close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనసు మురిసిన వేళ

- యశోదాకైలాస్‌ పులుగుర్త

అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, ఇంకా తనకు ఏమాత్రమూ అలవాటు కాని మనుషులు. 
భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు. అయినా అనుపమ కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది. 
అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుకే అనుపమ తల్లి కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నా ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థతపైన నమ్మకం పెట్టుకుంది.

అనుపమ అత్తవారింటికి వచ్చాకా రెండు మూడు రోజులు వారింటి పద్ధతులను నిశితంగా గమనించింది.
మామగారు గవర్నమెంట్‌ ఆఫీసులో పనిచేసి రిటైరయ్యారు. ఆడపడుచు ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుకుంటోంది. మరిది బి.కామ్‌. ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు.
అనుపమ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పని చేస్తోంది. ఇంజినీరింగ్‌ తరువాత బ్యాంకింగ్‌ పరీక్షలు రాసి అందులో సెలక్ట్‌ అయింది.
భర్త అరబిందో ఫార్మాలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. తను ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరుతుంది. శ్రీహరి ఎనిమిదింటికే వెళ్లిపోతాడు.
అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు. ఇంట్లో ఎంత మంది భోజనం చేస్తారు... ఎంతమంది లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్తారు...  అన్న ఆలోచన ఉండదు ఆవిడకు. అనుపమ పుట్టింట్లో అయితే- మరుసటి రోజుకి ఏ వంట చేయాలో, ఏ టిఫిన్‌ చేయాలో తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకుని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది.
ఇక్కడ అలాకాదు, ఏం చేయమంటారో మామగారిని అడుగుతారావిడ. ఆయనకు విసుగు. అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందర తొందరగా చేసేయలేరు. దాని ఫలితం ఎక్కువ ఎక్కువ వండేయడం, ఎవరూ సరిగా తినీ తినకా వండినదాంట్లో సగం అంతా వేస్ట్‌ అయ్యేది.
కొన్నాళ్లు చూసి అత్తగారితో చెప్పింది, సాయంత్రం పూట వంట తను చేస్తానని. అనుపమకి పుట్టింట్లో వంట చేయడం అలవాటే. సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలెన్నో తెలుసుకుని మరీ చేస్తుంది.
పుట్టింట్లో తను అమ్మ వెనుకనే తిరుగుతూ అన్నీ చూసేది, చేయడానికి ఉత్సాహం చూపేది. ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకి అడుగుపెట్టదు. అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్నా చితకా పనులేమీ చెప్పకపోవడం గమనించింది.
వంటకు కావలసిన సరుకులు కూడా సరిగా ప్లాన్‌ లేదు ఇక్కడ... ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవాల్సిందే... రోజూ పదిసార్లు మామగారిని బజారుకి పంపుతారు ఆవిడ.
ప్రతిరోజూ ఉదయాన్నే మూడు రకాల న్యూస్‌ పేపర్లు వస్తాయి... మామగారు తప్పించితే ఎవరూ న్యూస్‌ పేపరు చూడనైనా చూడరు. పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం... ఎందుకు ఏమిటీ అని ప్రశ్నించకుండా! లేనిపోని ఆర్భాటాలూ, హంగులూ ఇంటినిండా. అందుకనే ఇంతవరకూ సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు.
వాళ్లుంటున్న త్రీ బెడ్‌ రూమ్స్‌ అపార్ట్‌మెంట్‌కి ఇరవై వేలు అద్దె.
ఒక పద్ధతీ ప్రణాళికా లేని సంసారంగా  అనిపించింది అనుపమకి. తన పుట్టింట్లోని పద్ధతులకూ ఇక్కడి పద్ధతులకూ భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది.
ఆరోజు ఒకటో తేదీ. శ్రీహరి అనుపమని పిలిచి ఇకపై ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంత ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు. శ్రీహరి జీతం, అనుపమ జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు. వద్దన్నా తండ్రి ప్రతినెలా పదివేలు ఇస్తూ ఉంటారనీ చెల్లెలికీ తమ్ముడికీ కాలేజీ ఫీజులు ఆయనే కడతారనీ చెప్పాడు. ‘ఇంక నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్‌ మినిస్టర్‌’ అంటూ జోక్‌ చేశాడు.
‘‘ఏం, మీరు అంతా చూసుకుంటున్నారుగా హరీ, ఏమైంది సడన్‌గా? అయినా నేను చూసుకోవడం ఏంటి? నేను అసలుకే పిసినారి దాన్ని, ప్రతీదీ శల్యపరీక్షలు చేస్తాను. నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే?’’ అంది అనుపమ.
‘‘ఇంతోటి వ్యవహారానికి సమస్యలు ఏంటి అనూ? ఏం మెయిన్‌టైన్‌ చేయలేవా మరి?’’
‘‘అదేంకాదు, చేయలేక కాదు, మీకంటే ప్లాన్డ్‌గా చేయగలను. కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది... అదీ మన ఇంటి బాగోగుల కోసమే సుమా!’’
‘‘అబ్బా... ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా, అంతగా ఆలోచించడానికి? నేను అమ్మకీ నాన్నగారికీ కూడా చెప్పేశాను... ఇకనుండి ఏది కావాలన్నా అనుపమకే చెప్పమనీ, నాకు వీలుకావడంలేదనీ. నాన్నగారూ అమ్మా ‘సరేలేరా, కోడలు ఏమైనా పరాయి మనిషా’ అన్నారు. నా ఏటిఎమ్‌ కార్డూ, బ్యాంక్‌ చెక్‌ బుక్సూ అన్నీ నీ బీరువాలో పెట్టాను. అన్నీ చూసుకో మరి’’ అంటూ నిద్ర వస్తోందని బెడ్‌రూమ్‌కి వెళ్లిపోయాడు.
ఇంక అనుపమ తను అనుకున్నట్లుగా తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టింది...
మామగారిని మెల్లిగా అడిగింది, ‘‘మామయ్యా మీరు ఏ న్యూస్‌ పేపర్‌ చదువుతారు’’ అని... ఆయన చెప్పగానే ‘‘మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మామయ్యా’’ అంది.
‘‘అవునమ్మా, నేను హరికి రెండు మూడుసార్లు చెప్పాను కూడా, వాడు పట్టించుకోలేదు’’ అన్నారాయన.
వెంటనే ఆయన చదవని న్యూస్‌ పేపర్లను వేయవద్దని పేపర్‌బాయ్‌కి చెప్పేసింది.
నెలకు సరిపడా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో అత్తగారిని అడిగి లిస్ట్‌ తయారుచేసింది.
పాలు కావలసినవాటి కంటే అదనంగా రెండు మూడు ప్యాకెట్లు తెప్పించడం, అవి వాడకపోవడం, విరిగితే బయట పారబోయడం చూసింది. వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి, అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది.
అలాగే వాళ్లు రెగ్యులర్‌గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది. కూరగాయలు కూడా వారానికి ఒక్కసారే తెప్పించేది. దాంతో మాటిమాటికీ మామగారు సంచీ తీసుకుని వెళ్లడం తగ్గిపోయింది. అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్‌ తిని వెళతారో, లంచ్‌ బాక్సు ఎవరెవరు తీసుకెళతారో కనుక్కుని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది. కొన్ని కాయగూరలు ముందు రోజు రాత్రే అనుపమ తరిగి రెడీ చేసేది. సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు అడపడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెపుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది.
రాత్రి పూట అందరూ ఒకేసారి కలిసి కూర్చుని డిన్నర్‌ చేసేలా ఏర్పాటు చేసింది. దాంతో వండిన పదార్ధాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్తా సర్దేయడంతో మిగులూ తగులూ ఉండేదికాదు.
ఎక్కడెక్కడ వేస్టేజ్‌ జరుగుతోందో, ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్‌ చేసేది.
ఇలా, ఇంట్లో చక్కని ప్రణాళికాబద్ధమైన మార్పువల్ల మామగారికీ అత్తగారికీ వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది.

అయితే- ఇంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు... అనుపమకి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది... తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించరు, చివరకు శ్రీహరి కూడా. అతి మామూలుగా ఉంటారు. చాలా సహజం సుమా అన్నట్లుగా.
స్టేట్‌ బ్యాంక్‌ వారి కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో బ్యాంక్‌ ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే అనుపమ కూడా నాలుగువందల గజాల స్థలానికి అప్లై చేయడం అలాట్‌ అవడం జరిగింది. ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు, ‘ఆహా అలాగా’ అనేసి ఊరుకున్నాడు.
‘ఏమిటీ మనిషి? ఏ భావోద్వేగాలూ లేవా?’ అనిపించింది.
‘నన్ను మెచ్చుకొమ్మని కాదు కానీ, నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాటద్వారా వ్యక్తం చేయొచ్చు కదా’ అనుకుంది. ‘కొంతమంది అంతేనేమో’ అనుకుంటూ సరిపెట్టుకుంది.
మరో రెండు సంవత్సరాలలో ఆడపడుచు చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటోంది. మరిది సి.ఏకి ప్రిపేర్‌ అవుతున్నాడు.
ఈలోగా బ్యాంక్‌ కోపరేటివ్‌ సొసైటీలోని మెంబర్స్‌ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణంపైన మొగ్గు చూపింది. పైన మూడు బెడ్‌రూమ్‌లూ కింద సింగిల్‌ బెడ్‌రూమ్‌ హాల్‌ అండ్‌ కిచెన్‌తో డూప్లెక్స్‌ హౌస్‌కు ఎస్టిమేషన్‌ వేయించింది. తన జీతం, శ్రీహరి జీతంపైన హౌసింగ్‌లోన్‌ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకుని శ్రీహరితో చెప్పింది.
‘‘జీతంలో ఎక్కువ భాగం లోన్‌కి పోతే ఇంట్లో గడవడం కష్టమేమో కదా అనూ’’ అన్నాడు.
‘‘కొంత కాలం కాస్తంత టైట్‌గానే ఉంటుంది హరీ. కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు. కానీ ఇల్లు మన చేతికి వచ్చాక, కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెంట్‌ ఉండదు కదా. అయినా మీకెందుకూ, నేను మెయిన్‌టైన్‌ చేస్తాను కదా’’ అంది. దాంతో ‘నీఇష్టం’ అంటూ, అంతా అనుపమ మీద వదిలేశాడు.
మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్‌ కూడా శాంక్షన్‌ అయింది. అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే, ‘అవునా’ అన్నట్లు తలపంకించాడు. కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనపడలేదు. కానీ అనుపమ అంతరాత్మ మాత్రం అనుపమ భుజం తడుతూ ‘చాలా మంచి పని చేస్తున్నావు అనూ’ అంటూ అభినందించింది.
ఈలోగా అనుపమకి ఒక ప్రమోషన్‌ కూడా వచ్చింది... బ్యాంకింగ్‌ ఎగ్జామ్స్‌కు కష్టపడి ప్రిపేర్‌ అయి పాస్‌ అయినందుకు. ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్‌ కొనుక్కుని వస్తూంటే...
అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది... ‘పిచ్చి అనూ, నీకు ప్రమోషన్‌ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం’ అంటూ.
‘నాకు నేనే అభినందించుకోవాలండీ అంతరాత్మగారూ, మరి ఏం చేస్తామండీ’ అంటూ సమాధానపరిచింది.
ఏ భావోద్వేగం వ్యక్తపరచని మనుషులైనా ఇంట్లో ఎవరూ చెడ్డవారు కాదు. తనను అభిమానిస్తున్నారు, తను ఏ పని చేసినా వంకలు పెట్టడంలేదు, అది చాలదా అనుకుందో క్షణం.
కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది. అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
ఆ రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. భర్తను ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణమేమిటో అనుకుంది.
కాఫీ అందిస్తుండగా శ్రీహరి చెప్పాడు, తనకు సీనియర్‌ సైంటిస్ట్‌గా ప్రమోషన్‌ వచ్చిందనీ, జీతం కూడా బాగా పెరిగిందనీ.
అనుపమ అతి మామూలుగా ‘ఔనా’ అందేగానీ ఏమాత్రం సంతోషాన్ని వ్యక్తం చేయలేదు.
‘‘ఏమిటోయ్‌, ఇంత శుభవార్తకు రెస్పాన్సే లేదు రాణీగారి నుండి’’ అంటున్న శ్రీహరి మాటలకు...
‘‘ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండీ మహాశయా’’ అంటూ ఉడికించింది.
‘‘చూడండి హరీ, మీదాకా వస్తేగానీ అర్థం కాలేదు... మీకు ప్రమోషన్‌ వస్తే నానుండి కంగ్రాట్స్‌ను ఆశించారు. నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు. మరి నేను? నాకూ ప్రమోషన్‌ వచ్చింది. నేను అనుకున్నవెన్నో సాధించాను. కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను. కానీ ఎప్పుడూ ఏ సందర్భంలోనూ ‘యూ డిడ్‌ ఇట్‌ అనూ’ అన్న ఒక్క చిన్న మాట కూడా మీనుండి వినలేదు. నా స్వభావమే అంత అని తప్పించుకోకండి. మీ ప్రమోషన్‌కు మీ కొలీగ్స్‌ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా? మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు వచ్చినా ఎవరికైనా ఉత్సాహం, స్ఫూర్తి కలగడం సహజం. మనుషులెప్పుడూ ఒకేలాగ ఉండకూడదు హరీ. పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు. భార్యగా నేను మీ జీవితంలోకి అడుగుపెట్టాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు. నేనైనా అంతే.
మనం సాధించిన విజయాన్నీ, శ్రమనీ మనం ఒకరినొకరం గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు హరీ?’’ అంది నెమ్మదిగా.
‘‘ఓ... సారీ అనూ, నాకు అర్థమైంది ఇప్పుడు. మరెప్పుడూ ఇలా జరగదు ప్రామిస్‌’’ అంటూ అనుపమని దగ్గరకు తీసుకున్నాడు శ్రీహరి.
అనుకున్నట్లుగానే ఇల్లు నిర్మాణం పూర్తి అవడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు. అనుకోకుండా శిరీష పెళ్లికూడా కుదిరిపోయింది. ఇంటి గృహప్రవేశం తరువాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు.
గృహప్రవేశం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆరోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమని పిలిచి, తన మెడలోని నాలుగు పేట్ల చంద్రహారాన్ని కోడలి మెడలో వేస్తూ... ‘‘ఇది నీకే తల్లీ, నా గుర్తుగా’’ అంటూ, అనుపమ నుదుటిమీద ముద్దు పెట్టుకున్నారు. అత్తగారికి తనమీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్లు చెమర్చాయి.
గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్‌ ప్రభాకర్‌, అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేశారు.
సునంద అనుపమతో ‘‘మీరు చాలా కేపబుల్‌ అంటూ మావారు తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు అనుపమా. మీవారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట- మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్‌ మేనేజ్‌మెంట్‌ను చాలా చక్కగా బేలన్స్‌ చేస్తారనీ, ప్లానింగ్‌లో మీకు మీరే సాటి అనీ...’’ అంది.

‘‘అదేమీ లేదు సునందా, ఇంట్లో వాళ్లందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు’’ అంటూ చిరునవ్వు నవ్వింది.
శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమీ మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పడం అనుపమని సంతోషపెట్టింది. ఇల్లు కట్టుకున్న ఆనందంకంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది.
తను ఎదుటివారి మెప్పుదలకోసం ఆరాటపడడం లేదు. ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవడమే.
ఫంక్షన్‌ హడావుడీ అలసటా అంతా తీరిపోయాకా అనుపమ మామగారు కూతురి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో అనుపమ అయిదు లక్షలకు చెక్కు రాసి ‘‘శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి మామయ్యా’’ అంటూ ఆయన చేతిలో పెట్టింది.
‘‘ఇదేమిటమ్మా, ఇంత డబ్బు ఎక్కడిది? అప్పు చేసి ఇస్తున్నది కాదుకదా?’’ అన్నారాయన.
‘‘లేదు మామయ్యా శిరీష పెళ్లికని ఎప్పటినుండో మా ఇద్దరి జీతాలనుంచీ కొంత డబ్బు సేవ్‌ చేస్తూ వచ్చాను... సడన్‌గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమోనని. ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్‌కి అప్లై చేస్తాం’’ అని చెప్పింది.
కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పులకించింది.
‘‘మా ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుండీ నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతలను ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు. పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరుచుకోవడమేకాకుండా, శిరీష పెళ్లికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లీ’’ అనగానే వినయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది అనుపమ.
మామగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా, ‘ఇది నా ఇల్లు, ఈ ఇంటిలోని వారందరూ నావాళ్లు’ అన్న ఒక ఆత్మీయభావన ఆమె మనసుని మురిపింప చేసింది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు