close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్కంఠభరితం

ఎంచుకున్న సబ్జెక్టు ఏదైనా పాఠకులను ఆసక్తిగా చదివించే రచనాశైలి యండమూరిది. ‘నిశ్శబ్ద విస్ఫోటనం’ ఆయన తాజా నవల. ఓ పల్లెలో ప్రశాంతంగా బతికే తండ్రీకూతుళ్లు, అనూహ్యంగా మీదపడిన హత్యానేరం, తమను తెలివిగా దీనిలో ఇరికించిన అధికార మాఫియా ఉచ్చులోంచి బయటపడటానికి వేదరవళి చేసిన ప్రయత్నాలూ, ఆ క్రమంలో ఎత్తులూ పైఎత్తులూ... ఉత్కంఠభరితంగా సాగుతాయి. సమస్య నుంచి బయటపడి ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పటానికి ఆమె తనను తాను  మల్చుకున్న తీరు బాగుంటుంది.  కోర్టు వాద ప్రతివాదనలూ, పురాణ ఉపాఖ్యానాలూ, ప్రబంధ వర్ణనల ప్రస్తావనలూ ఆకట్టుకుంటాయి. జరగబోయే కథను మెరుపు వాక్యాలతో సూచనప్రాయంగా చెబుతూ సస్పెన్సును పెంచారు రచయిత. వ్యక్తిత్వ వికాస కిటుకులను సందర్భోచితంగా నవల్లో మిళితం చేయటం మరో విశేషం.  

- సీహెచ్‌. వేణు

నిశ్శబ్ద విస్ఫోటనం(నవల)
రచన: యండమూరి వీరేంద్రనాథ్‌
పేజీలు: 232; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


స్వీయానుభవాలు

రచయిత స్వీయ అనుభవాల నుంచి పుట్టిన పద్నాలుగు కథల సంకలనం ఇది. గోదావరి మీద మిత్రులతో పడవ షికారు సందర్భంగా కలిసిన ఓ ప్రేమజంట యథార్థ కథని ‘యానాంలో ఒక రోజు’లో చెప్పారు. ఆదర్శభావాలు కలిగిన కొందరు కలిసి తక్కువ ఫీజులతో మంచి విద్యాసంస్థను నడపాలనుకున్నారు. కొన్నాళ్లు విజయవంతంగా సాగిన ఆ సంస్థ తర్వాత విఫలయత్నంగా మిగలడానికి కారణమైన మనుషుల మనస్తత్వాలు మారాలని సూచిస్తుంది ‘మార్పు’. ఇద్దరు స్నేహితులు వీలునామాలు రాసి తమ తదనంతరం అవి అమలయ్యేలా చూడాల్సిన బాధ్యతను ఒకరికొకరు అప్పజెప్పుకోవడానికి కారణాన్ని వివరించే కథ ‘తండ్రులూ కొడుకులూ’. కథలన్నీ చదివిస్తాయి.  

- పద్మ

 

యానాంలో ఒకరోజు (కథలు)
రచన: అంపశయ్య నవీన్‌
పేజీలు: 142; వెల: రూ. 200/-
ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌


పలవరింతలే

కళాకారులూ రచయితలకు వాళ్ల కళ ఉన్నతస్థాయిని చేరుకుని, మళ్లీ కడలి అలల్లా వెనక్కి తగ్గుతుందని చెబుతారు. ఆ పతాకస్థాయిని ఎంత ఎక్కువ కాలం నిలుపుకోగలిగితే వాళ్లంత మేటి రచయితలు అవుతారు. కుప్పిలి పద్మ అలాంటి మేలిమి రచయిత్రి. ‘అమృతవర్షిణి’తో మొదలుపెట్టిన ఆమె రచనా సౌరు పాతికేళ్ల తర్వాత కూడా వసివాడలేదని చాటుతుంది ఈ ఎల్లో రిబ్బన్‌! దానిలాగే ఇది కూడా ప్రేమలేఖల సంపుటే. అయితే ఇందులోని నాయిక కేవలం విరహోత్కంఠిత కాదు. సామాజిక స్పృహ ఉన్న ఆధునిక భావుకురాలు. ప్రకృతి ఆరాధనా, ప్రేమ పలవరింతల మాటున చటుక్కున మెరిసే ఆ విశ్వమానవ దృష్టే ఈ ప్రేమలేఖల్ని విభిన్నంగా నిలుపుతుంది! 

 - అంకిత

ఎల్లో రిబ్బన్‌ (మోహలేఖలు)
రచన: కుప్పిలి పద్మ
పేజీలు: 88; వెల: రూ. 100/-
ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌


మాండలికానికి నిఘంటువు

రెండు రాష్ట్రాల్లోనూ మాట్లాడేది తెలుగే అయినా ప్రతి జిల్లాకూ ప్రత్యేక మాండలికం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రామాలన్నీ తిరిగిన అనుభవమూ ఉపాధ్యాయుడిగా పిల్లలూ తల్లిదండ్రులతో మాట్లాడిన అనుభవమూ రచయితకు ఆ జిల్లా మాండలికాన్ని బాగా అర్థం చేసుకోవడానికి తోడ్పడ్డాయి. ఆ యాసలోని సొగసుని ప్రేమించి, పదసంపద మీద మమకారాన్ని పెంచుకున్న రచయిత ప్రతి పదానికీ అర్థం చెప్పి, సందర్భోచిత వాక్యాల్లో ప్రయోగించి చూపించారు ఈ నిఘంటువులో. తెలంగాణ భాషని తేలిగ్గా అర్థం చేసుకోవ డానికి పనికొచ్చే పుస్తకమిది. 

- శ్రీ

మన భాష- మన యాస
రచన: మడిపల్లి భద్రయ్య
పేజీలు: 976; వెల: రూ. 450/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు