
అన్ని ఫంక్షన్లకీ ఒకే నగని పెట్టుకోలేరు. అలాగని ఖరీదైన వజ్రాల నెక్లెసుల్లాంటివి నాలుగైదు రకాలు కొనుక్కోవడమూ కష్టమే. అందుకే వాటిని ఈమధ్య మూడునాలుగు డిజైన్లలో పెట్టుకునేలా తయారు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి నగల్ని ఒక్కరే మార్చి మార్చి నాలుగైదు రకాలుగా పెట్టుకునే వీలుంటుంది. కానీ ఒకే నగని ఇద్దరు ముగ్గురు ఏకకాలంలో పెట్టుకునేలా డిజైన్ చేయడమే తాజా ఫ్యాషన్.
అమ్మాయిలకు నగలంటే బోలెడు ఇష్టం. అందులోనూ వజ్రాల నగలయితే మరీనూ. ఎన్ని కొనిచ్చినా ఇంకా కావాలనే అంటారు. కానీ అంత ఖరీదు పెట్టి రకరకాల మోడల్స్ చేయించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకే ఒకే నగని నాలుగైదు రకాలుగా పెట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ మొదలై కూడా చాలాకాలమే అయింది. కానీ ఒకే ఆభరణాన్ని ఒకేసారి ముగ్గురు నలుగురు పెట్టుకునేలా డిజైన్ చేయడమే తాజా ఫ్యాషన్.
ఇంతకుముందు వచ్చిన నగల్ని రకరకాలుగా పెట్టుకునే వీలున్నా అవన్నీ ఒక్కసారి ఒక్కరు పెట్టుకోవడానికి మాత్రమే కుదిరేది. ఎందుకంటే నగ మొత్తానికంతటికీ ఒకటే చెయిన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకే నగకి రెండుమూడు చెయిన్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. దాంతో ఆ నగని ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెట్టుకోవచ్చు. అత్తాకోడళ్లూ అమ్మాకూతుళ్లూ అక్కాచెల్లెళ్లు... ఇలా ఒకేసారి ఇద్దరూ లేదంటే అమ్మమ్మ, నానమ్మలతోసహా ముగ్గురు కూడా అలంకరించుకోవచ్చన్నమాట. అందుకే వీటిని జనరేషన్ జ్యుయెలరీ అనీ పిలుస్తున్నారు.
ఒకేసారి ఇద్దరికీ..!
సాధారణంగా ఏ నెక్లెసుకి అయినా మెడ చుట్టూ పెట్టుకునే హుక్ చెయిన్ ఒకటే ఉంటుంది. కానీ ఇద్దరు ముగ్గురు పెట్టుకునే ఈ కొత్త తరహా వజ్రాల నెక్లెసులకి దాని సైజుని బట్టి డిజైన్‌కి తగినట్లు రెండు మూడు హుక్ చెయిన్లు పెడుతున్నారు. దాంతో ఏ భాగానికా భాగాన్ని చక్కగా విడదీసి ఒకేసారి ఇద్దరూ లేదా ముగ్గురూ అందంగా అలంకరించుకోవచ్చు. లాకెట్టు లాంటిదయితే ఇంట్లో ఉన్న ఏ చెయిన్కయినా సులభంగా తగిలించుకోవచ్చు. కాబట్టి ఒక్క నగ కొంటే ఒకేసారి అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి- ముగ్గురూ హాయిగా వేసుకోవచ్చన్నమాట. అలాకాకుండా పెళ్లి వేడుకలకయితే ఒక్కరే ఆ నెక్లెస్ మొత్తంగా పెట్టుకుంటే గ్రాండ్గానూ ఉంటుంది. నిజానికి ఈ రకమైన డైమండ్ నెక్లెస్‌లను పెళ్లి, రిసెప్షన్ వేడుకల్లో గ్రాండ్‌గా కనిపించేందుకు పెళ్లికూతుళ్ల కోసమే ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. అయితే ఆ వేడుక అయిపోయిన తరవాత అంత వెడల్పాటి నగని వేరే వాళ్ల ఫంక్షన్లకో లేదా ఇతరత్రా చిన్నా చితకా వేడుకలకో పెట్టుకోలేరు. అందుకే దాన్ని రెండుమూడు భాగాలుగా విడదీసి పెట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. పైగా అంత పెద్ద నగకి ఒకే చెయిన్ పెడితే బరువుకి అది ఆగకపోవచ్చు. కాబట్టి దానికి రెండుమూడు చెయిన్లని అమరుస్తున్నారు.
అలాగని ఈ తరహా నెక్లెసుల్ని ఇద్దరు ముగ్గురు పెట్టుకోవాలన్న రూలేం లేదు. అది ఒక సౌలభ్యం మాత్రమే. ఒక్కరే వాడుకున్నా ఒకసారి స్నేహితురాలి పెళ్లికి సింపుల్‌గా ఉండే పైడిజైన్నీ, కజిన్ ఎంగేజ్మెంట్కి వెడల్పుగా పెండెంట్‌తో సహా ఉన్న కింది భాగాన్నీ, పక్కింటివాళ్లబ్బాయి పెళ్లికి మధ్యలో వెరైటీగా ఉన్న డిజైన్‌నీ, ఆడబడుచు పెళ్లికి మొత్తం నెక్లెసునీపెట్టుకోవచ్చన్నమాట. అప్పుడప్పుడూ ఆఫీసుకి వెళ్లినప్పుడు చెయిన్‌కి పెండెంట్‌ని తగిలించుకుని పెట్టుకుంటే అందరి కళ్లూ దానిమీదే ఉంటాయని వేరే చెప్పాలా. అంతేనా... మధ్యలో ఉన్న డిజైన్ని తీసి నెక్లెసులోని పై భాగాన్నీ కింది భాగాన్నీ కలిపీ పెట్టుకోవచ్చు. లేదూ పైది మాత్రమే తీసీ కిందనున్న రెండు భాగాల్నీ అలంకరించుకోవచ్చు. అసలు పెండెంట్ లేకుండానూ వేసుకోవచ్చు. అంటే ఈ రకమైన వజ్రాల నగ ఒక్కటి ఉంటే చాలు, బోలెడు నగలున్నట్లే అన్నమాట. కేవలం నెక్లెసులే కాదు, వీటికి మ్యాచింగ్ బుట్టల్ని సైతం మల్టీపర్పస్ తరహాలోనే డిజైన్ చేస్తున్నారు. అంటే- సందర్భాన్ని బట్టి కమ్మనీ బుట్టనీ మధ్యలో వేలాడే భాగాన్నీ ఇలా దేనికి దాన్ని విడదీసి పెట్టుకోవచ్చన్నమాట. మొత్తమ్మీద ఒక్కరే కాకుండా ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెట్టుకునేలా ఈ రెండుమూడు తరాల డైమండ్ నెక్లెస్‌లను తయారుచేస్తున్నారిప్పుడు. డిజైన్‌లో భాగంగా పొదిగిన కెంపుల్నీ పచ్చల్నీ కూడా మార్చుకునేలా చేస్తున్నారు కాబట్టి డ్రెస్సుకి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు అందులోని రత్నాల్నీ మార్చేసుకోవచ్చట. అయితే వజ్రాలు ఖరీదెక్కువ కాబట్టి ఈ తరహా నగల్ని తక్కువ ధరలో లభించే అమెరికన్ డైమండ్స్, సీజెడ్స్ వంటి రాళ్లతోనూ చేయించుకోవచ్చు. ఏంటీ... అప్పుడే డిజైన్ సెలెక్ట్ చేసేసుకుంటున్నారా? ఓకే ఆల్ ది బెస్ట్..!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్