ్మా... ఆయన దేవుడిలాంటి మనిషి. నాకు ఏ లోటూ లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ స్పష్టంగా చెప్పింది రాజ్యం.
ఆ మాటలు విన్న నా మనసు ఆనందంతో నిండిపోయింది. రాజ్యంమీద ప్రేమ రెట్టింపయ్యింది.
రెండు రోజులు మాత్రం ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్లు.
ఒడిదుడుకుల్లేని జీవితాలుంటాయా? ఉన్నట్టుండి రాజ్యం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆదుర్దాగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లాం. బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పారు. వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. లేకపోతే రాజ్యం ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు.
పిల్లల్లేకపోయినా పరవాలేదని చెప్పాను. ఆపరేషన్‌ చేయమని సంతకం చేశాను. రాజ్యం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది. ఆమెను ఊరడించడం ఎవ్వరితరమూ కావటం లేదు. ఎంత ఏడ్చినా జరగవలసింది జరగవలసిందేగదా! ఆపరేషన్‌ పూర్తయింది. రాజ్యం ప్రాణాలతో బయటపడింది నా ప్రాణానికి ప్రాణం నాకు దక్కింది.
ఓ వారం రోజులు ఉండి అత్తగారూ, మామగారూ వెళ్లిపోయారు. మా రెండో మరదలు సుశీలను మా దగ్గరే ఉంచారు.
‘‘సుశీలా నువ్వు వంటపని చూడు చాలు... మీ అక్క పని అంతా నేను చూసుకుంటాను’’ స్థిరంగా చెప్పిన నా వంక సంభ్రమంగా చూశారు అక్కాచెల్లెళ్లు.
మాట వరసకి అన్నాననుకున్నారు కానీ మర్నాటినుంచి రాజ్యం పనులన్నీ నేనే స్వయంగా చూసుకున్నాను. నెల రోజులైనా ఉందామనుకున్న సుశీల పదిహేను రోజులకే వెళ్లిపోయింది. రాజ్యం క్రమంగా కోలుకో సాగింది. రాజ్యం సూచనల మేరకు నేనే వంట చేయటం మొదలుపెట్టాను. త్వరగానే నాకు వంట చేయటం పట్టుబడింది. నా చేతి వంట రాజ్యానికి వంటబట్టింది.
మామూలుగా నా నుంచి మాటలు ఎక్కువ ఉండవు. కానీ రాజ్యం మనోవేదనకి మందు కేవలం నా మాటలే అనిపించి ఆమె కోసం మాట్లాడటం అవసరం అనుకున్నాను.
‘‘చూడు రాజ్యం... నాకు పిల్లలు కావాలని మోజేమీ లేదు. పిల్లలు లేకపోయినా పరవాలేదు. నాకు నువ్వు పిల్లవయితే, నేను నీకు పిల్లవాడిని- అంతే. నీకు అంతగా కావాలనుకుంటే ఓ పిల్లవాడినో పిల్లనో తెచ్చుకుని పెంచుకుందాం- అదీ కొంతకాలం తర్వాత’’ అంటూ ఆమెను అనునయించాను అర్ధాంగీకారం తెలిపింది నా అర్ధాంగి.
బహుశా మా పెళ్లి అయ్యాక ఆమెతో నేను అన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడేనేమో! నేనలా మాట్లాడటం ఆమెకు చాలా సంతోషాన్ని కలుగచేసిన మాట నిజం. మా జీవితాలు మళ్లీ మామూలై పోయాయి. ఎవరి పనుల్లో వాళ్లం నిమగ్నమయ్యాం.
గతంలో మరీ మౌన మునిలా ఉండే నేను అప్పుడప్పుడైనా కొంచెం మాట్లాడటం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. అందుకే పనికట్టుకుని మరీ ఆమెకోసం మాట్లాడుతున్నాను, కాదు కాదు... మాట్లాడటం నేర్చుకుంటున్నాను.
‘‘ఏమండీ... ఓసారి మా ఊరెళ్లి మా అమ్మానాన్నల్ని చూసొద్దామండీ. నాకు వాళ్లని చూడాలనిపిస్తోంది. చాలా రోజులయింది కదండీ’’ అడిగింది రాజ్యం.
కాదనలేకపోయాను. పుట్టింటి మీద ఆ మాత్రం మమకారం ఉండని ఆడపిల్లలుంటారా! పైగా మొట్టమొదటిసారి ఆమె అడిగిన కోరిక. అందుకే అంగీకరించాను. నేను రెండోరోజు సాయంత్రం తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాను. బతిమాలి మరీ నన్ను మరో రోజు ఉండేందుకు ఒప్పించి, ముచ్చటగా మూడవరోజు సాయత్రం తానూ నాతో బయలుదేరింది రాజ్యం.
‘‘మరో వారం ఉండి రమ్మన్నానుగా ఉండాల్సింది. మీ అమ్మావాళ్లక్కూడా తృప్తిగా ఉండేది’’ అన్నాను బస్సులో.
‘‘మిమ్మల్ని ఒక్కళ్లనే వదిలేసి నేను ఉండటమే!’’ అంది నా కళ్లల్లోకే చూస్తూ.
మనసులోనే మురిసిపోయాను ఆమె మాటలకు.
‘‘సరేగానీ, మా అమ్మావాళ్ల వైపు దూరపు బంధువుల అమ్మాయి మన ఊళ్లోనే హాస్టల్లోనో అద్దె ఇంట్లోనో ఉండి చదువుకుంటోందట. అక్కడ తిండీ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నదట. నెలకి ఇంతని తీసుకుని రెండుపూటలా భోజనం పెట్టగలవా అని అడిగిందండీ మా అమ్మ.’’
‘‘నెలకి అయిదు వేలు ఇమ్మను. ఉదయం టిఫిన్‌ కూడా పెడతానని చెప్పు అని మా అమ్మతో అన్నానండీ... ఏమంటారు?’’
‘‘చెప్పావుగా మీ అమ్మగారికి’’
‘‘మీకు ఇష్టం అయితేనే...’’
‘‘నీ ఇష్టం’’
అంతకన్నా మీరేం చెప్తార్లే అన్నట్లు చూసింది నా వంక.
బస్సు కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాను ఆమె చూపుల్నుంచి తప్పించుకునేందుకు.
వారంలోపే రాజ్యం చెప్పిన అమ్మాయి జ్యోతి మా ఇంటికి రోజూ రెండు పూటలా భోజనానికీ, ఉదయాన్నే టిఫిన్‌ చేయటానికీ రావడం మొదలుపెట్టింది. ఉత్త వాగుడుకాయ. వచ్చింది మొదలు వెళ్లేవరకూ ఏదోటి మాట్లాడుతూనే ఉంటుంది. రాజ్యానికి మంచి కాలక్షేపం. నాతో కూడా మాట్లాడాలని రెండు మూడుసార్లు ప్రయత్నించింది కానీ మన ముక్తసరి సమాధానాలూ, ముభావపు ముఖ కవళికలూ కనిపెట్టి మిన్నకుండిపోయింది.
ఉన్నపళంగా ఉద్యోగం ఊడిపోతే సంసారాలు వీధినపడటమేగా! ఎవరు బాధ్యులు? అడిగేది ఎవరు? సమాధానం చెప్పేది ఎవరు? ఎవ్వరూ లేరు, ఎవరి ఖర్మ వాళ్లదే. ఎవరి బతుకుతెరువు వాళ్లు వెతుక్కోవటమే. సంవత్సరాలుగా కొనసాగుతున్న కంపెనీలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. వేలాది కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. నా పరిస్థితీ అంతే అయింది. కాస్తో కూస్తో విలువలున్న మనుషులు కాబట్టి నాకు రావలసిన డబ్బులు లెక్క కట్టి అక్షరాలా రెండు లక్షలా పదమూడువేలా ఆరువందల నలభై రూపాయలకు చెక్కు తయారుచేసి నా చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు.
సామాన్యంగా ఒంటరివాళ్లయితే ఎక్కువ బాధపడరు. మరో వ్యాపకం చూసుకునేవరకూ ఆ డబ్బుని జాగ్రత్తగా వాడుకుని మరో ఉద్యోగం వెతుక్కోవచ్చనుకుంటారు. భార్యా పిల్లలు ఉన్నవాళ్లయితేనే బెంబేలు పడతారు ఇలాంటి సందర్భాలలో.
కానీ నా వ్యవహారం రివర్స్‌. రాజ్యం ఉందిగా నాకేంటి అనుకుంటూ ధైర్యంగా ఇంటికి చేరాను. విషయం రాజ్యానికి చెప్పి నా జేబులో ఉన్న చెక్కు తీసి ఆమె చేతిలో పెట్టాను.
‘‘మీరేం దిగులు పడకండి. ఏదోటి చేసుకోవచ్చు. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు’’ అన్నదే కానీ ఏమాత్రం
డీలా పడలేదు.
రెండు రోజులకే జ్యోతితో పాటు మరో ముగ్గురిని తీసుకువచ్చింది. వాళ్లతో మాట్లాడి మర్నాటినుంచి వాళ్లకి కూడా భోజన వసతికి ఒప్పుకుంది రాజ్యం.
రాజ్యం ఎంత వద్దన్నా వినకుండా నేనూ ఆమెకి వంటపనిలో సాయం చేయసాగాను. మా ఇద్దరికీ కొద్ది రోజుల్లోనే ఆ పని సులభం అయింది. నేను వంటకీ, వంటింటికే పరిమితం. వాళ్లకి వడ్డించే పని కూడా ఏమీ లేకుండా ప్లాన్‌ చేసింది రాజ్యం. వాళ్లు నలుగురూ వచ్చేసరికి డైనింగ్‌ టేబుల్‌ పైన అన్నీ ఏర్పాటు చేసి ఉంచేది. వాళ్లే పెట్టుకుని తినేవాళ్లు. ఎవరి ప్లేట్‌ వాళ్లు శుభ్రం చేసి వాటి స్థానంలో పెట్టడం మొదటి రోజునే అలవాటు చేసింది రాజ్యం.
పది పదిహేను రోజుల్లో మరో నలుగురు ఆడపిల్లలు కూడా జ్యోతి ద్వారా వచ్చి రాజ్యాన్ని బతిమాలి బతిమాలి ఒప్పించారు. మొత్తం ఎనిమిది మంది పిల్లలతో మా నెలసరి ఆదాయం నలభై వేలయింది. మహా అయితే పాతిక వేలకు మించి ఖర్చు కాకుండా (మా ఇంటి ఖర్చులతో సహా) అన్నీ జాగ్రత్తలూ తీసుకోసాగింది రాజ్యం.
పిల్లలు... పాపం వాళ్లెంత తింటారు... నాజూకు తిళ్లు. అయినా వాళ్లకి ఇంట్లో పిల్లలకి చేసినట్లు చేసి పెడుతున్నాను. రుచిగా చేస్తున్నాను. ప్రేమగా పెడుతున్నాను. వ్యాపార ధోరణి లేదు. ఇవ్వాళ కాకపోతే ఇంకొన్నాళ్లకి మీకింకో ఉద్యోగం రాకపోదు. ఆ తర్వాత వీలయితే ఇది కొనసాగిద్దాం, లేకుంటే లేదు. ఏమంటారు’’ మనసులో మాట చెప్పింది రాజ్యం.

‘‘నీ ఇష్టం’’
‘‘మీకంటూ ఇష్టాలేమీ ఉండవా?’’
‘‘నా మొదటి ఇష్టం,
చివరి ఇష్టం నువ్వే’’ అన్నాను.
ఆమె కళ్లల్లో నీటి సుడులు. తన్మయంగా తల నా గుండెలకానించింది.
‘పెళ్లిలో మీ నాన్న చేసిన కన్యాదానం అందరూ చూశారు. మా నాన్న చేసిన వరదానం ఎవ్వరికీ తెలీదు రాజ్యం. నిజానికి మావాళ్లు నన్ను నీ చేతుల్లో పెట్టారు’ నా మనసులో మాటలు మనసులోనే ఉంచుకున్నాను. దాచుకున్నాను. రాజ్యం మనసు దోచుకున్నాను. మళ్లీ చెబుతున్నాను... రాజ్యమే నా ధైర్యం... రాజ్యమే నా ప్రాణం.
భార్య యనెడు నొక్క భారమ్ము లేనిచో
ఉల్లియాకువోలె పురుషుడెగురు
దారితప్పనీని దైవమ్ము భార్యరా
విశ్వదాభిరామ వినురవేమ!
భర్త ఎంగిలి విస్తరాకు వంటివాడు. దానిపైన బరువు వంటిది భార్య. ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరిపోతుంది. స్థిరంగా ఉండదు. అలాగే, భార్య లేకపోతే మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య. జీవితాన్ని చక్కదిద్దే దేవత వంటిది భార్య.
వేమన శతకంలో చదువుకున్న పద్యం అర్థంతో సహా గుర్తుకు వచ్చింది.
వెంటనే నా రాజ్యం గురించి చెప్పాలనిపించింది. అందుకే చెప్పాను
మీకు ‘నేను- నా రాజ్యం’ అని.

నేను పుట్టిందీ పెరిగిందీ పెరుగుతున్నదీ పేదరికంలోనే. చాలీచాలని బతుకులే. కానీ ఎప్పుడూ రాజ్యం సంయమనం కోల్పోలేదు.
నిజానికి ఆమె కూడా నాలాంటి కుటుంబంలోనుంచే వచ్చిన కారణంగానే ఆమెకు పేదరికం అంటే కోపం లేకపోయి ఉండచ్చు.
తాను నిరాశ పడదు, నన్ను పడనీయదు.

పిల్లలు... పాపం వాళ్లెంత తింటారు... నాజూకు తిళ్లు.
అయినా వాళ్లకి ఇంట్లో పిల్లలకి చేసినట్లు చేసి పెడుతున్నాను. రుచిగా చేస్తున్నాను.
ప్రేమగా పెడుతున్నాను.
వ్యాపార ధోరణి లేదు.
ఇవ్వాళ కాకపోతే ఇంకొన్నాళ్లకి మీకింకో ఉద్యోగం రాకపోదు. ఆ తర్వాత వీలయితే ఇది కొనసాగిద్దాం, లేకుంటే లేదు. ఏమంటారు’’ మనసులో మాట చెప్పింది రాజ్యం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు