close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ మెరుపులు... చీకట్లు తెస్తాయి!

రాత్రివేళల్లో మిణుగురు పురుగులు మెరుస్తుంటే ఆ దృశ్యం చూడ్డానికి ఎంత బావుంటుందో కదా! అలాంటి మెరుపులు ఈ మధ్య అరేబియా సముద్రంలో కనిపించాయి. కాకపోతే ఆ వెలుగుల వెనకున్నది మిణుగురులు కాదు ఒక రకమైన శైవలాలు. వాటి వెనకున్నది మనమే. అంటే మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసమే! నమ్మలేకపోతున్నారా?

ముంబయిలోని జుహు బీచ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లోని అనేక తీర ప్రాంతాల్లో అలలు రాత్రిపూట నీలం రంగు ఫ్లొరెసెంట్‌ బల్బుల్లా ధగధగా మెరుస్తూ కనిపించా యామధ్య. ఆ వింతను చూడ్డానికి జనం గుంపులుగా ఎగబడ్డారు కూడా. నవంబరు, డిసెంబరు నెలల్లో చాలా రోజులు రాత్రి పూట అరేబియా సముద్ర అలలు అలా మెరుస్తూ కనిపించాయి. ఆ వెలుగులకి కారణం... ‘నోక్టిల్యూకా సింటిలాన్స్‌’గా పిలిచే జీవులు. వీటిలో ఉండే ‘లూసిఫెరిన్‌’ అనే పదార్థంవల్ల సహజంగా వెలిగే లక్షణం వచ్చింది. అలల కదలికలకి ఇవి మరింతగా స్పందిస్తూ మెరుస్తాయి. కాబట్టి నిశ్చల సముద్రంలోకంటే తీర ప్రాంతాల్లో ఈ మెరుపులు బాగా కనిపిస్తాయి. రాత్రుళ్లు నీలం రంగులో మెరిసే ఈ జీవులు పగటిపూట నాచులా కనిపిస్తాయి. నిజానికి ఇవి ఒక రకం శైవలాలు(ఆల్గే). అందుకే వాటికా రంగు వచ్చింది. ఇవి కిరణ జన్య సంయోగక్రియతో తమకు కావాల్సిన ఆహారాన్నీ, శక్తినీ సంపాదించుకుంటాయి. నీటిలో ఆక్సిజన్‌ స్థాయులు తక్కువ ఉన్నాకూడా ఏ ఇబ్బందీ లేకుండా బతక గలవు. మిగతా సముద్రాలతో పోల్చితే అరేబియాలో వీటి ఉనికి ఎక్కువ. అరేబియా అడుగు భాగంలో ఆక్సిజన్‌ తక్కువగా ఉండటమే దీనికి కారణం.

ఇప్పుడెలా వచ్చాయంటే...
నిజానికి ఆ వెలుగుల వెనకున్నది ప్రకృతి కాదు, పర్యావరణం విషయంలో మన వికృత చేష్టలే. రెండు దశాబ్దాల కిందట అరేబియాలో ‘నోక్టిల్యూకా...’ మెరుపులను మొదటసారి గుర్తించారు. మొదట్లో ఇవి తీరానికి దూరంగా కనిపించేవి. ఈ 20 ఏళ్లలో తీవ్రత క్రమంగా పెరిగి తీరానికి చేరాయి. అంతే కాదు, ఆ మధ్య గోవా బీచ్‌లలో దిగేవారిని జెల్లీ ఫిష్‌లు భయ పెట్టాయి. వీటిలో విషపూరితమైన రకాలూ ఉన్నాయి. రెండు రోజుల్లో దాదాపు 90 మందిని జెల్లీ ఫిష్‌లు కుట్టి గాయ పరచాయి. నోక్టిల్యూకాకీ, జెల్లీఫిష్‌లకీ మధ్య విడదీయలేని సంబంధం ఉంది. జెల్లీఫిష్‌ లకు నోక్టిల్యూకానే ప్రధాన ఆహారం. ఈ రెండూ పెరగడానికి ముఖ్య కారణం సముద్ర జలాల కాలుష్యమే.

ఆహార గొలుసు తెగుతుంది
కాలుష్యంవల్ల అరేబియా జలాల్లో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయాయి. ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది... సముద్ర జలాల్లోకి పెద్ద ఎత్తున శుద్ధి చేయని జలాలు చేరడం. రెండోది... భూతాపం పెరగడంవల్ల హిమాలయాల్లో మంచు కురవడం తగ్గిపోవడం. దీనివల్ల అరేబియాలోకి స్వచ్ఛ నదీ జలాలు చేరడం తగ్గిపోయింది. ఈ మార్పులవల్ల మిగతా సముద్ర జీవులు అంతరించిపోయినా ‘నోక్టిల్యూకా...’ మాత్రం దర్జాగా బతకగలదు. నోక్టిల్యూకావల్ల అలలు నీలం రంగులో మెరవడమనేది అరేబియా సముద్రానికి మరో తీరాన ఉన్న ఒమన్‌, యెమన్‌ వంటి దేశాల్లోనూ ఆ మధ్య కనిపించింది. అక్కడ చమురుశుద్ధి, డీశాలినేషన్‌ పరిశ్రమల నుంచీ వచ్చే వ్యర్థాలే అందుకు కారణమని పరిశోధకులు చెప్పాక, అక్కడి ప్రభుత్వాలు ఆ వ్యర్థాలు సముద్రజలాల్లోకి చేరకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ మన ప్రభుత్వం వీటి గురించి ఇప్పటివరకూ స్పందించలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే సముద్రజీవుల్లో ఆహార గొలుసు తెగిపోయే ప్రమాదమూ ఉంటుంది. దానివల్ల మత్య్స సంపదకు ముప్పు. చేపలవేటకు వెళ్లేవారికి జెల్లీ ఫిష్‌లు మాత్రమే దొరికే రోజులు వస్తే లక్షల మంది ఉపాధి పోతుంది. తద్వారా ఆహార సమస్యా తలెత్తుతుంది. మరోవైపు ఇది పర్యాటక రంగంపైనా ప్రభావం చూపుతుంది. ‘పర్యావరణంలో మార్పులవల్ల తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నాం. మనం దీనికి ఎంత దగ్గరగా ఉన్నామో చెప్పడానికి నిదర్శనమే ఈ మార్పులు’ అని చెబుతోన్న పర్యావరణవేత్తలు... ‘ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఆపడానికి మన ముందున్న ఏకైక మార్గం... కాలుష్యాన్ని తగ్గించడమే. కర్బన ఉద్గారాల్ని నియంత్రణలోకి తెచ్చి సౌర, పవన విద్యుత్‌లను ఉపయోగించాలి’ అని హితబోధ చేస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు