
మా పని సేవ చేయడమే!
సామాజిక సంక్షేమానికి సీఎస్ఆర్లో భాగంగా ఎన్నో సంస్థలు కొన్ని కోట్ల రూపాయల్ని నిధులుగా ఇవ్వడం తెలిసిందే. ఆ నిధులు వందశాతం సద్వినియోగం అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థ కార్యకలాపాల వెనుక ఎన్నో పెద్ద కంపెనీలు ఉండటం విశేషం.
వరంగల్‌కు చెందిన విద్య వినలేదు, మాట్లాడలేదు. ఆమె తల్లిదండ్రులు వైద్యుల్ని సంప్రదిస్తే స్పీచ్థెరపీతోపాటూ మరికొన్ని చికిత్సలు చేయించాలన్నారు. కానీ చిన్న కిరాణా కొట్లో పనిచేసే ఆ తల్లిదండ్రులకు అంత స్థోమతలేదు. చివరకు ఎలాగోలా ఆశ్రయ్ ఆకృతి అనే ఎన్జీవోను సంప్రదించారు. వారి తోడ్పాటుతో ఆ పాప స్పీచ్‌థెరపీ తీసుకుని ఇప్పుడు తోటి పిల్లలతో సమానంగా సాధారణ పాఠశాలలో చదువుకుంటోంది.
ఆమే కాదు... ఇంజినీరింగ్ దిశగా అడుగులు వేస్తున్న వందన, తనకంటూ ఉపాధి కల్పించుకున్న అమీనా మొదలు... రెండు తెలుగు రాష్ట్రాలూ, ఒడిశాలో కలిపి సుమారు 13 లక్షల మంది ఈ సంస్థ ద్వారా చదువు, ఆరోగ్యం, జీవనోపాధి... వంటి వాటిల్లో లబ్ధిపొందుతూ తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. నిజానికి ఈ సంస్థ 130 సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాల్లో 1800 శాఖలతో విస్తరించింది. దాదాపు అరవైవేల కంపెనీలు భాగంగా ఉన్న ఈ సంస్థ పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అటు కార్పొరేట్ కంపెనీలకూ, ఇటు ఎన్జీవోలకూ, నిరాశ్రయులకూ వారధిగా ఉండి... సీఎస్ఆర్లో భాగంగా కంపెనీలు ఇచ్చే కోట్ల రూపాయల్ని అవసరమైనవారికి చేరేలా కృషి చేస్తుందీ సంస్థ. ప్రధానంగా చదువు, ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమం, చెరువుల అభివృద్ధి... వంటి అంశాలపైన దృష్టిపెడుతూ అన్నివర్గాలవారినీ ఆదుకుంటోందని చెబుతారు ఆ సంస్థ ఛైర్పర్సన్ రమేష్ కాజా. ‘ఉదాహరణకు... డెలాయిట్ సంస్థ చదువుకోసం దాదాపు ఇరవైకోట్ల రూపాయలు ఇస్తే... దాన్ని మేం వెంటనే రకరకాల పాఠశాలలకు పంచేయం. ముందు పూర్తిగా వెనుకబడిన పాఠశాలల్నీ, ఆ తరువాత విద్యార్థులూ పాఠశాలల అభివృద్ధి కోసం పనిచేసే ఎన్‌జీవోలనూ ఎంచుకుంటాం. అది కూడా ఆ ఎన్జీవోల పనితీరూ, వాళ్లకు వచ్చిన నిధుల్ని ఎంతవరకూ ఖర్చుచేశారూ, మంచి పేరు ఉందా... ఇలా అన్నిటినీ గమనించాకే వాటికి ప్రాజెక్టును అప్పగిస్తాం. వాళ్లు పాఠశాలల్ని అభివృద్ధి చేస్తున్నా... మేం కూడా పర్యవేక్షిస్తూ పిల్లలకు అన్నిరకాల సదుపాయాలూ సమకూరేలా చూస్తాం. అవసరమైతే టీచర్లకూ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. స్కూళ్లలో బాత్రూంలు కట్టించడం, విద్యార్థులు పెరిగేకొద్దీ బిల్డింగ్లు పెంచడం, ఏడాదికి సరిపడా స్టేషనరీ, యూనిఫాంలూ ఇవ్వడం... ఇలా పూర్తిస్థాయిలో పనిచేస్తాం. అలా బహదూరపురలోని అభివృద్ధికి నోచుకోని 103 పాఠశాలల్ని నాలుగున్నరేళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మార్చేశాం. ఒకవేళ మేం ప్రాజెక్టు అప్పగించిన ఎన్జీవోలు సరిగ్గా చేయడంలేదనిపిస్తే... వెంటనే మరో సంస్థను ఎంచుకుంటాం. ఇలా కార్యక్రమాలు చేపట్టినప్పుడు మాకు మెరికల్లాంటి పిల్లలు కనపడితే... వాళ్ల బాధ్యతను పూర్తిగా తీసుకుంటాం...’ అని చెబుతారాయన. అయితే కొన్ని సంస్థలు నిధులు ఇస్తూనే ఫలానా రంగంలోనే ఆ డబ్బును వినియోగించాలని చెబుతాయి. అలాంటి వాటినీ పరిగణనలోకి తీసుకుంటుందీ సంస్థ.
చదువొక్కటే కాదు...
పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆ తల్లిదండ్రులు ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు అవసరమైన శిక్షణను ఎన్జీవోల సాయంతో ఏర్పాటుచేస్తుందీ సంస్థ. అలాంటిదే పాతబస్తీలో నిరాశ్రయులైన మహిళల్ని స్వయంఉపాధి వైపు నడిపించే హునర్ కార్యక్రమం. ఆడపిల్లలకు ‘స్టెమ్ మెజెస్టిక్’ ప్రాజెక్టు పేరుతో వాళ్లు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తోంది. ఆ శిక్షణ తీసుకున్న దాదాపు నలభైమంది అమ్మాయిలు ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ పదేళ్లలో సుమారు 170 కోట్ల రూపాయల్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించిన ఈ సంస్థలో భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లాతోపాటూ, దగ్గుబాటి సురేష్‌బాబు, గూగుల్‌లో ప్రాడక్ట్ ఆపరేషన్స్ అండ్ స్ట్రాటజీ హెడ్ చిత్రాసూద్, అమల అక్కినేని... హెచ్ఎస్బీసీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ మమతా మాదిరెడ్డి, జయేష్‌రంజన్, అనిల్‌కుమార్, శక్తిసాగర్, శశిరెడ్డి... వంటివాళ్లు బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే నిధుల్ని తీసుకుని సద్వినియోగం చేయడమే కాక వివిధ రంగాల్లో ఉన్న ఈ సంస్థ సభ్యులు కూడా తమ వంతుగా ఏటా లక్షల రూపాయల్ని పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఉదాహరణకు భారత్ బయోటెక్ నుంచి వచ్చే టీకాలను అవసరమైన వారికి సజావుగా అందేలా చూస్తుందీ సంస్థ. ప్రస్తుతం 130 ఎన్జీవోలతో పనిచేస్తున్న ఈ సంస్థ ఒక ప్రాజెక్టు పూర్తిచేశాక అక్కడితో దాన్ని వదిలెయ్యకుండా... ఆ అభివృద్ధిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలూ తీసుకోవడం విశేషం.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్