close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మ్యాచింగ్‌ వడ్డాణాలు కుట్టించేద్దాం!

పట్టుచీర కట్టినా ఫ్యాన్సీ చీర కట్టినా నడుముకి వడ్డాణం పెడితే ఆ లుక్కే వేరు. అయితే ఆ వడ్డాణం అచ్చంగా బంగారంతో చేసినదే అయి ఉండక్కర్లేదు, చీరకి చక్కగా మ్యాచయితే చాలు అనుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. అందుకే ఇప్పుడు చీరకి తగ్గ వడ్డాణాన్నీ డిజైన్‌ చేసేస్తున్నారు ఫ్యాషనిస్టులు.

కప్పుడు చీరకి బ్లౌజు మ్యాచింగ్‌ ఉంటే చాలు అనుకునేవారు. ఆ తరవాత వాటికి చెప్పులూ పర్సులూ వంటి రకరకాల మ్యాచింగ్‌ యాక్సెసరీలు రావడం మొదలైంది. ఇప్పుడు అది కూడా పాతబడింది. చీరకి మ్యాచయ్యే జ్యుయెలరీ ధరించడమే తాజా ట్రెండ్‌ అంటున్నారు నేటి తరం అమ్మాయిలు. ఆ మ్యాచింగ్‌ నగల్లో వడ్డాణమూ మినహాయింపు కాదు. అయితే వడ్డాణం లాంటి భారీ నగలు బంగారంతో ఒక్కటి చేయించుకోవడమే అందరికీ సాధ్యం కాదు. అలాంటిది అవి కూడా రెండుమూడు రకాలంటే మాటలా... అందుకేనేమో ఇప్పుడు ఇలా ఎంబ్రాయిడరీ మ్యాచింగ్‌ వడ్డాణాల ట్రెండ్‌ని సృష్టించేశారు డిజైనర్లు. దాంతో చీరకి బ్లౌజు కుట్టించినట్లే వడ్డాణాలూ డిజైన్‌ చేసేస్తున్నారు. అది కూడా బ్లౌజులమీద మాదిరిగానే ఆరి, మగ్గం, జర్దోజి... వంటి ఎంబ్రాయిడరీలతో రకరకాల డిజైన్లలో కుట్టేస్తున్నారు. అంతేనా... బట్టతో కుట్టిన బెల్టు రంగు కూడా కనిపించకుండా గిల్టెడ్‌ పూసల్నీ సహజాత రత్నాల్నీ కుందన్లనీ చొప్పించేస్తున్నారు. బంగారు వడ్డాణంలో మాదిరిగానే టెంపుల్‌ జ్యువెలరీ డిజైన్లతో చేసిన వినాయకుడు, లక్ష్మీదేవి వంటి వన్‌గ్రామ్‌ బిళ్లల్నీ పెడుతున్నారు. దాంతో అవి నిజంగా బంగారంతో చేసిన వడ్డాణాలే అనిపించేంత అందంగా ఉంటున్నాయి. కొందరు డిజైనర్లు అయితే చీర ఇచ్చేస్తే చాలు, దానికి తగ్గ ఎంబ్రాయిడరీ బ్లౌజుతోపాటు మ్యాచింగ్‌ బెల్టునీ డిజైన్‌ చేసి ఇస్తున్నారు.

నిజానికి చీరలకి మ్యాచింగ్‌ బెల్టు పెట్టే ట్రెండ్‌ వచ్చి చాలాకాలమే అయింది. అయితే అప్పట్లో డిజైనర్‌ ఫ్యాన్సీ చీరలకే అవి వచ్చేవి. అదీ సెలెబ్రిటీలకీ ర్యాంప్‌ వాక్‌లకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పట్టుచీరలకీ డిజైన్‌ చేస్తున్నారు. కొన్ని ప్రముఖ కంపెనీలు సైతం చీరలతోపాటు బెల్టుల్నీ డిజైన్‌ చేసిస్తున్నాయి. అంతేకాదు, చీర లేకున్నా ఇతరత్రా యాక్సెసరీలూ నగలూ అమ్మినట్లే విడిగా కూడా బెల్టు వడ్డాణాల్ని అమ్ముతున్నాయి. దాంతో పెళ్లికూతుళ్లనే కాదు, వేడుకలకు హాజరయ్యే అమ్మాయిలూ మ్యాచింగ్‌ వడ్డాణాలతో అందంగా తయారైపోతున్నారు. ముఖ్యంగా చీర కట్టుకోవడం అలవాటు లేని ఈ తరం అమ్మాయిలకు ఈ ఎంబ్రాయిడరీ వడ్డాణం పెట్టుకుంటే అందంగా ఉండటంతోపాటు మాటిమాటికీ దాన్ని సర్దుకోవాల్సిన అవసరమూ ఉండదు. సో.. ఇంకా ఆలస్యం ఎందుకు... మీ చీరలకు మ్యాచయ్యే వడ్డాణాలు తెచ్చేయండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు