close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రబ్బర్లు వాళ్లే చేసుకోవచ్చు

రకరకాల రంగుల్లోనే కాదు, డిజైన్లలోనూ దొరికే రబ్బర్లంటే ఏ పిల్లలకైనా ఇష్టమే. అలాంటి రబ్బర్లను బయటినుంచి కొనకుండా వాళ్లే తయారు చేసుకోగలిగితే... మరికొన్ని కొత్త రకాలను ఆవిష్కరించేయడం ఖాయం. దీన్ని గుర్తించారో ఏమో తయారీదారులు ఇప్పుడు పిల్లలకోసం అలాంటి కిట్‌నే తెచ్చేశారు. అదే ‘మేక్‌ యువర్‌ ఓన్‌ మినీ ఎరేజర్స్‌’ కిట్‌. ఇందులో రకరకాల రంగుల్లో క్లే లాంటిది వస్తుంది. దాన్ని నచ్చిన డిజైన్‌లో చేసుకుని ఆ తరువాత కాసేపు ఓవెన్‌లో బేక్‌ చేసుకుంటే చాలు. కోరిన డిజైనులో రబ్బర్లు వాడుకునేందుకు సిద్ధమవుతాయి. అలా చేసినవే ఇవన్నీ. బాగున్నాయి కదూ! 


ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు

పిల్లలు ఏమీ తోచనప్పుడు... గబగబా చెస్‌బోర్డో, క్యారంబోర్డో తీసుకుని కాసేపు ఆడుకుంటారు. కానీ ఆట అయిపోయాక ఆ బోర్డులను తీసి, వాళ్లు అన్నిసార్లూ లోపల పెట్టరు. దాంతో కొన్నిరోజులకే ఆ బోర్డు పాడైపోవడం, మళ్లీ కొత్తది కావాలని అడగడం మామూలే. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే బోర్డుగేముల్ని జతచేసిన ఈ టేబుళ్లను ఎంచుకుంటే సరి. ఆడుకోవడానికి వీలుగా ఉండే ఈ టేబుళ్లపైన చెస్‌, క్యారంబోర్డు, చైనీస్‌చెక్కర్‌, లూడో, స్నేక్‌ అండ్‌ లాడర్స్‌, మోనోపోలీ వంటి ఆటల్ని ప్రింటు చేస్తున్నారు తయారీదారులు. దాంతో కావాల్సినప్పుడు వాటిపైన ఆడుకుని ఆ తరువాత పుస్తకాలు పెట్టుకుని కూడా చదువుకోవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు ఆ టేబుళ్లను మడిచి పక్కన కూడా పెట్టేయొచ్చు.


కేబుల్‌వైర్లకో బొమ్మ

సెల్‌ఫోను ఛార్జింగు పెట్టుకోవడం అయిపోయాక దాన్ని అలాగే స్విచ్‌బోర్డులో ఉంచి వదిలేస్తుంటాం కొన్నిసార్లు. ఒకవేళ ఆ స్విచ్‌బోర్డును మరోదానికి వాడాలనుకుంటే ఆ ఛార్జరు వైరును తీసి పక్కన పెట్టేస్తాం. దాంతో కొన్నిసార్లు ఆ వైర్లు చిక్కుపడటం లేదా పాడైపోవడం జరగొచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చేస్తున్నాయి ‘వైర్‌ హోల్డర్లు’. బొమ్మల ఆకారంలో ఉండే ఈ హోల్డర్లను స్విచ్‌బోర్డు పక్కన గోడకు అతికించేస్తే అవసరంలేని కేబుల్‌ వైర్లను దానిలో దూర్చేయొచ్చు. దాంతో వైర్లు అడ్డంలేకుండానూ ఉంటాయి, మెలికలు పడి పాడైపోతాయనే భయమూ ఉండదు.


అన్నీ స్పీకర్లే

ఇంటికి తగినట్లుగా స్పీకర్లు కూడా రకరకాల డిజైనుల్లో, రంగుల్లో దొరికితే బాగుంటాయి కానీ... డబ్బాలా, నల్లగా ఉండేవి వద్దని కోరుకునే గృహాలంకరణ ప్రియులకు ఇప్పుడు అలాంటివే దొరుకుతున్నాయి. కుక్క, టెడ్డీబేర్‌, ఆపిల్‌... ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల్లో వచ్చేస్తున్నాయివి. పైగా వీటిని కేవలం కంప్యూటరు, టీవీకి జతచేయడమే కాదు, ఫోన్‌లకూ అమర్చొచ్చు. ఈ స్పీకర్లు వెరైటీగా ఇంటికి అందంగానూ ఉంటాయి. ఏమంటారూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు