close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపర్‌... మచ్ఛీ

చేపలతో ఎన్ని రకాలు చేసుకుంటున్నా... ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచించకుండా ఉండరు చాలామంది. అలా వెరైటీ చేప రుచుల్ని కోరుకునే వారి కోసమే ఇవన్నీ...


దహీ మచ్ఛీ

కావలసినవి
ఏదయినా ఒకరకం చేప ముక్కలు: ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయముద్ద: కప్పు, పెరుగు: అరకప్పు, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, అల్లం తరుగు: టేబుల్‌స్పూను, లవంగాలు: మూడు, దాల్చినచెక్క: ఒకటి, ఉప్పు: తగినంత, గరంమసాలా: అరచెంచా, పసుపు: అరచెంచా, కారం: ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఆవనూనె: సరిపడా.
తయారీ విధానం: చేపముక్కలపైన కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. గంటయ్యాక స్టౌమీద బాణలి పెట్టి పావుకప్పు నూనె వేసి,   చేపముక్కల్ని వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో అల్లం, వెల్లుల్లి తరుగు, లవంగాలు, దాల్చినచెక్క వేయించి... ఉల్లిపాయముద్ద వేయాలి. అన్నీ వేగాక పచ్చిమిర్చి, ఉప్పు, మిగిలిన పసుపు, కారం, గిలకొట్టిన పెరుగు వేసి కలపాలి. ఇది గ్రేవీలా అవుతున్నప్పుడు పావుకప్పు నీళ్లు, గరంమసాలా కొద్దిగా ఉప్పు, చేపముక్కలు వేయాలి. కూరలా అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి.


ఫిష్‌ ఫ్రై

కావలసినవి
ఏదయినా ఒకరకం చేప: ఒకటి, ఉల్లిపాయలు: రెండు, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, కారం: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, నిమ్మరసం: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: టేబుల్‌స్పూను, అరిటాకు: ఒకటి. మారినేషన్‌ కోసం: కారం: అరటేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: టేబుల్‌స్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను.
తయారీవిధానం: చేపను శుభ్రం చేసి దానిపైన మారినేషన్‌ కోసం తీసిపెట్టుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. పావుగంటయ్యాక స్టౌమీద పాన్‌ పెట్టి... చెంచా నూనె వేసి చేపను రెండు నిమిషాలు వేయించి తీసుకోవాలి. బాణలిని స్టౌమీద పెట్టి మిగిలిన నూనె వేసి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేయించి కారం పసుపు, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి టొమాటో ముక్కలు వేయాలి. అన్నీ వేగాక నిమ్మరసం వేసి స్టౌ కట్టేయాలి. అరిటాకుకు కొద్దిగా నూనె రాసి దానిపైన కరివేపాకు రెబ్బలు, సగం టొమాటో మసాలా పరిచి చేపను ఉంచాలి. దానిపైన మిగిలిన కరివేపాకు రెబ్బలు, మసాలా వేసి అంచుల్ని మూసేసి దారం కట్టాలి. దీన్ని పెనంమీద ఉంచి... నూనె వేస్తూ రెండువైపులా అయిదు నిమిషాలు కాల్చి తీసుకోవాలి.


ఫిష్‌ మఖానీ

కావలసినవి
చేప ముక్కలు: ఆరు, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా, టొమాటోలు: ఆరు, క్రీమ్‌: పావుకప్పు, జీడిపప్పు: ఎనిమిది, దాల్చినచెక్క: ఒకటి, యాలకులు: మూడు, లవంగాలు: మూడు, బిర్యానీఆకు: ఒకటి, పసుపు: ఒకటిన్నర చెంచా, కారం: రెండు చెంచాలు, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: చెంచా, కసూరీమేథీ: చెంచా, ఉప్పు: తగినంత, వెన్న: పావుకప్పు, నూనె: సరిపడా.
తయారీవిధానం: జీడిపప్పును కాసేపు నానబెట్టుకుని ఆ తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. చేప ముక్కలపైన సగం పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. పావుగంటయ్యాక స్టౌమీద బాణలి పెట్టి అరకప్పు నూనె వేసి చేపముక్కల్ని ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో టేబుల్‌స్పూను నూనె ఉంచి మిగిలింది తీసేసి వెన్న వేయాలి. అది కరిగాక దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించి... అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. అందులోనే టొమాటో గుజ్జు, కొద్దిగా ఉప్పు, మిగిలిన పసుపు, కారం, జీలకర్రపొడి, దనియాలపొడి వేసి కలపాలి. టొమాటో గుజ్జు ఉడికాక జీడిపప్పు ముద్ద, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా అవుతున్నప్పుడు చేపముక్కలు, క్రీమ్‌, గరంమసాలా, కసూరీమేథీ వేసి నిమిషమయ్యాక దింపేయాలి.


ఊరగాయ

కావలసినవి
ఏదయినా ఒక రకం చేప: కేజీ, పసుపు: చెంచా, కారం: నాలుగు టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: అరచెంచా, జీలకర్ర: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర టేబుల్‌స్పూను, నూనె: సరిపడా, చిన్న ఉల్లిపాయలు: ఎనిమిది, వెల్లుల్లి రెబ్బలు: ఇరవై, అల్లం తరుగు: పెద్ద ముక్క, కరివేపాకు: గుప్పెడు, ఆవాలు: అరచెంచా, మెంతులు: అరచెంచా, నిమ్మరసం: మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీవిధారం: చేపముక్కలపైన పసుపు, సగం కారం, మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. అరగంటయ్యాక ఈ ముక్కల్ని నూనెలో ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్రను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి కలిపి కచ్చా పచ్చాగా గ్రైండ్‌ చేయాలి. చేపముక్కలు వేయించిన నూనె బాణలిని మళ్లీ స్టౌమీద పెట్టి ఉల్లిపాయముద్దతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి దగ్గరకు అయ్యాక దింపేయాలి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు