
ఆ ప్రాంతంలో ఒకరు ‘మా ఊరు గోవా’ అంటే... మరొకరు ‘టర్కీ నుంచి వస్తున్నా’మని చెబుతారు. ఇంకొకరిని పలకరిస్తే ‘మాల్దీవ్ మా పక్క ఊరే...’ అనేస్తారు. అలాగని వీళ్లేదో చమత్కరిస్తున్నారని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆ జిల్లాలోని ఊరిపేర్లు అలానే ఉంటాయి మరి. అదే బిహార్‌లోని బాంకా జిల్లా. అక్కడికి వెళ్తే టర్కీ, మాల్దీవ్, ఢాకా, గోవా, కొరియా, శ్రీనగర్... లాంటివన్నీ ఒకేసారి చుట్టబెట్టేయొచ్చు. ఆ ఊళ్లకు అలాంటి పేర్లు ఎలా వచ్చాయో తెలియదు కానీ ఆ ఊళ్లవాళ్లు మాత్రం ‘మా పక్క ఊరే గోవా అనీ... మేం ఉండేది కొరియాలో తెలుసా...’ అని గొప్పగా చెప్పుకుని ఆనందపడి పోతుంటారట. నిజానికి మాల్దీవ్ ఊరిపేరు మొదట్లో మాల్దేవ్ అని ఉండేదట. కాలక్రమంలో అదే మాల్దీవ్ అయ్యిందట. అలాగే మిగిలిన ఊళ్లపేర్లూ వచ్చి ఉంటాయని చెబుతున్నారు స్థానికులు.
అందం కోసం వజ్రం బొట్టు
అతనో ర్యాప్ సింగర్. పేరు లిల్ ఉజి వెర్ట్. ఊరు అమెరికా. మొదటినుంచీ తాను మిగిలిన ర్యాప్ సింగర్ల కన్నా కాస్త భిన్నంగా ఉండాలని కోరుకోవడం అతని నైజం. అందుకే ఖరీదైన వాచీలూ, కార్లూ, డిజైనర్ దుస్తుల్ని వాడుతూ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకునేవాడు. ఆ మధ్య ముఖానికి పియర్సింగ్ చేయించుకుని ఇంటర్నెట్లో హల్చల్ సృష్టించాడు. ఏం చేశాడంటే... అమెరికా కరెన్సీ ప్రకారం సుమారు 24 మిలియన్లు (దాదాపు 150 కోట్ల రూపాయలు) విలువ చేసే అత్యంత ఖరీదైన గులాబీరంగు వజ్రాన్ని నిపుణుల సాయంతో తన నుదుటిపైన బొట్టులా పియర్సింగ్, చేయించుకుని... అందంగా కనిపించడం అంటే ఆషామాషీ కాదు, అందుకోసం బోలెడంత బాధనీ భరించాల్సి ఉంటుందని చెబుతున్నాడు.
మంచుకురుస్తున్నా లెక్కచేయకుండా...
సాధారణంగా అమెజాన్‌లో ఏదయినా ఆర్డరిస్తే.... చెప్పిన అడ్రెస్‌కు వాళ్లు బైక్‌మీద వచ్చి వస్తువును అందించడం తెలిసిందే. కానీ శ్రీనగర్‌లో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మరో అడుగు ముందుకేశాడు. అదెలాగంటే... ఆర్డరు అందించే సమయానికి శ్రీనగర్‌లో విపరీతంగా మంచు కురుస్తోందట. అలాంటి పరిస్థితుల్లో కూడా గుర్రంమీద వచ్చి మరీ... వినియోగదారుడికి ఆర్డరును చెప్పిన సమయానికి అందించాడట. ఉమర్గనీ అనే ఫొటోగ్రాఫర్ ఆ దృశ్యాన్ని ఫొటోతీసి ట్విటర్లో పెట్టడంతో అది వైరల్ కావడమే కాదు... నెటిజెన్ల నుంచి ఆ ఎగ్జిక్యూటివ్ ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు.
మ్యాగ్నెట్లను మింగేశాడు
కాస్త పెద్ద పిల్లల చేతికి మ్యాగ్నెట్ ఇస్తే... దాంతో ఏదయినా వస్తువు తయారుచేస్తారు లేదా ఇనుముని ఆకర్షింపచేస్తూ కాసేపు ఆడుకుంటారు. కానీ ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన పన్నెండేళ్ల రిలే మారిసన్ అయస్కాంతం గోళీలను మింగేసి... ఆ విషయాన్ని మెల్లగా తల్లికి చెప్పాడు. అసలేం జరిగిందంటే... రిలేకు మొదటినుంచీ సైన్స్ అంటే విపరీతమైన ఇష్టం. దాంతో రకరకాల ప్రయోగాలు చేసేవాడు. ఓసారి అయస్కాంతం ఇనుమును ఆకర్షించడం చూశాక ఇంకేదైనా ప్రయోగం చేయాలనుకున్నాడు. బాగా ఆలోచించి వాటిని మింగేస్తే ఇనుము తన శరీరానికి అతుక్కుంటుందా లేదా అనేది చూడాలనుకున్నాడు. అలా మొదట కొన్ని మ్యాగ్నెట్లనూ, మూడురోజుల తరువాత మరి కొన్నింటినీ మింగేశాడు. అయితే ఆ తరువాతి నుంచీ తినడం, కూర్చోవడం కష్టమవడంతో తల్లికి తాను మ్యాగ్నెట్లను మింగినట్లు చెప్పాడు. ఆమె కంగారుగా ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ల సలహాతో ఎక్స్‌రే తీయిస్తే... అందులో 54 కనిపించాయి. దాంతో డాక్టర్లు మ్యాగ్నెట్స్ ఆరుగంటలు కష్టపడి అతడికి ఆపరేషన్ చేసి వాటన్నింటినీ తీసేయడంతో ఇప్పుడిలా బతికి బయటపడ్డాడు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్