close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త ఉద్యోగాలకు మీరు సిద్ధమా!

పెరుగుతున్న సాంకేతికత కారణంగా రెండు మూడేళ్లకోసారి ఉద్యోగ రంగంలో ప్రాధాన్యాలు మారడం సహజం. కొన్ని ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగితే కొన్నిటికి తగ్గుతుంది. ఒకటీ అరా కొత్త తరహా ఉద్యోగాలూ వస్తుంటాయి. అలాంటిది గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న సంఘటనల కారణంగా ఉద్యోగాలూ వ్యాపారాల తీరే మారిపోయింది. దాంతో కొన్ని ఉద్యోగాలకు ఉన్నపళంగా డిమాండ్‌ పెరిగితే, మరికొన్ని ఉద్యోగాలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. ఉద్యోగావకాశాలపై తరచూ వివిధ కోణాల్లో అధ్యయనాలను నిర్వహించే లింక్డ్‌ ఇన్‌ సంస్థ ఆ అధ్యయనాల ఆధారంగా 2021లో డిమాండ్‌ ఉన్న ఉద్యోగాలేమిటో ప్రకటిస్తే, నాస్కామ్‌ లాంటివి ఆయా రంగాల్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెబుతున్నాయి.

దువుకోవాలంటే బడికో కాలేజీకో వెళ్లాలి. ఏ సంగీతమో నృత్యమో నేర్చు కోవాలంటే అవి నేర్పే టీచర్ని వెతుక్కుని వెళ్లి నేర్చుకోవాలి. వ్యాయామం చేయాలంటే జిమ్‌కీ, సినిమా చూడాలంటే థియేటర్‌కీ వెళ్లాలి. ఇది ఏడాదిక్రితం పరిస్థితి.

ఇప్పుడో... ఇంట్లో కంప్యూటర్‌కో, చేతిలో ఫోనుకో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. ఇల్లు కదలకుండా అన్నీ చేసేయొచ్చు. ఇవే కాదు, షాపింగూ బ్యాంకింగూ ఆఖరికి కొన్ని ఉద్యోగాలు కూడా ఇంటి నుంచే చేసేస్తున్నారు. ఆన్‌లైన్లో ఈ పనులన్నీ చేయడం కొత్తేమీ కాకపోయినా కరోనా వల్ల మారిన పరిస్థితులు దాన్ని ఎన్నో రెట్లు పెంచాయి. దాంతో కొత్త కొత్త ఉద్యోగాలు తెరమీదికి వచ్చాయి.

ఆయా ఉద్యోగాలేమిటో, వాటికి కావలసిన నైపుణ్యాలేమిటో యువతకు తెలిస్తే వారు వాటికి తగిన అర్హతలను పెంచుకుని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మరో పక్క ఆయా రంగాలకు అవసరమైన, అర్హులైన సిబ్బందీ దొరుకుతారు. అందుకే నాస్కామ్‌, సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎకానమీ, లింక్డ్‌ ఇన్‌, నౌకరీ.కామ్‌ లాంటి సంస్థలు తరచూ ఈ విషయంపై అధ్యయనాలు చేసి నివేదికలు వెల్లడిస్తుంటాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గత ఏడెనిమిది నెలల్లోనే వైద్యరంగంలో రెండు లక్షల 70వేల ఉద్యోగాలు కొత్తగా భర్తీ అయినట్లు ఆ రంగంలో ఉపాధి అవకాశాలను పరిశీలించే ఎరైజ్‌ కెరీర్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. కరోనా వల్ల వారి అవసరం పెరిగిందనుకోవచ్చు కానీ, విద్యారంగంలోనూ లక్షన్నర ఉద్యోగాలు వచ్చాయట. లాక్‌డౌన్‌ వల్ల టీచర్లూ పిల్లలూ ఇంట్లో ఉంటే అన్ని ఉద్యోగాలు ఎవరు, ఎవరికి ఇచ్చినట్టూ అంటే... అవన్నీ బడులతో సంబంధంలేని కొత్త ఉద్యోగాలే! అలా ఇప్పుడు వేర్వేరు రంగాల్లో డిమాండ్‌ ఉన్న ఉద్యోగాలేమిటీ అంటే...

డిజిటల్‌ మార్కెటింగ్‌
జనాభాలో మూడోవంతుకు పైగా యువత ఉన్న దేశం మనది. వినియోగదారుల్లో సగానికి పైగా వాళ్లే. ఒక ఉత్పత్తి అయినా, సేవ అయినా వారి దృష్టిలో పడాలంటే సామాజిక మాధ్యమాల మీద ఉనికి చాటు కోవాల్సిందే. ఆ వేదికల మీద అత్యధికంగా ఫాలోయింగ్‌ ఉన్నవారు యువతను ప్రభావితం చేసే సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా చలామణీ అవుతున్నారు. అందుకే ఇప్పుడు వ్యాపారసంస్థలన్నీ సోషల్‌ మీడియాని సీరియస్‌గా తీసుకోవడంతో అది సరికొత్త ఉద్యోగాల వేదిక అయింది. దాని ఆనుపానులు తెలిసిన ‘డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణుల’కు డిమాండ్‌ పెరిగింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాలు ఎలా పనిచేస్తాయీ, ఏయే వయసుల వారు ఏయే మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తున్నారూ, ఏయే సమయాల్లో ఆన్‌లైన్లో ఉంటున్నారూ, అక్కడ వారు ఎక్కువ సమయం ఎలాంటి అంశాలను చూస్తున్నారూ- లాంటి వివరాలన్నీ తెలుసుకుని; వెబ్‌ ఎనలిటిక్స్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్స్‌ వాడే అల్గారిథమ్స్‌... వంటి వాటిపై అవగాహన పెంచుకుని డిజిటల్‌ మార్కెటింగ్‌లో రాణించవచ్చు. వీళ్లు తమ నైపుణ్యాలతో ఆయా ఉత్పత్తులకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగేలా చూస్తారన్నమాట. ఈ రంగంలో దాదాపు 20 లక్షల వరకూ ఉద్యోగావకాశాలు ఉంటాయని అంచనా.

విషయ నిపుణులు
నిత్య విద్యార్థి అన్న మాట ఈ తరం వృత్తి నిపుణులకు చక్కగా సరిపోతుంది. ఇంటర్నెట్‌ వినియోగం పెరిగాక విద్యార్థులూ ఉద్యోగార్థులే కాకుండా అన్ని రంగాలలోనూ నేర్చుకోవడం అనే ప్రక్రియ నిరంతరంగా సాగుతోంది. 57 శాతం ప్రొఫెషనల్స్‌ తాము ఆన్‌లైన్‌లో గడిపే సమయాన్ని ‘అప్‌స్కిల్లింగ్‌’- అంటే చేసే ఉద్యోగానికి అవసరమైన మరిన్ని నైపుణ్యాలను నేర్చుకోవడానికి వినియోగిస్తామని చెప్పారు ఓ అధ్యయనంలో. మరి విభిన్నమైన రంగాలకు చెందిన వారందరికీ అవసరమైన సమాచారం అంతర్జాలంలోకి ఎలా వెళ్తుందీ, ఎవరు పెడతారూ అంటే- వారినే విషయ నిపుణులు(కంటెంట్‌ క్రియేటర్స్‌) అంటున్నారు. వెబ్‌సైట్లు, యూట్యూబ్‌,  పాడ్‌కాస్ట్‌, బ్లాగులు... ఇలా రకరకాల వేదికలపై విషయ నిపుణులు పంచుకునే సమాచారమే ఆ అవసరాలను తీరుస్తోంది. కాబట్టి తమ తమ రంగాల్లో లోతైన విషయ పరిజ్ఞానమూ, దాన్ని విపులంగా అర్థమయ్యేలా రాయగల సామర్థ్యమూ ఉన్నవారికి ఆకాశమే హద్దంటున్నారు నిపుణులు. మంచి భాష, సృజనాత్మక వ్యక్తీకరణ వంటివి అదనపు అర్హతలవుతాయి. ఈ పని ఎవరికివారు సొంతంగా చేసుకోవచ్చు. లేదా కంటెంట్‌ రైటర్‌గా ఉద్యోగంలోనూ చేరవచ్చు. వ్యాపార సంస్థలు తమ బ్రాండ్‌ గురించి వినియోగ దారులకు చెప్పదలచుకున్న సమాచారాన్ని ఆకట్టుకునేలా రాయడమూ ఆడియో, వీడియో, గ్రాఫిక్స్‌ లాంటి వేర్వేరు రూపాల్లో ప్రెజెంట్‌ చేయడమూ వీరి ఉద్యోగబాధ్యత.

ఈ ఇంజినీర్లు ప్రత్యేకం!
ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు ఇంజినీర్లే వెన్నెముక అంటారు. ప్రతి వ్యాపారానికీ ప్రతి సంస్థకీ ఒక వెబ్‌సైటూ మొబైల్‌ అప్లికేషనూ తప్పనిసరి అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వారికి మరింత డిమాండ్‌ పెరిగింది. ఇంజినీరింగ్‌లోనే సరికొత్త విభాగాలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి. మిల్‌ ఫర్‌ బిజినెస్‌ సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 400 వెబ్‌సైట్లు తయారవు తుండగా, ఏటా నాలుగు లక్షల మొబైల్‌ అప్లికేషన్లు ఆప్‌స్టోర్లలో చేరుతున్నాయట. వాటన్నిటినీ తయారు చేయడమూ, పరీక్షించి చూడడమూ, సరిగా పనిచేసేలా నిర్వహించడమూ లాంటి పనులన్నీ చేస్తున్నది నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌, బ్యాక్‌ఎండ్‌ డెవలపర్‌... లాంటి ప్రత్యేక నైపుణ్యాలు గల ఇంజినీర్లే. వీరికి తోడు పర్యావరణ నిపుణుల(ఎన్వి రాన్‌మెంటల్‌ ఇంజినీర్స్‌) అవసరమూ బాగా పెరిగింది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరులపైన దృష్టి పెడుతున్న నేపథ్యంలో పవన విద్యుత్తు రంగంలో 2 లక్షలూ, సౌర విద్యుత్తు రంగంలో 10 లక్షలూ ఉద్యోగావకాశాలున్నాయని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌, నేషనల్‌ రిసోర్స్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సంస్థలు చెబుతున్నాయి.

మార్కెటింగ్‌ మారిపోయింది!
ప్రకటనలూ వాణిజ్య ప్రతినిధుల నియామకం లాంటి సంప్రదాయ విధానాల ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే విధానం దాదాపు చివరిదశకు చేరిందంటోంది హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ. ఒక వస్తువు గురించి వివరాలు తెలుసుకోవాలంటే దాని ప్రకటన ద్వారా తప్ప వినియోగదారులకు మరో మార్గం ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడలా కాదు, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వెబ్‌సైట్లూ, వాటిల్లో ఉండే వినియోగదారుల రివ్యూలూ, సామాజిక మాధ్యమాల్లో పరిచయస్తులు వ్యక్తం చేసే అభిప్రాయాలూ... ఇలా అన్ని పక్కల నుంచీ సమాచారం వచ్చిపడుతోంది. అలాంటప్పుడు ఎవరైనా ఒక బ్రాండ్‌ని నమ్మి దాన్నే కొనాలంటే దాని గురించి వినియోగదారులకు నమ్మకం కలిగేలా వేర్వేరు దశల్లో చెప్పే మనుషులు కావాలి. వాళ్లనే బ్రాండ్‌ అసోసియేట్స్‌ (వీళ్లు షాపులో ఉండి వినియోగదారులకు ఫలానా వస్తువు ఎందుకు మంచిదో ఇతర బ్రాండ్లతో పోల్చి చెబుతుంటారు) అనీ, అఫిలియేట్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్టులు(వీళ్లకు సంస్థతో సంబంధం ఉండదు కానీ తమకు నచ్చిన ఉత్పత్తుల గురించి చెబుతూ ప్రచారం చేస్తుంటారు, ప్రతిఫలంగా కమిషన్‌ తీసు కుంటారు) అనీ, నెట్‌వర్కింగ్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్టులు(వీళ్లు బృందాలుగా ఒక్కో కంపెనీ ఉత్పత్తులను అమ్ముతారు) అనీ అంటున్నారు. మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ పద్ధతుల మీద అవగాహన కలిగివుండడం అవసరం.

విద్యారంగంలో...
ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న విద్యావిధానం లాక్‌డౌన్‌ వల్ల గతి తప్పింది. ఇంట్లో ఉండి మాత్రం చదువుకోకూడదా అనుకున్న ఎడ్యుటెక్‌ స్టార్టప్‌లు తరగతుల వారీగా, పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేందుకూ అన్ని సబ్జెక్టుల్లోనూ వీడియో పాఠాలు రూపొందించి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో పెట్టడంతో ఈ రంగంలోనూ కొత్త అవకాశాలెన్నో పుట్టుకొచ్చాయి. తరగతి గదిలో పాఠాలు చెప్పడం వేరు... ఎదురుగా ఉన్న పిల్లల సందేహాలు తీరుస్తూ సమగ్రంగా బోధించవచ్చు. వీడియో పాఠాలకు ఆ వెసులుబాటు ఉండదు కనుక పాఠం చెప్పే విధానమే పూర్తిగా మారిపోవాలి. ఆ నైపుణ్యాలు ఉన్నవారికి ఇంటి దగ్గరనుంచే పనిచేసేలా అవకాశాలు కల్పించాయి ఈ సంస్థలు. విద్యార్థులకు ఇప్పుడిక సిలబస్‌ పరిధులు దాటి నేర్చుకోవడం అలవాటైంది కాబట్టి పాఠశాలలూ కళాశాలలూ మామూలుగా పనిచేయడం ప్రారంభించినా వీడియో పాఠాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుందంటున్నారు పరిశీలకులు. అలా పాఠాలు చెప్పేవాళ్లే కాకుండా ఈ కోర్సులకు తగిన సిలబస్‌ రూపొందించేందుకు ‘కరిక్యులమ్‌ డెవలపర్‌’, అందుబాటులో ఉన్న వందలాది కోర్సుల్లో ఎవరికి ఏ కోర్సు అవసరమో సలహా ఇవ్వడానికి ‘అకడమిక్‌ అడ్వైజర్‌’, విద్యా సంస్థల్లో ప్రవేశాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ‘అడ్మిషన్స్‌ ఆఫీసర్‌’ లాంటి ఉద్యోగాలూ కొత్తగా వస్తున్నాయి. ఇక, ‘కెరీర్‌ కౌన్సెలర్లు’ అమెరికాలో 26 లక్షల మంది ఉంటే మన దగ్గర ఇప్పటివరకూ 500 మంది మాత్రమే గుర్తింపు పొందిన కౌన్సెలర్లు ఉన్నారట. అర్హులకు అవకాశాలెన్నో ఉన్నాయనడానికి ఇది చాలదూ నిదర్శనం!

అంతర్జాల భద్రత
సైబర్‌ నేరాల కారణంగా 2019లో మన దేశం 1.25 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయింది. ఆన్‌లైన్‌ లావాదేవీలు మామూలుగా ఉన్నప్పుడే ఇంత నష్టం జరిగితే 2020 సంవత్సరంలో ప్రజలు అన్నిటికీ ఆన్‌లైన్‌ మీదే ఆధారపడినప్పుడు ఇంకెన్ని నేరాలు జరిగి ఉండాలీ! ఒక్క హైదరాబాద్‌లోనే గత ఏడాది సైబర్‌ నేరాలు ముందు ఏడాది కన్నా రెట్టింపు అయినట్లు నమోదైన కేసులు చెబుతున్నాయి. సైబర్‌ సాంకేతికత నిత్యజీవితంలో భాగమై పోయిన రోజులివి. వేలికొసలమీద ఎంత తేలిగ్గా దాన్ని ఉపయోగించుకుని పనులు చేసుకుంటామో అంతే తేలిగ్గా సంఘవిద్రోహశక్తుల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం చాలా ఉంది. వారే వర్చువల్‌ ప్రపంచంలో మనకి రక్షక భటులు. నాస్కామ్‌ అంచనాల ప్రకారం సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి మనదేశంలో పది లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఐటీ రంగంలో ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నప్పటికీ సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందనీ, పెద్ద పెద్ద కంపెనీలు రూ.కోటి నుంచి 4 కోట్ల వరకూ జీతం ఇచ్చి అయినా నిపుణులను నియమించుకోడానికి సిద్ధంగా ఉన్నాయనీ అంటోంది నాస్కామ్‌.

వ్యాపారాభివృద్ధి, అమ్మకాలు
ప్రతి వ్యాపారసంస్థకీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే ‘బిజినెస్‌ స్ట్రాటెజిస్టు’లను నియమించుకోవడం ఇప్పుడు అవసరం. సంస్థ అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించి, వాటిలో చేయాల్సిన మార్పుల్ని సూచించడం లేదా కొత్త ప్రణాళికలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం ఈ నిపుణుల బాధ్యత. ఆ సంస్థ ఉత్పత్తులూ లేదా సేవల నాణ్యతని పెంచడమూ, సిబ్బంది పనితీరును పర్యవేక్షించి యాజమాన్యంతో సంప్రదింపులు జరపడమూ కూడా వీరి బాధ్యతే.

ఇక, అమ్మకాల విషయానికి వస్తే ‘సోషల్‌ సెల్లింగ్‌’ ఇప్పటి ట్రెండ్‌. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలోనే దీని గురించి ఆన్‌లైన్‌లో నేర్చు కున్నవారు 61 శాతం పెరిగారట. ఏమిటీ సోషల్‌ సెల్లింగ్‌ అంటే- సోషల్‌ మీడియా ద్వారా వినియోగదారులను గుర్తించి ఉత్పత్తులను అమ్ము కోగల కళ. అందుకు తగిన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి. ఈ రంగంలోనే మరో విభాగం ‘డేటా సైంటిస్టులు’. ఏ వ్యాపారానికి అయినా వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం చాలా అవసరం. దాని ద్వారానే వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తుల్నీ సేవల్నీ పెంచుకోడానికి వీలవుతుంది. ఆ వివరాలన్నిటినీ విశ్లేషించేవారినే డేటా సైంటిస్టులు అంటారు. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే వీరిని నియమించుకునేవి. ఇప్పుడు దాదాపు ప్రతి వ్యాపార సంస్థకీ వీరి అవసరం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ నిపుణుల సంఖ్య బాగా పెరగనుంది.

కృత్రిమ మేధ తోడు
మరో పదేళ్లకల్లా మనిషి ఆలోచనాసరళి పూర్తిగా హైబ్రిడ్‌ అయిపోతుందనీ, సగం మనిషి తెలివితేటలూ మిగతా సగం కృత్రిమ మేధా కలిసి కొంగొత్త పనివిధానం మొదలవుతుందనీ అంటారు గూగుల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌- రే కుర్జ్‌వెయిల్‌. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధదేనని నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగానికి ఇప్పుడు మెషీన్‌ లెర్నింగ్‌ స్పెషలిస్టులూ, రోబోటిక్‌ ఇంజినీర్లూ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులూ లక్షల్లో అవసరమట. ఇప్పటికే రక్షణ, అణువిజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో రోబోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లోనూ హోటళ్లలోనూ సిబ్బంది పాత్ర పోషించిన రోబోలు, ఇళ్లల్లో పనిమనుషుల అవసరాన్నీ తీర్చాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే పరిశ్రమల సంఖ్యలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న మనదేశంలో ఈ రంగాల్లో నిపుణులకు మంచి భవిష్యత్తు ఉందంటున్నారు పరిశీలకులు.

ఈ-కామర్స్‌ స్పెషలిస్టులు
ఏ ఫేస్‌బుక్కో తెరవగానే ప్రకటనలో ఓ డ్రెస్‌ కన్పిస్తుంది. బాగుందే అనుకుని క్లిక్‌ చేస్తాం. అక్కడ ఆకర్షణీయంగా మరెన్నో కన్పిస్తాయి. నచ్చినవి ఎంచుకుని క్రెడిట్‌ కార్డుతో డబ్బు కట్టేసి మన పనుల్లో మనం ఉంటే భద్రంగా ప్యాక్‌ చేసిన డ్రెస్‌ని డెలివరీ బాయ్‌ ఇంటికి తెచ్చిస్తాడు. అసలు మనకి నచ్చే డ్రెస్‌ మన తెరపై కన్పించడానికి కారణం- ‘ఆన్‌లైన్‌ స్పెషలిస్టు’లూ, ‘ఈ-కామర్స్‌ కోఆర్డినేటర్లూ’. ఆన్‌లైన్‌లో మనం చూసే వాటి ఆధారంగా గూగుల్‌ అనలిటిక్స్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని వాడుకోవడం ద్వారా వాళ్లు ఆయా బ్రాండ్లనూ, ఉత్పత్తులనూ వినియోగదారుల దృష్టిలో పడేలా చేస్తారు. ఇలా సంస్థల అమ్మకాలు పెరిగేలా చేయడమూ వెబ్‌సైట్ల ద్వారా జరిగే రోజువారీ అమ్మకాల నిర్వహణని పర్యవేక్షించడమూ వారి పని. ఈ-కామర్స్‌ పెరగడమే కానీ తగ్గే అవకాశం లేదు కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఆ ఉద్యోగాలకీ ప్రయత్నించవచ్చు.

ఆర్థిక రంగంలో...
రోజు రోజుకీ ఎన్నెన్నో కొత్త కొత్త వ్యాపారాలూ, సేవలూ అందించే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఆయా పనులు చేసే క్రమంలో నియమాలకూ నైతిక ప్రమాణాలకూ కట్టుబడి ఉంటున్నాయా అన్నది చూసుకోడానికి ‘రెగ్యులేటరీ కాంప్లియన్స్‌ అనలిస్టు’ అవసరం. గేమింగ్‌, ఇంజినీరింగ్‌ కంపెనీలలో వీరిది పూర్తి స్థాయి ఉద్యోగం. అలాగే షేర్లను కొని, అమ్మే ‘ఈక్విటీ ట్రేడర్‌’లకీ, ‘యాక్చువరీ’- అంటే బీమా గణకులకూ కూడా డిమాండు బాగా పెరిగిందట. ఆర్థిక వ్యవస్థ విస్తరించినకొద్దీ కొత్త కొత్త బీమా పాలసీలు అవసరమవుతాయి. వాటికి ఎవరు ఎంత ప్రీమియం కట్టాలన్న లెక్కలు వేసేవాళ్లను బీమా గణకులు అంటారు. లెక్కల్లో ఆసక్తి ఉన్నవారు ఆ దిశగా ప్రయత్నించవచ్చు.

చూశారుగా... డిగ్రీ పూర్తిచేసినవారంతా అభిరుచికీ ఆసక్తికీ తగిన రంగంలో కెరీర్‌ని ఎంచుకుని అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే... భవిష్యత్తు బంగారు బాటే!

ఇవీ గమనించాల్సిన విషయాలే!

డిమాండ్‌ పెరిగిన ఉద్యోగాల సంగతి అటుంచితే, ఉద్యోగరంగాన్ని ప్రభావితం చేస్తున్న మరికొన్ని అంశాలూ ఉన్నాయి. కెరీర్‌ ప్లాన్‌ చేసుకునేవారు వాటినీ గుర్తుంచుకోవాలి.
* ఈరోజుల్లో ఫలానా ఉద్యోగం మాత్రమే చేస్తానని ఎవరూ గిరిగీసుకుని కూర్చోవడం లేదు. 62 శాతం నిరుద్యోగులు ఏ రంగంలో ఉద్యోగానికైనా సిద్ధంగా ఉన్నామనీ అందుకు తగిన నైపుణ్యాలు తమకు ఉన్నాయనీ చెప్పారు.
* మానవ వనరుల విభాగం పాత్ర బాగా పెరిగింది. వైవిధ్యమైన నైపుణ్యాలున్న, ఎక్కడినుంచీ అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న, విభాగాల మధ్య బదిలీకి అంగీకరించే సిబ్బందికి ప్రాధాన్యమిస్తున్నారు. 85శాతం హెచ్‌ఆర్‌ నిపుణులు సిబ్బందికి ‘రీస్కిల్లింగ్‌’ (నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడం) అవసరం అంటున్నారు.
* దాదాపు అన్ని రంగాల్లోనూ గిగ్‌ జాబ్స్‌ అంటే- తాత్కాలిక ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగింది. పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా కొద్ది నెలలకోసం తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయనీ దాదాపు 75 వేల ఉద్యోగాలు ఈ విధంగా భర్తీ చేసే అవకాశం ఉందనీ అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అనుభవం సంపాదించుకోవాలనుకున్నవారికి ఇదీ ఒక అవకాశమే.
* మనదేశంలో డ్రోన్ల తయారీ పరిశ్రమ ఈ ఏడాది మూడువేల కోట్లకు చేరుతుందని అంచనా. దాంతో డ్రోన్‌ ఆపరేటర్ల అవసరమూ పెరుగుతుంది.
* వృద్ధుల సంఖ్య పెరుగు తున్నందున ఫిజియో థెరపిస్టులూ, జీవనశైలి వ్యాధులను కట్టడి చేయడానికి డైటీషియన్ల అవసరమూ బాగా ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు