close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సదా... ప్రజా సేవలో!

పిల్లలైనా, పెద్దలైనా ఆరోగ్య సమస్యలుంటే ఆ కుటుంబాలు ఎంతలా తలకిందులవుతాయో తెలియంది కాదు. అందుకే కొందరు సహృదయులు వారి ఆరోగ్యం గురించి ఆలోచించి వినూత్నమైన పరిష్కారాల్ని చూపుతున్నారు. మరికొందరు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చేవాళ్ల ఆకలినీ తీర్చి మానవతను చాటుకుంటున్నారు.


ఆకలితో ఎవరూ వెళ్లకూడదని...

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి... జిల్లా నలుమూలల నుంచీ నిత్యం వందల సంఖ్యలో రోగులూ వాళ్లతోపాటు సహాయకులూ వస్తారిక్కడికి. వీళ్లలో చాలామంది డబ్బు ఆదా చేయడం కోసం మధ్యాహ్నం భోజనం చేయకుండా కడుపు మాడ్చుకుంటారు. చికిత్స కోసం రోగిని ఆసుపత్రిలో చేర్చితే ఆసుపత్రి వర్గాలు భోజనం అందిస్తాయి కానీ, సహాయకులు మాత్రం బయట తినాల్సిందే. అందుకోసం వాళ్లు రూ.100 వరకూ వెచ్చించాల్సిందే. దాంతో ఒక పూట తినీ తినక అక్కడున్నన్ని రోజులూ కాలం వెళ్లదీస్తారు. ఈ పరిస్థితిని గమనించిన ‘శ్రీసత్య అక్షయ సేవ ట్రస్టు’ సభ్యులు వీళ్ల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు.  ఆసుపత్రి ఆవరణలోనే ఒక భవనంలో దీన్ని 2016లో ప్రారంభించారు. అప్పట్నుంచీ నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. డాక్టర్‌ అంజనీకుమార్‌, రాజేశ్వరమ్మ, డాక్టర్‌ ఎంవీ సురేష్‌, ప్రత్తి ఆనంద కృష్ణ, అనురాధ, అరుణ్‌కుమార్‌, రాజశ్రీ ఈ ట్రస్టు వ్యవస్థాపక సభ్యులు. రోజూ మధ్యాహ్నం  సుమారు 250 మంది ఇక్కడ తమ ఆకలి తీర్చుకుంటుంటారు. అన్నార్తులు ఎక్కువగా ఉంటే ఆ మేరకు మళ్లీ అదనంగా వంట చేస్తారు. అన్నం, సాంబారు, పచ్చడి, కూర, రసం, మజ్జిగ అందిస్తారు. ‘మానవసేవే మాధవ సేవ’గా భావించి ట్రస్టు సభ్యులు సొంత డబ్బుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, వీరిని ప్రోత్సహిస్తూ కొందరు దాతలూ చేయూతనందిస్తున్నారు.

- తమ్మి వెంకట శేషయ్య, నెల్లూరు


ఆఖరి రోజులు ప్రశాంతంగా...

దురైకి చెందిన డాక్టర్‌ ఆర్‌.బాలగురుసామి కార్పొరేట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తారు. అంతేకాదు, మిత్రులతో కలసి గ్రామాల్లో తరచూ ఉచిత వైద్య శిబిరాల్నీ, అవగాహనా సదస్సుల్నీ నిర్వహిస్తారు. ఆ సమయంలోనే పల్లెల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ దిక్కూమొక్కూ లేని రోగుల్ని చూశారు. వారిలో క్యాన్సర్‌ బాధితులూ ఉన్నారు. అలాంటివారు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటేనే మేలనుకున్నారు బాల. మరో ఆరుగురు వైద్య మిత్రులతో కలసి అద్దె భవనం తీసుకుని అక్కడ ఇలాంటి రోగుల్నీ, అనాథ రోగుల్నీ చేర్చి 2015 నుంచీ చికిత్స అందించడం మొదలుపెట్టారు. సేవ చేయడమే అసలైన సంపదని భావించి తమ సంస్థకు ‘ఐశ్వర్యం ట్రస్టు’గా పేరు పెట్టుకున్నారు. అద్దె ఇంట్లో ఆసుపత్రి నిర్వహించడంపైన యజమాని అభ్యంతరం చెప్పడంతో ఆర్నెల్లకే వీరు సొంత భవనం కోసం ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ సంగతి తెలుసుకున్న మదురైకి చెందిన జలజ, జనార్దన్‌ దంపతులు తమకున్న వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని వారికి ఉచితంగా అందించారు. దాతలు ముందుకు రావడంతో రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించి దాన్లో ‘నేత్రావతి పెయిన్‌, పాలియేటివ్‌ కేర్‌, రిహాబిలిటేషన్‌ సెంటర్‌’ నడుపుతున్నారు. దీన్లో 50 పడకలు ఏర్పాటుచేశారు. ఇక్కడుండే వాళ్లలో చాలావరకూ రోగులు మంచానికి పరిమితమైనవాళ్లే. అనాథల అంతిమ సంస్కారాల్నీ ట్రస్టు సభ్యులే నిర్వహిస్తుంటారు.


పిల్లల కోసం థెరపీ వ్యాన్‌

కొవిడ్‌ కారణంగా చాలా రకాల సేవలు ఇంటి దగ్గరకే అందుబాటులోకి వస్తున్నాయి. చాన్నాళ్లపాటు అలా అందకుండా ఉండిపోయిన కొద్ది రకాల సేవల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు థెరపీ చేయడం ఒకటి. దాంతో గతంలో కొన్నాళ్లు థెరపీ తీసుకున్న పిల్లల పరిస్థితి కూడా మళ్లీ మొదటికే వచ్చింది. ఈ లోపాన్ని సరిచేయాలనుకున్నారు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ‘సాంఫియా ఫౌండేషన్‌’ నిర్వాహకులు. దానికోసమే ‘థెరపీ ఆన్‌ వీల్స్‌’ను తీసుకొచ్చిందా ఫౌండేషన్‌. దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ థెరపీ కేంద్రం ఇది. ఫిజియో థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ... లాంటి సేవలను దీన్లో అందిస్తారు. ఈ వ్యాన్‌లో ఎక్సర్‌సైజ్‌ బాల్స్‌, థెరపీ టాయ్స్‌ మొదలైన పరికరాలు ఉంటాయి. 14 నెలల పిల్లలు సైతం ఈ సేవలు పొందొచ్చు. ఈ మొబైల్‌ వ్యాన్‌ ప్రస్తుతం కులు, మనాలీ, మణికరన్‌ ప్రాంతాల్లో తిరుగుతూ రోజూ 80 మందికి సేవలు అందిస్తోంది. ‘ఇండియన్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌(ఐఆర్‌ఈడీఏ)’ యాజమాన్యం ఈ మొబైల్‌ వ్యాన్‌కూ, అందులోని పరికరాలకూ అవసరమైన నిధులు అందించింది. ఈ వ్యాన్‌ ప్రజల దగ్గరకే వెళ్తుండటంవల్ల కొందరు తల్లిదండ్రులు వ్యాన్‌లోని నిపుణులతో తమ పిల్లల ఎదుగుదల సమస్యల గురించీ చర్చించి సలహాలూ, సూచనలూ తీసుకుంటున్నారు కూడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు