close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడ వజ్రాలు దొరుకుతాయి!

అదో వజ్రాల ఉద్యానవనం... దాని పేరు ‘క్రేటర్‌ ఆఫ్‌ డైమండ్స్‌ స్టేట్‌ పార్క్‌’. సందర్శకులెవరైనా సరే వజ్రాల్ని వెతుక్కుని తెచ్చుకునే వీలున్న ఒకే ఒక వజ్రాల గని. అమెరికాలోని అర్కన్సాస్‌ రాష్ట్రంలోని మర్ఫీబొరొలో ఉన్న ఈ పార్కు 900 ఎకరాల వరకూ విస్తరించి ఉంది. మొట్టమొదటగా 1900 ప్రాంతంలో ఇక్కడ వజ్రాలు బయటపడ్డాయట. దీన్ని వాణిజ్యపరమైన గనిగా మార్చడానికి అవకాశం లేకపోవడంతో సందర్శక ప్రాంతంగా తీర్చిదిద్దారు. 1972లో పార్కు మధ్యలో ఉన్న 37 ఎకరాల్ని సందర్శకుల వజ్రాల వేటకోసం ప్రత్యేకంగా కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ రోజుకి రెండుమూడు చొప్పున 33,100 వజ్రాలు దొరికాయట. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే వజ్రాలన్నీ ఎక్కువగా తెలుపు, గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయి. వజ్రాలతోపాటు అమెథిస్ట్‌, గార్నెట్‌, జస్పర్‌, ఎగేట్‌, క్వార్ట్జ్‌... వంటి విలువైన రాళ్లూ ఇక్కడ దొరుకుతాయి. పార్కులోని డైమండ్‌ డిస్కవరీ సెంటర్‌లో అక్కడ దొరికే ముడి రత్నాల నమూనాలని చూపించి అవేంటో వివరించడంతోపాటు వాటిని వెతికే పద్ధతుల గురించీ సిబ్బంది చక్కగా వివరిస్తారట. దాంతో ఈ పార్కుకి వెళ్లినవాళ్లలో చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అయితే ఈ పార్కుని సందర్శించాలంటే పెద్దవాళ్లకి ఎనిమిది, పిల్లలకు ఐదు డాలర్ల టిక్కెట్‌ తప్పనిసరి. తవ్వడానికి ఎవరి పరికరాలు వాళ్లే తెచ్చుకోవాలి లేదా అద్దెకి కూడా ఇస్తారట. వజ్రాలవేటతోపాటు పిల్లలూ పెద్దలూ సేదతీరేందుకు ఇతరత్రా వినోద కేంద్రాలూ ఇక్కడ చాలానే ఉన్నాయి. దొరికితే వజ్రం దొరుకుతుంది. లేదంటే దానికోసం వెతికిన అనుభవమైనా మిగులుతుంది, వెతికితే పోలా...
అనుకుని పిల్లాపెద్దా అందరూ ఆ పార్కుని తెగ తవ్వేస్తుంటారట.


మీకు తెలుసా!

పిల్లలకు కాస్త పాకడం రాగానే మనం బేబీ వాకర్లు కొంటుంటాం. కానీ కెనడాలో వాటిని కొన్నా అమ్మినా లక్ష కెనడియన్‌ డాలర్లు(రూ.57లక్షలు) జరిమానా విధిస్తారు. వాకర్‌లో నడుస్తూ పిల్లలు తెలియక మెట్లవైపు వెళ్తే పైనుంచి కిందికి పడిపోయి పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుందన్నదే ఇందుకు కారణం. వాకర్‌లోంచి పడి కొందరు పిల్లలకు తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు